పల్లె పిలుపు

*పల్లె పిలుపు*

    ” సుధా! సుధా! ఎక్కడున్నావ్? ” హడావిడి పడుతున్నాడు ప్రణీత్.

” ఏమిటండీ? మొహం మతాబులా వెలిగిపోతోంది.హైక్ వచ్చిందా? బోనస్సా?” భర్త సంతోషం చూసి మురిసిపోతూ అడిగింది సుధ.

కిచెన్ లోంచి నేప్ కిన్ తో చేతులు తుడుచుకుంటూ వచ్చిన సుధను భుజాలు పట్టుకుని డైనింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టాడు ప్రణీత్.

” ఇవేం కాదు.ఇన్నాళ్ళకి అమ్మ ఆ పల్లెటూరొదిలి మనింటికి రావడానికి ఒప్పుకుంది. పది రోజులుంటానంది. మనవడి మీద బెంగట.నాకు సెలవు ఇప్పుడిప్పుడే కుదరదన్నాను. అందుకే…” ఆనందంతో గడగడా చెప్పుకుపోతున్న భర్త మాటలకి సుధ కూడా సంబరపడింది.

” ఏమండీ! అత్తయ్య మనం ఎప్పుడు వెళ్ళినా రెక్కలు ముక్కలు చేసుకుని రకరకాల పిండివంటలు వండి పెడతారు‌.ఇప్పుడు చూడండి.నా టేస్టీ వెరైటీస్ అన్నీ రుచి చూపిస్తాను.ఇంక ఇక్కడే ఉండిపోతాననేంత ప్రేమగా చూసుకుందాం.సరేనా?” అంటున్న సుధని ప్రేమగా చూశాడు ప్రణీత్.

ఇంతలో అక్కడకు వచ్చిన చిన్నూ నాయనమ్మ వస్తోందని తువ్వాయిలా గంతులు వేశాడు‌.

” నాన్నా! నాయనమ్మని రామోజీ ఫిల్మ్ సిటీ, సాలార్ జంగ్ మ్యూజియం, స్నో వరల్డ్ అన్నీ తిప్పుదాం.పిజ్జా,బర్గర్,నూడిల్స్ , ఐస్ క్రీమ్స్ అన్నీ రుచి చూపిద్దాం.సరేనా!” అంటున్న కొడుకు ముద్దుమాటలకి మురిసిపోతూ తలూపాడు ప్రణీత్.

మర్నాడే కొడుకు కారు పంపగా సిటీకి చేరింది జానకమ్మ.

గేట్ దగ్గర వేచి ఉన్న ముగ్గురినీ చూసి ఆమె కళ్ళు జ్యోతులైనాయి.

లిఫ్ట్ ఎక్కనని భయపడిన నాయనమ్మని చూసి ” నాన్నా! రేపు ఎస్కలేటర్ ఎక్కిద్దాం.” అన్నాడు చిన్నూ నవ్వుతూ.

కోడలిని కూతురిలా చూసుకునే జానకమ్మ ఆమె నుండి కూడా అంతే ఆప్యాయతని పొందడంలో వింత లేదు.ఆవిడని సకల సౌకర్యాలతో చూసుకోవాలని వారి ఆశ.కానీ భర్త పోయినా ఆ పల్లె వదలనంటుంది.

మర్నాడు ఏమీ తోచక బయట నిలబడిన జానకి ఎదురు అపార్ట్‌మెంట్ నుండి బ్యాగ్ తగిలించుకుని బయటకు వచ్చి తాళం వేస్తున్న అమ్మాయిని చూసి పలకరింపుగా నవ్వింది.ఆమె వింతగా చూసి చిన్నగా భుజాలెగరేసి హైహీల్స్ టకటకలాడించుకుంటూ పోయింది.

జానకమ్మ మొహం చిన్నబోయింది. సుధతో ఆ మాటే ప్రస్తావిస్తే వారికి తెలుగు రాదు అత్తయ్యా! సిటీల్లో అన్ని రాష్ట్రాల నుండి ఉద్యోగాల నిమిత్తం వస్తారు.కాకపోయినా ఇక్కడ ఎవరి గోల వారిదే.” అంది.

జానకమ్మ నివ్వెరబోయింది. తన కొడుకు,కోడలు వచ్చినపుడు ఊరంతా ” మా రాఘవరావు కొడుకువు కదూ! బాగున్నావా నాయనా!” అంటూ చుట్టు ముట్టి కుశలప్రశ్నలడగడం ఆమె మదిలో మెదిలి నిట్టూర్చింది.

ఇంతలో ప్రణీత్ ఫోన్ చేశాడు.” సుధా! డాక్టర్ అపాయింట్ మెంట్ ఆరింటికి.రెడీగా ఉండు” అంటూ.

” ఎవరికీ? ఏమైందీ” అంటూ ఆందోళన పడుతున్న అత్తగారిని చూసి సుధ సర్ది చెప్పింది.

