ఆలోచనల్లో రావాలి మార్పు 

ఆలోచనల్లో రావాలి మార్పు 

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: చంద్రకళ దీకొండ

పుట్టుకతోనే ఆడపిల్లగా, బరువుగా భావించి, తమ ‘గుండెల మీద కుంపటి’ ని ఎప్పుడు దింపుకుందామా అనే ఆతృత తల్లిదండ్రులకు.
ఆహారం విషయంలోనూ, విద్యాబుద్ధులు చెప్పించే విషయంలోనూ వివక్షయే!
తమ కంటే చిన్నవారి ఆలనాపాలనా వారి బాధ్యతే. అందుకోసం చదువును మధ్యలోనే వదిలేసే బాలికలు కోకొల్లలు.
బాల్య వివాహాలు నేటికీ చాటుమాటుగా సాగుతూనే ఉన్నాయి. బాలికల జనాభాలో సగం మందికి పైగా పోషకాహార లేమితో బాధపడుతున్నారు. శారీరక ఆరోగ్య విషయాలపై, వ్యక్తిగత పరిశుభ్రతపై వారికి అవగాహన లేదు.
విద్యా హక్కు, బాల కార్మిక నిర్మూలన వంటి చట్టాలెన్ని ఉన్నా, అమలులో శూన్యం.
పద్దెనిమిది ఏళ్ళలోపే వివాహం చేయటానికి వరకట్నం, పేదరికం, ఎక్కువ చదివిస్తే అంతకన్నా ఎక్కువ చదివిన వాణ్ణి తీసుకురావాలన్న భయం, సమాజంలో విరివిగా జరుగుతున్న అఘాయిత్యాలు, అత్యాచారాలకు భయపడి తొందరగా వివాహం జరిపించడం… ఇలాంటి మూల కారణాలెన్నో!
వైద్యపరంగా చూసినప్పుడు… ఇరవై నుండి ఇరవై ఐదేళ్ళ వయసు ప్రత్యుత్పత్తికి అనుకూలమయినది. అవయవాలు పరిపక్వత చెంది గర్భస్రావాలకు, శిశుమరణాలకు అవకాశం తక్కువ. స్వయం నిర్ణయాధికారానికి అవకాశం ఎక్కువ.
వివాహానికి అర్హమయ్యే వయసు పెంచడం కంటే ముందు, ప్రభుత్వాలు విద్య, ఆరోగ్యం, భద్రత వంటి మౌలికాంశాలపై దృష్టి సారిస్తే, ఆడపిల్లలకు మేలు జరిగే అవకాశం ఉంది.
ఈ విషయంలో నా స్వీయానుభవం ఒకటి మీతో పంచుకుంటాను…
తొమ్మిదో తరగతి చదువుతున్న తెలివైన అమ్మాయికి ఇంట్లో వాళ్ళు వివాహం నిశ్చయిస్తే, మా టీచర్లమంతా కలిసి ఆ అమ్మాయికి కౌన్సిలింగ్ చేసి, ఒక రెస్క్యూ హోమ్ లో చేర్చాం. విషయం తెలిసి ఆ బాలిక తల్లిదండ్రులు, జనంతో కలిసి వచ్చి టీచర్లపై దండెత్తారు. ఆ అమ్మాయి ఎక్కడుందన్న సంగతి ఎవరమూ చెప్పలేదు. తరువాత ఆ అమ్మాయి వేసవి సెలవుల్లో ఇంటికి వచ్చినప్పుడు, ఎవరికీ తెలియకుండా వివాహం జరిపించారు. ఆ అమ్మాయి ఎదిరించలేకపోయింది.
చట్టాలెన్ని చేసినా, వాస్తవంగా జరిగే విషయాలు ఇలా ఉంటాయి. తల్లిదండ్రుల్లో, సమాజంలో ఆలోచనల్లో మార్పు తెచ్చే ప్రయత్నాలు జరగాలి. ముందుగా వారి జీవితాలకు భద్రత, రక్షణ కల్పించాలి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!