కాదేదీ ప్రేమకు అసాధ్యం

కాదేదీ ప్రేమకు అసాధ్యం

రచయిత ::శాంతి కృష్ణ

ఏం మాట్లాడుతున్నావ్ ప్రియా?? నువ్ చెప్పే కారణాలు ఏవి నాకు సబబుగా అనిపించడం లేదు. అయినా సారధిది చిన్నపిల్లల మనస్తత్వం. వాడు ఇలాంటి కారణంతో వచ్చిన సంబంధాలు వద్దు అంటున్నాడంటే నమ్మబుద్ధి కావడంలేదు. అయినా నీకు అలా ఎందుకనిపిస్తుంది???
ఎందుకంటే నేను మన సారధి తో మాట్లాడాను కాబట్టి. తను నాకు కొడుకుతో సమానం నీరజ్. అందుకే తన లైఫ్ బాగుండాలని ధైర్యం చేసి విషయం ఏంటి? అసలు నీకు ఎందుకు ఏ అమ్మాయి నచ్చటం లేదని అడిగాను. తను చెప్పిన సమాధానం విని నాకు చాలాసేపు మెదడు పనిచెయ్యలేదు.
తన మైండ్ ని ఎవరో బాగా పాడు చేశారు నీరజ్. నువ్వే ఎలా అయినా అర్ధమయ్యేలా వివరంగా చెప్పు మీ తమ్ముడికి.
తనకు జీవితం అంటే ఏంటో, జీవిత భాగస్వామి అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పి మంచి బాటలో నడిపించు అని చెప్పి బాధగా బయటకు వెళ్ళిపోయింది.

