కౌముది కౌగిట్లో..!

కౌముది కౌగిట్లో..! 

రచయిత: అయిత అనిత

పిండారబోసిన పున్నమిరాత్రుల్లో
చందమామతో గోరుముద్దల సంరంభం!
వేసవివెన్నెల్లో అమ్మమ్మ కథల కోలాహలం!!
కబుర్లతో కమ్మని ఆత్మీయ సరాగం!

నులకమంచంపై పవళించి
చుక్కలను లెక్కెట్టిన చిరుజ్ఞాపకం!
జాబిలిని దోసిట్లోకి తీసుకోవాలని
తీరనిఆశల కుతూహలం!!
అంబర వీధిలో ఆనందాలపల్లకిపై పయనం!

మాలతీలతలను వీక్షిస్తూ
కలలలోకంలోకి షికారుకెళ్లిన బాల్య ప్రపంచం!
కౌముది కౌగిట్లో ఒదిగి
ప్రణయరాగాలు మీటిన యవ్వనపర్వం!!
ఊహాప్రపంచంలో ఊసులు కలబోసుకున్న తన్మయత్వం!

ప్రేమకైనా విరహానికైనా సాంత్వనకైనా చింతనకైనా
తోడుండే ఆకాశ అందాలసామ్రాజ్యం!
మనసును తేలికపరిచి
శరచ్చంద్రికలై అల్లుకున్న ఆత్మీయ అనుబంధం!
వెన్నెలతో నా ప్రస్థానం సంతోషసంద్రంలో తీరాన్నిచేరాలన్న ఆకాంక్షల సమాహారం!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!