గంగమ్మ సత్రం (కథ)
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: టీ. వి. ఎల్. గాయత్రి
రామాపురమనే గ్రామం లో శివయ్య అనే ఒక మోతుబరి రైతు వుండేవాడు. ఆయనకు దానగుణము కూడా ఎక్కువే. ఆయన పేదవారి కోసము తన సంపాదనలో కొంత భాగము ఖర్చు పెడుతూ వుండేవాడు. రామా పురానికి దగ్గరలో ఒక పట్నం వుండేది. ఆ పట్నంలో పేద విద్యార్థులకు అన్నం పెట్టమని గంగమ్మ అనే ఆవిడను ఏర్పాటు చేసి ఒక ఇల్లు అద్దెకు తీసికొని శివయ్య ఆవిడకు నెల నెలా బియ్యము, సరుకులూ పంపించేవాడు.
గంగమ్మ వాటితో శ్రద్ధగ పేదపిల్లలకు భోజనం పెట్టేది. అయితే శివయ్య సరుకులు పంపించినా ఆ ఇంటిలో గంగమ్మ వంట వండి పెడుతుంది కాబట్టి అందరూ ‘గంగమ్మ సత్రం’ అనే వాళ్ళు. అలా ఆ సత్రాన్ని శివయ్య పేద విద్యార్థుల కొఱకు చాలా ఏళ్లుగా నడుపుతున్నాడు. కొన్నేళ్లకు శివయ్యకు కష్ట కాలము వచ్చింది. ఆ ప్రాంతంలో కరువు రావటంతో మూడు సంవత్సరాలు పొలాలు పండ లేదు.వరుసగా మూడో ఏడు కూడా పంట లేకపోవడం శివయ్యఆర్థిక పరిస్థితి కొంచెము తగ్గింది. ఇంట్లో ఖర్చు తట్టుకోవటం కష్టంగా వుంది. పిల్లా జెల్లా వున్న సంసారము. ఇల్లు ఎలాగో నడిపినా సత్రానికి బియ్యము పంపించడం కష్టంగావుంది శివయ్యకు.
ఆయన పరిస్థితి చూసి గంగమ్మ కూడా “అయ్యగారు!మీకు పంటలు పండినప్పుడే ఇవ్వండి. మీ ఔదార్యము నాకు తెలియనిది కాదు. సత్రము కొఱకు ఎవరో ఒకరు ధనసహాయము చెయ్యకపోరు.ప్రయత్నిద్దాము.”అంది. శివయ్యకు చాలా బాధ వేసింది. సత్రం లో భోజనము లేక పోతే పేదపిల్లలు ఎలా చదువుకొంటారు? ఆయన విచారంతో నడుస్తూ అక్కడే వున్న బొగ్గు ముక్క తీసికొని ఆ వీధిలో గోడమీద ఇలా వ్రాసాడు. “ఈ వీధిలో గంగమ్మ సత్రము నడపటానికి నా వద్ద తగు మాత్రము ధనము లేదు. అలా అని పేద పిల్లలకు అన్నం పెట్టక పోతే వాళ్ళ చదువు దెబ్బతింటుంది. ఎవరైనా ఈ కష్టకాలములో సహాయము చేసిన యెడల వారి ఋణము నాకు పైకము అందిన వెంటనే తీర్చగల వాడను.ఇట్లు రామాపురం శివయ్య”. అలా వ్రాసి ఆయన కదిలి భారంగా గ్రామానికి చేరుకున్నాడు.
ఆశ్చర్యం! ఆ వీధి వాళ్ళు గోడ మీద శివయ్య వ్రాసిన సమాచారము చదవంగానే తలా కొంచెము బియ్యము తీసికొని గంగమ్మ ఇంటికి రావటం మొదలు పెట్టారు.
రెండు మూడు రోజుల్లో గంగమ్మకు నెలకు సరిపడా సరుకులు వచ్చి చేరాయి. వార్త విన్న శివయ్య చాలా సంతోషించాడు.
అతడు పట్నం వచ్చి వీధిలో వారికి కృతజ్ఞతలు తెలియ చేసాడు.అలా ఆ వీధిలో వాళ్ళు సత్రానికి కావలిసిన బియ్యము,సరుకులూ సరఫరా చేయసాగారు.ఇలా కొన్ని నెలలు గడిచాయి. మరుసటి సంవత్సరం శివయ్యకు పంటలు బాగానే పండాయి. ఆయన వీధిలో ప్రముఖులను సమావేశపరిచి ఇంక సత్రం జరుగుబాటు చూసుకొంటానని, తన పొలంలో పంట చేతికి వచ్చిందని చెప్పగానే మిగిలిన వాళ్ళు శివయ్యతో ఎంతో ఆదరముతో “మీరు చేస్తున్న మంచి పనిలో మేమందరమూ భాగస్వాముల మవటము మాకు చాలా అనందము. ఇకనుండీ ఈ గంగమ్మ సత్రము మన అందరిది. అందరమూ కలిసి పని చేద్దాము. ఇంకా ఎక్కువ మంది పేద విద్యార్థుల చదువుకోసము పాటుపడదాము.”అన్నారు. శివయ్య చాలా సంతోషించాడు.
ఈ విధంగా గంగమ్మ సత్రం చాలా మందికి ఆశ్రయ మిచ్చింది. ఆ తర్వాత గంగమ్మ సత్రం ఏ లోటు లేకుండా కొనసాగింది. ఆ ఊరిలో గంగమ్మ సత్రానికి చాలా మంచి పేరు వచ్చింది. శివయ్యను పట్నంలో పెద్దలు చాలా గౌరవించేవాళ్ళు. శివయ్య దానగుణమునకు మెచ్చిన ప్రభుత్వం శివయ్యకు ఉత్తమ పౌర సన్మానం చేసింది.
