కాస్త మాడిస్తే సరి

కాస్త మాడిస్తే సరి

రచయిత :: నాగ మయూరి

వదిన కూర మాడి వాసన వస్తోంది తెలియట్లేదా, అంతలా ఏ పనిలో మునిగిపోయావు అంటూ పక్కింటి వనజాక్షి గోడమీద నుంచి తొంగిచూస్తూ అరుస్తోంది.

ఆ అరుపులు విని భయటకి వచ్చిన రాణి ” ఆ రానియ్యి వదిన ఆ మాత్రం మాడితే కానీ కూరకి వాసన అంటదు” అని తీరికగా సమాధానం చెప్పింది.

వనజాక్షి ఆశ్చర్యంగా అదేంటి వదిన కూర మాడితే ఎలా తింటారు? అసలే మీ అత్తగారు ఛాధస్తంగా తుడిచిందే తుడిచి,కడిగిందే కడుగుతూ శుచి, శుభ్రం అంటారు.
మీ మామగారు ఏమో అన్నీ రుచిగా ఉంటేకానీ తినరు కదా. అలాంటిది నువ్వు ఇలా కావాలని కూర మాడ్చటమేమిటి అంటూ మూతి ముప్పై వంకరలు తిప్పింది.

రాణి నింపాదిగా చెప్పడం మొదలు పెట్టింది….

ఏమి చెప్పను వదిన మా కష్టాలు ఈ మధ్య మీ అన్నయ్యకి “కరోనా ఫోభియా” పట్టుకుంది అంటుండగానే వనజాక్షి అడ్డుపడి “చాలు చాలులే ఊరుకోవమ్మా భయట వాతావరణం ఎలా ఉందో నీకు మాత్రం తెలియదా? పైగా టీ.వి, పేపర్ దేంట్లో చూసినా ఆ మహమ్మారి గురించేనాయే” ఇలాంటి సమయంలో బయట తిరిగే అన్నయ్యకి ధైర్యం చెప్పాల్సింది పోయి ఫోభియా అంటావేంటి?

నేను చెప్పేది కాస్త విను వనజాక్షి మీ అన్నయ్య ఎక్కడ తనకి కరోనా వస్తుందో అన్న భయంతో ప్రతిచిన్న విషయానికీ భయపడుతూ, విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అందులో తప్పు ఏముంది? ఇప్పుడు అంటే ఈరోగం వచ్చింది కానీ మీ
మీ అత్తగారు ఎప్పుడు అన్నీ శుభ్రం చేస్తే కానీ లోపలికి తేనివ్వరు, బాగా పరిచయస్థులు అయితే కానీ లోపలికి రానివ్వరు కదా! మీకు అసలు కరోనా భయం లేదులే వదిన అంది.

మేము నెత్తి,నోరు కొట్టుకుని మీ అన్నయ్యకి అదే చెబుతున్నాము అయినా ఆ మనిషి వింటే కదా!

మొన్న నువ్వు ఊరు వెళ్ళినప్పుడు ఎంత హడావిడి చేశారనుకున్నావు !

పొద్దున్నే వేడి వేడిగా ఉప్మా చేసి అందరికీ వడ్డించా అది తింటూనే మీ అన్నయ్య అసలు రుచేలేదు అన్నారు.
ఔను అమ్మాయి ఇలా రుచి పచీ లేకుండా వండావేంటి అని మామయ్య గారు.
కనీసం సువాసన అయినా లేదంటూ అత్తయ్యగారు…
ఇంకా ఈయన గారు కరోనా వచ్చేసింది అన్న భయంతో ఇంటిల్లిపాదిని హస్పటల్ కి తీసుకెళ్ళి టెస్ట్ లు చేయించారు. తీరా చూస్తే అందరికీ రిపోర్టు నెగిటివ్ అనే వచ్చింది.

మరి అయితే రుచి ఎందుకు తెలియలేదు వదిన! ఆ ఏముంది నేనే “ఉప్మా లో ఉప్పు వేయడం మర్చిపోయాను.”
ఇంటికి వచ్చి స్థిమిత పడ్డాకా కానీ ఆ విషయం గుర్తు రాలేదు.

ఇంక ఆరోజు సాయంత్రమే ఇంటిల్లిపాది కలిసి ఓ తీర్మానం చేసుకున్నాం. ఏమి వండిన కానీ “కాస్త మాడిస్తే సరి” ఆ వాసన తెలుస్తుంది కాబట్టి ఉప్పు మర్చిపోయినా భయం ఉండదు అని.

అందుకే వదిన ఇలా కూర కాస్త మాడువాసన వచ్చేదాక ఉంచుతున్నాను.

నువ్వు కూడా అనవసరంగా కరోనా అంటూ భయపడి డబ్బులు పాడుచేసుకోకు వదిన. కాస్త కూర మాడుస్తూ ఉంటే సరిపోతుంది అంటూ రాణి సలహా ఇచ్చింది.

వనజాక్షి విస్మయంగా చూస్తూ వంటిట్లోకి వెళ్ళింది. రాణి ఇచ్చిన ఉచిత సలహని పాటించడానికి అనుకుంటా….

ఈ చిట్కా కావాలంటే మీరు కూడా వాడుకోండమ్మా….

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!