తడి కన్నులనే తుడిచిన నేస్తమా

తడి కన్నులనే తుడిచిన నేస్తమా

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: K. లక్ష్మి శైలజ 

“స్నేహమేరా జేవితం… స్నేహమేరా శాశ్వతం!” కాలేజీ లో జరుగుతున్న పాటల పోటీలల్లో స్టేజి మీద ఆపాట పాడుతున్న విశాల్ తో పాటు స్టేజీ కింద కూర్చున్న విద్యార్థులు కూడా తామే ఆ పాట పాడినంత సంతోషంగా తలలు ఊపి ఆ పాటను స్వాగతించారు. ఆ పాడిన గొంతులో మాధుర్యానికో, ఆ పాటలో ఉన్న స్నేహ మాధుర్యానికో నిర్ణయించుకోలేక ఆ పాట పాడిన విశాల్ కు బహుమతి ఇచ్చేశారు న్యాయ నిర్ణేతలు. స్నేహితుల దినోత్సవం రోజు పాడటం కూడా ఒక కారణమేమో.
విశాల్ బహుమతి తీసుకొని నేరుగా స్నేహితుడు సాగర్ దగ్గరకొచ్చాడు. సాగరమంత విశాల హృదయంతో విశాల్ ను ఆలింగనం చేసుకున్నాడు సాగర్. ఇద్దరూ రూముకు బయలుదేరి, ‘మురళికృష్ణ’లో ఐస్క్రీమ్ తిని, మలైకాజా కొనుక్కొని వచ్చేశారు. నెల్లూరు దగ్గర కాకటూరులో విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో చేరినప్పటి నుండీ ఇద్దరూ మంచి స్నేహంగా వున్నారు. ‘విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి’ అన్నట్టుగా ఉంటుంది వాళ్ళ స్నేహం. సాగర్ నిండు సంద్రం లాగా గంభీరంగా ఉంటే, విశాల్ మాత్రం ఈ విశాల ప్రపంచమంతా నాదే అన్నట్లు అంతటా చురుగ్గా ఉంటూ ఉంటాడు. “విశాల్, స్వరూప్ ఎందుకో డల్ గా ఉన్నట్లుంది. నిన్నంతా రూమ్లోనే ఉన్నాడట” అన్నాడు సాగర్, తన బుక్స్ అరను సర్దుకుంటూ. ఒక్క క్షణం తాను చేస్తున్న బట్టలు మడత వేసే పని ఆపి, “పద వెళ్ళొదద్దాం” అంటూ విశాల్, స్వరూప్ రూమ్ వైవు బయలుదేరాడు. ఒకే వీధిలో స్టూడెంట్స్ ఉండే రూమ్స్ అక్కడ చాలా ఉన్నాయి. విశాల్ వాళ్ళు వెళ్ళేసరికి, స్వరూప్ ఒక బ్యాగులో బట్టలు సర్దుకొని ఊరికి బయలుదేరుతున్నాడు. విశాల్ వెళ్ళి, “ఏమైంది స్వరూప్?” అనగానే, ఏదో చెప్పబోయి తలవంచుకున్నాడు స్వరూప్.
“డబ్బేమైనా కావాలా?” విశాల్ మాటలకు తల అడ్డం ఊపాడు. “మరేంటి?”  ఈ లోపు సాగర్ కుడా వచ్చాడు. స్వరూప్ బ్యాగ్ పక్కన పెట్టి, కుర్చీలో కూర్చున్నాడు. “మా చెల్లికి పెళ్ళి చేస్తున్నారట” అన్నాడు.
