సరైన నిర్ణయం

సరైన నిర్ణయం

         రెండుచేతులకు నాలుగువేళ్లకు నాలుగేసి ఉంగరాలు, మణికట్టుకి లావుపాటి మండగొలుసు, మెడలో లావుపాటి చైన్, చేతికి అలంకారం గా ఆనాటి పుస్తకంలా, ఈ కాలం లేటెస్ట్ స్మార్ట్ ఫోన్, సూట్ బూట్ తో కారులో నుండి దిగుతున్న తమ స్నేహితుడిని నోరు అప్పగించి అలా చూస్తూండిపోయారు, రవణ స్నేహితులందరూ.

“ఏరా!… ఎలా ఉన్నారు అందరూ!?” అంత గొప్పగా కనబడుతున్న కూడా తమ దగ్గరకు వచ్చి, ఆప్యాయంగా పలకరిస్తున్న స్నేహితుని చూసి వినయంగా నిలబడి పోయారు అందరూ.

ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, “ఇంకా ఎంతకాలం రా!?… ఈ పల్లెను పట్టుకుని వ్యవసాయం చేస్తూ బతుకుతారు. నాతో వచ్చేయండి. నా వ్యాపారంలో భాగస్వాములుగా చేర్చుకుంటాను… బాగా డబ్బు సంపాదించుకుందురు గాని” అంటూ ఆగి, స్నేహితుల అభిప్రాయం కోసమన్నట్లు చూసాడు.

వారంతా “మేము రాలేము రా!… మాది ఇంకా ఉమ్మడి కుటుంబం. మా పెద్దవాళ్లు పంపించరు” అంటూ తప్పుకున్నారు, కాని వెంకటేష్ లో మాత్రం రవణ మాటలు ఆశలు పుట్టించి, మౌనంగా ఉండిపోయాడు.

అటు, ఇటు చెప్పకుండా మౌనంగా చూస్తున్న వెంకటేష్ ను చూసి, “సరే రా!…

బై!… తొందరేమి లేదు. నిదానంగా మీ పెద్దవాళ్లతో మాట్లాడే ఒక నిర్ణయం తీసుకొండి” అంటూ కారు ఎక్కబోయి , “ఒరే!… వెంకటేష్ అలా మా మావయ్య ఇంటికి వెళ్లోద్దాం రా రా!… నీ గురించి మావయ్య చాలాసార్లు అడిగారు” అంటూ కారు ఎక్కించుకుని తనతో పాటు తీసుకుపోయాడు రవణ.

అక్కడికి వెళ్లిన తర్వాత ఆ ఇంట్లో  రవణకు జరుగుతున్న  మర్యాదలు చూస్తున్న వెంకటేష్ కి మతిపోయింది.

ఒకనాడు, ఇదే ఇంట్లో రవణకు జరిగిన అవమానాలు గుర్తొచ్చి, “ఔరా!… డబ్బు ఎంత పని చేస్తుంది” అనుకుంటూ,

“ఇంత కష్టపడి డిగ్రీ చదివించాను, ఒక దమ్మిడి సంపాదన లేదు. పోద్దస్తమానం తినడం, ఆ వెధవలతో చేరి రోడ్డు మీద బలాదూర్ గా తిరగడం తప్ప, మరో పని చేత కాదు”

నాన్న తరచు అనే మాటలు గుర్తు తెచ్చుకుని,  ‘ఎలాగైనా నాన్నను ఒప్పించి, రవణ వెంట పట్నం వెళ్లిపోవాలనుకున్నాడు’ వెంకటేష్.

అనుకున్నదే తడవు ఆచరణలో పెట్టేసాడు. “అంతా డబ్బు ఇప్పుడేక్కడిది” అంటున్న తండ్రిని, ఇంట్లో రెండు రోజులు నిరాహార దీక్ష చేసి ఒప్పించేసాడు.

దాని ఫలితం ఎవరి కాళ్లో, చేతిలో పట్టుకుని, అప్పోసప్పో చేసి, వెంకటేష్ ని రవణ వెంట పంపించాడు అతని తండ్రి.

            &&&&&&&&&&&&

     వెంకటేష్ ఈ పట్నం వచ్చి, నెలరోజులు దాటింది. రవణ వెంటబడి  వచ్చాడు. కాని, ఆ తర్వాత ఏదో చిన్న గది అద్దెకు చూపించి, దించి వెళ్లిన అతడు మరల తొంగి చూడలేదు ఈ నెల రోజుల్లో.

ఎప్పుడైన తన డోక్కు పోన్ లో కాల్ చేసిన “ఇదిగో రా!… పనిలో ఉన్నాను. నీదగ్గరకు రావాలని రోజు అనుకుంటున్నాను. కాని, అర్థరాత్రి వరకు ఏవో ఊపిరి సలపని పనులు. రేపు ఎలాగైన వచ్చి, మన సైట్ కి తీసుకెళ్తాను” అనడమే కాని, ఆ రేపన్నది ఎప్పటికి రావడం లేదు, ఈ నెల రోజుల నుండి.

‘ఆ పల్లెలో ఉన్నప్పుడు ఎలా ఉండేవాడిని!?… ఇక్కడికి వచ్చి ఎలాగయ్యాను!?’ అంటూ, మెల్లిగా ఆలోచనలు తరచు కందిరీగల్లా చుట్టుముట్టి, అల్లరి చేయడం మెుదలైనాయి వెంకటేష్ లో.

