పెద్ద దిక్కు

పెద్ద దిక్కు

రచయిత ::కమల ముక్కు ( కమల ‘శ్రీ’)

గుక్కపెట్టి ఏడుస్తున్న ఎనిమిది నెలల చిన్నారి దీప్తి ని చూస్తుంటే ఏం చేయాలో అర్ధం కావడం లేదు శిరీషకి. ఆకలితో ఏడుస్తుందేమో అనుకుని పాలు పెట్టేందుకు ప్రయత్నించింది.కానీ పాప పాలు తాగకుండా ఏడుస్తూనే ఉంది.అలా ఏడుస్తూ ఉన్న పాప ని చూడగానే గుండె తరుక్కుపోయిన శిరీష ఎందుకు ఏడుస్తుందో అర్ధం కాక భర్త మాధవ్ కి ఫోన్ చేసింది. ఆఫీస్ లో మీటింగ్ లో ఉన్న మాధవ్ ఫోన్ లిఫ్ట్ చేయలేదు.గత నెల డాక్టర్ దగ్గరికి వెళ్లినప్పుడు ఆయన ఇచ్చిన సిరప్ లు ఉన్నాయి. ఏవి ఎలా పట్టాలో క్షుణ్ణం గా చెప్పారు. కానీ ఏం బాగులేదో తెలిస్తే కదా పట్టేది.తనకా నా అన్నవాళ్లు లేరు.పోనీ పక్కింటి ఆంటీ ని అడుగుదామంటే ఆవిడ ముందు రోజే తన కుటుంబం తో తీర్ధ యాత్రలకు వెళ్లింది.

ఈ అపార్ట్మెంట్ లోకి వచ్చి వారమే కావడం తో పక్కింటి ఆంటీ తప్ప ఎవరూ తెలీదు. పోనీ ఎవరికన్నా అడుగుదామనుకుంటే ఆ అపార్ట్ మెంట్ లో ఉన్న వాళ్ళందరూ ఉద్యోగస్తులే కావడం, ఆ సమయానికి ఎవరూ ఇంట్లో ఉండక పోవడం తో ఏం చేయాలో తేలిక ఏడుస్తున్న దీప్తిని ఎలా సముదాయించాలో తేలిక కళ్ల నీరు పెట్టుకుంది.

పాప ఏడుపు ఇంకా పెరిగింది. ఇక ఆగలేక ఏటైతే అదే అయ్యిందని ఫోన్ అందుకుని ఊర్లో ఉన్న తన అత్తగారు రాఘవమ్మ కి ఫోన్ చేసింది.

“హాలో”అంది రాఘవమ్మ నీరసం గా.

“అత్తయ్యా…అత్తయ్యా…” అంటూ ఏడుపు మొదలుపెట్టింది శిరీష.

“అమ్మా శిరీషా ఏమయ్యిందే ఎందుకు ఏడుస్తున్నావు?.” కంగారుగా అడిగింది రాఘవమ్మ.

“అత్తయ్యా పాప.. పాప..” అంటూ వెక్కుతుంది.

“ఏంటే ఏమయ్యింది పాప కి. ముందా ఏడుపు ఆపి విషయం చెప్పు.”

“పాప అరగంట నుంచీ ఏడుస్తూనే ఉంది. ఎందుకో అర్ధం కావడం లేదు.”

“అవునా! మరి ఇంతవరకూ చేయలేదేం. సరే ముందు పాపకి చీమో, దోమో కుట్టిందేమో చూడు.

“చూశానత్తయ్యా. ఏం కరవలేదు.”

“సరే ఆడి పొత్తికడుపు నొక్కి చూసి ఎలా ఉందో చెప్పు.”

“బాగానే ఉంది అత్తయ్యా.”

“రోజూ ఒంటికీ,రెంటికీ వెళ్తుందా?.”

హా వెళ్తుంది.”

“అంటే బాగానే జీర్ణం అవుతుంది. మరి ఎందుకు ఏడుస్తుంది?.” అనుకుంటూ, “పాప ముడ్డికింద గుడ్డ తడిచిపోయిందేమో చూశావా!?.”

“పాపకి గుడ్డ వాడము అత్తయ్యా. డైపర్ లే వేస్తాను.”

“ముందు ఆ డైపర్ ని తీసేయ్. ఏదో బయటకు వెళ్లినప్పుడు వేయాలి డైపర్ లు.మీరేమో పొద్దస్తమానూ వాటినే ఉంచేస్తే ఎలా.ఆ డైపర్ తీసి పొడి గుడ్డలు దాని కింద వెయ్యు.అలా నిత్యం డైపర్ తోనే ఉంటే వాళ్లకి నిమ్ము చేరుతుంది.తడి గా అనిపించి నిద్ర సరిగ్గా పట్టదు.ఒక్కోసారి వారికి జ్వరం వచ్చినా వస్తుంది.అది తీసి శుభ్రం గా పొడి గుడ్డతో దాని ముడ్డి తుడిచి పొడి గుడ్డ దానికింద వెయ్యు.”

