స్నేహ బంధం 

స్నేహ బంధం 

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: కొంటి కర్ల లలిత 

చిత్రం: ప్రాణస్నేహితులు (1988)
దర్శకత్వం: వి.మధుసూదనరావు గారు.
సాహిత్యం: భువనచంద్ర గారు.
సంగీతం: రాజ్ కోటి గారు.
గానం: బాలు గారు.

ప్రాణస్నేహితులు చిత్రం నుండి స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అనే పాట.
ఈ లోకంలో అన్ని బంధాలకన్నను స్నేహబంధం చాలా చాలా విలువైనది. మధురమైనది. ఏ బంధమైనా మధ్యలో తెగిపోతుందేమో కాని, మంచి స్నేహబంధం మాత్రం శాశ్వతంగా నిలిచిపోతుంది. ఎంతో అపురూపమైనది. అద్భుతమైనది స్నేహబంధం. ఆ బంధాన్ని వివరించే సందర్భంలో ఈ పాటను మురళీ మోహన్ గారు పిల్లలతో కలిసి పాడుతున్నట్లుగా చిత్రీకరించటం జరిగినది. ప్రాణానికి ప్రాణమైన స్నేహబంధం యొక్క ప్రాధాన్యతను వివరిస్తూ, ఎంతో హృద్యంగా స్నేహ పరిమళాలు పూయించిన భువనచంద్రగారి ఈ గీతానికి రాజ్ కోటి గారు వీనుల విందైన సంగీత మధురిమలను అందించగా, తన గాత్ర మాధుర్యమంతా ఒలికిస్తూ, స్నేహ సుగంధాలు వెదజల్లుతూ, అత్యద్భుతంగా, హృదయానికి హత్తుకునేలా ఎంతో హృద్యంగా ఆలపించి పాటకు ప్రాణం పోసారు బాలు గారు. స్నేహ మాధుర్యమయమైన ఈ గీతం తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయింది. తెలుగు పాటకు చిర కీర్తిని ఆపాదించి పెట్టింది.
పల్లవి
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా
కడదాక నీడ లాగా నిను వీడిపోదురా
నీ గుండెలో పూచేటిది
నీ శ్వాసగా నిలిచేటిది
ఈ స్నేహమొకటేనురా… స్నేహాని….
స్నేహాన్ని మించిన కలిమి బలిమి ఈ లోకంలో వేరేలేదంటూ, కడదాకా నీడ వలె తోడుంటూ, మధురిమల పుష్పమై గుండెల్లో వికసిస్తుంది. నీ శ్వాస, నీ ఆశ అన్ని తానై నిలిచివుంటుందంటూ మంచి స్నేహానికి చక్కటి నిర్వచనం ఇచ్చారు రచయిత.
తులతూగే సంపదలున్నా..
స్నేహానికి సరిరావన్నా..
పలుకాడే బంధువులున్నా..
నేస్తానికి సరిరారన్నా..
మాయ మర్మం తెలియని చెలిమే ఎన్నడు తరగని పెన్నిధిరా..
ఆ స్నేహమే నీ ఆస్తిరా..
నీ గౌరవం నిలిపేనురా..
సందేహమే లేదురా..
స్నేహానికి సరితూగే సంపదలు ఉండవంటూ.. అంతటి ఆత్మ బంధువులు కూడా ఉండరంటూ.. మనమున్నంత వరకు శాశ్వతంగా నిలిచి ఉండే ఐశ్వర్యం స్నేహమొకటే అని గీత రచయిత చెలిమి బంధం గూర్చి ఎంతో హృద్యంగా చెప్పారు.
త్యాగానికి అర్థం స్నేహం…
లోభానికి లొంగదు నేస్తం…
ప్రాణానికి ప్రాణం స్నేహం..
రక్తానికి రక్తం నేస్తం..
నీది నాదను భేదం లేనిది..
నిర్మలమైనది స్నేహమురా..
ధృవతారలా స్థిరమైనది..
ఈ జగతిలో విలువైనది..
ఈ స్నేహమొకటేనురా..
ఎంతటి కష్టములోనైనా, పరిస్థితులేవైనా, స్నేహమెపుడు త్యాగాన్నే కోరుతుంది. ఎటువంటి లాభాపేక్షకు, లోభానికి లొంగకుండా, ప్రాణానికి తన ప్రాణం అడ్డువేస్తుంది. ఆపద సమయంలో, రక్తబంధంకన్నా విలువైనది. నీవు నేను వేరుకాదు ఒకటేనంటూ, భేదభావం లేని, నిస్వార్థమైన స్నేహం, ధృవతారలా ఎప్పటికీ వెలుగులీనుతునే ఉంటుందంటూ, ఆత్మీయతను పంచే స్నేహం ముందు కోట్ల సంపదలు కూడా దిగదుడుపే, అంటూ భువనచంద్రగారు స్నేహ మాధుర్యాన్ని , స్నేహం యొక్క గొప్పతనాన్ని , త్యాగనిరతిని అద్భుతంగా, అద్వితీయముగా వర్ణించారు ఈ గీతంలో.
సంగీత సాహిత్యాలతో మనసుల్ని మురిపించి, మృదుమధురమైన గాత్రంతో మైమరపించి, అద్భుత చిత్రీకరణతో పులకింపజేసిన, ప్రాణ స్నేహితులు చిత్రవర్గానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!