జీవనయాణం

జీవనయాణం

రచయిత ::అనురాధ మురుగము బూజుల

ప్రతి మనిషి చేతిలో లేనివి రెండే రెండు “ఒకటి పుట్టడం, రెండోది చనిపోవటం”, ఈ రెండు మన చేతుల్లో లేకపోయిన మనకు నచ్చినట్టు బ్రతికేస్తుంటాం. కానీ కొన్నిసార్లు మనకు మనముగా చనిపోవటానికి సిద్దపడుతాము. అదే ఆత్మహత్య చేసుకోవటం. ఈరోజు నేను అందుకే సిద్దపడిపోయి చావటానికి మా ఊరి చివర వున్న కొండ మీదకు వచ్చాను, ఆకిందికి పడిచనిపోతే గుర్తుపట్టటానికి చాలా రోజలు పట్టొచ్చు, నేను ఈ జీవితాన్ని చాలించిన, నాతో పాటు బ్రతికే నా “భార్య పిల్లలు”, ఏదో ఒకరోజు వస్తానని ఎదురుచూస్తూ, కొన్నిరోజులకు వదిలేసి బ్రతకటం నేర్చుకుంటారు.
భార్యాబిడ్డలని బ్రతికించలేని నేను బ్రతకటం వ్యర్థం అనుకున్నాను, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. “ఎవరికి తెలియని విషయం ఏమిటంటే,” ఆత్మహత్య చేసుకోవటం చాలా ఈజీ అని, కాదు అది అంత సులువు కాదు, చావటానికి కూడా చాలా ధైర్యం కావాలి, ఎన్ని ఆటుపోట్లు తగిలితే ఈ జీవితం వద్దు అనుకుంటాము, ఎంత తెగింపు వస్తే ఈ స్థితికి వస్తాము, అందుకే ఈరోజు చావటానికి సిద్దపడిపోయాను.

కొండమీద నిలబడి కిందికి చూసాను, ఒక్కనిమిషం ఒళ్ళు జలదరించింది, వెన్నులో ఒనుకు చిన్నగా మొదలు అయ్యింది. బ్రతికాన బ్రతుకు అంతా ఒక్కనిమిషంలో కళ్ల ముందు కదలాడింది.
అందమైన బాల్యం, నాతోపాటు ఆడుతూ పాడుతూ పెరిగిన స్నేహితులు గుర్తు వచ్చారు. అయినా చావే శరణ్యం లా నాకు తోస్తోంది.
అమ్మ నాన్నలకు నేను ఒక్కాగానొక్క కొడుకుని అందుకే నాదాకా యే కష్టం లేకుండా పెంచారు.
చదువుకొనే రోజుల్లోనే, నాకు తెలియకుండానే నాకు ఓ కళ వంటపట్టింది, నేను సరదాగా బుక్స్ లో బొమ్మలు వేసేవాడిని, స్నేహితులు కూడా నాతోనే గ్రీటింగ్ కార్డ్స్ లాగా వేయించుకొనే వారు. అది చూసిన మా సైన్స్ మాస్టర్ తనకు తెలిసిన ఒక ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్లాడు. ఆయన దగ్గర పెన్సిల్ బదులు బ్రష్ పట్టుకోవడం నేర్చుకున్నాను. అనతికాలంలోనే ఆయన దగ్గర మెళకువలు నేర్చికోవడంతో నా చదువు పూర్తి కాకుండానే ఓ రకంగా యోగ్యుడిని అయ్యాను, ఊరిలో కటౌట్లు, దేవుడి గుడిలో అందమైన బొమ్మలు వేయటం, కొన్ని గవర్నమెంట్ అనౌన్సెమెంట్లు అన్నిపనులు నేనే చేసేవాడిని, కొద్దిరోజులకు ఆయన వయసు అయిపోవడంతో మొత్తం నా చేతుల్లోకి వచ్చింది. చిన్నవాడిని అయినా బాగా రానిస్తూ వుండటంతో, అందరూ నా దగ్గరికే వచ్చేవారు.
ఇష్టమైన పని కావడంతో అలుపు లేకుండా, చదువుతో పాటు కొనసాగించేవాడిని. అలా ఇంటర్ అయ్యాక, పై చదువులు చదవాలని అనిపించలేదు. ఎందుకంటే ఎంత చదివిన ఏమి చేసిన డబ్బులు సంపాదించేకోసమే కదా, నేను రెండు చేతులా సంపాదిస్తున్నాను. అమ్మ, నాన్నలను బాగా చూసుకుంటున్నాను. అంత కంటే ఏమి కావాలి, అలా మా ఊరిలోనే కాక పక్క ఊర్లల్లో కూడా నా పెయింటింగ్స్, కనిపించేవి.

