క్వారంటైన్ కష్టాలు

క్వారంటైన్ కష్టాలు

రచన: తిరుపతి కృష్ణవేణి

గత కొద్ది రోజులుగా పడుతున్న ఇబ్బందులు ఈ రోజుతో తీరబోతున్నందుకు వంశీ మనసులో చాలా సంతోషంగా వుంది. పరీక్షలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి మనసులా!
అవునుమరి! ఒకరకంగా చెప్పాలంటే పరీక్షే మరి!
తనదాకా వస్తే గాని తెలియదు అంటారు.
వంశీ విషయంలోఅనుభవ పూర్వకంగా ముమ్మాటికీ నిజం అని తెలిసింది.
ప్రతి ఇంట్లో, ముఖ్యంగా మధ్యతరగతి ఇండ్లలో మహిళలు ఇంటిపనులన్నీ
ఒక్కరే చేసి కొంటూ కుటుంబాన్ని ఓపికతో చక్కదిద్దుకుంటారు. పిల్లలు, ఖర్చులు, కుటుంబ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని, ఆడవారే ఆ పనులన్నీ కష్టపడి చేసుకుంటారు.
కుటుంబంలో ఎవరికి ఏ విధమైన ఇబ్బంది కలిగినా వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటారు.
అలాంటి ఇంటి ఇల్లాలుకే మహమ్మారి కరోనా సోకితే ఆ కుటుంబ సభ్యుల పరిస్థితి ఎలా ఉంటుందో గ్రహించాడు వంశీ.
మధ్యతరగతి కుటుంబ నేపథ్యంనుండి వచ్చిన
వంశీ ప్రభుత్వ ఉద్యోగి. భార్య, ఇద్దరు పిల్లలు. చిన్న కుటుంబం. పిల్లలు ఆన్ లైన్ చదువులతో ఇంట్లోనే ఉంటున్నారు.
ఒక రోజు కావ్య అనారోగ్యానికి గురైంది. జలుబు దగ్గుతో ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్ కు వెళ్ళారు . అక్కడ కావ్యకు కరోనా టేస్ట్ లో పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. మెడికల్ కిట్ ఇచ్చి పదునాలుగు రోజులు హోమ్ క్వరంటైన్ లో ఉండాలని, ఇతర కుటుంబ సభ్యులకు రాకుండా, మాస్కులు, శానిటైజర్జ, తగు జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రత్యేక రూంలో ఉంచాలని, జాగ్రత్తలు చెప్పారు.
ఒక్కసారి వంశీకి గుండె ఆగినంత పనైంది. మనసoతా ఆందోళనతో నిండి పోయింది. ఇప్పుడు తన పరిస్థితి ఏమిటి? అమ్మ, చెల్లి వాళ్ళుగాని, ఎవరైనా బంధువులు గాని ఇంటికి వస్తారనుకుంటే ఒక్కరూ కూడా రాలేని పరిస్థుతులు ప్రపంచాన్ని గడగడ లాడిస్తూన్న కరోనా విధ్వంసం అని పేపర్ లో, టి.వి ల్లో చూస్తున్నాము గాని, ఇప్పుడు ఇంట్లోకే వచ్చిందంటే భయం గానే ఉంది. అసలే ఇంట్లో చిన్నపిల్లలున్నారు. ఏదయినా ధైర్యంగా ఉండి,పిల్లలను కావ్యను జాగ్రత్త గా చూచు కోవాలి అని మనసులో అనుకున్నాడు. వీళ్ళతో పాటు వంట పని, ఇంటిపని తనే చూచు కోవాలి ఎలా ఎలా అని ఆలోచనలో పడ్డాడు వంశీ. కావ్య
ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు
తనకుగాని, పిల్లలకు గాని ఏ ఒక్క లోటు లేకుండా చూచు కొనేది. ఆమె ఇలా బాధపడుతుంటే చాలా కష్టంగా మరియు భయంగా కూడా ఉంది వంశీకి. ఏం చేయాలో అర్ధం కావటం లేదు.
