ది జర్నీ

ది జర్నీ

రచయిత ::వాడపర్తి వెంకటరమణ

ఎంట్రన్సు పక్కనున్న సీటులో నా సూట్ కేస్ పెట్టి మెయిన్ డోర్ దగ్గరకు వచ్చి నిల్చున్నాను ఫ్లాట్ ఫాం వైపు చూస్తూ.

రైలు చిన్నగా కదులుతోంది.

ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్దామనుకున్న తరుణంలో నా దృష్టి ఎందుకో మళ్ళీ ఫ్లాట్ ఫాం పై పడింది.సహజంగానే సినిమాల్లో చూపించినట్లు ఎవరో అమ్మాయి చివరి నిమిషంలో రైలు అందుకోవడానికి ఫ్లాట్ ఫాం పై పరిగెడుతూ కనిపించింది.అలా అలా పరిగెత్తుకుంటూ సరాసరి నేను నిల్చున్న ఎంట్రన్సుకు చేతికందేంత దగ్గరగా వచ్చేసింది.బ్యాలన్స్ తప్పుతుందేమోనని కలలో ఉన్నట్లు ఆమెకు చేయందించాను.ఆమె చేయందుకుంది.

లోపలికొచ్చాక ఒక్కసారిగా ‘హమ్మయ్య…’ అనుకుంది ఆమె.ఆమెతో పాటు నేను కూడానూ.

నఖశిఖపర్యంతం అప్పుడు చూశానామెను.అప్సరసలను తలదన్నే అందంతో ఒక్కసారి చూస్తే కళ్ళు తిప్పుకోలేనట్లు ఉందామె.అప్పటివరకు పరిగెత్తి ఆయాసంతో రొప్పడం వలన నుదిటిపై చిందిన చిరు చెమట బిందువులు మంచిముత్యాల్లా మెరుస్తున్నాయి.ఆ మంచిముత్యాలను చూస్తూ అలాగే ఉండిపోయాను.

“చాలా థాంక్సండీ…!” సాయం చేసినందుకు కృతజ్ఞతగా అంది ఆమె.

ఆ మాటలకు నా ఆలోచనలను కత్తిరించి,”ఇట్స్ ఓకే…” అని చెప్పి నా సీటు వైపు కదిలాను.ఆమె నా ఎదుట సీట్లో బ్యాగు సర్దుకుని కూర్చుంది.ఆమె ధరించిన డ్రస్సుకు ఆమె అందం తోడవ్వడంతో ఇంకాస్త అది ఎలివేట్ అయినట్లనిపించింది నాకు.ఆమెను పెళ్ళిచేసుకున్నవాడు నిజంగా అదృష్టవంతుడే అనుకున్నాను.

“మీరెంత వరకు…?” అడిగిందామె.

“పలాస…మీరు…?”అడిగాను.
“నేను కూడా…అన్నట్లు నన్ను పేరు పెట్టి పిలిస్తే చాలు.నా పేరు మృదుల!”

“నైస్ నేమ్!” మెచ్చుకోలుగా అన్నాను.రైలు పెందుర్తిలో మూడు నిమిషాలు ఆగి మళ్ళీ ముందుకు కదిలింది.

ఆ స్టేషన్లో బాన పొట్టేసుకుని ఒకతను,బక్కగా రివటలావున్న ఉన్న ఆమె తమ ఇద్దరి పిల్లలతో ఆ కంపార్ట్మెంట్ లోకి ఎక్కారు.ఆ పిల్లల చేతులు తినుబండారాలవల్ల ఖాళీగా లేవు.బాన పొట్ట ఫ్లాట్ ఫాం పై కొన్న వేయించిన శనక్కాయల పొట్లాన్ని విప్పి ఒక్కో కాయను వలిచి లోపలి శనగపలుకుల్ని నోట్లో వేసి గ్రైండ్ చేస్తూ పైన తొక్కల్ని మాత్రం కూర్చున్న సీటు చుట్టూ నిర్లక్ష్యంగా పడేస్తున్నాడు.పాపం బక్కచిక్కిన తల్లికి కొంచెమైనా పెడుతున్నారో లేదో ఈ తండ్రీ, పిల్లలు అనిపించింది నాకు.వారు చేస్తున్న పనికి కోపమొచ్చినా తమాయించుకున్నాను.

కానీ మృదుల మృదువుగా కాక కాస్త కఠినంగానే అడిగింది.

“మీకు బుద్ధుందా!నిర్లక్ష్యంగా తినేసి మిగిలిన చెత్తంతా కంపార్ట్మెంట్ లో పడేస్తున్నారు.ఇదేమన్నా డస్ట్ బిన్ అనుకున్నారా!”

“ఓమ్మో… మాటలు సరిగా రానీ.ఈ రైలేదో మీ తాత గారెయ్యించినట్లు మాట్లాడుతున్నావు.మేమూ టిక్కెట్టుకి డబ్బులిచ్చే రైలెక్కాం!” బాన పొట్ట ఎదురుదాడికి దిగింది.గొడవ కాస్తా ముదురుతుండడం గమనించి మృదులను కాస్త కూల్ చేసి సీట్లో కూర్చోబెట్టాను.గొడవ కొంచెం సద్దుమణిగింది.

