దొరకునా ఇటువంటి సేవ?’

దొరకునా ఇటువంటి సేవ?

రచన: పద్మజ రామకృష్ణ.పి

“ఏమోయ్, నా బట్టలు ఎక్కడా?” అంటూ లోపలినుండి  కేకలు వేస్తున్నాడు గుర్నాథం.

“వస్తున్నానండీ” అంటూ పంచలో నుండి బట్టలు తీసుకుని ఒక్క పరుగులో భర్త ఎదురుగా నిలబడింది గుర్నాథం భార్య సావిత్రి.

“చూడు, మధ్యాహ్నం మా బాబాయ్, పిన్నీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు నాలుగు రోజులు ఇక్కడే ఉంటారు, వాళ్ళు వెళ్ళేవరకు కాస్త వంట సరిగ్గా వండు!” అన్నాడు గుర్నాథం.

గుర్నాథం చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు, సొంత బంధువులు ఉండి కూడా, ఎవరూ ఆదరించలేదు. అనాథాశ్రమంలో పెరిగాడు, బాగా చదివి జాబ్ లో సెటిల్ అయ్యాకే ఈ బంధువుల రాకపోకలు!

****

సావిత్రికి వాళ్ళ రాక కొత్తేమీ కాదు. రావడం, వచ్చిన ప్రతిసారీ ఏదో ఒకమాట అని వెళ్లడం వాళ్లకు మామూలే. వాళ్ళు వస్తున్నారంటేనే సావిత్రికి హడల్.

ఇంటి ముందు ఆటో ఆగింది. సావిత్రి గబగబా ఇంట్లో నుండి బయటకు వచ్చి,  దగ్గరకు వెళ్లి, ఆటో దిగుతున్న అత్తగారి చేతిలో లగేజీ అందుకుంది.

“ఒళ్ళంతా గుల్లగుల్ల అయ్యింది, అబ్బా… ఏం ప్రయాణమో ఏమో!” అంటూనే ఇంట్లో అడుగు పెట్టింది అత్తగారు. పెడుతూనే ఇల్లంతా కళ్ళతోనే తనిఖీ చేయసాగింది. ఓ చోట కళ్ళు ఆగగానే, “అవునూ, మేము పోయిన సారి వచ్చిన్నప్పుడు ఉన్న టీవీ కాదే ఇది, మార్చారా?” అని అడిగింది.

“అవునత్తయ్యా. మొన్ననే తెచ్చారు మీ అబ్బాయి.” అని చెప్పింది సావిత్రి.

“ఎందుకమ్మా, ఇంత పెద్ద టీవీ తెచ్చారు? అయినా  మీకు పిల్లా పీచూ కూడా లేరు కదా, తరువాత చూసేందుకు! మా ఇంట్లో ఇప్పటికీ అదే పాత టీవీ…” అని అనేసింది.

సావిత్రి మనసు చివుక్కుమంది. నిజమే, వీళ్ళు వస్తే తప్ప సంతానం లేరన్న సంగతి అసలు గుర్తు ఉండదు తనకు. ఇక గుర్తు చేస్తూనే ఉంటారనుకుంది మనసులో.

వాళ్ళ ఇంట్లో వీళ్ళ గొడవ కొన్ని రోజులు తప్పించుకోవడానికి, కొద్దిగా రిలీఫ్ కోసం అప్పుడప్పుడు కొడుకులు వాళ్ళను ఇలా పంపించేస్తూ ఉంటారు.

‘బాబోయ్, వీళ్ళు ఉన్నన్ని రోజులూ జాగ్రత్తగా ఉండాలి!’ అనుకుంది సావిత్రి.

గుర్నాథం ఆఫీస్ నుండి వస్తూనే, హాల్లో టీవీ చూస్తూ ఉన్న వాళ్ళ పిన్నీ, బాబాయ్ లని ఆప్యాయంగా పలకరించాడు.

“ఏంటోరా గుర్నాథం! ఇక్కడి నుండి వెళ్లిన ఒక రెండు నెలలు గట్టిగా గడిచీగడవక ముందే నువ్వు తెగ గుర్తుకువస్తావు, గుర్తు వచ్చిందే తడవుగా ప్రయాణం కట్టేస్తుంటాము.” అన్నాడు బాబాయ్.

“నాకు మాత్రం ఎవరున్నారు బాబాయ్, మీరు తప్ప!” అన్నాడు గుర్నాథం.

“సావిత్రీ, మా పిన్నీ వాళ్లకు భోజనం పెట్టావా, లేదా?”

“పెట్టానండీ…” అని కిచెన్ నుండే సమాధానం చెప్పింది సావిత్రి.

“సరే, నేను స్నానం చేసి వస్తా. నాక్కూడా భోజనం వడ్డించు.”

గుర్నాథం అన్నం తింటూ ఉండగా, వాళ్ళ ఊర్లో సంగతులు చెప్పుకుంటూ నవ్వుకోసాగారు ముగ్గురూ.

