తోబుట్టువులు – మిథ్యాబింబాలు

తోబుట్టువులు – మిథ్యాబింబాలు
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : యం .వి .ఉమాదేవి

ఒడిదుడుకుల జీవితంలో లెక్క లేనన్ని జ్ఞాపకాలు కొన్ని చేదయినా కొన్ని బాల్యం బంగారు నావలో తోబుట్టువులతో కలిసి సాగిన చిలిపి ఆటలు, అల్లరిని గుర్తు చేసే తరంగాలు ! పండో కాయో కలిసి పంచుకున్న రోజులు, అమ్మ నాన్నల అనురాగం తో బాధ్యత లేని, తెలియని అమాయక కాలం గొప్పది !
పెరిగిన లోకజ్ఞానం, విద్యలూ  జీవితం లోని ఆనందం  తన్నుకుపోతున్న గండ భేరుండాలు అయిపోయాయి! తమకు సంసారం అంటూ ఏర్పడినాక ఒకరి అవసరం ఏముంది అనే మెటీరిలియలిస్టు తత్వం బాగా ప్రబలిపోయింది. ఎక్కడ నో కార్యక్రమం లో కలుసుకోవాలని  తపించే వాళ్ళు కొందరయితే, ఏళ్ళ తర్వాత కలిసినప్పుడు కూడా ముఖం తిప్పుకునే వాళ్ళు కొందరు. పుట్టినచోటు ఒకటే అయినా వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి జీవితం లో స్థిరపడినప్పుడు, అవతల వాళ్ళని చూసి, అసూయ పడటం లేదా, తక్కువ స్థాయి అని ఈసడించడం మానవత్వం అనిపించుకోదు .
వాళ్ళు ఎవరు ?? మన తోబుట్టువులు, పాతకాలం వాళ్ళ భాషలో చెప్పాలంటే ఎంగిలి పాలు తాగినవాళ్ళు! తలుచుకుంటే మనసు హాయిగా అనిపించాలి. ఒకవేళా అవతల మనిషి స్వార్థపరులైనా మన  పలకరింపు సంస్కారం తో ఉంటే చాలా మంచిది. ఈ సంపద మనతో రాదు . ఉన్న దాన్లో కొంత సాయం చేస్తే ఆస్తి తరిగిపోదు.!
ఇంకో రకం వాళ్ళున్నారు, వాళ్ళ సొంత అహంతో చేసిన పనులు, తీసుకున్న నిర్ణయాలు తో ఎదురుదెబ్బలు తిని, తమ కష్టాలకి తల్లిదండ్రులు (ఇదో తమాషా వాళ్ళు గతించిన వాళ్ళయినా సరే ) తోబుట్టువులే కారణం అని ఊహించుకుంటూ వాళ్ళని చూస్తే చాలు, మాటలతో బాధపెట్టడం,
బైట వాళ్ళ కి చాడీలు చెప్పడం చేసి అదో పైశాచిక ఆనందం పొందుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళతో ఆ తోబుట్టువులకి సొంత సమస్యల కన్నా ఇదొక పెద్ద బాధ అవుతుంది. అందుకే వీలైనంత దూరంగా ఉండటం మంచిది. తమ వైఫల్యకారణం ఇతరులకు అంటగట్టాలని చూసే వాళ్ళు శత్రువుతో సమానo ! ఆచి తూచి మాట్లాడుతున్నా అభాoడాలు వేసేస్తారు. కానీ ఇది కలియుగం ఇక్కడ చేసే పనులకి ఇక్కడే శిక్ష ఉంటుంది అని నమ్మడం మంచిది. అందుకే ఈ బిజీ జీవితంలో సమస్యల వలయం లో ఒక చిన్న ఓదార్పు, కలిసి పంచుకున్న కుటుంబ జ్ఞాపకాలు. మనకీ వాళ్ళ కీ సంతోషం ఇచ్చేలా మన ప్రవర్తన ఉండాలి. ఇందుకు ఆడ, మగ తేడాలు లేనే లేవు. సమానత్వం పేరుతో నిరుపేద అయిన అన్న లేక తమ్ముడు నివాసాన్ని భాగం పంచుకుని అద్దె కిచ్చుకోవడం వంటి అకృత్యాలెన్నో ఉంటాయి. ఈ ఇంట్లో ఎందుకు పుట్టాం దేవుడా అనుకునేలా తోబుట్టువుల ప్రవర్తన ఉండకూడదు .
సంయమనం, సహాయం చివరి శ్వాస వరకూ రక్తసంబంధంలో ఉండాలి ! అప్పుడే తర్వాత తరాలు కూడా అలాగే నడుస్తాయి !! కన్న కడుపు చల్లగా కలిసి మెలిసి ఉందాము, అన్న కవిగారి పాట గుర్తు ఉందిగా!!

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!