రైలు విజయనగరం జంక్షన్ దాటి ముందుకు సాగుతోంది.

ఉన్నట్టుండి అటూ ఇటూ గెంతులాడుతున్న బాన పొట్ట చిన్న పిల్లాడు కమలాపండు తొక్కపై కాలేసి జారి కింద పడ్డాడు.సీటు పక్కనున్న రాడ్డు తలకు తగిలి రక్తం చిమ్మింది.బాన పొట్ట చాలా భయపడిపోయాడు.పిల్లాడి తల్లి ఏడవటం మొదలెట్టింది.జరిగిన సంఘటనకు ఏం చేయాలో పాలుపోలేదు వాళ్ళకు.చుట్టుపక్కల సీట్లలో కూర్చున్న వాళ్ళు పిల్లాడి చుట్టూ చేరిపోయారు. ఆ సంఘటనతో ఒకింత గంభీర వాతావరణం నెలకొంది ఆ కంపార్ట్మెంట్ లో.

వాళ్ళని కాస్తా దూరంగా ఉండమని చెప్పి,సీటుపై పిల్లాడ్ని పడుకోబెట్టి తన బ్యాగులోంచి హైడ్రోజన్ పెరాక్సైడ్ బాటిల్, కాటన్ తీసి గాయమైన చోట హైడ్రోజన్ పెరాక్సైడ్ లో ముంచిన కాటన్ తో క్లీన్ చేసి రక్తం రాకుండా కట్టుకట్టింది మృదుల.

షాకవ్వడం నా వంతైంది.

“మృదులా…! నువ్వు డాక్టరువా?” షాక్ నుండి తేరుకుని అడిగాను.

“ప్రస్తుతానికి కాదు గానీ… మెడిసిన్ చదువుతున్నాను.ప్రయాణం చేస్తున్నప్పుడు నా బ్యాగులో ఎప్పుడూ ఫస్ట్ ఎయిడ్ కిట్ ఉంటుంది!” చెప్పింది మృదుల.

అన్ని దుర్భాషలాడినా మనసులో ఏమీ పెట్టుకోకుండా తమ పిల్లాడికి వైద్యం చేసిన మృదులకు కృతజ్ఞతలు చెప్పారు పిల్లాడి తల్లిదండ్రులు.మృదుల నవ్వేసి గాయం నొప్పి తగ్గడానికి మాత్రలు పిల్లాడి తల్లి చేతిలో పెట్టింది.

రైలు పలాస స్టేషన్ చేరేసరికి సాయంత్రం అయ్యింది.మృదుల, నేను రైలు దిగి స్టేషన్ బయటకు వచ్చాం.

“ఇంతకూ పలాసలో నువ్వెక్కడికెళ్ళాలి?”అడిగాను మృదులని.

ఆమె చెప్పింది విని మళ్ళీ షాక్ తిన్నాను.ఎందుకంటే నేనెళ్తున్న పెళ్లికే తనూ వస్తోంది.పెళ్ళికూతురు వరుసకు తన కజిన్ అనీ,తమ వాళ్ళు ఆల్రెడీ రెండు రోజులు ముందే వచ్చారని, తనకు ఇంపార్టెంట్ క్లాసులుండడంతో లేటుగా పెళ్ళికి బెంగుళూరు నుండి బయలుదేరానని చెప్పింది.

“అవునూ మీరెక్కడికెళ్ళాలి?”

నవ్వుతూ చెప్పాను.మీ కజిన్ పెళ్ళికని.

***

పెళ్ళివారిల్లు బంధుమిత్రులతో కళకళలాడుతోంది.

మృదుల తనవారు కనపడటంతో అటుగా వెళ్ళింది.నేను అటూ ఇటూ చూస్తూ నిలబడ్డాను.ఇంతలో పెళ్ళికొడుకు సంతోష్ వచ్చి,”బాగున్నావా పెద్దమ్మా!”అని నన్ను లోపలికి తీసుకుపోయాడు.లోపల ఎదురుగా నా కొడుకు డాక్టర్ సందీప్ నన్ను చూసి,”ఏం మమ్మీ… జర్నీ ఎలా జరిగింది.ఇబ్బందేం పడలేదు కదా…”అని అడుగుతున్నాడు.

ఆ మాటలు నాకేం వినపడలేదు.నా కొడుకుని చూసాక ఇప్పుడు నా మనసులో గట్టిగా నిర్ణయించుకున్నాను మృదులను నా కోడలిగా చేసుకోవాలని.

You May Also Like

3 thoughts on “ది జర్నీ

  1. కథను బాగా నడిపించారు.మృదుల పాత్ర ద్వారా ఆపద సమయంలో ఆదుకోవాలని తెలియజేసారు. చక్కగా వ్రాసి మంచి కథను అందించిన రచయితకు అభినందనలు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!