ఆ ఊరినుండి, ఇంకో ఊరికి వెళ్ళేటప్పుడు ఊరు దాటేటప్పుడు నేను వేసిన బొమ్మలు స్వాగతం పలికెవి, అవి చూసేటప్పుడు ఒకింత గర్వం నాలో తొణికిసలాడేది. మాకోసం ఒక ఇల్లు కూడా కట్టుకున్నాము. మా నాన్న సంభందాలు చూద్దాము అనుకొనేలోపే, మా ఇంటి ముందు పేరయ్యలు వరుస కట్టేసారు.
కానీ నేను ఎక్కడ యే చిత్రం వేసిన ఒక అమ్మాయి నా పెయింటింగ్స్ అభిమానించేది ఆ అమ్మాయిని చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. నా కోరికను ఎవరూ కాదనలేదు. అలా ఆ అమ్మాయి “జమున” నా ఇల్లాలు అయింది.

అలా కొన్నిసంవత్సరాలకు ఇద్దరు పిల్లలు పుట్టారు, ఒక పాప, బాబు పుట్టారు. అందమైన చూడ చక్కని సంసారం, కుటుంబం లా పదిమందికి కనిపించేది. నాకు యే లోటు లేదనుకొనే సమయంలో చిన్న చిన్న అవాంతరాలు మొదలు అయ్యాయి.
“అన్ని అనుకున్నట్లు జరిగితే జీవితం ఎందుకు అవుతుంది”, ఈ సారి పండుగకు దేవాదాయ శాఖ వారి నుండి కబురు రాలేదు. సరేలే ఏమవుతుంది అని అనుకున్నాను. తిరునాళ్లలో చూస్తే ఏవో ఫ్లెక్సీలు కనిపించాయి. ఎక్కడి నుండి తెప్పించారో అర్థం కాలేదు.

మా వీధిలో తెలిసిన వాళ్ళు హోటల్ ఓపెన్ చేస్తుంటే నాకే పని వస్తుంది అని ధీమాగా వున్నా, కానీ ఓపెనింగ్ కి ఆహ్వానం ఇచ్చారు. నేను కాకుండా వచ్చిన కొత్త ఆర్టిస్ట్ ఎవరో కనుక్కుందామని వెళ్ళాను, కానీ చూస్తే లోపల లైట్స్ పెట్టి అన్ని టిఫిన్ పేర్లు, బొమ్మలు అందంగా పేర్చి వున్నాయి అగోడ మీద, ఏంటో అర్థం కాక, అడిగాను, సిటీ నుండి చేయించారాని అర్థం అయ్యింది, వాటిని “ఫ్లెక్సీలు, హోల్డింగ్స్, లాలీపోప్స్”, అంటారు, అంతా కంప్యూటర్ లో చేసి ఇస్తారు అని చెప్పారు.

