గీతాసారం

గీతాసారం

రచన: కమల ముక్కు (కమల ‘శ్రీ’)

“బిడ్డా! పరిస్థితి ఇంకా చేయి దాటి పోలేదు.ఆలోచించకు.” తన తండ్రి లింగన్న అంటున్నట్టుగా అనిపించి తల విదిలించి లేచాడు శివ. అతని ఒళ్లంతా రక్త సిక్తమై ఉంది. చుట్టూ తుపాకీ గుళ్లు శరీరం లో దిగి స్పృహ లేని పరిస్థితి లో రక్త సిక్తమైన తన తోటి పోలీసులు.

వారికి కాస్త దూరం లో తమ వైపే వస్తూ టెర్రరిస్టులు. ఆలోచిస్తూ ఉండిపోతే బ్రతికే ఉన్నా స్పృహ లేని పరిస్థితిలో ఉన్న తన తోటి పోలీసులు ప్రాణాలు కోల్పోతారు. ఏం చేయాలి?. వచ్చిన వారిలో తానే స్పృహ లో ఉన్నాడు. కానీ ఒక కాలు చిన్న గోతిలో పడి ఇరుక్కుపోయింది. ఆలోచిస్తే తన వాళ్లు మొత్తం చనిపోతారు. అప్పుడు గుర్తుకు వచ్చాయి తండ్రి లింగన్న ఎప్పుడూ చెప్పే మాటలు.

“బిడ్డా! గుర్తుపెట్టుకో నువ్వు చేసే పని వలన నలుగురికి మేలు జరుగుతుంది అంటే మాత్రం ఆ పని చెయ్యడానికి అస్సలు వెనకాడకు.” అర్జునుడికి గీత ను బోధిస్తున్న శ్రీకృష్ణుడిలా ప్రతీ రోజూ తన కొడుకు శివ కి చిన్నప్పటి నుంచి ప్రతీ రోజూ చెప్పేవాడు లింగన్న. కడుపేద కుటుంబానికి చెందినవాడైనా కొడుకుకి మాత్రం ఎప్పుడూ మంచే చెప్పేవాడు. పెద్దల పట్ల , ఆడవాళ్ళ పట్ల, దేశం పట్ల గౌరవ మర్యాదలు కలిగి ఉండాలి అంటూ తనకి తెలిసిన నాలుగు మంచి మాటలు చెప్పే వాడు. ఆ మాటలు చిన్న వాడైన శివ మనసులో నాటుకుపోయాయి. వాటినే పాటిస్తూ పెరిగి పెద్దవాడు అయ్యాడు. ఎప్పుడో చనిపోయిన తన తండ్రి చెప్పిన ఆ మాటలే గుర్తు తెచ్చు కున్నాడు.

“దేవుడా! ఏదో ఒక మార్గం చూపించు నా వాళ్లను కాపాడుకోవడానికి. వీళ్ళందరి ప్రాణాలిప్పుడు నా చేతిలోనే ఉన్నాయి.” అంటూ చుట్టూ చూశాడు. కాస్త దూరం లో తన కానిస్టేబుల్ దగ్గర ఉన్న రైఫిల్ కనపడింది. దానికి ఉన్న కత్తి కనిపించింది. విశ్వ ప్రయత్నం చేసి దాన్ని అందుకున్నాడు.

ఓసారి కళ్లు మూసుకుని తన వాళ్లని గుర్తు తెచ్చుకున్నాడు. నాన్నా నువ్వు చెప్పినట్టే చేస్తున్నా. నలుగురికి మంచి జరుగుతుంది అంటే ఏం చేయడానికి అయినా వెనుకాడకు అన్నావు కదా. అదే చేస్తున్నా ఇప్పుడు.” అనుకుంటూ ఆ కత్తి తో గోతిలో ఇరుక్కున్న తన కాలిని నరుక్కున్నాడు. దాంతో రక్తం అంత దూరం ఎగిసిపడింది.చాలా బాధగా ఉంది అతనికి కానీ తన వాళ్లని కాపాడుకోవాలి అన్న తన లక్ష్యం ముందు ఆ నొప్పి తనకి తెలియడంలేదు.

