అరవిరిసిన కుసుమాలు

అరవిరిసిన కుసుమాలు

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: గుడిపూడి రాధికారాణి

పూర్వకాలంలో చిన్నవయసులోనే వివాహాలు జరిగేవి. బాల్యవివాహాలు బాలికలకు శాపంగా మారేవి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు 18 ఏండ్లను వివాహ వయస్సుగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సహాయపడింది. కాలం మారింది. బాలికలు విద్యా, ఉపాధి అవకాశాలను మెరుగ్గా పొందుతున్నారు. మహిళ రాణించని రంగమంటూ లేదని నిరూపిస్తున్నారు. కానీ ఇప్పటికీ పదవ తరగతి పూర్తి కాగానే ఆమె పాఠశాల ప్రథమస్థానంలో నిలిచినప్పటికీ వివాహం చేసే కుటుంబాలు ఉన్నాయి. వారు తెలిపే కారణాలు భద్రత సమస్య, ప్రేమలో పడుతుందనే అపనమ్మకం, ఆర్థిక కారణాలు మొదలైనవి. వివాహ వయస్సును 21 సం.లుగా నిర్ణయించడం ఎంతో సమంజసం.‌ బాలికలు విద్యను కొనసాగించి కనీసం‌ డిగ్రీ చేతికి రావాలన్నా లేదా కంప్యూటర్, ఎంబ్రాయిడరీ వంటి ఏదేని నచ్చిన ఉపాధిరంగాన్ని ఎంచుకొని శిక్షణ పొంది నైపుణ్యం సాధించాలన్నా ఆ సమయం ఉపకరిస్తుంది. భార్యాభర్తలిద్దరూ సంపాదనాపరులు కావడం నేటి కాలంలో అవసరంగానూ సహజంగానూ మారింది. ఏదైనా ఒడిదుడుకులు ఎదురైనపుడు ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలంటే కూడా మహిళకు సాధికారత, ఆర్థిక స్వావలంబన అవసరం. ఉమ్మడికుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నమైన ప్రస్తుత కాలంలో మహిళ తన కాళ్ళపై తాను గౌరవంగా నిలబడి బ్రతకగలగడం మరీ అవసరం. స్వంత కుటుంబంలోనే పనిమనిషిగా మారి వంటింట్లో మగ్గిపోయిన వితంతువులను, భర్త వదిలివేసిన వారినీ చూశాం. ఈ పరిస్థితికి కారణం విద్య, ఉపాధి శిక్షణలు లేకపోవడం.‌ ఇప్పుడు మరో కోణం చూద్దాం… ఆకర్షణను ప్రేమగా భ్రమించి ఒక అనర్హుడితో వెళ్ళిపోయినా చట్టం పద్దెనిమిది దాటిన కారణంగా ఏం చేయలేక పోలీస్ స్టేషన్ సాక్షిగా మూడుముళ్ళు వేయిస్తోంది. తర్వాత నిశ్చింతగా ఉన్నవారి శాతం ప్రశ్నార్థకమే కదా కనీసం ఇరవైఒకటి దాటనిస్తే మంచిచెడులను విశ్లేషించుకోగల తార్కిక జ్ఞానం అబ్బుతుంది. పరిస్థితులను ఎదుర్కోగల ఆత్మస్థైర్యం అలవడుతుంది. కాబట్టి టీనేజ్లో అరవిరిసిన కుసుమాల వంటి బాలికలను తొడిమ నుండి తెంపక తల్లి ఒడిలోనే వికసింపనిద్దాం. ఇరవై ఒకటి దాటాకే వివాహం‌ చెయ్యటం ద్వారా కొత్త జీవితం ఫలప్రదమవనిద్దాం.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!