స్వేచ్ఛ లేని అమ్మాయి

స్వేచ్ఛ లేని అమ్మాయి

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: మాధవి కాళ్ల

అమ్మాయి ఫోన్లో మాట్లాడితే చాలు ఎవరో ఒకరు అనుమానంతో అడుగుతారు. “ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావ్ ఆడా? మగా?” అని. సాయంత్రం సమయంలో బయటకు వెళితే ‘ఎందుకు? ఏమిటి?’ అని అడుగుతారు.

18 సంవత్సరాలలో అమ్మాయికి పెళ్ళి చేస్తే సడన్గా ఇప్పటివరకూ ఉన్నవాళ్ళని వదిలి పెట్టి వెళ్ళటం మనసుకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కొత్త వాళ్ల మధ్య ఉండడం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. అమ్మాయికి తన కాళ్ళ మీద నిలబడేలా ఇంట్లో వాళ్ళు అవకాశం ఇవ్వడం చాలా తక్కువ.

 ఒకవేళ ధైర్యం చేసి జాబ్ చేస్తే ప్రతి రోజు గొడవే జరుగుతుంది. ఆ గొడవలో ప్రతి సారి ‘నువ్వు జాబ్ మానేసేయి’ అని చెప్పడం అలవాటుగా మారుతుంది. మనుషులను అర్థం చేసుకునే మనస్తత్వం కావాలి. ఎవరు ఎలాంటి వారో తెలుసుకొని ప్రవర్తించాలి.

అమ్మాయిల పెళ్ళి వయస్సు పెంచడం లాభమే. ఎందుకంటే జీవితంలో వాళ్ళు ఏదో సాధించాలని వాళ్ళ లక్ష్యం కోసం ప్రయత్నం చేయాలని అనుకుంటారు. సమాజంలో వాళ్ళ గౌరవం కోసం, ఒక స్థాయి కోసం పాకులాతున్నారు.

ప్రభుత్వం పెళ్ళి వయస్సు పెంచినా కొందరి తల్లిదండ్రులు ఆ వయస్సు రాకముందే పెళ్ళి చేస్తున్నారు. కొన్ని పల్లెటూర్లలో చిన్నతనంలోనే పెళ్ళిళ్ళు చేసేస్తున్నారు. నేను స్వయంగా ఎన్నో పెళ్ళిళ్ళు చూసాను. ఏదో చదివిస్తున్నారు అంతే తర్వాత పెళ్ళి వయస్సు రాకముందే పెళ్ళి చేస్తున్నారు. కనీసం పై చదువులు కూడా చదివించరు.

ఇంట్లో వీటి గురించే గొడవలు జరుగుతున్నాయి. అత్తారింట్లో ఒక విలువ లేని మనిషిగా మిగిలిపోతున్నారు. వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలని చూస్తే చాలు, “నీకు ఏం తెలుసు?” అని చులకనగా చూస్తారు. కాలాలు మారినా ఆడవాళ్ళకి విలువ ఉండడం లేదు. ఆడదానికి స్వేచ్ఛ ఇవ్వాలంటే ఏదో తప్పు జరిగిపోతుంది అనే భయపడే పరిస్థితి ఉంది.

ముందు వెనక చూడకుండా ఒక మనిషికి ఇచ్చి పెళ్ళి చేయడం, తర్వాత వాడి నిజస్వరూపాన్ని తెలిసి కూడా వాడు పెట్టే టార్చర్ భరిస్తూ ఉండడం, ఈ విషయం ఆ అమ్మాయి తల్లిదండ్రులకు తెలిసి “అయ్యో మన అమ్మాయి జీవితం నాశనం అయిపోయిందే!” అని వాళ్ళు బాధ పడి, ఇటు ఈ అమ్మాయికి భవిష్యత్తు మీద నమ్మకం లేకపోవడం తనని ఇంకా బాధ పెడుతుంది.

అమ్మాయిలకు పెళ్ళి వయస్సు పెంచడం వల్ల తన జీవితం మీద ఒక అవగాహన కలుగుతుంది. తనని అర్దం చేసుకున్న వ్యక్తితో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఒకవేళ సమస్య వచ్చిన పరిష్కారం చేయవచ్చు అనే నమ్మకం ఉంటుంది. సమస్యలు లేని జీవితం లేదు. ఆ సమస్యలకు పరిష్కారం  తప్పకుండా దొరుకుతుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!