కాస్త దూరం లో టైం బాంబ్ కనిపించింది. కుంటుకుంటూనే అక్కడకు వెళ్లి దానిని అందుకుని కాస్త దూరం లో ఉన్న తమ వెహికల్ దగ్గరికి వెళ్లాడు. టెర్రరిస్ట్ లు తమ వాళ్ల దగ్గరకు వస్తున్నారు.బాంబ్ కి టైమర్ సెట్ చేసి ముందుకు దూకించాడు జీప్ ని.

ఎప్పుడైతే శివ జీప్ ని స్టార్ట్ చేశాడో టెర్రరిస్ట్ ల దృష్టి అతని మీదకు మళ్లింది. తమ చేతిలో ఉన్న వెపన్స్ కి పని చెప్పారు. బుల్లెట్లు అతని శరీరం లోకి దూసుకుపోతున్నాయి. తెగిన కాలి నుంచి రక్తం, బుల్లెట్ గాయాల నుంచి రక్తం. కళ్లు మూతలు పడుతున్నాయి. ఒంట్లో నీరసం ఆవహిస్తోంది. కానీ జీప్ పై చేయి ని తీయలేదు. అది దూసుకుపోతూ ఉంది.

తమ వైపు వస్తున్న జీప్ పై ఎటాక్ చేసేందుకు తమ జీప్ లనూ స్టార్ట్ చేశారు టెర్రరిస్టు లు. అందరూ శివ జీప్ ని చుట్టి ముట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇంతలో ఢాం అంటూ శబ్థం.

శివ జీప్ తో పాటూ టెర్రరిస్టు ల జీప్ లూ తునాతునకలైనాయి. అందరి శరీరాలూ ఛిద్రమైనాయి.

***

టీవీ లో బ్రేకింగ్ న్యూస్.

“టెర్రరిస్టులను పట్టుకునేందుకు వెళ్లిన సీఆర్పీఎఫ్ పోలీసులపై దాడి చేసిన టెర్రరిస్టు లు. ఓ పోలీసు ఎదురు దాడితో మరణించిన టెర్రరిస్టులు.

గాయాల పాలైన పోలీసులు హాస్పిటల్ లో ఉన్నారు. వారు చెప్పిన వివరాల ప్రకారం ఆ పోలీసు పేరు శివ అనీ… తనది ఆంధ్రప్రదేశ్ అని తెలిసింది.” అంటూ శివ గురించి చెప్తుంది న్యూస్ రిపోర్టర్. మార్చి మార్చి అక్కడి భీతావహ దృశ్యాలూ, శివ ఫోటో ని చూపిస్తున్నాయి ఛానల్స్.

శివ ఇంట్లో ఆ దృశ్యాలు చూస్తూ కన్నీరు మున్నీరౌతున్నారు.

“ఒక్కగానొక్క బిడ్డవయ్యా. చివరి చూపు కూడా దక్కకుండా పోయావే. మాకు ఈ ముసలి వయసులో తోడుగా ఉంటావనుకున్నామే. ఇలా అన్యాయం చేసి పోయావేంటయ్యా.” అంటూ ఏడుస్తుంది శివ తల్లి మాలక్ష్మి.

ఆమె ను చూస్తూ చుట్టు పక్కల వాళ్లూ ఏడుస్తున్నారు.

లింగన్న మాత్రం శివ ఫోటోని తదేకంగా చూస్తూ ఉండిపోయాడు.

“బిడ్డా! నేను చెప్పిన మాట ఇంతలా ఒంటబట్టించుకున్నావా?. నువ్వు చేసిన పనికి ఏం మాట్లాడాలో తెల్వడం లేదురా. నీలాంటి బిడ్డ నా కొడుగ్గా పుట్టడం నా అదృష్టం రా. తల్లిదండ్రులు చెప్పేది అందరూ వింటారు. కానీ పాటించేది మాత్రం నీలాంటి కొందరో. నువ్వు బంగారం రా బిడ్డా. బంగారం.” అనుకుంటూ అలా చూస్తూ ఉండిపోయాడు లింగన్న.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!