కోడలా మజాక 

కోడలా మజాక 

రచయిత :: నాగ మయూరి

నక్షత్ర , నవదీప్ లకు అంగరంగ వైభవంగా వివాహం జరిగింది.  పారాణి పాదాలతో అత్తారింట్లో అడుగు పెట్టిన  నవ వధువును సాదరంగా ఆహ్వానించింది అత్తగారు సునంద.

ఆమె అందరి అత్తలలా కాకుండా  “కోడలిని కూతురిలా చూసుకోవాలని,ఆ రకంగా తనకు ఆడపిల్ల లేని లోటు తీర్చుకోవాలి” అని  అనుకునేది. నక్షత్ర కాపురానికి వచ్చిన దగ్గర నుంచి ఒక్క పని అయినా ముట్టుకునేది కాదు. బారెడు పొద్దెక్కాక లేచి ఫోన్ లో తల్లిదండ్రులు,   స్నేహితులతో వీడియో కాల్స్ మాట్లాడుతూ కూర్చుంటే , అత్తగారే ఆమెకు అన్నీ అందించాల్సి వచ్చేది.

పెళ్ళి  అయ్యి మూడు నెలలు గడిచాయి  అయినా కానీ  కోడలి దినచర్యలో మార్పు లేకపోవడంతో ఇంక సునంద ఆమెకు పనులు చెప్పి చేయించు కోవాల్సిందే అనుకుంది.

సునంద కోడలిని పిలిచి “నేను మార్కెట్ కి వెళ్ళి వస్తాను. నువ్వు కాస్త  ఈ బట్టలు ఉతికి, పిండి పెట్టుంచు, నేను వచ్చి ఆరేసుకుంటాను”  అని నక్షత్రతో చెప్పి బయటకు వెళ్ళింది.

పాపం పనులు అలవాటు లేని నక్షత్ర అత్తగారు చెప్పిన మొదటి పనిని కాదనలేక, తనకురాకున్న ఎలాగోలా కష్టపడి బట్టలుతికి పిండి పెట్టింది.

కాసేపటి తర్వాత మార్కెట్ నుంచి ఇంటికి వచ్చిన సునంద కోడలి పనితనాన్ని చూడాలనే ఆరాటంతో నేరుగా  పెరట్లోకి వెళ్ళి బట్టలను చూసి, కాసేపు తన కళ్ళని తానే నమ్మలేకపోయింది. ఆ షాక్ నుంచి నెమ్మదిగా తేరుకున్న సునంద కోడలిని  పిలిచి,  “నువ్వు అసలు ఈ భూమి మీదే పుట్టావా! లేక వేరే గ్రహం నుంచి ఊడిపడ్డావా” అంటూ గట్టి గట్టిగా అరవడం మొదలు పెట్టింది.

అత్త అరుపులకి భయపడిన నక్షత్ర ఏడుస్తూ భర్తకి, తన తల్లితండ్రులకి ఫోన్ చేసింది. క్షణాలలో వారంతా సునంద ఇంట్లో ప్రత్యక్షమయ్యారు.

లోపలికి వస్తూనే నవదీప్ మొదలెట్టాడు అమ్మా నువ్వేంటి అందరు అత్తలా తయారయ్యావు అంటూ….nవెనకాలే నక్షత్ర తల్లి అందుకుంది  “అసలు మా అమ్మాయి అంత తప్పు ఏమి చేసింది!  వదిన మీరు చెప్పినట్టు బట్టలుతికి పిండిపెట్టడం కూడా  తప్పేనా”  అంటూ…. సునంద మీద విరుచుకు పడుతోంది.

ఆ అరుపులకి చుట్టుపక్కల ఇళ్ళలోని ఆడవారంతా వచ్చి చేరారు.

అందరినీ పెరట్లోకి  తీసుకెళ్ళి అక్కడున్న బట్టలు చూపించింది సునంద.  వాటిని చూసిన వారంతా ముందు ఆశ్చర్యంతో  నోరెళ్ళబెట్టినా, నెమ్మదిగా ముసి ముసి నవ్వులు నవ్వడం  మొదలు పెట్టారు.

నక్షత్ర తల్లి ఇదేమిటే ఇలా చేశావు !  అంది కూతురుని.

నక్షత్ర నెమ్మదిగా భయంతో చెప్పడం మొదలు పెట్టింది.

అమ్మా అది  “అత్తయ్య మొదటి సారి నాకు పనిచెప్పారు. రాదని  ఎలా చెప్పను సరే యూ ట్యూబ్ ఉంది కదా అన్న ధైర్యంతో  చేద్దాము అనుకున్నాను. తీరా అత్త వెళ్ళాకా చూస్తే సెల్ ఫోన్ లో సిగ్నల్స్ లేవు…

ఏమి చెయ్యాలో అర్ధం కాక సిగ్నల్స్ కోసం తిరుగుతుంటే  వంట గదిలో ఎదురుగా ఈ  పిండి డబ్బా కనపడింది. అత్తయ్యగారు దీని గురించే చెప్పుంటారనుకుని….ఆ డబ్బాలో  ఉన్న పిండి అంతా తెచ్చి బట్టలకి పట్టించాను”  తప్పా అంటూ ఏడుస్తోంది.

నేను బట్టలు పిండమని చెప్తే నీకు ఇలా అర్ధమయ్యిందా…  “అమ్మ నాకోడలో అంటూ” సునంద బుగ్గలు నొక్కుకుంది. ఏంటో ఈ కాలం పిల్లలు అంటూ వచ్చిన వాళ్ళు  అందరూ  గుసగుసలాడుతున్నారు.

నక్షత్రకి  ఏమీ అర్థం కాక వాళ్ళందరినీ చూస్తూ  భయం భయంగా నిలబడి ఉండటాన్ని గమనించిన నవదీప్ నవ్వుతూ,  “చూడు నక్షత్ర అమ్మ చెప్పింది ఏంటంటే బట్టలని నీరు లేకుండా గట్టిగా పిండమని కానీ ఇలా పిండి పట్టించమని కాదు”  అని చెప్పాడు.

అప్పటికి విషయం అర్థమైన నక్షత్ర  తన తెలివితేటలని తలచుకుని సిగ్గుతో చిన్నగా    నవ్వడం మొదలు పెట్టింది.  నక్షత్ర  నవ్వుని చూసి అప్పటి దాకా గంభీరంగా ఉన్న అక్కడి వారు  అందరూ కూడా  నవ్వులలో  మునిగిపోయారు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!