ఇంటికి దీపం ఇల్లాలు (నిజమే)

ఇంటికి దీపం ఇల్లాలు (నిజమే)

రచయత :: సుజాత తిమ్మన

రమేష్, వెంకట్ ఇద్దరూ చిన్నతనం నుంచి మంచి స్నేహితులు. కలిసి బడికి వెళ్ళేవాళ్లు. ఆటల్లోనూ, మరి ఏ ఇతర పనులయినా ఒక్కటిగా చేసుకునే వాళ్ళు. ఇంచుమించు వారిద్దరి కుటుంబ పరిస్థితులు కూడా ఒక్కటిగానే ఉండేవి. రమేష్ వాళ్ళ నాన్న, వెంకట్ వాళ్ళ నాన్న కూడా ప్రభుత్వరంగ సంస్తలో పనిచేసేవారు. వచ్చిన జీతం కొంత ఇంటికి ఇచ్చినా మిగిలినది తమ వ్యసనం అయిన తాగుడుకి పెట్టేవాళ్లు.
చదువుల విషయంలో వెంకట్ ఇంటర్మీడియట్ ఫెయిల్ అవటం వలన అతని చదువు అక్కడితో ఆగిపోయింది. రమేష్ ఉన్నత చదువుల నిమిత్తం ఊరు విడిచి పట్నం వెళ్ళాడు. అయినా వారిరువురు రోజుకు ఒకసారి అయినా మాట్లాడుకోకుండా ఉండలేరు.
అనుకోకుండా ఒక రోజు వెంకట్ తండ్రి గుండెపోటుతో మరణించాడు. ఉద్యోగం కారుణ్య నియామకం క్రింద వెంకట్ కు రావటంతో ఇరవై సంవత్సరాలకే వెంకట్ అటెండర్ గా ఆ ప్రభుత్వోద్యోగంలో చేరాడు. తండ్రి ఉద్యోగంతో పాటు వారసత్వాన్ని కొనసాగిస్తూ తాగుడు వ్యసనానికి కూడా అలవాటు పడ్డాడు. వద్దని ఎంతో వారించిన తల్లి మాటను కానీ స్నేహితుడైన రమేష్ మాటను కానీ లెక్కపెట్టలేదు. పెళ్ళి చేస్తే మారతాడని భావించిన తల్లి వాళ్ళకు దగ్గర బంధువులమ్మాయితో పెళ్ళి జరిపించింది.
వెంకట్ భార్యగా ఆ ఇంట అడుగు పెట్టిన సుశీల పేరుకు తగ్గట్టే సౌమ్యురాలు. వెంకట్ తాగుడుకి బానిస మాత్రమే కానీ చెడ్డవాడు కాదు. ఈ విషయం ముందునుంచే తెలిసిన సుశీల భర్తకి అనుగుణంగా నడుచుకుంటూ ఉండేది.
“బయట ఎక్కడో తాగడం మంచిది కాదని, అలా తాగాలి అనిపిస్తే ఇంటి వద్దే తాగండి. మిమ్మల్ని ఎవరు ఏమి అనరు” అంటూ అనునయించి చెప్పటంతో ముందు కోపంతో కాదని చెప్పాడు. ఆ తరువాత రమేష్ తో ఫోన్ చేసి మాట్లాడాడు ఈ విషయం. నిజంగా రమేష్ చాలా సంతోషించాడు. వెంకట్ కి తగిన ఇల్లాలు దొరికిందని. అదే విషయం నచ్చచెప్పాడు సుశీల చెప్పినట్టు వినమని. అప్పటినుంచి ఇంటి వద్దనే రోజు రాత్రిళ్ళు తాగడం మొదలుపెట్టాడు.
“ఇదేం చోద్యం తల్లీ! వాడిని తాగుడుకి దూరం చేస్తావు అనుకుంటే… ఇంట్లోనే తాగమని ఇంకా ప్రోత్సహిస్తావా… నీ లాంటి పెళ్ళాంని నేనింతవరకు చూడలేదమ్మా…” అంటూ మెటికలు విరిచింది అత్తగారు.
“అత్తయ్యా! మీరే చూస్తూ ఉండండి… ఏం జరుగుతుందో ?” అని సమదానం ఇచ్చింది సుశీల.
అనుకున్నట్టుగానే కొద్ది కొద్దిగా తగ్గిస్తూ వచ్చాడు తాగే మందు. సుశీల కూడా తను నేర్చుకున్న టైలరింగ్ పని చేస్తూ ఇంటికి కావలసినవి కొంటూ ఇల్లును చక్కదిద్దుకుంది.
మూడు నెలలు గడిచేసరికి ‘తను తండ్రి కాబోతున్న’అనే శుభవార్త విని అమితమైన ఉత్సాహంతో భార్యకు మాట ఇచ్చాడు. మెల్ల మెల్లగా ఈ అలవాటు మనడానికి ప్రయత్నిస్తానని.
బాబు పుట్టాడు. బారసాల సమయానికి రమేష్ కూడా తను కొత్తగా పెళ్లిచేసుకున్న లావణ్యను తీసుకుని ఊరికి వచ్చాడు. లౌక్యంతో వెంకట్ ను మార్చుకున్న సుశీలను మెచ్చుకోకుండా ఉండలేకపోయాడు ఇంటికి దీపం ఇల్లాలే…నిజమే! అనుకుంటూ..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!