మార్గదర్శి

మార్గదర్శి

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: మోటూరి శాంతకుమారి

నేను తెలిసి తెలియని వయసులో చేసిన తప్పుకు దేవుడు బాగానే శిక్ష విధించాడు. డిగ్రీలో చేరిన రెండవ సంవత్సరంలో ప్రేమలో పడ్డాను. పెద్దవాళ్లనెదిరించి పెళ్లి చేసుకున్నాము. నేను చేసుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు ప్రభాకర్. నమ్మి పెద్దవాళ్ళని ఎదిరించాను. గుడ్డిగా నమ్మినందుకు తగిన శాస్తే జరిగింది. పిల్లాడు పుట్టినాక అర్ధంతరంగా తప్పుకున్నాడు. దిక్కు తోచని స్థితి.
ఆ ఊళ్ళో ఉండలేక భవిష్యత్తు వెతుక్కుంటూ హైదరాబాద్ రైలు ఎక్కేసాను, జనరల్ కంపార్ట్మెంట్. ఒక చేతిలో బాబు, ఒక చేతిలో సూట్కేస్. ఎక్కడా ఖాళీ లేదు. సూట్కేస్ ఒక పక్కన పెట్టి సీట్ రాడ్ పట్టుకుని నించున్నాను. బాబుని ఇటివ్వమ్మా అంటూ ఒక పెద్దావిడ పలకరించారు. బాబుని వొళ్ళో పడుకోబెట్టుకున్నారు. మీ వారు రాలేదా అడిగారు. గంట తర్వాత ఒకావిడ దిగి పోయింది. ఆ సీట్లో కూర్చున్నాను. మెల్లిగా మాటల్లోకి దించి నావిషయం మొత్తం రాబట్టారు. ఎక్కడికి వెళుతున్నావని అడిగారు. ఎవరూ లేరని చెప్పాను. పిల్లాడితో ఇబ్బంది పడతావ్ నాతో రమ్మన్నారు. స్టేషన్లో దిగింతర్వాత ఆవిడ కోసం కారు వచ్చింది. ఆవిడతో వెళ్లాను. వేరే దారి కూడా లేదు. ఇంటికి చేరుకున్నాక గది చూపించారు. స్నానం చేసినాక పనమ్మాయి టీ పట్టుకు వచ్చింది. తాగినాక కాస్త రిలీఫ్ అనిపించింది. ఆవిడ కూడా స్నానం పూజ చేసుకుని వచ్చారు. “అమ్మాయ్!మా బోటివాళ్ళం అంటే మీకు కోపం వస్తుంది కానీ ఎవడో ముక్కు మొహం తెలియనివాడు ప్రేమిస్తున్నానంటే పడిపోతారు. తల్లీ తండ్రుల కేమీ తెలియదన్నట్టు, వాడి వెనక పడి వెళ్లి పోతారు. పిల్లలు తమ కాళ్ళ మీద తాము నిలబడాలనే కదా చదువు చెప్పించేది. తమకి చదువు లేకపోయినా, కష్టపడి చదివిస్తారెందుకు..? పిల్లలు తమలాగా కష్ట పడకూడదనే కదా..! ఆ విషయం అర్ధం చేసుకోకుండా, ఆలోచించకుండా వాడిని నమ్మి వెళ్లి పోవటమే మీకు తెల్సింది. ఫలితం ఇదీ. నిన్ను నిందిస్తున్నానని అనుకోవొద్దు. నీ కాళ్ళ మీద నువ్వు నిలబడటానికి నా వొంతు సహాయం చేస్తాను. ధైర్యం గా వుండు. నీకు ఇక్కడేమీ భయం లేదు. అని ధైర్యం చెప్పారు. నా కొడుకు ఆమెకి బాగా దగ్గరయ్యాడు. కొడుకుతో చెప్పి కంప్యూటర్ క్లాస్ లో చేర్పించింది. నేను లేనప్పుడూ బాబుని ఆవిడే చూసుకుంటారు. కొడుకు, కోడలూ ఇద్దరూ మంచి వాళ్లే..! కోర్స్ అయిపోయింతర్వాత వాళ్లే జాబ్లో పెట్టించారు. నేను కూడా రెండు ట్యూషన్లు కుదుర్చుకున్నాను. డబ్బుకి ఇబ్బంది తప్పింది. మెల్లగా నేను దగ్గర్లోనే రూమ్ తీసుకుని మారి పోయాను. డిగ్రీ పూర్తి చేసుకుని, పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించుకున్నాను. హాయిగా వుంది. ఆవిడ స్ఫూర్తితో నేను వీలున్నంతలో నలుగురికీ సహాయం చేస్తున్నాను. ఇప్పుడు ఆవిడ స్వర్గం నుండే నన్ను దీవిస్తుంటారు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!