తస్మాత్ జాగ్రత్త!

తస్మాత్ జాగ్రత్త!

రచన : వాడపర్తి వెంకటరమణ

అది మే నెల.

మధ్యాహ్నపు ఎండ తీవ్రతకు జనసంచారం లేక నిర్మానుష్యంగా ఉందా వీధి.అప్పుడే ఆ వీధిలోకి ప్రవేశించాడు ఓ కోయదొర.

అదే సమయంలో టీవీలో వచ్చే ‘జీడిపాకం’ సీరియల్ వెయ్యిన్నొక్క ఎపిసోడ్ ఉత్కంఠగా చూస్తోంది విశాలాక్షి.

అప్పుడే టప్ మని కరెంటు పోవడంతో చిర్రెత్తుకొచ్చి, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని నోరారా తిట్టుకుని బయట గుమ్మం దగ్గరకు వచ్చింది.వీధిలో పోతున్న కోయదొర కనిపించాడామెకు.

స్వతహాగా విశాలాక్షికి జ్యోతిష్యం, జాతకాల పిచ్చి జాస్తి.తాయెత్తులు కట్టే వాడిదగ్గర్నుంచి, చిలుక జోస్యం చెప్పే వాడి వరకు ఎవరు కనపడ్డా వారితో జాతకం చెప్పించుకుని సంతోషపడుతుంది.

కోయదొరను పిలిచి, అతడు కూర్చునేందుకు తుంగచాపను పరిచి అతను చెప్పినట్లు అతని ఎదురుగా కూర్చుంది విశాలాక్షి.

అతను ఇల్లంతా ఓసారి పరికించి,”కుర్రో కుర్రు…కొండ దేవత చెప్పమంటోంది.నువ్వు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నావు తల్లో…” అన్నాడు కోయదొర.

“నిజమే! మీరు చెప్పిన మాటలు అక్షరాలా వాస్తవం.నడుమునొప్పి, కీళ్ల నొప్పులతో గత ఆరేడు నెలలుగా బాధపడుతున్నాను!” అని తన బాధను వివరించింది విశాలాక్షి.

“బాధపడకు తల్లీ! అంతా కొండ దేవత చూసుకుంటుంది.నీకు సంపూర్ణంగా ఆరోగ్యం ఇస్తుంది.ఇలాంటి రోగాలు, రొష్టులు దరిచేరకుండా వనమూలికలతో చేసిన లేహ్యం ఉంది.దీన్ని పుచ్చుకుంటే అన్ని రోగాలు మటుమాయం అవుతాయి” అంటూ భుజానికున్న సంచిలోంచి ఓ సీసాతీసిచ్చాడు కోయదొర.

ఆ మాటలకు తెగ సంతోషపడిపోయింది.లేచి లేడిపిల్లలా పరిగెత్తవచ్చుననుకుంది.సరేనని ఒప్పుకుంది విశాలాక్షి.

ఆ సీసాలో లేహ్యాన్ని ఆమెచేత మూడుసార్లు తినిపించాడతను.తిన్నప్పుడు బాగానే వుందనిపించింది.ఆ తర్వాత ఏం జరిగిందో తెలియలేదామెకు… కళ్ళు మూతలు పడడంతప్ప.

కాసేపటికి మెలకువవచ్చి కళ్ళు తెరిచి చూసిన ఆమెకు ఎదురుగా కోపంతో భర్త కనిపించాడు.వెనక్కి తిరిగిచూస్తే తలుపులు తెరిచి ఖాళీగావున్న బీరువా కనిపించింది.

సమాప్తం

You May Also Like

One thought on “తస్మాత్ జాగ్రత్త!

  1. బాగుందండి.. ఈ రోజుల్లో ఇలాంటివి జరుగుతున్నాయి.. సింపుల్ గా బాగుంది కథ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!