అర్ధరాత్రి 12 గంటలు

(అంశం::” సస్పెన్స్/హార్రర్/థ్రిల్లర్ “)

అర్ధరాత్రి 12 గంటలు

రచయిత :: రామ్ ప్రకాష్

అభయ్ కి ఏమి కనిపించట్లేదు. మొత్తం చీకటిగా ఉంది.  కాని తన చెవిలో మాత్రం ఒక చిన్నని మూలుగు వినపడుతుంది.  క్రమంగా ఆ మూలుగులు దగ్గర పడుతున్నాయి.
ఇంతలో తన చెవిలో
“నేను నిన్ను చంపబోతున్నాను..  నీ రక్తం తాగేస్తాను ” అనే ఒక భయంకరమైన గొంతు వినిపించింది.

వెంటనే ఒక ఆకారం తన ముందు ప్రత్యక్షమయింది.  తెల్లని చీర కట్టుకొని ఉంది. తన కళ్ళేమో చింతనిప్పుల్లా ఎర్రగా మండుతున్నాయి. జుట్టేమో మర్రిచెట్టులా గాలికి ఊగుతుంది. మొహం మీద ఎవరో కత్తితో కోసినట్టుగా గాట్లు ఉన్నాయి.

తను దెయ్యమో కాదో అర్థం అవ్వట్లేదు. తన కాళ్ళ వైపు చూసాడు. ఆశ్చర్యంగా అక్కడ కాళ్ళు లేవు. తన చేతులేమో ఇప్పుడే రక్తంతో కడుక్కున్నట్టు ఎర్రగా ఉన్నాయి. గోళ్లేమో వేర్లలా మెలి తిరిగి ఉన్నాయి. తనని చూస్తుంటే భయంతో ఊపిరి ఆగిపోతుందేమో అనిపిస్తుంది. గొంతు చించుకొని అరవాలనుకున్నాడు కానీ నోటి నుండి మాట బయటకి రావట్లేదు. పారిపోదాం అంటే అడుగు కదల్చలేకపోతున్నాడు. చేతులేమో ఎవరో పట్టుకొని వెనక్కి విరిచినట్టు ఉన్నాయి.

పక్కన బల్ల మీద చాలా ఆయుధాలు ఉన్నాయి. అందులోనుంచి ఒక చిన్న కత్తి తీసుకుంది. మెల్లగా అభయ్ ఎడమ కంటి దగ్గరకు తెచ్చి,  ఫోర్క్ తో ఫ్రూట్ తీసుకున్నట్టుగా ఒక్క పోటు పొడిచి తన కనుగుడ్డు బయటకి తీసి ఒక్క ఉదుటున నోట్లో వేసుకుంది. అభయ్ కంటి నుంచి రక్తం కారుతుంది. అభయ్ కి  నొప్పి తెలుస్తుంది కాని అరవలేకపోతున్నాడు. తను ముందుకు వచ్చి, చెంపమీద నుంచి కారుతున్న రక్తాన్ని నాలుకతో తాగింది. మెల్లగా తన చేతిలోని కత్తితో తన గుండెల్లో ఒక్క సారిగా గుచ్చేసింది.

అభయ్ కి సడన్ గా మెలుకువ వచ్చేసింది.  పక్కనే ఉన్న గడియారం 12 గంటలు కొట్టింది. ఒళ్ళంతా చెమటతో తడిసిపోయింది. ఒక్కసారి తన ప్రాణం నోట్లోకి వచ్చేసింది.  భయంకరమైన పీడకల. గుండె ఆగినంత పనైపోయింది.
కాసేపు అలాగే కూర్చున్న తరువాత తేరుకున్నాడు.

అభయ్ కి శిరీష తో పెళ్లి అయ్యి ఒక నెల అయ్యింది. ఇద్దరి సొంతూళ్లు ఒక్కటే,  రాజమండ్రి.  కాని అభయ్ ఉద్యోగం ఏమో హైదరాబాద్.  అమెరికా వెళ్తున్నాం,  కొండాపూర్ లో మా ఫ్లాట్  అమ్మబడును అని ఎవరో ఆన్లైన్ లో పెడితే చూసి గత వారమే ఈ ఇళ్ళు కొన్నాడు.  చాలా మంచి ఫ్లాట్  తక్కువకే వచ్చిందని సంతోషించాడు. ఈరోజే వాళ్ళ జంట కొత్తగా ఈ ఇంట్లోకి వచ్చారు. వచ్చిన రోజు రాత్రే ఈ పీడకల.

తన పక్కన శిరీష పడుకుంది. తనకు ఇంక నిద్ర పట్టలేదు. లేచి శిరీష నుదిట మీద ఒక ముద్దు పెట్టి,  కాసేపు టీవీ అయినా చూద్దాం అని హాలులోకి వచ్చాడు. టీవీ ఆన్ చేసాడు. ఏదో పాత సినిమా వస్తే చూస్తూ కూర్చున్నాడు.

