రాధికా బాంధవా!
రచయిత: గుడిపూడి రాధికారాణి
వనిత యవ్వనమంత వనిన వెన్నెల వోలె
వృధాగా మారుటే
వ్యధాభరితము కాద?
రార ఓ మాధవా! రాధికా బాంధవా!!
ఆషాఢమాసాల అడ్డు తొలగించేసి
కరోనా కష్టాల కందకం దాటేసి
బాటలో పరిచున్న బండరాళ్ళను దాటి
పెద్దలను ఒప్పించి హద్దులను తెంపేసి
మండుటెండలు కూడ పండువెన్నెల కాగ
వేగిరము రావోయి! వేచియున్నది రాధ
మదిలోన నీతలపు మమతలను జల్లంగ
హృదిలోన నీవలపు హృద్యమై పోవంగ
మల్లెలూ మొల్లలూ మన్మథుడి శరములూ
నిలువనీకున్నాయి నీ రాక కోరాయి
జాగేల మాధవా! జాలి చూపించవా?
కంచె దాటగ లేవ? మంచె చేరగ రావ?
నిలువెల్ల కన్నులై నిలుచుంటినోయ్ ఇచట