మనిషి మనసు

మనిషి మనసు (పాటకు ప్రాణం పల్లవి)

(తపస్వి మనోహరం – మనోహరి)

వివరణ: అరుణ డేనియల్

పాట రచన: ఆచార్య ఆత్రేయ
సంగీతం: కె.వి. మహదేవన్
విశ్లేషణ: అరుణ డేనియల్
చిత్రం: ప్రేమలు – పెళ్ళిళ్ళు
గాయకులు: రామకృష్ణ

పల్లవి:
మనసులేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసు లేని దేవుడు మనిషికెందుకో మనసిచ్చాడు. మనసును మనసు వంచన చేస్తే కనులకెందుకో నీరిచ్చాడు. ఈ పాట లో ప్రధానంగా మనసు కవి ఆత్రేయ ఎలాంటి కఠినమైన పదాలు వాడకుండానే మనసు గురించి అద్భుతమైన విధంగా వర్ణించాడు. పండితులకు పామరులకు ఎవరైనా ఏ సంధర్భంలోనైన విన్నట్లయితే వాళ్ల పరిస్థితితో పోల్చుకుని ఆలోచనలో పడిపోయే గీతం ఇది.
అమ్మాయి అబ్బాయి యవ్వనపు తొలి రోజుల్లో కలుసుకొని, ఒకరిని ఒకరు ఇష్టపడి, పెళ్లి బంధంలో ప్రవేశిస్తారు. ఎంతో సంతోషంగా జీవితం దొర్లుతూ ఉంటుంది. కానీ ప్రతి ఒక్కరికీ ఒక వృత్తి అనేది ఉంటుంది. కొన్ని సార్లు వృత్తిని, కుటుంబ జీవితాన్ని సమన్వయ పరచడం చాలా కష్టం. ఇక్కడ అమ్మాయి భర్తను అర్థం చేసుకోలేదు. తనదైన లోకంలో ప్రపంచంలోనే ఉంటుంది. ఫలితంగా వివాహ బంధం విచ్చినమౌతుంది.
మనిషి ఎపుడు సుఖంలో మునిగి తేలుతున్నపుడు దేవుని తలచుకోడు. దుఃఖం తలుపు తట్టిన వెంటనే, సృష్టి చేసిన దేవుని మీద నిందలు మోపుతూ ఉంటాడు. ఈ గీతంలో అదే చూస్తాము. దేవునికి మనసేలేదని గీతకర్త వ్రాసారు. నిజానికి మనసులేనిది ప్రేమను, పెళ్లిని చిన్న కారణాలకు కాలదన్నుకున్న అమ్మాయికి. కానీ నింద దేవుని మీద. మనసు ముక్కలై కళ్ల నుండి కన్నీరు ఆగకుండా కారుతోంటే భాధ భరించలేక పాడిన పాట ఇది.
చరణం: 1
మనిషికి, దైవానికి ఎనాటి నుంచో వైరము…
మనిషికి, దైవానికి ఎనాటి నుంచో వైరము…
వీడి కోరిక వాడు తీర్చడు, వాడి దారికి వీడు వెళ్లడు… భగ్నమైన ప్రేమ, పెళ్లి నుంచి గేయ రచయిత ప్రేక్షకుడిని దేవుని స్వరూపాన్ని వివరించి ఒక ఆలోచనలో పడేస్తాడు. ఆఖరికి మనిషికి, దైవానికి ఎనాటి నుంచో వైరము అంటాడు. అది రచయిత అభిప్రాయం. నిజానికి దేవుడు లోకమును నడిపిస్తాడు. కానీ మనసు కథలను వ్రాస్తూ కూర్చోడు కదా..!
చరణం: 2
ప్రేమనేది ఉన్నదా అది మానవులకే ఉన్నదా..!
ప్రేమనేది ఉన్నదా అది మానవులకే ఉన్నదా..
హృదయముంటే తప్పదా…
అది బ్రతుకు కంటే గొప్పదా…
ఈ చరణంలో విఫలమైన ప్రేమ, వివాహ బంధం నుంచి, పూర్తి వైరాగ్యం వైపుకు తీసుకుని వెళ్తాడు. మనసు కవి ఆత్రేయ. హృదయం ఉంటే ప్రేమ తప్పదా..? ఈ భావనలు మనిషికి మాత్రమే ఉన్నాయా, ప్రేమ బ్రతుకు కంటే గొప్పదా అని రచయిత దేవుని ప్రశ్నిస్తాడు.
చరణం: 3
ఏమిటో ఈ ప్రేమ తత్వం…
ఎక్కడుందో మానవత్వం…
ఏమిటో ఈ ప్రేమ తత్వం…
ఎక్కడుందో మానవత్వం…
ఏది సత్యం ఏది నిత్యం…
చివరికంతా శూన్యం…
ప్రపంచంలో అన్నీ బంధాలు ప్రేమతోనే ముడిపడి ఉన్నాయి. మరి ఎందుకు క్షణ కాలంలో ప్రేమలు మాయమౌతున్నాయి.. ఏమిటి ఈ ప్రేమ తత్వం..? ఇంతగా ప్రేమించాక వదిలెయ్యడంలో మానవత్వం ఉందా..? అంతా శూన్యమే కదా..!
చక్కని పాట. నట సామ్రాట్ అక్కినేని గారి అద్బుత అభినయం. వెరసి ప్రేక్షకునికి గొప్ప విందు భోజనం ఈ పాట. ఎపుడైనా ఒకసారి ఈ పాట గురించి దేవుని స్వరూపాన్ని గురించి, ప్రేమ తత్వం గురించి ఆలోచన చేయండి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!