నేను మనిషినే కొంచెం అర్థం చేసుకోరూ

నేను మనిషినే కొంచెం అర్థం చేసుకోరూ

రచయిత :: సావిత్రి తోట “జాహ్నవి”

“తమరు వీరాధివీరులు , నేనేమో ఏబ్రాసి దాన్ని, అంతేగా!” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది కాంతం.

“హా, హా, అని నేను అనేదేమిటి? నువ్వే ఒప్పుకున్నావు ఇప్పుడు”

“అవును మరీ. మీరైతే ఒంటి చేత్తో అవలీలగా అన్ని మోసేస్తారు” అంటున్నంతలో,  కాంతం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆ వాదన ఎక్కడికి దారితీసేదో. కాని,

“అమ్మా! ఆకలి. తినడానికి ఏమన్నా పెట్టావు!?” అంటూ వచ్చిన ఏడేళ్ల కొడుకుకి, మావగారికి టిఫిన్ పెట్టడానికి వంటగదిలో కెళ్లింది.

కాంతం కళ్లలోకి చూసిన మాణిక్యానికి, చెదిరిపోయిన జుట్టు, నలిగిన చీరతో  పనంతా  చేసి బాగా అలసిపోయినట్లు కనిపిస్తున్న ఆమె  ముఖం చూసి, మనస్సు చివుక్కుమంది.

ఒకసారి ఆ రోజు ఉదయం నుండి జరిగిన సంగతులు చెప్పుకుంటే, ఈ మాటల యుద్దానికి కారణం తెలుస్తుంది.మరీ  కాలంలో తెల్లవారే సమయానికి ప్రయాణిద్దాం. మీరు నాతో వస్తారు కదూ!?

ఆ రోజు తూర్పున బాలభానుడు ఉదయించడానికి  గంట పూర్వమే లేచిన కాంతం యధా ప్రకారం  ఇంటిపనులు మెుదలుపెట్టింది.

ఇంతలో వచ్చిన కాయగూరలావిడ “అమ్మా! ఈ తట్ట దించడానికి కొంచెం సాయం పట్టు” అంటూ వీధిలో నుండి కేకలు వేసింది.

అస్సలే  వీధికి ఎదురుగా కిందవాటా ఇల్లు. ఎవరూ, ఏది అమ్మడానికి తెచ్చిన తమ ఇంటి ముంగిట్లోనే  దించి, తాము తెచ్చిన కాయగూరలు, పళ్లు లాంటివి అమ్ముకుంటారు.

అక్కడే పేపర్ చదువుతున్న మాణిక్యం లేచి, తట్ట దించడానికి ఆవిడకేమన్నా సాయం చేస్తాడేమోనని చూసింది. కాని, అదేమి పట్టించుకోకుండా సీరియస్ గా పేపర్ చదువుతూ, కాఫీ తాగడాన్ని  ఆస్వాదిస్తున్నాడాయన.

చట్నీ తాలింపుకి  సిద్దం చేస్తున్న కాంతం ఆ పనిని పక్కనపెట్టి వెళ్లి తట్ట. దించి, తనకు కావాల్సిన కాయగూరలు తీసుకుని లోపలికి వచ్చేసింది.

మరల అంతలోనే “అమ్మా! పూలు” అంటూ కేక.

సరామాములే.

ఆ తర్వాత పళ్లు అంటూ, మరమరాలు అంటూ ఎవరెవరు వచ్చి, వాళ్లు తెచ్చిన బరువులు దించడానికి సాయం చేయమని అడుగుతూనే ఉన్నారు.

గడియాకోసారి, వంటగదిలో నుండి వీధిలోకి తిరుగుతూనే ఉంది కాంతం, వాళ్లకి సాయం చేయడానికి. కాని, అక్కడే మాణిక్యం అదేమి పట్టించుకోకుండా తన మానాన తాను పేపర్ చదువుతూనే ఉన్నాడు.

అస్సలే శనివారం. పూజ అయ్యేవరకు ఉపవాసం. పిల్లలకు, పెద్దలకు రకానికో టిఫిన్.

