నీ సేవలకు వందనాలు
రచన:: నెల్లుట్ల సునీత
సూర్యుడికన్నా ముందే లేచి
కాలంకన్నా వేగంగా పరిగెత్తి
కట్టుకున్నవాడికీ పిల్లలకు
ఇంట్లో ఉన్న పెద్దలందరికీ
సపర్యలన్నీ చేసి సాపాటు ఏర్పరచి
ఉద్యోగం మానవ లక్షణమని తలచి
అబలను సబలగ నిరూపించగా
సమాజంలో శాంతిని కాపాడగా
ముందడగు వేసింది ముదిత
రక్షక భటురాలిగా చరిత
అధికారుల చిన్నచూపులోవైపు
ఆటవికుల చెడుచూపులోవైపు
తోటివారి తోడేలు చేష్టలు
బయటివారి బరితెగింపు మాటలు
చెవిన పడినా లెక్కచేయకనే
చెదిరే గుండెను దిటవు చేసుకుని
రాత్రనక పగలనక నిత్య జాగరణ
కష్టమనక సుఖమనక విధి నిర్వహణ
మహిళలకు ధైర్యం చెబుతూ
ముష్కరుల గుట్టును విప్పుతూ
కుటుంబ హింసను కట్టడి చేస్తూ
బాధిత మహిళకు బాసటనిస్తూ
మెరుగైన సమాజం కోసం
ఆమె ఎత్తిన కొత్త అవతారం
ప్రాణంపోసే కన్నతల్లిలా
నేరంచేస్తే కాళికాంబలా
కరకు ఖాకీ దుస్తుల వెనుక
కరుణ కలిగిన మనసుతో
కదులుతున్న రక్షక భటురాలా
నీ సేవలకు వేవేల వందనాలు!
***