టీ, టిఫిన్, భోజనం, మంచి నీళ్ళ దగ్గరనుండి అన్నీ అమర్చి చేతికి అందిస్తుంటే, ఆహా!:ఎంత బాగా వండావో? ఎంత రుచిగా ఉందో? అని హాయిగా తినటం తప్ప అది తయారు చేయటానికి తన కష్టం ఎంత ఉంటుందో,? ఎప్పుడూ గుర్తించలేదు ? ఇకనుండి పదునాలుగు రోజులు ఈ పనులన్నీ చేయాలంటే ఊహించటానికే భయంగా ఉంది.ఇంటిపని, వంటపని లో ఏ మాత్రం అవగాహనలేని వంశీకి ఎలా చేయ గలనో అని భయం మొదలైంది.
అసలు ఈ కరోనా ఎన్ని నిబంధనలు పెట్టింది? హోటల్ భోజనం గాని, టిఫిన్ గాని తినకూడదు. బయటివారు మనయింటికి రాకూడదు, మనం ఇతరుల ఇంటికి వెళ్ళకూడదు. శుచిగా శుభ్రంగా ఉండాలి. శానిటేజర్ దగ్గరే ఉంచుకోవాలి ఇన్ని జాగ్రత్తలు పాటించినా మనకుకూడా వస్తుందేమో అనే భయం మనలను వెంటాడుతునే ఉంది. అయినా వచ్చేసింది. ఎన్నికష్టాలు వచ్చాయిరా, బాబు.?
పిల్లల ఆరోగ్యం చాలా జాగ్రత్తగాచూచుకోవాలి.
మొదటి రోజు అన్నీ పనులు చేసి కావ్యకు, పిల్లలకు ఎలాగో భోజనం పెట్టగలిగాను. . మరుసటి రోజు తెల్లవారి గాని తెలియలేదు, అసలు విషయం? ఇల్లు, వాకిలీ శుభ్రంగా ఊడ్చటం, మురికి బట్టలు వాషింగ్ మిషన్ లో వేయటం . తర్వాత అంట్లు తోమటం. వంట పూర్తి చేయటం, భోజనాలు వడ్డించటం.సాయంత్రం అంట్లు తోమటం.!
అసలు కష్టం అంట్లు తోమటం దగ్గర మొదలైంది. చేతులకు రెండింటికి మంటలు మొదలైనవి..
.అంట్ల పని తర్వాత ఆరవేసిన బట్టలన్నీ తీసి మడతలు పెట్టి సర్దాలి. ఇల్లంతా శుభ్రంగా ఉంచాలి కాబట్టి రోజు ఉదయం పూట క్లాత్ వేసితుడువాలి.
అబ్బబ్బ ఇన్ని పనులు ఉంటాయని ఇప్పుడే అర్ధం అయ్యింది. పాపం ఆడవాళ్లు ఇన్ని పనులు ఎలా చేస్తున్నారో అర్ధం కావటం లేదు
ఆడవాళ్లు ఎంత కష్టమైన పని ఐనా తన కుటుంబం కోసం ఇష్టంతో చేస్తారు. ఇంటికి ఎవరైనాబంధువులు .వచ్చినప్పుడు వారికి సమయానికి భోజనం పెట్టగలుగుతామా లేదా అని ఆందోళన పడతారు.వారి కష్టాన్ని ఎవరూ గుర్తించరు.
నెమ్మదిగా వారం రోజులు గడిచాయి. ఇంటి పని రోజు రోజుకూ పెరుగుతుందే కానిఏ మాత్రం తగ్గటం లేదు.
నాకు మాత్రం చుక్కలు కనపడుతున్నాయి. క్వరంటైన్ సమయం ఎప్పుడు పూర్తి అవుతుందో? అని రోజులు లెక్కవేసుకుంటున్నాను. గతంలో అయితే కుటుంబంలో ఎవరికయినా కష్టం వస్తే అమ్మ,గాని నాన్నగాని వచ్చి ధైర్యం చెప్పి నాలుగు రోజులు ఆసరాగా ఉండి వెళ్ళేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులే కరువైనాయి.
ఈ నాలుగు రోజుల పనికే నాకు ఇంత కష్టంఅనిపిస్తుంది.
జీవితకాలంచేసే ఆడవారికి ఇంకెంత కష్టం ఉంటుందో నాకుఅర్ధంఅవుతుంది.ఒక్కసారి ఆలోచనలనుండి బయటకు వచ్చాడు వంశీ.
పదునాలుగు రోజుల క్వరంటైన్ అనంతరం ఈ రోజు ఉదయమే హాస్పిటల్ కు వెళ్ళారు వంశీ దంపతులు . టెస్టింగ్ లో కావ్యకు నెగటివ్ రిపోర్ట్ వచ్చింది. సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చారు.
వంశీ ఇకనుండి కావ్యకు ఇంటిపనుల్లో వంటపనుల్లో సహాయంగా ఉండాలని మనసులోనే గట్టిగా నిర్ణయించు కున్నాడు.
ఆమ్మో!ఆడవారు ఒక్కరోజు పని చేయలేక పోయినా ఇల్లంతా గోవిందే మరి !!

(సమాప్తం.)

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!