మామగారికేమో ఇడ్లీ, మాణిక్యం నన్ను అప్పుడే ముసలివాడి కింద జమా కట్టేసావా అంటూ ఇడ్లీ తినడానికి ఒప్పుకోడు.

అందుకే దట్టంగా అల్లం, పచ్చిమిర్చి వేసి పెసరట్టు, అందులోకి వేడి వేడిగా ఉప్మా చేయమంటారు.సరామాములుగానే అల్లం, పుదీనా చట్ని రెండు రకాల చట్నిలు ఉండాలి అందులోకి.

అత్తగారు చనిపోయిన ఈ ఆరు నెలల్లో, మావగారిని  తెచ్చుకుని, చిన్నపిల్లాడిలా సేవలు చేస్తుంది. కాని, భర్త నుండి చిన్న సాయం కాని, కనీసం ప్రశంస కి కూడా నోచుకోలేదు పాపం కాంతం.

అస్సలే కరోనా రోజులేమో. ఇంట్లో పెద్దాయన ఉన్నారు.  అందుకే దులిపిందే దులిపి, కలిగిందే కడిగి చేతులు పుళ్లు పడ్డాయి.

లాక్ డౌన్ సమయంలో రెండు గంటలే విరామం ఇవ్వడం వలన గ్రీన్ జోన్ కావడంతో అమ్మేవాళ్లు అందరిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారు పోలిసులు. పాపం వాళ్లు బతకాలి కదాని.

దానితో ఆ రెండు గంటల్లోనే అమ్ముకున్నవారందరూ వచ్చి, తమ విశాలమైన అరుగు మీద తట్టలు దించుకుని, కోనడానికి వచ్చే వాళ్ల కోసం ఎదురు చూస్తుంటారు.

దానితో ఉదయం నుంచి ఉపవాసం ఉందేమో, వీధిలోకి, ఇంట్లోకి తిరుగుతూ బాగా అలసిపోయింది.

మాణిక్యానికి  గట్టిగా చెప్పి, పని చేయించుకోవాలాంటే ఎదురుగా మామగారు ఉన్నారయ్యే.

ఇంతలో గ్యాస్ అయిపోవడంతో, “బయట ఉన్న గ్యాస్ కొంచెం తెచ్చి పెట్టాండి” అని మాణిక్యం  వంక బతిమాలుతున్నట్లు ! చూసింది.

అప్పటికే  నిస్సత్తువ ఆవహించిన కాంతం.

“అదేమిటోయ్! ఇక్కడ నుంచి అక్కడికి గ్యాస్ బండ కూడా తీసుకెళ్లలేవా?” అంటూ వెటకారం చేసాడు మాణిక్యం కాంతాన్ని.

“ఆ, మీరేమో వీరాధివీరులు మరీ. నేనేమో ఏబ్రాసిదానిని. అంతేగా” అంటూ మూతి మూడు వంకర్లు తిప్పింది కాంతం.

కాంతం వెనకే వంటగదిలోకి  వెళ్లిన మాణిక్యం, “అది కాదోయ్ సరదాగా అన్నాను. పిల్లలకి, నాన్నగారికి టిఫిన్ నేను వడ్డిస్తాను. నువ్వు వెళ్లి నీ పూజ చేసుకో. తినేసి, పూజ చేసుకోమని చెప్తే వినవు. పూజ చేసే వరకు ఉపవాసాలు చేస్తావు. ఈ కాలంలో ఒంటరిగా ఇన్ని పనులు చక్కబెట్టాలాంటే మాటలా. తెల్లవారేసరికి ఏదైనా తింటే కదా పని చేయడానికి ఓపిక వస్తుంది”,అంటూ , పలహారాలు తీసుకెళ్లి, టేబుల్ మీద అమర్చడం మెుదలుపెట్టాడు.

మాణిక్యం టేబుల్ మీద అన్ని పలహారాలు సర్ధడం చూసిన వాళ్ల ఏడేళ్ల కొడుకు కూడా తల్లి  చేతిలో పళ్లాలు అందుకుని టేబుల్ మీద పెట్టడం చూసిన కాంతం ముఖం లో సంతృప్తి తో కూడిన చిరునవ్వు మెులకలెత్తింది.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!