“పెళ్ళైతే దిగులెందుకురా?” అని ఫ్రైండ్స్ అడగ్గా, “మా చెల్లి వయసు పదమూడు. అదీ రెండో పెళ్ళి వాడితో. ఒక వారంలో పెళ్ళి. పెళ్ళి పత్రికలు కూడా ప్రింట్ చెయ్యలేదు. వాళ్ళు వద్దని చెప్పారట” అన్న స్వరూప్ మాటల్లో కొంచెం జీర వినిపించింది. ఆశ్చర్యపోయారు వింటున్న స్నేహితులిద్దరూ. “మా ఊరి ప్రెసిడెంట్ పెళ్ళి కుదిరించాడట. వాళ్ళకు తెలిసిన వాళ్ళ కొడుకని. కానీ పెళ్ళికొడుకొక్కడే వచ్చి అమ్మాయిని చూసి పోయాడట. పెళ్ళి కూడా కాళహస్తిలో చేసుకుంటారట. వాళ్ళు విజయవాడలో ఉంటారట. పెళ్ళికొడుకు ఏదో షాపులో పని చేస్తాడట. “పెళ్ళికి మేము ఎక్కువ మందిమి రాము. మీరు కూడా ఎక్కువమంది కాకుండా కొద్దిమందే రండి” అని చెప్పారట. విజయవాడ వచ్చి చూసొస్తామని ప్రెసిడెంట్ గారు అడిగితే కూడా, “పెళ్ళైన తరువాత పెళ్ళి కూతురుతో పాటు వద్దురులే” అన్నారట” అంటూ నెమ్మదిగా వివరించాడు. “మావూరికి బస్సు సౌకర్యం లేదు. అందువల్ల ఎప్పుడంటే అప్పుడు రాకపోకలు జరగవు. అందువల్ల మాలాంటి చిన్న కుటుంబాలలో ఆడపిల్లలను ఎక్కువగా చదివించలేము.  అందులోనూ మా అమ్మ చనిపోవడం వల్ల ఇంట్లో పనీపాటకు చెల్లిని చదువు మానిపించేసింది మా సవతి తల్లి” అన్నాడు మళ్ళీ. “అయితే మనసులో ఇంత బాధ పెట్టుకొని కళ్ళనీళ్ళతో ఒక్కడివే రూమ్లో ఉన్నావా? మాతో చెప్పొచ్చు కదా!” అన్నాడు విశాల్. స్వరూప్ చెప్తున్నదంతా విని నిట్టూర్చాడు సాగర్. ‘ఏముంది వింత? మామూలే కదా’ అన్నట్లు.
“ఒకపని చేద్దామా? ప్రెసిడెంట్ గారి నడిగి ఆ పెళ్ళికొడుకు అడ్రస్ తీసుకుందామా? ఒకసారి విజయవాడ వెళ్ళి, వాళ్ళ ఇల్లు చూసి వస్తే విషయం తెలుస్తుంది,” అని విశాల్  అనగానే, “ప్రెసిడెంటుకు కూడా పూర్తి అడ్రస్ తెలిసినట్లు లేదు. వాళ్ళే పెళ్ళి ఖర్చుకు డబ్బులిచ్చారట. దాంతో మానాన్న పొలంలో వరి నాట్లకు తీసుకున్న అప్పు తీరిపోతుందని పెళ్ళి చేస్తున్నాడు. ఊర్లో మా తాతయ్యా వాళ్ళు, మా మేనత్త వాళ్ళు వద్దని చెప్తున్నా మా నాన్న వినటం లేదట. ‘పెళ్ళికి మీరెవరూ రావద్దు’ అంటున్నాడట” అన్నాడు స్వరూప్.
“ఏంటో.. ఆ అబ్బాయి విషయం అంతా ఏదో సీక్రెట్ గా అనిపిస్తోంది” అన్నాడు విశాల్.
“ఒకపని చెయ్యి. నువ్వు ఈరోజు మీ ఊరు వెళ్ళు. రేపు మేము మీ ఊరికి వస్తాము. నీకు తెలియనట్లుగా ఉండు. మీ నాన్నకు చెప్పకు” అన్నాడు విశాల్.
“ప్రెసిడెంట్ గారు అడ్రస్ చెప్తారో లేదో తెలియదు. ఆయనకు కూడా ఏమైనా డబ్బులు మభ్యపెట్టి ఉన్నారేమో? పెళ్ళి ఆపితే డబ్బులు రావని మా నాన్నకు కోపం. నీ మీద కోప్పడతాడేమో?” అన్నాడు స్వరూప్.
“అలా అయితే తప్పకుండా మీ చెల్లిని కాపాడాల్సిందే!” అన్నాడు విశాల్ మొండిగా.
“పెళ్ళి పత్రికలు వేస్తే అందరికీ తెలుస్తుందని, పెళ్ళికి ముందు గానే రేపే ఊరు విడిచి కాళహస్తికి వెళ్తున్నారట” అన్నాడు స్వరూప్.