***

సారధి రాజేశ్వరి, ప్రకాష్ గార్ల మూడవ సంతానం. చిన్నప్పటినుంచి
కొంచెం పెంకితనం,మానసిక పరిపక్వత సరిగ్గా లేని కారణంగా పదో తరగతి వరకు ఇంట్లోనే ఉంచి చదివిస్తూ, మానసిక వైద్య నిపుణులతో కౌన్సెలింగ్ ఇప్పించారు.
పదోతరగతి పూర్తయ్యేసరికి సారధి మానసిక స్థితి మెరుగుపడిందని ఇంటర్ కోసం కాలేజీలో జాయిన్ చేశారు.
ఇంటర్ విజయవంతంగా ముగించుకొని డిగ్రీ లోకి అడుగు పెట్టాడు. అక్కడ పరిచయమైన కొందరు స్నేహితులు సారధి మానసిక పరిస్థితి, పెంకితనం గురించి తెలిసి మెల్లగా తనని చెడు వ్యసనాల వైపు నడపడానికి ప్రయత్నించారు.
చిన్నప్పటి నుంచి వాళ్ళ అన్న నీరజ్ ను రోల్ మోడల్ గా చూస్తూ పెరిగిన సారథికి అవేమీ వంటబట్టలేదు. కానీ స్నేహితుల కోసం విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసేవాడు. తన డబ్బు కోసం ఎప్పుడూ స్నేహితులు గుంపులు గా తన చుట్టూ ఉండేవారు. వాళ్లలో ఒకరిద్దరు మంచివారైతే, మిగిలిన వారు తన డబ్బు కోసం తిరిగే వారు. ఇదంతా తెలిసినా నీరజ్ తన తమ్ముడి సంతోషాన్ని పోగొట్టడం ఇష్టంలేక, పరిస్థితి చేయిదాటనంత వరకు పర్వాలేదని మాట్లాడే వాడు కాదు.
మెల్లగా వారి వ్యాపారాలలో చిన్న చిన్న డీల్స్ కూడా చూసుకోవడం మొదలుపెట్టాడు సారధి.
తన స్నేహితుల నుండి చెడు వ్యసనాలకు అలవాటు పడలేదు గాని వాళ్ల మాటలు తన మెదడులో నాటుకుపోయాయి. నువ్వు పెళ్లి చేసుకునే అమ్మాయి నీకు తగ్గ పొడుగు, మీ ఆస్తికి తగ్గ అందం, తీరైన రూపం ఉన్నప్పుడు మాత్రమే నీకు సొసైటీలో గౌరవం ఉంటుంది. ముఖ్యంగా నిండుగా ఎత్తుగా ఉన్న వక్షోజాలు లేని ఆడవాళ్లు భర్తని అస్సలు సుఖపెట్టలేరు. నీ భార్య నిన్ను సుఖపెట్టలేకపోతే మీరు విడిపోయే ప్రమాదం ఉంది. అప్పుడు సొసైటీ లో మీ పరువు మొత్తం పోతుంది అని ఒక విష బీజం నాటారు. అది ఇంతింతై వటుడింతై అన్నట్టు సారధి మనసులో నాటుకుపోయింది.
తనని ఎంతో ప్రేమిస్తున్న, మేనమామ కూతురైన రమ్యను కూడా వాళ్ళు చెప్పిన లక్షణాలు లేవని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించాడు.
ఎన్ని సంబంధాలు వస్తున్నా తనని సుఖపెట్టగల లక్షణాలు లేవని మనసులో అనుకొని వెంటనే వద్దని చెప్పేసేవాడు.
కుటుంబమంతా సారధి ఎందుకు పెళ్లికి ఒప్పుకోవట్లేదో, తన మనసులో ఏముందో తెలియక చాలా సతమతమయ్యేవారు.
ఇక తప్పక ఏమున్నా విషయం తనే కనుక్కోవాలి అనే ఉద్దేశంతో ప్రియా వెళ్లి మరిది గారిని అడిగింది అసలు నీ ప్రాబ్లం ఏంటి సారధి? ఎందుకు ఏ సంబంధం నీకు నచ్చట్లేదు? నేను నీకు వరసకి వదినని అయినా నీ తల్లి తో సమానం. ఏమైనా ఉంటే నాకు చెప్పు నీకు నచ్చే లక్షణాలు ఉన్న అమ్మాయిని నేను స్వయంగా వెతికి తీసుకొస్తాను అని అడిగింది.
ఆ ప్రశ్నకి సారధి చెప్పిన సమాధానం విని నిర్ఘాంతపోయింది. నువ్వు ఆలోచించే విధానం తప్పు అని నచ్చచెప్పడానికి ప్రయత్నించింది. తను ఎంత చెప్పినా వినకపోయేసరికి ఇక తప్పక విషయం భర్తకి చేరవేసింది.
ముందు విషయం విని నిర్ఘాంతపోయినా, తర్వాత తన స్నేహితులలో నమ్మకస్తులైన వారిని పిలిచి వివరం అడిగితే, తన ఆలోచనలు అలా మారడానికి తన స్నేహితులే కారణమని, అలా చెప్పడం వల్ల కొద్దికాలం సారధి పెళ్లి వాయిదా పడితే తన డబ్బుతో వాళ్ళు ఎంజాయ్ చేయొచ్చని వారి ఆలోచన అని, ఆ విషయం మీకు చెప్తే మమ్మల్ని చంపేస్తామని బెదిరించారని చెప్పారు.
ఏం చెప్తే సారధి మారతాడో అర్థం కాక ముందు తల పట్టుకున్న, ఒక నిర్ణయానికి వచ్చినవారై మళ్ళీ సైకియాట్రిస్ట్ ను సంప్రదిస్తే మంచిది అని, చిన్నప్పుడు ట్రీట్మెంట్ చేసిన మానసిక నిపుణులు దగ్గరకు వెళ్లి సలహా అడిగారు.
తన దగ్గరికి తీసుకు వస్తే కొన్ని సిట్టింగ్స్ లో అంతా నార్మల్ అవుతుంది అని చెప్పడంతో సారధిని ఒప్పించి మానసిక వైద్యుల్ని సంప్రదించడానికి ఒప్పించి తీసుకెళ్లారు.
తన దగ్గరకు వచ్చిన సారధి తో మాట్లాడుతూ తన మానసిక పరిస్థితిని అంచనా వేశారు డాక్టర్ గారు. అసలు శృంగారం అంటే ఏంటి! సంభోగం అంటే ఏంటి! శరీరంలోని ఏయే అవయవాలు ఏ పాత్ర వహిస్తాయి… అన్ని వివరంగా అర్థం అయ్యేలా ఒక్కో సిట్టింగ్లో ఒక్కో దాని గురించి వివరిస్తూ తన ఆలోచనలను మార్చడానికి ప్రయత్నించారు.
సారథికి తన స్నేహితుల మాటలు బుర్రలో ఎంతలా నాటుకుపోయాయి అంటే; అన్ని సిట్టింగ్స్ అయిపోయినా కూడా తన మనసులో వారు చెప్పిన లక్షణాలు ఉన్న అమ్మాయి వస్తే బాగుంటుందన్న ఆలోచన మెదులుతూనే ఉంది.
అయినప్పటికీ తల్లిదండ్రులను బాధపెట్టడం ఇష్టంలేక అన్యమనస్కంగానే తనను ప్రేమిస్తున్న రమ్యను వివాహం చేసుకున్నాడు.
రమ్య కూడా ఎలాగైనా సారధిని మార్చాలి అనే దృఢ సంకల్పంతో, తన ప్రేమతో మార్చుకోగలను అనే నమ్మకంతో తల ఉంచి ఆనందంగా తాళి కట్టించుకుంది.
రమ్య సారధి చిన్నప్పటినుంచి బావమరదళ్ళు, స్నేహితులు అయిన కారణంగా భార్య భర్తల సంబంధం వాళ్ళిద్దరి మధ్య లేనప్పటికీ ఎంతో సన్నిహితంగా మెలిగేవారు.
రమ్య ప్రేమలో, సాంగత్యంలో సారధి మెల్లగా తన అపోహలు అన్నిటిని పోగొట్టుకోవడం మొదలుపెట్టాడు.
భార్య కుటుంబం సంసారం వీటన్నిటికీ ఉన్న విలువను రమ్య ద్వారా తెలుసుకుని, స్నేహితుల మాట విని తన ఎంత తప్పుగా ఆలోచించాడో అర్ధం చేసుకున్నాడు.
తన తప్పు తెలుసుకుని రమ్యను అక్కున చేర్చుకున్నాడు. కుటుంబం సంసార జీవితం లోని సుఖాన్ని రుచి చూడటం ప్రారంభించాడు.
భార్యకు ఉండవలసింది అవయవ సౌష్టవం కాదు; ప్రేమించేమనసు అని గ్రహించి తన జీవితాన్ని సుఖసంతోషాల నిలయంగా మార్చుకున్నాడు….

(ఒక వ్యక్తి నిజ జీవితంలో జరిగిన సంఘటనలు ఆధారంగా ఈ కథ రాయడం జరిగింది. అన్యాదా భావించారనుకుంటున్నాను)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!