నాన్న

నాన్న

రచయిత :: మంజీత కుమార్


వేళ కాని వేళ ఫోన్ మోగింది. ఏ వార్త వినాలో అనుకుంటూనే ఫోన్ ఎత్తాను. చేతులు వణుకుతున్నాయి, గుండె ఆగిపోయేలా ఉంది “కరోనా నాన్నను మింగేసింది. ఓ దేవుడా ఇప్పుడేంటి దారి” కన్నీళ్లు ఆగట్లేదు.
నిద్ర మత్తులో ఉన్న సృజన్ కి చెప్పాను. షాక్ అయ్యాడు. “ఏం చేద్దాం? ఎలా? ఓహ్ గాడ్” అంటూ బెడ్ పై నుంచి లేచి మొబైల్ అందుకున్నాడు.

నాన్న హైదరాబాద్ ఆసుపత్రిలో. మేము అమెరికాలో. నేను 9 నెలల గర్భవతిని. కరోనా సమయంలో అది కూడా గర్భంతో ప్రయాణం చేయడం కష్టం, అనుమతించరు కూడా.

“పోనీ నేను వెళ్ళనా?” సృజన్ ఏవేవో అడుగుతూనే ఉన్నాడు.

నేను మాత్రం గతంలోకి వెళ్ళిపోయాను. నాన్న ఒక్క నిమిషం నన్ను చూడకుండా ఉండలేకపోయేవారు. సెలవుల్లో అమ్మమ్మ ఇంటికి వెళ్లినా… రెండో రోజు వచ్చేసి… నువ్వు లేకుంటే తోచట్లేదురా అని ఇంటికి తీసుకొచ్చేవారు. భుజాలపై ఎక్కించుకోవడం, డాన్స్ చేయడం, అమ్మకు తెలీకుండా ఐస్ క్రీమ్స్, చాకోలెట్లు కొనివ్వడం ఇలా ఎన్నో. ఆడపిల్ల అని ఎప్పుడూ ఆంక్షలు పెట్టలేదు. ఏదంటే అదే. చదువు, ఆటలు, పాటలు అన్నింట్లో ఉండేదాన్ని. నాకింకా గుర్తు అమెరికాలో చదువుకుంటాను అంటే ఎంత బాధపడ్డారో. కానీ నా భవిష్యత్తు కోసం ఒప్పుకుని పంపించారు. చదువు పూర్తి కావడం … సృజన్ తో పెళ్లి అమెరికాలోనే సెటిల్ అయిపోవడం జరిగిపోయాయి. నేను గర్భవతి అని తెలియగానే నన్ను చూడాలని అమెరికా వద్దామనుకున్నారు. ఇంతలోనే ఈ కరోనా దాపురించింది. వాక్సిన్ వచ్చింది అనుకునేలోపు ఈ వార్త. అమ్మ ఎలా ఉందో పాపం. ఒంటరిగా నాన్న లేకుండా. నేనేమో ఇక్కడ. ఏమిటి ఈ కష్టం. ఏం చేయాలి?

“సృజన్ నేను నేను ఇండియా వెళ్ళాలి. నాన్నను చివరిసారిగా చూడాలి. ఆడపిల్ల అయినా దహన సంస్కారాలు నేనే చేయాలని నాన్న ఎప్పుడూ అనేవారు. ప్లీజ్ తీసుకెళ్ళు” ప్రాక్టికల్ గా సాధ్యం కాదని తెలిసినా ఈ పిచ్చి మనసు ఊరుకోదుగా

“స్మిత… ఇండియా వెళ్లినా కరోనాతో చనిపోయారు కాబట్టి మనల్ని దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. దహనం అంటావా… ఈ సమయంలో నీకు చెప్పొద్దుగానీ, చూస్తున్నావుగా ఎలా సామూహిక దహనాలు చేస్తున్నారో. అసలు ఎవరు చేస్తున్నారో కూడా తెలియదు. కాస్త స్థిమితంగా ఉండు. నీకు నేనేం చెప్పగలను, నువ్వే డాక్టర్ వి”

అవును నేను డాక్టర్ ని కానీ ఆ విషయం నేనే మర్చిపోయాను. వీక్ గా ఉన్నానని బెడ్ రెస్ట్ తీసుకుంటున్నాను. డాక్టర్ కన్నా ముందు నేనో కూతురిని. తండ్రి చివరిచూపుకు నోచుకోని ధీనురాలిని.

నాన్న ఆ పదం తల్చుకుంటేనే గుండె బరువెక్కుతోంది. రెక్కలు కట్టుకువెళ్లి నాన్నను చూడాలనుంది. నా చేతులతో తుది సంస్కారాలు చేయాలనుంది.

“నాన్న నాన్న” అంటూ ఎప్పుడు పడిపోయానో తెలియదు. కళ్ళు తెరిచే సరికి నేను పనిచేసే ఆసుపత్రిలో ఉన్నాను. నా ఫ్రెండ్ సుధ డెలివరీ చేసేందుకు సిద్ధం అవుతోంది. మత్తులో కళ్ళు మూతబడ్డాయి.

బిడ్డ ఏడుపుతో మెలకువ వచ్చింది. నన్ను చూడగానే సృజన్ “ఇదిగో నీ కోసం మీ నాన్న అమెరికా వచ్చారు” అన్నాడు. ఆనందం ఆశ్చర్యం. చేతుల్లోకి తీసుకుని చూడగా అచ్చo నాన్నకు ఉన్నటే నుదుటిపై పుట్టుమచ్చ. “సృజన్ సృజన్ నిజంగా నాన్న వచ్చారు”అంటూ పుట్టుమచ్చ చూపించాను. ఒక్కసారిగా బాధ ఎగిరిపోయింది. చిన్నప్పుడు నన్ను ఆడించిన నాన్నను ఇకపై నేను ఆడించాలి అన్న ఊహే ఆనందంగా ఉంది.

ఇంతలో సృజన్ “మామయ్య తుది సంస్కారాలు అయ్యాయంటూ” అమ్మకి వీడియో కాల్ చేశాడు. చిన్నారి నాన్నని చూపిస్తే ఎంత మురిసిపోయిందో.

“స్మిత…15 రోజుల్లో నా ఫ్రెండ్ అత్తయ్యని ఇక్కడికి తీసుకుని వస్తాడు. ఇక అత్తయ్య ఈ బుల్లి మాముతో ఇక్కడే ఉండిపోయే ఏర్పాట్లు చేశాను” అన్నాడు. ” అన్నట్టు ఇకపై మాము అనే పిలుస్తాను ఎంతైనా పిల్లనిచ్చిన మామగారు కదా” అన్నాడు

“సృజన్ నువ్వెంత మంచివాడివి” అని నేను మాట పూర్తి చేయకుండానే

“నాకా విషయం ఎప్పుడో తెలుసు” అంటూ సృజన్ నా నుదుటన తీయని ముద్దు పెట్టాడు.

***

You May Also Like

2 thoughts on “నాన్న

  1. మంజీత గారు కథ 👌👌
    కూతురిని ప్రేమించటంలో నాన్న తర్వాతే ఎవరైనా.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!