మదిలో వీణలు మ్రోగే

మదిలో వీణలు మ్రోగే

(తపస్వి మనోహరం – మనోహరి)

విశ్లేషణ: ఎం. వి. ఉమాదేవి

చిత్రం: ఆత్మీయులు
గాయని: పి. సుశీల గారు

పల్లవి:
మదిలో వీణలు మ్రోగే..
ఆశలెన్నొ చెలరేగే..
తొలి యవ్వనంలో ఉన్న అమ్మాయికి పెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. ఎరిగిన వాడు కావడంతో, అమె ఆనందంలో సిగ్గుతో పెరట్లో వీణ వాయిస్తున్న, కాబోయే వదిన గారి ముందు మనసు వెళ్ళబోసుకుంది. చిన్ని పదాలు, గొప్ప భావం.
చరణం: 1
సిగ్గు చాటున నా లేత వలపు మొగ్గ తొడిగింది..
పాల వెన్నెల స్నానాలు చేసి పూలు పూచింది..
లేత వలపు మొగ్గ తొడిగి పూలు పూయడం పాల వెన్నెల స్నానాలు, కవి గారి మనోహర భావన.
చరణం: 2
కెరటాల వెలుగు చెంగలువ నెల రాజు పొందు కోరేను… అందాల తారనయి మెరిసి చెలికాని చెంత చేరేను…
పక్కనే కొలనులో కలువలు చూసి అమ్మాయి భావాలు మరింతగా పెంచాయి. తనో తారగా అతనే నెల రాజుగ అనుకుంది.
చరణం: 3
రాధ లోని అనురాగమంతా మాధవునిదేలే..
వేణులోలుని రాగాల కోసం వేచియున్నదిలే..
రాధా మాధవ విగ్రహం మనసూ తనువు పరవశం, భావాలు మరింతగా చిక్కబడ్డాయి. స్నేహితుడు తన వాడైతే కలిగే అనుభూతి అమ్మాయిలో వెలుగు చూసింది. అన్నగారు, ఆత్మీయ పెద్దాయనా పాట విని ఆనందించారు. ఆలతి పదాలతో అల్లిన గీతానికి చారడేసి కళ్ల చంద్రకళ సౌమ్యమైన ముఖంలో భావాల వ్యక్తీకరణ, నిండు జాబిల్లితో, పరిసరాలు ఆహ్లాదం కలిగించడంతో పాట అయి పోయినా కొంత సేపు ట్రాన్స్ లో ఉంచుతుంది. రసాలూరు రాజేశ్వర రావు గారి సంగీతం మనోరంజితమై సాగింది. చిత్రీకరణ చాలా బాగుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!