అందరూ ఇలా వాడుతూ పోతే, నా కళ వెనుకాపడిపోతుంది, నేను నా కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి, బ్రతకటం ఎలా అని అనిపించింది. అయినా అ ధైర్య పడకుండా, ఇంకా కొత్తగా రంగులు రంగరించి నాలో వున్న కొత్తకళ కు పునాది వేసాను. చూసి బాగుంది అనేవాళ్ళే తప్ప పని వచ్చేది కాదు.
ఊరంతా వేసాను, పిచ్చోడు అనుకున్నారు. నాకు విద్య నేర్పిన గురువుగారు వచ్చి, కొత్త తరం వస్తోంది, వెళ్లి దానివైపు అడుగులు వేసేయ్, అలా అని దీనిని వదలకు, మనలో వున్న “కళ “, ఎప్పుడూ సజీవంగానే వుంటుంది, బ్రతకటానికి ఎప్పుడూ కొత్త దారులు వస్తుంటాయి, వెళ్ళాలి అని హితవు చెప్పారు.
చేసేదిలేక పక్క ఊరు వెళ్లి కంప్యూటర్ కోర్సులో జాయిన్ అయ్యాను. ఎప్పుడో వదిలేసిన చదువు కదా, ఒంటపట్టట్లేదు, కోర్స్ పూర్తి అయింది కానీ, నాకే ఏమి అర్థం కాలేదు.
నా మీద నాకే అసహ్యం వేస్తోంది, నా పిల్లల్తో పాటి మళ్ళీ పుస్తకాలు పట్టాను, ఏమి బుర్రకు ఎక్కట్లేదు, సొంతిల్లు వుంటే సరిపోతుందా? పూట గడవాలి కదా, మా జమున నన్ను అడగకుండానే, మెల్లగా మిషిన్ నేర్చుకొని ఇంటిని గడుపుతోంది, మా అమ్మ కూడా మళ్ళీ బుట్టలు కుట్టి అమ్ముతోంది. గవర్నమెంట్ పథకాల్లో జాయిన్ అయ్యి ఏదో చేస్తున్నారు.
నేను ఒక్కడినే ఏమి చెయ్యలేకపోతున్నాను. ఇలా ఒక సంవత్సరం గడిచింది. తల్లి, పెళ్ళాం సంపాదిస్తుంటే, కూర్చొని తింటున్న సోమరిపోతులాగా నాకే అనిపించింది.
ఎన్నిసార్లు ఎన్నిఆకృతులు అందంగా తీర్చి దిద్దుతున్న అవి నన్ను చూసి నవ్వుతున్నాయి. కోపం వస్తోంది, ఒకసారి నా కొడుకుని కొట్టేసాను కూడా, కొడితే వాడు ఏడవలేదు, నా వైపు అదోలా చూసాడు, నా భార్య వాడిని తీసుకెళ్లినా, వాడి చూపు వాడి మనసులో నా స్థానం తెలియచేసినట్టు, నా స్థాయి తగ్గినట్టు అనిపిస్తోంది.
నా జమున పల్లెత్తు మాట అనకుండా, సంసారం సాగిస్తోంది, ఏమి కాదు అనే ధైర్యం తను ఇస్తున్నా, నా మనసే ఒప్పుకోవడంలేదు.
పెళ్ళాం, పిల్లల్ని పోషించలేని నాది ఒక బ్రతుకేనా?, ఇంటిలో ముప్పుటలా కంచంకి మాత్రమే, అనుకుంటే పెళ్ళాం తో మంచం కి మాత్రమే…… ఛీ….. ఛీ…… నాది ఒక బ్రతుకేనా? ఇక నేను పనికిరాను అనుకొని ఇక్కడికి వచ్చాను.
వేగంగా కిందపడాలి అనుకొని ఒక పది అడుగులు వెనక్కి వేసి, పరిగెత్తుకుంటూ వెళ్లి ఆగుతున్నాను, అలా రెండు సార్లు, మూడో సారి ఆగకూడదు అని వేగంగా వెళ్ళాను.
దూకేసేయ్ బాబు, ఆగకుండా అలాగే కింద పడిపో అనే మాటలు వినపడ్డాయి. ఎవరో అని తిరిగి చూసాను.
ఒక మధ్య వయస్కుడు, నా కంటే ఒక పది సంవత్సరాలు ఎక్కువ వుంటాయి, అనుకుంటా, ఆయన నా దగ్గరకు వచ్చి ఆలోచించకుండా దూకేసేయ్, నీకు చేత కాకపోతే చెప్పు నేనే తోసేస్తాను అన్నాడు.
