ఎందు దాగున్నాడో

(అంశం: “ఏడ తానున్నాడో”)

ఎందు దాగున్నాడో

రచన: సావిత్రి కోవూరు

సూర్యుడొచ్చే ఏలకల్లా – చుక్క లాగా లేచి వచ్చి ముంగిట్లోనా ముగ్గులేసి – నీళ్ళ కడవ సంక నెట్టి ఊరవతల ఏటికెళ్ళీ – ఏటిగట్టున తాన మాడి ఎండపొలుపుకు ఊరడిల్లీ – ఎదలోని రాజు కొరకు ఎదురు చూసి ఎదురు చూసి – ఎదలోనే మరిగిపోతి ఏడతానున్నాడో నా రాజు – ఎరగ నైతె ఎరగ నైతి.

మెరుపు చుక్కల చీర గట్టి – వెండి రంగు రైక తొడిగి ముక్కుకేమో ముక్కెరెట్టి – కాళ్ళకేమో కడియాలెట్టి కాసు బిళ్ళ బొట్టుపెట్టి – కళ్ళ కేమో కాటుకెట్టి మల్లెపూలు కొప్పునెట్టి – మంచి గంధం పూసుకోని మామ కోసం సూత్త ఉంటే – కొంటె చూపుల చందమామ
మెర్రి మెర్రి చూసుకుంటూ – ఎక్కిరిస్తూ ఉండబట్టే ఏడతానున్నాడో నా రాజు – ఎందుదాగున్నాడో.

మదిలోని చిన్న వాడు – మనసున్న మగవాడు
మదినిండా తలపులాయె – మనసేమో ఆగదాయె మామ నేమో రాడాయె – మల్లెలేమొ వాడిపోయే  ఏడ తానున్నాడో నా రాజు – ఎందు దాగున్నాడో

కొంటె చూపుల కుర్రవాడు – కోరమీసం కోడె గాడు కోల కట్టే తిప్పుకుంటూ – కిర్రు చెప్పులు వేసుకుని మడి గట్టున నడుచుకుంటూ – మళ్ళి మళ్ళి చూసుకుంటూ
అల్లరీగ నవ్వుకుంటూ – నవ్వులెన్నో రువ్వుకుంటూ
ఏడతానున్నాడో నా రాజు – ఎందు దాగున్నాడో.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!