నేను కవిత రాస్తూనే ఉంటాను
(తపస్వి మనోహరం – మనోహరి)
రచన: వరలక్ష్మి యనమండ్ర
నేను కవిత రాస్తాను – రాస్తూనే ఉంటాను
నింగి నుండి చిరుజల్లులు నేలమ్మను తాకినపుడు
జల్లులలో తడిసిపోయి నేలతల్లి మురిసినపుడు
ఆకసాన ఇంద్రధనుస్సు సాకారం అయినపుడు
కాలువలలో పిల్లలు కాగితపు పడవలు వదిలినపుడు
ఆనందంతో కవిత రాస్తాను – రాస్తూనే ఉంటాను
పల్లెలలో నడచునపుడు పైరుతల్లి పిలిచినపుడు
వీధులలో బాలలంత బాధలేక ఆడునపుడు
తెల్లని కొంగల బారులు వరుసలలో ఎగురునపుడు
చీకటిలో మిణుగురులు వెలుగుపూలు చిందునపుడు
సంతోషంతో నేను కవిత రాస్తాను – రాస్తూనే ఉంటాను
పొద్దంతా ఇంటిపనిని అమ్మ చేసుకున్నపుడు
పువ్వుల వలె పసిపాపలు చిరునవ్వులు రువ్వునపుడు
తూనీగలు ఝుం ఝుం అని ఝంకారము చేయునప్పుడు
కొమ్మ మీది కోకిలమ్మ కుహూ కుహూ అని పాడునపుడు
సంబరముతో నేను కవిత రాస్తాను – రాస్తూనే ఉంటాను
అభం శుభం తెలియని పిల్లలు హాస్టలులో బందీలైనపుడు
పగలూ రేయీ చేసే మార్కుల సమరం లో వారు ఓడినపుడు
అందని ర్యాంకుల దిగులుతో వారు అత్మహత్య చేసుకున్నపుడు
ఆకతాయిలు ఓ వైపు అమ్మాయిలనేడిపిస్తే
చట్టాలతోనే మరోవైపు సరిపెడుతున్నపుడు
బాధాతప్త హృదయంతో నేను కవిత రాస్తాను – రాస్తూనే ఉంటాను.