ఏడుపు వచ్చి గట్టిగా ఏడ్చేసాను, అలా కాసేపు అయ్యాక, ఆయన బాటిల్ తో నీళ్లు ఇచ్చాక, ఇందాక తలచుకున్నాను కదా, నా గతం అంతా చెప్పాను, దానికి ఆయన నవ్వేసి, నీ సమస్య లోనే సమాధానం వుంది.
నీకే కాదు ప్రతి ఒక్కరి సమస్యలోనే సమాధానం వుంటుంది, అది గుర్తించకుండా చావు దాక వస్తారు. వెళ్ళు బ్రతకటానికి దారిని వెతుకు, ఆనందంతో పని చేయటం నేర్చుకో, “ప్రతి నదికి మలుపులు వుంటాయి, అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో ఒడిదుడుకులు “ వుంటాయి. నది సముద్రంలో ఎలా కలుస్తుందో, మన జీవితం కూడా అంతే ఏదో ఒక చోట ముగించాల్సిందే కానీ….. ఆ పైవాడు రాసినట్లు, మనకు తోచినట్లు కాదు అర్థం అయిందా? “ఒక సమస్యకు అనంతకోటి ఉపాయాలు” అని పెద్దలు చెప్పిన మాటలు కూడా గుర్తు పెట్టుకోవాలి.
సమస్య మనమే….. పరిష్కారం మనమే…… అన్ని మనలోనే వుంటాయి. అంతేకాని యే సమస్య ఎవడూ సృష్టించడు, ఎవరూ నాశనం చేయలేరు.
సంతోషం, దుఃఖం, బాధ, ఆనందం అన్ని మనం సృష్టించుకున్నవే, మనకు నచ్చితే బాగున్నట్టు లేదంటే బాగోలేనట్టు. అన్నీ మన కల్పితాలే, “కష్టం దేవుడు సృష్టించాడు, సుఖం మనం కష్టపడితే వచ్చేది కాదు”, అర్థం చేసుకో.
ఎలా మొదలుపెట్టిన, ఈ జీవనము మనం కొనసాగించాలి, ఈ తల నేలమీద పడేవరకు అన్నీ వుంటాయి. మనమే ముందుకు సాగిపోవాలి. అన్ని అనుభవాలు, అనుభూతులు అనుభవిస్తూ వెళ్ళాలి.
జీవితంలో అనుభూతికి మించిన అనుభవం లేదు, కాబట్టి ఆలోచించి “చావటానికి వచ్చిన ధైర్యం బతకటానికి ఉపయోగించుకో “ అని హితవు చెప్పాడు.
చూడు బాబు నాకు తెలిసింది చెప్పాను. తరువాత నీ ఇష్టం అన్నాడు.
మీ పేరు చెబుతారా అన్నాను నేను, తెలుసుకొని ఏమి చేస్తావు చెప్పు, ఈ ప్రపంచంలో చాలా మందికి చాలా కథలు వుంటాయి, అందులో నాది ఒకటి, ప్రతి ఒక్కరికి వాళ్ళ సమస్య పెద్దగాను, పక్కవాళ్ళది చిన్నదిగాను కనిపిస్తుంది. అని చెప్పాడు ఆ పెద్దమనిషి.
నా పేరు సుందర్ అండి అని చెప్పాను, నవ్వేసి ముందుకు వెళ్లి దూరంగా కూర్చున్నాడు. నేను చావలేక ఇంటికి వెళ్ళాను.
నా కోసం నాన్న మెల్లగా వెతుకుతున్నాడు, ఎందుకంటే ఇద్దరు ముగ్గురూ “ఎక్కడికి వెళ్ళావు”? అని అడిగారు. నా రాకతో అందరి ముఖాల్లో “ఏమి కాలేదన్న”, సంతోషం కనిపిస్తోంది.
నాకు కొత్త ఉదయం కనిపించింది, “దేవుడు మనిషి రూపంలో వచ్చి సాయం చేస్తాడు కదా “, అందుకే వచ్చి నాకు తెలిసిన పద్దతిలో “గీతోపదేశం”, చేసాడు అనుకుంటా అనుకొని నిర్ణయం తీసుకున్నాను.
నేను బతకటానికి, నన్ను నమ్ముకున్న వాళ్ళని బ్రతికించుకోవటానికి నా “జీవనయాణం” మొదలుపెట్టాను. వెళ్లి కోర్సులో జాయిన్ అయ్యాను. ఇప్పుడు అన్నీ అర్థం అవుతున్నాయి. నాలోని సృజనాత్మకత బయటికి వస్తోంది, ఇంటిలో కూడా కంప్యూటర్ కొనుక్కొని మళ్ళీ వృద్ధిలోకి వస్తున్నాను. నా సుందరమైన జీవితాన్ని అతి సుందరం చేసుకుంటున్నాను.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!