“సరే అత్తయ్యా!.” అని డైపర్ తీసి పొడి గుడ్డతో క్లీన్ చేసి ఇంకో పొడి గుడ్డని పాప కింద వేసింది. కాసేపటికి పాప ఏడుపు నెమ్మదించింది. “అత్తయ్యా పాప ఏడుపు ఆపింది.”అంది శిరీష సంతోషం గా.

“సరే ముందు దానికి పాలుపట్టి నిద్రపుచ్చిన తర్వాత ఫోన్ చెయ్యు.”అని ఫోన్ పెట్టేసి ఆలోచనల్లో మునిగిపోయింది రాఘవమ్మ.

మాధవ్ తన ఒక్కగానొక్క కొడుకు. అతను పదేళ్ల వయసులో ఉన్నప్పుడే తన భర్త రామయ్య మరణించడం తో ఉన్న ఐదేకరాల పొలాన్ని సాగు చేసుకుంటూ రెక్కలు ముక్కలు చేసుకుని పెంచింది కొడుకు మాధవ్ ని.అతను కూడా కష్టపడి చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాడు.

తనకి అన్నింటిలో చేతికాపుకొస్తుందని తన భర్త చెల్లెలి కూతురు శిరీష్ తో కొడుకు పెళ్లి చేసింది. శిరీష వాళ్ల పెళ్లయ్యాక ఆమె కుటుంబం బోటులో భద్రాచలం వెళ్తూ ఉండగా గోదారిలో బోటు మునిగి అందరూ చనిపోయారు. ఆ విషయం తెలుసుకున్న శిరీష కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంటే ఊరుకో శిరీషా.‌ఏడిస్తే పోయిన వాళ్లు తిరిగొస్తారా ఏంటి?. ఎప్పటినుంచో ఏడుస్తూ ఉన్నావు. కాస్త ఎంగిలి పడు.” అని భోజనం వడ్డించి రాఘవమ్మే తినిపించింది. కొద్ది రోజులకు కోలుకుంది శిరీష.

మాధవ్ ఉద్యోగరీత్యా పట్టణంలో ఉండి వారం లో ఓసారి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. అతను వెళ్లేటప్పుడు కోడలి ముఖంలో బాధని చూసి

“మాధవా! ఎన్నాళ్లిలా.పట్టణంలో ఏదైనా ఇల్లు తీసుకుని అమ్మాయిని నీతో పాటే తీసుకుని వెళ్లు.” అంది.

“మేమెళ్లిపోతే మిమ్మల్ని ఎవరు చూస్తారు అత్తయ్యా?!.”

“పర్లేదు నన్ను చూసుకోవడానికి ఇక్కడ రంగమ్మ ఉందిలే. వాడూ రోజూ తిరిగీ ఎలా నీరసించిపోతున్నాడో చూడు.మాధవా మంచి ఇల్లు చూడు.”

“సరే అమ్మా!”

ఓ వారం రోజుల తర్వాత “అమ్మా! మా ఫ్రెండ్ వాళ్ల మామయ్య వాళ్లు అపార్ట్మెంట్ కట్టారు. అందులో ఓ ఫ్లాట్ ఖాళీ గా ఉందటా. నీకు కావాలంటే ఓ ఇరవై ఐదు లక్షలకు మాట్లాడుతాను అన్నాడు. ఏం చేయమంటావు. అద్దె కి ఉండే కన్నా ఇలా ఫ్లాట్ కొనుక్కోవడమే మంచిది కదా అని ఆలోచిస్తున్నాను.” అన్నాడు మాధవ్.

“కానీ ఇరవై ఐదు లక్షలంటే…?!.”

“ఆఫీస్ లో లోన్ తీసుకుని కొంచెం కడతాను. మిగతా నెలనెలా కట్టుకోవచ్చు.”

“మన పొలం మీద వచ్చిన రాబడి ఖర్చులు పోనూ దాసింది, మీ నాన్న నాకు అప్పుడప్పుడు చేయించిన బంగారం అంతా చూస్తే ఓ పది లక్షల వరకూ ఉంటుంది. నువ్వు మిగతా డబ్బులు ఎవరి దగ్గరన్నా తీసుకో. లోన్ వద్దు. మన దగ్గర ఉన్నప్పుడు అప్పు తీర్చవచ్చు.” అంది రాఘవమ్మ.

“ఎందుకత్తయ్యా మా అమ్మ వాళ్లు నాకిచ్చిన బంగారు నగలు తాకట్టు పెడితే సరిపోతుంది కదా.” అంది శిరీష.

సరే అలాగే కానిద్దాం అంటూ ఆ ఫ్లాట్ ని కొనుక్కుని ఓ మంచి రోజున గృహప్రవేశం కూడా చేసారు. కొన్ని రోజులు వారితో ఉండటానికి వచ్చిన రాఘవమ్మకి కొద్ది రోజుల్లోనే కోడలి ప్రవర్తనలో తేడా కనపడింది. ఏది పట్టుకున్నా, ఏం పని చేసినా వంకలే. చిన్నదానికీ పెద్ద దానికీ సూటిపోటి మాటలే. కొడుక్కి చెప్పలేక, తనలో తానే కుమిలి పోయేది. ఇక అక్కడ ఉండలేక పొలం పనులు ఆగిపోయాయి, ఇంట్లో దీపం పెట్టేవారు ఎవరూ లేరని తన ఊరు వెళ్లిపోయింది రాఘవమ్మ.