“అయితే వాళ్ళు నిజంగా కాళహస్తికి పోతారో లేక పెళ్ళి ఇంకెక్కడైనా అంటే పెంచలకోన, జొన్నవాడ లాంటి గుళ్ళల్లో ఎవరికీ తెలియకుండా చేసుకుంటారేమో తెలియదు కదా?” సాలోచనగా అన్నాడు సాగర్.
“అయితే స్వరూప్. వెంటనే నువ్వు మీ ఊరికి పద. నేనూ వస్తాను. నా బండ్లో నిన్ను మీఇంటి దగ్గర దించి, నేను వచ్చేస్తాను. నా నెంబర్ గుర్తుందిగా. ఫోన్ చేస్తూ ఉండు. వాళ్ళు ఈ రాత్రికే ఊరు దాటొచ్చు కూడా. పద పద!” అంటూ విశాల్ లేచాడు. “నేనూ రానా?” అన్నాడు సాగర్. “బండ్లో ముగ్గురం కుదరదు కదా”
“వేరే వాళ్ళ బండి తెచ్చుకుంటాలే. నిన్ను వంటరిగా వదలను” అన్నాడు సాగర్. రెండు బళ్ళలో ముగ్గురూ స్వరూప్ వాళ్ళ పల్లెకు బయలు దేరారు. అప్పటికే రాత్రి ఏడు గంటలవుతోంది. ఈ లోపల విశాల్ తన ఫోన్లో ఒక మెసేజ్ పెట్టాడు, వాళ్ళ ఎస్.ఐ అంకుల్ కు. తన కోసం ఒక కానిస్టేబుల్ని స్వరూప్ వాళ్ళ ఊరి మొదట్లో తోడు ఉండేట్లు పంపమని. ముగ్గురూ వెళ్ళేటప్పటికి రాత్రి ఎనిమిదయ్యింది. స్వరూప్ ను ఇంటి దగ్గర దించేటప్పటికి ఇంట్లో నుంచి చిన్నగా అరుపులు, ఆడపిల్ల ఏడవటం వినిపిస్తున్నాయి. స్వరూప్ ఇంట్లోకి వెళ్ళాడు. వీళ్ళిద్దరూ తలుపు బయటే ఉండిపోయారు. స్వరూప్ ను చూడగానేవాళ్ళ నాన్న, “వచ్చావా? చూడు నీ చెల్లెలు ఏం చేసిందో. అంగన్వాడీ టీచర్ తో తనకు పెళ్ళి  చేస్తున్నారని చెప్పిందట. సూపర్వైజరును తీసుకొని టీచర్ వచ్చి, అమ్మాయికి చిన్న వయసులో పెళ్ళి చెయ్యొద్దని చెప్పి వెళ్ళింది. ఏదో నాలుగు డబ్బులు వస్తే అప్పు తీరుద్దామనుకున్నాను. అది జరిగేటట్టు కనపడలేదులే” అన్నాడు ఆవేశంగా. “అప్పు కోసం చెల్లెల్ని అమ్మేస్తామా నాన్నా? పెళ్ళివాళ్ళు మంచి వాళ్ళు కానట్లు అనిపిస్తోంది. చెల్లి కూడా చిన్నపిల్ల. కొన్ని రోజులు ఆగుదాంలే” అన్నాడు స్వరూప్.
“నువ్వు కూడా పెళ్ళి ఆపడానికే వస్తివా? ప్రెసిడెంటుకు చెప్తే ముందు నిన్ను ఇక్కడి నుంచి పంపించేస్తాడులే ” అన్నాడు కోపంగా.
