(అంశం : నా అల్లరి నేస్తం) ఆరో ప్రాణం
రచన ::సౌజన్య ‘ చేతన ‘
తొలి కనుల కలయికలోనే
నా మనసులో
నువ్వే నేనని తలిచాను
ఇక నువ్వు నేను వేరు కాదని
నిన్నే వలచాను
నన్ను నేనే విడిచాను
నీ తలపులలో మైమరిచాను
మన చిలిపి అలకలు
చిగురుటాకులపై తేనె చినుకులు
కన్నె వలపు సిరులు
వయసు తపనలకు సిగ్గు తెరలు
నా ఉచ్ఛ్వాస నిచ్ఛ్వాసల గమనము నీవే
హృదయ స్పందనల ఊపిరి నీవే
ఆనందాల ప్రేమ పల్లకీని మోసే చెలికానివి నీవే
కంట తడి తుడిచే ప్రియనేస్తానివీ నీవే
నా పాదాల విజయపయనానికి
సరైన బాటను చూపిన ఆత్మ బంధువూ నీవే
నా వెన్నంటే నీడల కాపాడుతూ గమ్యతీరం చేర్చిన చుక్కానివీ నీవే
పెదవులపై మధువులను పూయించిన నా అల్లరి నేస్తానివీ నీవే
ప్రతి జన్మలో తోడుంటానని చేయి కలిపిన
నా ఆరోప్రాణానివీ నీవే