తను ఊరెళ్లిన కొద్ది రోజులకే శిరీష కడుపుతో ఉందని తెలవడం, కొద్ది రోజులు వెళ్లి వాళ్లతో గడిపి తిరిగి తన ఊరు వెళ్లిపోవడం, ఏడో నెలలో కాన్పు కోసం వచ్చిన శిరీష పండంటి ఆడబిడ్డ ని కనడం పాపకి ఐదో నెల వరకూ ఉండి తిరిగి పట్నం వెళ్లిపోవడం అన్నీ గుర్తు కి వచ్చాయి రాఘవమ్మకి. ఇంతలో ఫోన్ మ్రోగడంతో ఆలోచనల నుంచి తేరుకుని “హలో” అంది.

“అత్తయ్యా! పాప పడుకుంది.”

“ఇప్పుడు చెప్పవే నిన్న రాత్రి ఏం తిన్నావు?”

“రాత్రి ఆయన బిర్యానీ తెస్తేనూ…”

“హా బాగా తిన్నావా. బుద్దుండక్కర్లా. చంటిబిడ్డ తల్లివి ఏవి తినాలో ఏవి తినకూడదో తెలీదా. దానికి వేడి చేసిందేమో పాపం. అందుకే మాటిమాటికీ ఒంటికి పోయి నిమ్ము చేసింది. మనం ఏం తింటే మంచిదో ఏం తినకపోతే మంచిదో తెలుసుకుని మెలగాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉన్నారో లేదో వారు ఒంటికి వెళ్లిన దానిబట్ఠే తెలిసిపోతుంది. నాలుగైదు రోజులకు ఒకసారి రెంటికి వెళ్లినా పర్వాలేదు కానీ ఒంటికి మాత్రం రోజూ పోయాలి. లేదంటే వాళ్లు ఆరోగ్యం గా లేనట్టే.

“అవునూ రోజూ సూర్యుని ఎండు తగిలేలా ఉంచుతున్నావా. దానికి కాపడం, నూనె రాసి మర్దనా చేయడం చేస్తున్నావా?!.”

“లేదత్తయ్యా నూనె రాసి మర్దనా చేస్తున్నా, కాపడం నాకు రాదు. ఇక్కడ కుంపటి ఉండదు కదా పోనీ చేద్దామంటే. మా ఫ్లాట్ కి ఎండ అంత ఎక్కువ గా తగలదు.”

“సరే పాపని ఎంత సేపు మంచం మీద ఉంచుతున్నావు.లేదా అది ఏడుస్తుందని ఎత్తుకునే ఉంటున్నావా?!.”

“అంటే అదీ .. అత్తయ్యా! ఏడుస్తుంటే చూస్తూ పనులెలా చేసుకోగలం. అందుకే ఏడ్చినప్పుడల్లా…”

“అందుకే పిల్లలు ఆరోగ్యంగా ఉండరు. పాలు త్రాగాక క్రింద వేయాలి. వాళ్లు ఆడుకుంటూ, ఏడుస్తూ ఉంటే తాగిన పాలు జీర్ణం అవుతాయి.

ఇవన్నీ మీకు తెలీవు కాబట్టే కొన్ని రోజులు కన్నారింట్లో ఉంచి పిల్లలకు అన్ని సదుపాయాలు చేస్తారు. తల్లికి పత్యం అవీ పెడతారు. అందుకే మా కాలంలో పిల్లలు అంత ఆరోగ్యంగా, పుష్టిగా ఉండేవారు. కానీ మీరు ఎవరి మాటా వినరూ, మీకు నచ్చినట్టుగా ఉంటారు. ఇంటికి మంచీ చెడూ చెప్పే ఓ పెద్ద దిక్కు ఉండాలంటారు. లేకపోతే ఇదిగో ఇలాగే చిన్న విషయానికి ఏడుస్తూ బెంగపెట్టుకోవాలి. పాప కి ఏమీ కాదు. నువ్వు కంగారు పడకు.”

“అలాగే అత్తయ్యా” అని… “అత్తయ్యా ఓ మాట అడుగుతాను కాదనురు కదా?!.” అంది శిరీష.

“ఏంటో అడుగు?.”

“అత్తయ్యా! మీరు కొన్ని రోజులు మా దగ్గరికి…!.” అని ఆగిపోయింది శిరీష.

“వస్తాలే కంగారు పడకూ. మనలో మనకి మాటపట్టింపులు వస్తాయి పోతాయి, అవన్నీ పట్టించుకుని కూర్చుంటే ఎలానే. రేపు పొద్దున్నకల్లా ఇంట్లో ఉంటాను. చంటిదానికి అవసరం అయిన పొడులు చేయించాను. అవన్నీ పట్టుకుని వస్తాను. సరేనా.” అని ఫోన్ పెట్టేసింది రాఘవమ్మ.

అప్పటికి గానీ శిరీష మనసు కుదుట పడలేదు.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!