నువ్వు నిండిన నేను

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                నువ్వు నిండిన నేను

రచన ::సుధామురళి

నీకొకటి చెప్పాలి ఈరోజు……
నువ్వెలా నవ్వులా నా మనసుపై పూస్తావో
ఆ గుట్టు నీకు చెప్పాలి
నువ్వలా నన్నిలా ఎలా ఉంచగలిగావో
ఆ మాయనూ చెప్పి తీరాలి

ఎన్నో దుఃఖపు పోగుల్లో నేను చిక్కుకున్నప్పుడు
నువ్వలా చాకచక్యంగా నన్నెలా బైటపడేశావో ఆ ఒకానొక రహస్యాన్ని
సంతోషపు సరిహద్దులను నా కోసం విశాలం చేస్తూ
నువ్వెలా నన్నలా హాయి కొమ్మకు ఊయల ఊపావో ఆ మంత్రపు గుట్టుని
చీకటిలో వెలగడం నాకిష్టమని
వెన్నెల్లో నడవడం నాకు తీపని
ఛాయ్ బిస్కట్ కహానీలు వింటూ
మన బాలూ పాటలు హమ్ చేసుకోవడం
అదో ముచ్చటని
నువ్వొచ్చినప్పుడల్లా
నాతో ఉన్నప్పుడల్లా
గుర్తుచేస్తూ నా కళ్లలోని మెరుపును ఆస్వాదిస్తావు చూడు
ఆ ప్రేమనూ చెప్పాలి

ఏదో ఒక్క క్షణాన నాకేదీ రాదని
నేనేదీ చేయలేనని నీతో పోట్లాడితే
నాకే తెలియని నన్ను పరిచయిస్తూ తియ్యగా గద్దిస్తావు చూడు
ఆ హక్కు చాటు మమకారాన్ని చెప్పాలి

నేనో ఆముదం చెట్టునని కుములుతుంటే
బోన్సాయ్ మొక్కనని ఆటపట్టిస్తావు చూడు
అప్పుడు నేనేంటో పూర్తిగా తెలిసిన నిన్ను నీకే తెలియచెప్పాలి

ఓయ్ నా అల్లరి నేస్తమా….
ఇన్నీ నీకీరోజు చెప్పాలి
నువ్వు నిండిన నేనే అత్యుత్తమమని చెప్పి తీరాలి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!