నా గమ్యం తెలిసింది
రచయిత :: పరిమళ కళ్యాణ్
ఒంటరిగా బాల్కనీలో నిలుచున్న నాకు తన అడుగుల చప్పుడు వినిపించడం మొదలైంది.
ఎప్పుడూ లేనిది కొత్తగా తోచింది నా మనసుకి, రానురాను ఆ శబ్దం మరింత దగ్గరగా వినిపించింది. తనేనా నా కోసమే వస్తున్నాడా అనుకున్నాను.
ఎన్నాళ్ళయింది తనని చూసి అంటూ గుండె వేగంగా కొట్టుకోసాగింది. తనని చూడాలని, తనతో మాట్లాడాలని నా మనసు ఉవ్విళ్లూరింది. తను ఇంకా దగ్గరకి వచ్చి, వెనుదిరిగి నిలుచున్న నా భుజాలపై చెయ్యి వేసినట్టు అనిపించింది. అప్రయత్నంగా నా గుండె కరిగి, కన్నీళ్ల రూపంలో బయటకి పొంగుకొచ్చింది. అటు తిరిగాను తన ముఖం చూడాలన్న తాపత్రయంతో. కానీ అక్కడ ఎవరూ కనిపించలేదు.
చుట్టూ చూసాను ఎవ్వరూ లేరు. ఇదంతా కలా, నా ఊహేనా అనుకున్నాను. ఇల్లంతా కలియచూసాను. తను ఎక్కడా కనపడలేదు. హాల్లో సోఫాలో కూర్చుని భారంగా తలపైకి ఎత్తాను. ఎదురుగా తన ఫోటో కనపడింది దండతో…
నా గుండె మరింత ద్రవించింది, ఏరులై పారింది. అలా ఎంతసేపు ఏడ్చానో నాకే తెలీదు. పెళ్లిలో అగ్నిసాక్షిగా నా చేతిలో చెయ్యి వేసి, కష్టాల్లోనూ, సుఖాల్లోనూ నా చెయ్యి వదలనని బాస చేసి, నన్ను అర్ధంతరంగా ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయారు.
తానొక మంచి డాక్టరుగా అందరికి తెలుసు, ఎందరికో ఉచితంగా వైద్యం చేసేవారు కూడా. ఎవరికైనా దీనస్థితిలో ఉంటే తను కరిగిపోయేవారు. పేషెంట్ కి ధైర్యం చెప్పి, ఇంటికి వచ్చి బాధ పడేవారు. కానీ ఆ భగవంతుడికి ఎంత రాతి గుండె? అటువంటి సున్నితమైన మనసు కలవారికి పిల్లలు పుట్టే అవకాశం లేకుండా చేసాడు.
మా పెళ్ళై ఆరేళ్ళు అయినా ఇంకా కొత్తగానే అనిపిస్తుంది మా బంధం ఎప్పటికీ. ఒక మంచిరోజు చూసి, అనాధాశ్రమం నుంచీ ఎవరినైనా తెచ్చుకుందామని అనుకున్నాం. ఈలోగా మన దేశంలో కరోనా వైరస్ వచ్చిందని లోక్డౌన్ మొదలు పెట్టారు. ఆశ్రమం నుంచీ పిల్లని తెచ్చుకునే పనిని వాయిదా వేసుకున్నాం.
తను కరోనా సమయంలో డ్యూటీ డాక్టరు అయ్యారు. పేషెంట్లని చూడటానికి రోజూ వెళ్లేవారు. రాను రాను కేసులు ఎక్కువయ్యాయి. తను ఇంటికి ఎప్పుడో ఆలస్యంగా వచ్చేవారు. ఎంతో జాగ్రత్తగా ఉండేవారు.
తర్వాత కొన్నాళ్ళకి ఇంటికి రావటమే మానేశారు. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా, కరోనా మహమ్మారి తనని కూడా వదలలేదు. తనకి వైరస్ సోకిందని తెలిసి నా గురించి ఎంతో బాధ పడ్డారు. కనీసం తనని చూడటానికి కూడా వెళ్ళనివ్వలేదు నన్ను. ఒకే ఒక్కసారి దూరం నుంచీ చూడగలిగాను అంతే. ఆ క్షణమే తన బాధ తన కళ్ళలో కనిపించింది.
నన్ను వేరే పెళ్లి చేసుకోమని చెప్పి తను ప్రాణాలు విడిచారు. ఎందుకంటే నాకు పిల్లల్ని కూడా ఇవ్వలేకపోయానని తన బాధ. మా అమ్మా నాన్నలు కూడా మళ్లీ పెళ్ళి చేసుకోమన్నారు. కానీ నాకు తనతో కలిసి జీవించిన ఆరేళ్ళ జ్ఞాపకాలు చాలనుకున్నాను. మా ఇద్దరి నిర్ణయం మేరకు కరోనా పూర్తిగా తగ్గిన తర్వాత ఆశ్రమం నుంచీ ఒక అమ్మాయిని తెచ్చి పెంచుకోవాలని నిశ్చయించుకొన్నాను. ఇంట్లో వద్దని ఎంత వత్తిడి తెచ్చినా కుదరదు అన్నాను. దాంతో అమ్మా వాళ్లకు దూరంగా వచ్చేసాను. అత్తమామలు వచ్చి వెళ్తూ ఉంటారు అప్పుడప్పుడూ.
ఇంకా నా జీవితానికి ఒక గమ్యం ఏర్పడింది. ఎదో చిన్న ఉద్యోగం చూసుకొని, ఆ అమ్మాయిని నా కుతురిలా భావించి, తనని బాగా పెంచాలని గట్టిగా నిశ్చయించుకున్నాను. అదే దిశగా అడుగులు వేస్తున్నాను. ఫోటోలో నుంచి తన ముఖం నవ్వుతున్నట్టుగా కనపడింది, అదే నా నిర్ణయానికి అంగీకారం అనుకున్నాను.
చాలా బాగుంది అక్క
థాంక్యూ తమ్ముడూ