పొద్దుపోయింది. కిచెన్ లో అన్నీ సర్దుకుని పడుకుంది సావిత్రి. నిద్ర రావడం లేదు, మనసంతా భారంగా మారింది. ఉదయం అత్తగారు గుర్తు చేసిన ‘సంతానం’ సంగతి గుర్తు వచ్చి కంట్లో నీళ్లు తిరిగాయి. బాధలోనే మెల్లగా నిద్రలోకి జారుకుంది సావిత్రి.

వారం దాటింది. కానీ గుర్నాథం పిన్నీ, బాబాయ్ ఇల్లు కదిలేలా లేరు.

“చూడమ్మా, రేపు టిఫిన్ కి గారెలు చెయ్.” అని ఆర్డర్ వేసింది అత్తగారు.

“సరే, అత్తయ్యా.” అంది సావిత్రి.

గుర్నాథం ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఇల్లంతా చీకటిగా ఉంది. హాల్లో మాత్రం టీవీ వెలుతురులో నవ్వుకుంటూ కబుర్లు చెప్పుకుంటున్నారు పిన్నీ, బాబాయ్ లు. లైటు వేసి చూసాడు, సావిత్రి కనిపించలేదు. బెడ్ రూమ్ లోకి వెళ్ళి చూస్తే చీకటిలో పడుకుని మూలుగుతూ కనిపించింది సావిత్రి. భార్యను లేపడానికి చెయ్యి పట్టుకుని చూస్తే, ఒళ్ళు కాలిపోతుంది.

“పిన్నీ, సావిత్రికి ఒళ్ళు కాలిపోతోంది, చూసావా?”

“అయ్యో, అవునా? మరి మాకీపూట భోజనమెలా?” అన్నారిద్దరూ.

చిత్రంగా చూసాడు గుర్నాథం ఇద్దరి వంకా. ‘ఇదేంటి, తనకు బాగోలేదంటే వీళ్ళు భోజనం గురించి అడుగుతారు!’ అనుకున్నాడు మనసులో.

“ఏంటి సావిత్రీ, ఎలా ఉంది చెప్పు? నేను బయటకు వెళ్లి టాబ్లెట్ తెస్తా.” అన్నాడు సావిత్రితో.

“అయ్యో, చాలా టైమ్ అయింది. ముందు అత్తయ్యా వాళ్లకు హోటల్ నుండి భోజనం తీసుకురండి.” అంది సావిత్రి నీరసంగా.

గుర్నాథం మనసుకి బాధగా అనిపించింది. సావిత్రిని ఎప్పుడూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం
చెయ్యలేదు, నిజంగా తాను చాలా అసమర్థుడు! ఆమె ఇలా ఉండి కూడా వాళ్ళ ఆకలి గురించే ఆలోచిస్తోంది. వాళ్ళు తమ భోజనం గురించి ఆలోచించారే కాని సావిత్రి ఆరోగ్యం గురించి ఆలోచనే లేదు అనుకున్నాడు, బాధగా.

బయటకు వెళ్లి హోటల్ నుండి భోజనం, సావిత్రికి టాబ్లెట్స్, ఇడ్లీ తెచ్చాడు గుర్నాథం. తెచ్చిన భోజనానికి వంకలు పెడుతూ తిని పడుకున్నారు పిన్నీ, బాబాయ్.

సావిత్రి కోసం తెచ్చిన ఇడ్లీ పొట్లాం ఓపెన్ చేశాడు గుర్నాథం. భార్య లేవలేని పరిస్థితిని చూసి, తానే
నిదానంగా సావిత్రికి ఇడ్లీ తినిపించి, గొంతులో టాబ్లెట్ వేసి, నీళ్లు పోశాడు.

తెల్లారేసరికి కాస్త ఓపిక వచ్చింది సావిత్రికి. ఎప్పటిలాగే తన పనుల్లో నిమగ్నమైంది.

హాల్లో ఉన్న వాళ్ళ బాబాయ్, పిన్నీ వినేలా పెద్దగా, “ఏమోయ్, ఈ రోజు రాత్రికే మన ప్రయాణం. గుర్తుందిగా?” అన్నాడు గుర్నాథం.

టీవీలో లీనమై చూస్తున్న పిన్నీ, బాబాయ్ “అవునా? అదేంటి,  ఇన్ని రోజులూ అనుకోని ప్రయాణం?” అన్నారు.

“లేదు బాబాయ్, రెండు నెలల క్రితం చేసుకున్న టూర్ ప్లాన్ ఇది.” అన్నాడు గుర్నాథం.

భర్త వైపు ఆశ్చర్యంగా చూసింది సావిత్రి. భార్య వంక చూసి కను సైగ చేశాడు గుర్నాథం.

“మరి మేము బయలుదేరాలి అనుకుంటా కదా, మీ ప్రయాణం సాయంత్రం అయితే…” అంది పిన్ని.

“అవును పిన్నీ, నాకు కూడా చాలా బాధగా ఉంది, మా ప్రయాణం మీరు ఉండగా వచ్చినందుకు.”  అన్నాడు రాని బాధ నటిస్తూ గుర్నాథం.

