పాటకు ప్రాణం పల్లవి సాహిత్య వివరణ

పాటకు ప్రాణం పల్లవి సాహిత్య వివరణ

(తపస్వి మనోహరం – మనోహరి)

వివరణ : కె.కె.తాయారు

చిత్రం: రంగస్థలం
రచన: చంద్రబోస్ గారు
సంగీతం: దేవి శ్రీ ప్రసాద్ గారు

ఈ పాట రంగస్థలం అనే చిత్రంలోనిది. దీనిని రాసిన వారు శ్రీ చంద్రబోస్ గారు. సంగీత భాణిని సమకూర్చినవారు దేవి శ్రీ ప్రసాద్ గారు, పాట కూడా భావ యుక్తంగా పాడినది వారే. ఈ పాటలో నాయికను చూసి, నాయకుడు తన మనస్సులోని భావన వ్యక్తీకరించిన తీరు ఎంత సున్నితంగా ఉందో..! ప్రకృతి రమణీయంతో సాహిత్య వరవడలు పెట్టి, ఆలపించిన అమృత ధారలు పలికించారు. ఇద్దరూ శ్రీదేవి ప్రసాద్ గారు, శ్రీ చంద్రబోస్ గారు.
వేరుశెనగ కోసం మట్టిని తవ్వితే ఏకంగా తగిలిన లంకె బిందె లాగా ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే, పల్లె పద్ధతిలో చెప్పిన పదాల జిలుగులు, మనసులో నింపిన మధురిమ అనన్యం. లంకె బిందె లాగా అదృష్టం అన్న తీరు.
సింత చెట్టు ఎక్కి, చిగురు కొయ్యబోతే.. చేతికి అందిన చందమామ లాగా ఎంత సక్కగున్నవే లచ్చిమి. ఆ స్త్రీ మూర్తి అందాన్ని సున్నితమైన భావంతో చింత చిగురు కోద్ధామని ప్రయత్నిస్తే చేతికి చందమామ దొరికిందని నిజంగా దొరికినంత సంతోషంగా అద్భుతంగా వివరించారు, పాడారు.
మల్లెపూల మధ్య ముద్ద బంతి లాగా ఎంత సక్కగున్నవే.. లచ్చిమి ఎంత సక్కగున్నవే… గుబాళించే మల్లెపూల సుగంధాల మధ్య ముద్ద బంతి లాగా… ఇక్కడ ఇంతీ పూబంతి, ముద్ద బంతి అంటే అంత ముగ్ధ మనోహరంగా ఉన్నదని వర్ణించారు.
ముత్తయిదువ మెల్లోన పసుపు కొమ్ములాగా ఎంత చక్కగా ఉన్నావే లచ్చిమి… ఇక్కడ ముత్తైదు పసుపు, కుంకుమల విలువెరిగి చక్కని అందాలను అలది చెప్పకనే చెప్పిన తీరు, ఆమె మెడలోని పసుపు కొమ్ము విలువ వ్యక్తీకరించిన భావన నిగూడం అద్భుతం.
సుక్కల చీర కట్టుకున్న వెన్నెల లాగా ఎంత సక్కగా ఉన్నావే లచిమి… కవి గారు హృదయం ప్రకృతిలోని దివ్యత్వానికి, వెన్నెలనే మూర్తిని జేసి ఆమెకి ఆకాశంలో చుక్కలు పొదిగిన చీర రూపంలో ఏమి వర్ణించగలం అందాల కవితా గానం విని అనుభవించి ఆనందించాల్సిందే.
ఓ రెండు కాళ్ళ సినుకివి నువ్వు గుండె సెర్లో దూకేశినావు. అలల మూట ఇప్పేసినావు, ఎంత సక్కగున్నవే లచ్చిమి ఎంత సక్కగున్నవే… చినుకు రూపంలో నాయిక గుండెలోని చెరువులో (అభిమానపు తటాకంలో) దూకితే అలల రూపంలో ప్రవహించింది. నీ అపురూపం అని వ్యక్తీకరించారు సంగీత వరవడి కూడా అపురూపం.