అకస్మాతుగా ఇంట్లో లైట్స్ అన్ని ఆఫ్ అయ్యాయి. టీవీ ఆగిపోయింది. మొత్తం చీకటిగా మారింది. సీలింగ్ ఫ్యాన్ మాత్రం కీచుమని శబ్దం చేస్తుంది. ఇంతలో మెల్లగా గజ్జెల శబ్దం వినిపించింది. తక్కువగా వచ్చింది కదా అని దురాశ కి పోతే ఆ అమెరికా వాడేంటి దెయ్యాల కొంప అమ్మాడు అని అనిపించింది. భయంతో గట్టిగ అరిచాడు.

” ఏమైందండీ,  ఎందుకలా అరిచారు. కరెంటు పోయింది, పక్కన చూస్తే మీరు లేరు.  ఎక్కడ ఉన్నారో చూద్దాం అని ఇలా వచ్చాను. దీనికే ఇంత భయపడ్డారా? “

ఓరిని,  సిరి నా. భయపడి చచ్చాను కదా. అసలే కొత్త పెళ్ళాం,  తన ముంద పరువెక్కడ పోతుందోనని లేని ధైర్యం తెచ్చుకొని:
“నేనెందుకు భయపడ్డాను. నువ్వు రావడం చూసాను. నిన్ను భయపెడదాం అని అలా అరిచాను. నేను అనుకున్న దానికన్నా ధైర్యవంతురాలే నువ్వు “

తను నవ్వింది. అలా చల్లగాలికి వెళదామని ఇద్దరు బాల్కనీ లోకి వచ్చారు. చల్లని గాలి వీస్తుంది. సిటీ మొత్తం ప్రశాంతంగా ఉంది. అసలే అమావాస్య రోజు కావడం వల్ల నల్లటి దుప్పటి కప్పినట్టుంది ఊరంతా. ఇద్దరు కాసేపు ప్రేమగా ఒకరి గురించి ఒకరు మాట్లాడుతూ ఉన్నారు. ఇష్టాలు పంచుకున్నారు.

ఇలా సరదాగా సాగిపోతున్న సమయంలో  అకస్మాతుగా ఇంట్లో నుంచి గిన్నెలు ఒక దాని తర్వాత ఒకటి కిందపడి శబ్దం చేశాయి. ఇద్దరు ఒకరి మొఖం ఒకరు చూసుకున్నారు. ఇంట్లో వీళ్ళు తప్ప ఇంకెవరు లేరు. మరి ఎవరు ఇలా చేసారు. ఇద్దరికి భయంతో నోట మాట రాలేదు.

సిరికి కూడా చాలా భయంవేసింది. అభయ్ చేతిని గట్టిగ పట్టుకుంది. అభయ్, సిరిని తన వెనక నిలబడమన్నాడు.  మెల్లగా అడుగుల శబ్దం వినిపిస్తుంది. దానితో పాటు లయబద్దంగా గజ్జల శబ్దం కూడా. చీకట్లో ఒక ఆకారం వీళ్ల వైపే రాసాగింది.  చెమటతో ఇద్దరు తడిచిపోయారు.  వీళ్ల గుండెచప్పుడు పెరిగిపోయి వీళ్ళకే వినిపిస్తుంది.  క్రమంగా అడుగుల శబ్దం పెద్దదయ్యింది.  అభయ్ కి వెన్నులో వణుకు పుట్టడం మొదలయ్యింది.
ఆ చీకట్లో నుంచి ఆ ఆకారం మొబైల్ లైట్ పట్టుకొని వచ్చింది.

“ఏవండీ,  ఈ సమయంలో ఇక్కడ ఏమి చేస్తున్నారు? ” ఎదురుగా శిరీష వచ్చింది.

ఒక్క క్షణం తన గుండె ఆగిపోయి మళ్ళీ కొట్టుకోవడం మొదలుపెట్టింది. ఇప్పటిదాకా తనతో ఉన్న సిరి ఇప్పుడు ఇలా వచ్చిందేంటి. భయంగానే వెనక్కు తిరిగి చూసాడు.  అక్కడ శిరీష లేదు. తన ముందు మొబైల్ టార్చ్ పట్టుకొని నిలబడి ఉంది. అంటే ఇప్పటిదాకా తను మాట్లాడింది ఎవరితో?

భయంతో గట్టిగా అరిచాడు. దెబ్బకు మెలుకువ వచ్చింది.  చూస్తే తను పడక గది లో బెడ్ మీదనే ఉన్నాడు. తన పక్కన శిరీష ప్రశాంతంగా పడుకొనే ఉంది.

అప్పుడే గడియారం మోగింది..

సమయం అర్ధరాత్రి 12 గంటలు….

.సమాప్తం....

You May Also Like

One thought on “అర్ధరాత్రి 12 గంటలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!