“ఈసారి వచ్చినప్పుడు మరో నాలుగు రోజులు అదనంగా ఉంటాము లేరా…” అంటూ, సామాను సర్దుకొని వాళ్ళు వెళ్లిపోయారు.

వాళ్ళు వెళ్ళిపోయాక, “అయ్యో, ఉదయం లేవగానే పప్పు నానబెట్టాను, పాపం అత్తయ్యా వాళ్లకు గారెలు వేసి పెట్టాలని,” అంది సావిత్రి.

“అసలు ఇది ఎప్పటి టూర్ ప్లాన్? నాకు గుర్తు లేనేలేదు. గారెలకు వేసిన పప్పు ఇప్పుడేం చెయ్యాలి నేను?” అంది నవ్వుతూ.

“అవి మీ భర్తగారు సాయంత్రం తిని పెడతారులే, డోంట్ వర్రీ!” అన్నాడు పకపకా నవ్వుతూ గుర్నాథం.

కొన్ని రోజులు తరువాత ల్యాండ్ లైన్ కి ఒక ఫోన్ కాల్ వచ్చింది… గుర్నాథం ఫోన్ తీసాడు

“ఆ… గుర్నాథం, నేను మీ బాబాయ్ ని. ఊరికి వద్దాం అనుకుంటున్నాము” అని అన్నాడు బాబాయ్…

“సారీ బాబాయ్, మేము ఊర్లో లేము, ఇప్పట్లో రాము!” అని ఫోన్ పెట్టేసాడు గుర్నాథం.

“అదేంటి, వాళ్ళు ల్యాండ్ లైన్ కి ఫోన్ చేస్తే ఊర్లో లేము అన్నారు?” అంది, అయోమయంగా సావిత్రి.

“వాళ్లకెందుకు పాపం మరల ఆశ? ఈ పాటికే వాళ్లకు అర్థం కావాలి మరి, వాళ్ళ రాక మనకు ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అనేది… కనీసం నీకు బాగుండకపోతే మా పిన్ని వంటగది వైపుకు తొంగి చూడలేదు సరికదా, పరిస్థితిని ఏమాత్రం అర్థం చేసుకోకుండా బయట భోజనం అంటూ వంకలు పెడుతూ, గొణుగుతూ తిన్నారు… అమ్మానాన్నలు చనిపోయి, ఒంటరిగా నేను మిగిలిపోయినప్పుడు ఏమయ్యారు ఈ బాబాయ్, పిన్నీ? నేను పెద్దయి, మంచి ఉద్యోగం సంపాదించుకొని, ఓ ఇంటివాడనయ్యాక, కాస్తో కూస్తో ఆస్తి కూడబెట్టాక వెతుక్కుంటూ వచ్చేసారు.

‘ధనం మూలమిదం జగత్’ అంటే ఇదే సావిత్రీ!” అన్నాడు గుర్నాథం.

“కానీ ఎంతైనా పెద్దవాళ్ళు! మనకున్న పెద్ద దిక్కు వాళ్ళే కదండీ!”

“ఆ విషయం మనమే కాదు. వాళ్ళూ గ్రహించాలి కదా! మననుంచి ఎంత ఆదరణ, ఆప్యాయత పొందారో వాటిని మనకు మన పెద్దలుగా అందించవలసిన బాధ్యత వాళ్ళకు లేదంటావా?

చిన్నతనంలో ఒక్కపూట కూడా భోజనం  పెట్టని ఇలాంటి బంధాలు, మన దగ్గర ధనం చేరినప్పుడే చేరువ అవుతుంటాయి! ఇది నేను తెలుసుకోలేక నిన్ను చాలా సార్లు ఇబ్బంది పెట్టాను…”

అన్నాడు గుర్నాథం.

“పోనీలే, ఇప్పటికైనా నన్ను అర్థం చేసుకున్నారు మీరు!” అని పొంగిపోయింది సావిత్రి.

“ఇంకో విషయం సావిత్రీ! స్వంత పిల్లల ప్రేమాభిమానాలకు నోచుకోకుండా వృద్ధాశ్రమాలలో అలమటిస్తున్న తల్లిదండ్రులు ఎంత మందో! అలాంటి తల్లిదండ్రులను మనం దత్తత చేసుకొని ఇంటికి తెచ్చుకుందాం. వారికి పిల్లలు, మనకు పెద్దవాళ్ళు దొరుకుతారు. ఏమంటావు?”

“తప్పకుండా. చాలా మంచి ఆలోచన మీది!” భర్త భుజం తట్టింది సావిత్రి మెచ్చుకోలుగా.

“అలాగే, మనకు సంతానం కలుగలేదని ఎప్పుడూ బాధ పడవద్దు. ఒక్క సంవత్సరం చూద్దాము. వైద్యం చేయించుకుందాము. ఫలితం రాకుంటే దేవుడిచ్చిన బిడ్డగా ఎవరినైనా పెంచుకుందాం!”

బదులుగా ఆనందాశ్రువులతో గుర్నాథం గుండెలపై తలవాల్చింది, సావిత్రి.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!