విషయమేంటంటే చిన్నూకి ఈ మధ్య ఆకలి తగ్గిందట.పెట్టిన లంచ్ బాక్స్ పెట్టినట్లే తిరిగొస్తోంది.

విషయం విని తేలిగ్గా ఊపిరి పీల్చుకుంది జానకి.

” ఈ మాత్రానికి డాక్టర్, హాస్పిటల్ ఎందుకు సుధా! ఆ టెస్ట్ లు ఈ టెస్ట్ లని గంపెడు డబ్బు గుంజి బుట్టెడు మందులిస్తారు.నాలుగు వామాకులు తుంపుకురా.నూరి వామాకుల రసంతో వేడివేడిగా నాలుగు ముద్దలు అన్నం పెట్టానంటే తిరిగి బంతిలా ఆడతాడు. అయినా నేనొచ్చిందగ్గర్నుంచీ చూస్తున్నా.ఆ దిక్కుమాలిన మైదాపిండి వంటలు.అజీర్తి రాక ఆరోగ్యమొస్తుందా! “అంది.

” వామాకులా? అవెక్కడ నుండి తేను?” అంటూ తెల్లబోయింది సుధ.

జానకమ్మ ఆశ్చర్య పోయింది.

లిఫ్ట్ భయంతో మెట్లు దిగి వెళ్ళి వెతికింది.ఇరుకైన ఆకాశ హర్మ్యాల మధ్య అందం కోసం షోగ్గా నిలబడ్డ క్రోటన్స్ తప్ప ఆ కాంక్రీట్ జంగిల్లో ఆమెకి వాము,తిప్పతీగ వంటి మొక్కలే కనబడలేదు.

ఏం వెతుకుతున్నారని ఆమెని ఆరా తీసేవారే లేరు.పిల్లాడికెలా ఉందని వాకబు చేసిన పొరుగూ లేదు.

మర్నాటినుండి ఆవిడని ఊరంతా తిప్పారు ముగ్గురూ.

ఆ ప్రదేశాలు,సౌకర్యాలకంటే తనని సంతోషంగా ఉంచాలనే వాళ్ళ తాపత్రయం చూసి ఆనంద భాష్పాలు రాల్చిందావిడ.

పది రోజుల తర్వాత ఉండమన్నా వద్దంటూ తిరుగు ప్రయాణమైంది.

” అమ్మా! కష్టపడి చదివించావు.ఈ రోజున నేనెంత సంపాదించానో,ఎంత సుఖంగా ఉన్నామో చూశావు కదా! నీకు సంతోషమేనా?” చిన్నపిల్లాడిలా అడుగుతున్న ప్రణీత్ తల నిమిరింది.

” నాయనా! చల్లని గాలి కోసం  మన పల్లెలో ఎక్కడికీ వెళ్ళనవసరం లేదు.ఊరంతా చల్లదనమే,పచ్చదనమే.మీరు పార్కుకి వెళతారు.లేదా గదిలో దూరి ఏసీ వేసుకుంటారు.

వేపాకూ మిరియాలూ అయిదేసి కలిపి నమిలితే డెంగ్యూ లాంటి జ్వరాలు కూడా పరారు.కొండంత రోగాన్నైనా తరిమికొట్టే వంటింటి , పెరటి వైద్యాలు మన పల్లెలో బోలెడు. ఇక్కడ చిన్న అజీర్తికి కూడా పెద్ద సంచిడు మందులు.ఆ అజీర్తిని తెచ్చిపెట్టే పిచ్చి తిళ్ళు.

హాయిగా పలకరించే మనిషే లేడిక్కడ.అంతా ఉరుకులు పరుగులు.పక్కింట్లో ఎవరుంటారో కూడా పట్టదు.ఇక అనుకోని ఆపదలో ఆదుకొనేదెవరు.మన పల్లెలో అక్కరకీ,ఆపదకీ ఊరంతా తలో చెయ్యి వేస్తారు.బాబాయిని నేనున్నా.అత్తమ్మని నేను లేనూ! అంటూ ధైర్యం చెప్పడంతోనే సగం బాధ తీరిపోతుంది.

పల్లెటూరంటే పలకరింపే కదా!

మీరే పేదరికంలో ఉన్నారు.పచ్చని పల్లెలు సిరితో,తరగని ప్రాణవాయువుతో కళకళలాడుతున్నాయి. సెలవులిచ్చినపుడల్లా రండి.గుండెలనిండా స్వచ్చమైన గాలి పీల్చుకుని మనసులనిండా ఆప్యాయతల సేదదీరి హాయిగా వెళ్దురుగాని.” అంటూ పల్లెతల్లి ఒడికోసం బెంగపడిన పసిపాపై వెడలింది.

రచయిత:: గుడిపూడి రాధికారాణి

You May Also Like

5 thoughts on “పల్లె పిలుపు

  1. చాలా బాగుందాండి💐💐

  2. మీ కథలకు నేను పెద్ద ఫ్యాన్, ఏసీ 😍

  3. మంచి కధ. మీ కవిత చదవమేకానీ ఇదే మొదటి కధ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!