మబ్బు లేని మెరుపువి నీవు.. నేల మీద నడిచేసినావు.. నింగి చేసినావు ఎంత సక్కగున్నావు… నాయికని మబ్బు లేని మెరుపుని చేసి తాను నేల మీద నడిచి వచ్చింది. ఆకాశమైనాడు కాబట్టి దివ్యమైన అనుభూతి.
చెరుకు ముక్క నువ్వు కొరికి తింటూ వుంటే ఎంత చక్కగా ఉన్నావు, ఆ చెరుకు గడకే తీపి రుచి తెలిపినావే ఎంత సక్కగున్నావే… ఆమె పెదాల ప్రేమల రుచి తాకి చెరుకుకే తీపి రుచి చూపిందని, హృదయానుభూతిని నింపిన నాయకుని భావవ్యక్తీకరణ సంగీత సరళిలో ఊహించి ఓలలాడించింది.
తిరునాళ్లలో తప్పి, ఏడ్చే బిడ్డకు ఎదురొచ్చినా తల్లి లాగా సక్కగున్నావు… ఆ బిడ్డ పొందిన సంతోషం చెప్పలేనిది. అలాగే ఇక్కడ నాయకుని మనసులోని ఆనందం అంతే అంచులు చేరింది.
గాలి పల్లకిలో వెంకి పాట లాగా, ఎంకి పాటలోన తెలుగు మాటలాగా, ఊహా గానంలో పల్లకిని తెచ్చి అందు నండూరి వారి ఎంకి పాట గురించి చెబుతూ పాటలో తెలుగు తనాన్ని వ్యక్తీకరించారు. ఇదండీ కవి హృదయ స్పందన పాట శోభ.
కడవ నువ్వు నడుమున బెట్టి కట్ట మీద నడిచొస్తుంటే, సంద్రం నీ సంకెక్కినట్టు ఎంత సక్కగున్నవే… సాధారణంగా కడవ నడుమును పెట్టడం కట్ట మీద నడవడం మామూలే కానీ, ఇక్కడ సంద్రమే ఆమె నడుము పైకి ఎక్కి కూర్చున్న ఊహ అద్వితీయతని చూపెడుతున్న కవి హృదయం గాన మాధుర్యం.
కట్టెల మోపు తలకెత్తుకొని అడుగులోన అడుగేస్తుంటే అడవి నీకు గొడిగెట్టినట్టు ఎంత సక్కగున్నవే..! ఏమి వర్ణించారు అడవే గొడుగు అయినట్టు. ఆమె అందాన్ని కాపాడుతూ ఉన్నట్టు వర్ణించిన విధం చాలా చక్కగా ఉంది. ఏమనిపించింది అంటే కాదేది కవితకి అనర్హం అన్నట్టు ప్రతి పదం ఉపయోగం అద్భుతం. బురద చేలో వరి నాటు ఎత్తా ఉంటే ఎంత సక్కగున్నావే… నాట్లు నాటుతున్నప్పుడు రమణుల అందం లోక విధితమే. దానిని వక్కాణించారు కవి గారు.
భూమి బొమ్మకు నీవు ప్రాణం పోసినట్టు ఉందని భూమికి ప్రాణాన్నిచ్చే భావన గొప్పగా ఉంది. సంగీతం పాట మనసులో నిలిచే గానం చేసిన దేవి శ్రీ ప్రసాద్ గారికి, దానికి కవిత రూపంలో మలచిన చంద్రబోస్ గారికి హృదయపూర్వక వందనాలు.
అన్నిటినీ అనుసరిస్తూ వాచకం లోపం లేకుండా, అర్థయుక్తంగా, భావ యుక్తంగా, సంగీత పరంగా హృదయ లోతులలో శాశ్వతంగా ఆ మాటల, పాటల అందం తిరిగి తిరిగి ప్రతిధ్వనించే రీతిలో గానం మధురిమలు అందించిన ప్రతి ఒక్కరికి వందనాలు. దివ్య సంగీత కావ్య ఝరుల సంకీర్తనలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!