చిన్నారి నీ జైత్ర యాత్రలో నీవే ఒక నవనారి 

చిన్నారి నీ జైత్ర యాత్రలో నీవే ఒక నవనారి

(తపస్వి మనోహరం – మనోహరి)

రచన: సిద్దగాని భాగ్యలక్ష్మి

 ఎక్కడైతే మహిళలు స్వతంత్రంగా ఎదగ గలుగుతారో, తమ భవిష్యత్తుకు దిశానిర్దేశం చేసే నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కలిగి ఉంటారో అప్పుడు మహిళా సాధికారతతో పాటు కుటుంబ మరియు దేశ ఆర్థిక అభివృద్ధి కూడా సాధించవచ్చు. అటువంటి లక్ష్యంతో తీసుకున్న నిర్ణయమే బాలికల వివాహ వయస్సు పెంపు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1978లో బాలికల వివాహ వయసును 16 నుండి 18 సంవత్సరాలకు చట్టం ద్వారా సవరణ చేశారు. 43 ఏండ్ల నుండి ఇప్పటివరకూ సగటు జీవితకాలం పెరిగింది, మహిళల విద్యా ప్రమాణాలు పెరిగాయి. వీటికి అనుగుణంగా ఇటీవల కేంద్ర క్యాబినెట్ ‘జయ జెట్లీ’ కమిటీ ద్వారా బాలికల వివాహ వయస్సు గురించి తీసుకున్న ఈ నిర్ణయం 18 సంవత్సరాల నుండి 21 సంవత్సరాలకు పెంచారు. 18వ సంవత్సరంలో ఒక బాలికకు వివాహం జరిగితే , ఆమె గర్భం దాల్చినప్పుడు రక్తహీనత మరియు పౌష్టికాహార లోపానికి గురి కావడం జరుగుతుంది. NFHS (నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే) ప్రకారం 50% మహిళలు గర్భధారణ సమయంలో రక్తహీనతతో బాధపడుతున్నారు. దీని ద్వారా మాతా శిశు మరణాలు పెరిగే అవకాశం ఉంటుంది. బాల్య వివాహాలు మరియు మాతా శిశు మరణాల సంఖ్యను కూడా, తగ్గించాలన్న అభిప్రాయంతో తీసుకున్న ఈ నిర్ణయం అందరికీ ఆమోదయోగ్యం కాకపోవచ్చు. కానీ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 2015 ప్రకారం 23% బాల్యవివాహాలు 18 సంవత్సరాల లోపు జరుగుతున్నాయి. 18 సంవత్సరములకు ఒక బాలికకు ఓటు హక్కు ద్వారా ముఖ్యమంత్రులను, ఎంపీలను ఎన్నుకునే అవకాశం ఉన్నప్పటికీ ఒక భర్తని ఎంచుకునే అవకాశం లేదా? అనే వ్యతిరేక ధోరణి కూడా వెలువడ్డాయి.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఎన్నుకున్న మంత్రులను ఎంపీలు నచ్చనప్పుడు ఐదు సంవత్సరాల తర్వాత తొలగించుకునే అధికారం కూడా ఉంటుంది, కానీ జీవిత భాగస్వామిని ఎంచుకోవాలంటే ఆమెకు సామాజికంగా మానసికంగా వ్యక్తిగతంగా ఎంతో అవగాహన కలిగి ఉండడం అనేది ప్రధానం. వివాహ వయసు 21కి పెంచడం వలన బాలికలు ప్రాథమిక విద్యతోనే చదువును ఆపేయకుండా ఉన్నత విద్యా అర్హతలను పెంచుకునే అవకాశం కూడా కలుగుతుంది. దాని ద్వారా ఆర్థికశక్తిగా ఎదగడం వలన కుటుంబాలలో జరిగే అనివార్య సంఘటన వలన భర్తలను కోల్పోతే, చింతించకుండా కుటుంబ పోషణకు సంపాదించే మార్గాన్ని, తనకు తాను సృష్టించుకునే సామర్థ్యాన్ని కూడా కలిగి ఉంటుంది.రాజ్యాంగ చట్టాల ద్వారా ఈ వివాహ వయసును పెంచడం ద్వారా ఇవి అన్ని అమలవుతాయా అనే సందేహం రావచ్చు. వరకట్న నిషేధ చట్టం వచ్చినంత మాత్రాన వరకట్నాలు తీసుకోవడం అనేది తగ్గలేదు. ఉమ్మడి పౌరస్మృతి సెక్షన్ 44 ప్రకారం భారతదేశంలో అన్ని మతాలకు సరైన సివిల్ చట్టాలనేవి లేవు. అయితే ఈ వివాహ వయస్సు సవరణ ద్వారా లింగ సమానత్వంతో పాటు సమాజంలో కొంతైనా మార్పుని ఆశించి మహిళా సాధికారతతో పాటు మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చు అన్న ఉద్దేశంతో తీసుకురావడం జరిగింది భావి భారత బాలికలకు ఇది శుభ పరిణామమే…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!