బయట వింటున్న వీళ్ళకు అర్ధం అయ్యింది, ఇందులో ప్రెసిడెంట్ హస్తముందని… అక్కడ నిలబడ్డ వాళ్ళను అడిగి ప్రెసిడెంట్ ఇంటిని చూశారు. ‘ఇంట్లో లేడు, నెల్లూరుకు  వెళ్ళార’న్నారు. ఫోన్ నెంబర్ తెలుసుకొని ఫోన్ చేశారు, కొంచెం పక్కగా వెళ్ళి. పెళ్ళి ఆపకుంటే పోలీసులకు చెప్తానన్నాడు విశాల్. పెళ్ళి సంగతి నాకేం తెలియదని ఫోన్ పెట్టేశాడు అతను. ఈలోపు కానిస్టేబుల్ ఫోన్ చేశాడు, ఊర్లోకి వస్తున్నానని. స్వరూప్ కూడా ఫోన్ చేశాడు, “మా నాన్న ప్రెసిడెంట్ మనుషులకు మీ గురించి చెప్తున్నాడు, జాగర్తగా వెళ్ళ”మని. ‘సరే’నని చెప్పి బయలుదేరారు విశాల్, సాగర్ లు. అయితే వీళ్ళ బండ్లు తిరిగి నెల్లూరుకు బయలుదేరిన పది నిముషాలకు డొంక దారిలో నుండి రెండు మోటారు బైక్స్ వీళ్ళ బండ్లకు అడ్డం వచ్చాయి. వీళ్ళు బండ్లు ఆపారు. ఫోన్ తీసే లోపలే అవతల వాళ్ళు కర్రలు తీశారు. వీళ్ళు తప్పించుకోవడానికి అటూ ఇటూ పరిగెడుతూ నెల్లూరు రోడ్ వైపే ఆ చీకట్లో పరుగెత్తారు.
వాళ్ళు విసిరిన ఒక కర్ర సాగర్ కాళ్ళకు తగిలింది. “అమ్మా” అంటూ పడిపోయాడు సాగర్. ఆ కేక విని వెంటనే ఆగిపోయాడు విశాల్. సాగర్ దగ్గరకు పరుగున వచ్చాడు. సాగర్ ను లేపే లోపలే ఆ దుండగులు దగ్గరకు వచ్చేశారు. చేతులతో విశాల్ ను వీపు మీద, మొహం మీద ఫట్ ఫట్ మని పిడికిలితో కొట్టడం మొదలు పెట్టారు.
విశాల్ మొహం అటూ, ఇటూ తిప్పుతూ సాగర్ ను పొదివి పట్టుకున్నాడు. ఇంతలో నెల్లూరు నుంచి ఊరి వైపు వచ్చే రోడ్డులో నుంచీ ఒక బండి స్పీడుగా వచ్చింది వీళ్ళదగ్గరకు. అందులోనుంచి కిందకు దూకుతున్న కానిస్టేబుల్ ను చూడగానే వాళ్ళు పొలాలకు అడ్డం పడి పరుగెత్తారు.  కానిస్టేబుల్ రోడ్ మీదే పరుగెత్తి వాళ్ళ బండ్లు సీజ్ చేసి, అంబులెన్సుకు ఫోన్ చేశాడు. అతను ఎస్.ఐ. తో మాట్లాడాడు. విశాల్ కూడా ఎస్.ఐ. తో మాట్లాడి, “థాంక్స్” చెప్పాడు. ఆ వచ్చిన కానిస్టేబుల్ తో కూడా “థాంక్స్ అంకుల్” అని చెప్పాడు. ఇంతలో అంబులెన్స్ వచ్చి, విశాల్, సాగర్ లను హాస్పిటల్లో అడ్మిట్ చేసారు. హాస్పిటల్లో ఇద్దరికీ వైద్యం జరుగుతూ ఉండగా, ఎస్. ఐ. వచ్చాడు.
విశాల్ ని అలా చూసి, “విశాల్ ఏమిటిది? ఇలా ఒంటరిగా, రాత్రి పూట ఇంత సాహసం అవసరమా? నీకేదైనా అనుమానంగా అనిపించగానే మాకు చెప్తే, మేము యాక్షన్ తీసుకుంటాము కదా! ఇప్పుడు చూడు. కొంచెంలో ఎంత ప్రమాదం తప్పిందో” అన్నాడు.