‘ఆ పల్లెలో ఉన్నప్పుడు వేళకు వేడివేడిగా ఇంత గంజాన్నం తినేసి, బయటకు వెళ్లితే మళ్లీ తిరిగి ఇంటికి వచ్చే వరకు ఆకలి వేసేది కాదు. ఎంచక్కగా స్నేహితులతో ఆటలు, పాటలు, కబుర్లు అంటూ పైస ఖర్చు లేకుండా కాలక్షేపం జరిగి పోయేది.

రాత్రిపూట వీధి అరుగు మీద తల కింద దిండు వేసుకుని పడుకుంటే, ఆకాశంలో చుక్కలు కన్పిస్తూ, రారమ్మంటూ, ఏవో కబుర్లు చెప్తుంటే ఎంత ప్రశాంతంగా ఉండేది.

ఎప్పుడూ నిద్రపట్టేసేదో. సూర్యుడు వేడి ముఖాన్ని తాకిన లేవకుండా అలాగే పడుకోవాలన్పించేది. మళ్లీ అమ్మ వచ్చి, తిట్లదండకం మెుదలెట్టితే కాని లేవబుద్దయ్యేది కాదు.

ఎంత ఖర్చు పెట్టిన రోజుకీ వంద రూపాయలు కూడా ఖర్చు లేని ఆ పల్లెటూరు ఎక్కడ!? వేలకు వేలు నిముషాల్లో మింగేసే ఈ పట్నం ఎక్కడ!

ఈ పట్నం వచ్చినప్పుడు ఇరవై వేలు జేబులో పెట్టుకుని వస్తే, ఈ రోజుకి వెయ్యి రూపాయలు కూడా లేదు. అదే మా పల్లెలో అయితే ఆ డబ్బుతో నెలరోజులు ఇంటిల్లిపాదికి ఏ లోటు లేకుండా ఖర్చులు జరిగిపోయేవి.

ఇలా రోజురోజుకీ ఆ హోటల్ ఖర్చులు, లేదంటే వెచ్చాల ఖర్చులు లెక్కలు చూసి, గుండె బేజారెత్తపోయింది వెంకటేష్ కి

అవును మరీ. తోట నుండి ఉచితంగా తాజాకూరలు, ఒక్కరు పండించిన పంట పప్పులు, బియ్యాలు  తక్కువ రేటుకు ఇచ్చి పుచ్చుకునే ఆ పల్లెటూరు ఎక్కడ!? ప్రతిదానికి రెండింతలు, మూడింతలు ఖరీదు కట్టే ఈ పట్నం ఎక్కడ!?’ ఇలా ఆలోచనలలో ఉండగానే  చేతిలో ఫోన్ మోగడంతో, “హాలో!” అంటూ బదులు పలికాడు వెంకటేష్.

“సారి రా!… అనుకోని విధంగా పనులు వచ్చిపడటంతో నీ దగ్గరకు రాలేక పోయాను. రేపు ఉదయం ఎలాగైనా మనం సైట్ కి వెళ్దాం. ఉదయాన్నే వస్తాను, రెడీగా ఉండు”

“మరేం పర్వాలేదు రా!…తీరికగా నీ పనులు చూసుకో. నేను ఈ రోజు మా ఊరు వెళ్లి పోతున్నాను. నువ్వేం మరీ నా గురించి ఆలోచించకు”

” అదీ కాదు రా!… నేను చెప్పేది విను”

“మరేం వినే అవసరం లేదు రా!? నేను ఎంత పోరపాటు చేసెనో నాకు ఇక్కడికి వస్తే కాని, అర్థం కాలేదు. ఇక్కడ చేసే బిజినెస్ ఏదో మన పల్లెల్లో చేసుకుంటే, సొంత ఊరిలో సొంత మనుష్యుల మధ్య ఉన్న తృప్తి అయిన దక్కుతుంది.

ఇక్కడ ఎవరు? ఎప్పుడు? ఎందుకు వస్తారో ఎందుకు పోతారో తెలియదు. ఏదైనా అమ్మాలన్న, ‘ఇప్పుడు డబ్బు లేదు. రేపు ఇస్తానంటూ’, అరువు అడుగుతారు. పోని నమ్మకం తో అరువు ఇచ్చామంటే మరీ మర్నాడు కనబడరు.

అదే మన ఊరిలో అయితే అరువు ఇచ్చిన పుట్టి పెరిగిన ఊరిలో చెడ్డపేరు వస్తుందని ఎలాగో ఒకలా అప్పు తీర్చడానికి ప్రయత్నిస్తారు. తప్ప, ఇచ్చిన అప్పు ఎగవేయడానికి ఇష్టపడరు ఎవరూ! కనుక ఇక్కడ చేసే వ్యాపారం ఏదో మన పల్లె లోనే చేసుకుంటూ, నా వాళ్ల మధ్య ఉన్నానని తృప్తిగా ఉండవచ్చు. మరేం అనుకోకు రా!…”

అంటూ, ‘పట్నాలలో అన్నీ బతుకులు  పల్లెలను మరచిన బతుకులే. పల్లెల ముందు ఈ పట్నాలు సాటిరావు’ అని తనలో తాను అనుకుంటూ, ఆ నెల రోజుల్లో పట్నానికి, పల్లెకు గల తేడా తెలియడంతో తన వారిని కలుసుకుని, స్నేహితులందరూ కలిసి, తమకు తగిన ఉపాధి కల్పించుకోవాలన్న  దృఢ నిశ్చయంతో బస్టాండ్ కి బయలుదేరాడు వెంకటేష్.

రచయిత:: సావిత్రి తోట “జాహ్నవి”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!