నా కలం
రచయిత: యం. సుశీల రమేష్
నీవు నన్ను చూడడం మానేశావు
నీవు నాతో మాట్లాడటం లేదు.
నీ మదిలో భావాలు నాతో పంచుకోవడం లేదు.
నీ చేతి స్పర్శ తో అనుక్షణం నాలో ఎన్నో కోరికలు రగిలించావు.
ఎదుటి వారి మనోభావాలు నాతో చెప్పించావు.
ప్రతి దినం నా కోసం రెక్కలు కట్టుకు నీ వచ్చేదానివి.
నీవు ఆలోచించేటప్పుడు నన్ను నీ పెదాలపై నాట్యం చేయిస్తుంటే నా వంట్లోని నరాలు జివ్వుమనేవి.
నీవు సమాజాన్ని ప్రశ్నించే వేళ
నేను ఎంతో గర్వ పడేవాడిని.
ప్రేమకావ్యం నాతో రాయించిన వేళ నేను పరవశించాను.
నీ వ్యక్తిత్వం ఏంటో క్షుణ్ణంగా
తెలిసినవాడిని నేనే.
నీ చేతి వేళ్ళు అంటే నాకెంతో మక్కువ.
ఎందుకంటే నేను ఉండేది అక్కడే.
నేను నీ కలాన్ని నన్ను మరిచావెందుకు.
ఈ విరహాన్ని ఇక నేను భరించలేను.
తొందరగా వచ్చి నన్నందుకో.