“అంత టైం లేదంకుల్. వాళ్ళు రాత్రికే ఊరు విడిచి వెళ్తారని అనిపించింది. ముందు మేమెళ్ళి, మీ సహాయం తీసుకుందామని బయలు దేరాము” అన్నాడు విశాల్. సాగర్ కాలికి బాగా దెబ్బ తగిలింది. విశాల్ కు ముఖం అదిరిపోయింది. “వాళ్ళనెలా పట్టుకుంటారు అంకుల్?” అన్నాడు విశాల్. “పోలీస్ వాన్ వెళ్ళింది. వాళ్ళ బండ్లు తీసుకురావడానికి. ఆ బండి నెంబర్ ద్వారా వాళ్ళను తెలుసుకుంటాము. ప్రెసిడెంటుకు ఫోన్ చేశాము. పిల్లతో కూడా తల్లి తండ్రులు వేరే వూరు వెళ్ళి పెళ్ళి చేసినా, ప్రెసిడెంటును శిక్షిస్తామని చెప్పాను. అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళి, కనీసం ఇంకో ఐదేళ్ళ వరకూ పిల్ల పెళ్ళి చేస్తే జైల్లో పెడతామని బెదిరించాము. మీరు ఎక్కడకి వెళ్ళినా మాకు దొరికిపోతారు అని చెప్పాము. ఫొనెలాగు వుంది. ఇక్కడ పొలంకూడా ఉందిగా. వాళ్ళు ఎక్కడికీ పోరింక. మహిళా అభివృద్ధి, శిశుసంక్షేమ శాఖ పి.డి. గారికి ఫోన్ చేసి ఆ పిల్లను ఫాలో అప్ చెయ్యమని చెప్పాను” అన్నాడు ఎస్.ఐ.
“థాంక్యూ అంకుల్. మీ డ్యూటీనే అయినా మాకోసం సాయంత్రం నుంచీ పని చేశారు. ఒక ఆడపిల్ల బాల్యవివాహాన్ని ఆపడానికి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. పేరెంట్స్ మామూలు మాటలకు వినేట్లుగా కనిపించలేదు. అందువల్ల మీ సహాయం తీసుకున్నాము” అన్నాడు విశాల్.
“ఓకే, ఓకే. జాగ్రత్త! మీ నాన్నకు నువ్వు చెప్తావా? నేను చెప్పేదా?” అన్నాడు ఎస్.ఐ. “వద్దంకుల్ నేనే రేపు చెప్తాను. ఇంటికి వెళ్ళొస్తాను కూడా. మీరు చెప్తే కంగారు పడతారు” అన్నాడు విశాల్. “సరే, నేను వెళ్ళొస్తాను. టేక్ కేర్” అంటూ ఎస్.ఐ. వెళ్ళిపోయాడు. చీకటి ఇంకా వీడక ముందే స్వరూప్ హాస్పిటల్ కు వచ్చాడు. వస్తూనే వీళ్ళిద్దరినీ బెడ్ మీద చూసి కళ్ళనీళ్ళు పెట్టుకున్నాడు. “నా కోసం మీరు దెబ్బలు తిన్నారు. మీ ఋణం ఈ జన్మ లో  తీర్చుకోలేను” అన్నాడు స్వరూప్, రెండు చేతులతో ఇద్దరికీ  నమస్కారం చేస్తూ. “అలా ఏమీ అనుకోకు. కరెక్ట్ సమయానికి పెళ్ళి కాకుండా కాపాడగలిగాము” అన్నాడు విశాల్. “పాపం స్వరూప్ కళ్ళనీళ్ళతో రూమ్ లో రెండు రోజులు మధన పడ్డాడు, చెల్లి పెళ్ళి ఆపే మార్గం తెలియక” అన్నాడు, పక్క మంచం మీద సాగర్ ను చూస్తూ విశాల్. “ఈ రోజు నువ్వు ఈ స్టెప్ తీసుకోకుంటే, ఇంత సాహసం చేయకుంటే, రేపటికల్లా వీళ్ళ నాన్నావాళ్ళు వెళ్ళి  పోయేవారు. స్వరూప్ చెల్లి వీళ్ళకు దక్కేది కాదు” అన్నాడు సాగర్. “అయినా మీరెంతో ఇబ్బంది పడ్డారు” అన్న స్వరూప్ మాటలకు… “అవసరమైనప్పుడు సాహసం చేయకుంటేనూ, స్నేహితుల కష్టాన్ని తీర్చలేకుంటేనూ ఈ జీవితానికి అర్ధం లేదు!” అన్నాడు విశాల్, విశాలంగా నవ్వుతూ…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!