అబద్ధం…ఆడరాదు

అబద్ధం…ఆడరాదు

రచన: లోడె రాములు

“మోక్షా…హోమ్ వర్క్ ఏమేమి ఉన్నాయో,చూపించు టెస్ట్ బుక్స్ తియ్..”
“ఓకే.. అమ్మా..!”అని చూస్తున్న టీవీ ని స్విచ్ ఆఫ్ చేసి బుద్దిగా అమ్మ ముందు కూర్చొని ,స్కూల్ బ్యాగ్ నుండి టెస్ట్ బుక్స్ తీసింది..
తల్లి బుక్స్ అన్నీ చెక్ చేస్తుంటుంది. ప్రతి రోజూ బుక్ ,కంపాక్స్, పెన్సిల్,
బెల్ట్ ఇలా ఎదో ఒకటి స్కూల్లో మరచిరావడం..తెల్లారి దొరికితే పర్వాలేదు..కానీ చాలా సార్లు దొరకకుండా పోవడం..మళ్లీ కొనడం అంటే చికాకు వేస్తుంది తల్లి వర్ధినికి..
పాప కేమో ఇంకా పసితనం కదా..
టెస్ట్ బుక్స్ అన్నీ ఉన్నాయి..కానీ ఇంగ్లీష్ టెస్ట్ బుక్ లేదు..తల్లి చూసి ఆడిగేదాకా తనకు గుర్తే లేదు..
“ఎక్కడేశావ్..ఇంగ్లీష్ టెస్ట్ బుక్'”అని కాస్త కోపంగా అడిగే సరికి …”అమ్మా..ఇంగ్లీష్ మేడం తీసుకుంది”అని టక్కున చెప్పింది..
“మళ్లీ ఇవ్వలేదా..మీ మేడం..?”
“లే…..ఇయ్యలే….!”
“సరే..ఉండు.. మీ మేడం కు ఫోన్ చేస్తా..”అని ఫోన్ చేసింది..
” హాల్లో…మేడం.. నేను మీ 3rd క్లాస్ స్టూడెంట్ మోక్ష వాళ్ల మమ్మిని.. మీరు పాప దగ్గర ఇంగ్లీష్ టెస్ట్ బుక్ తీసుకున్నారట..క్లాస్ అయిన తర్వాత తిరిగి పాపకు ఇవ్వాలి కదా..'”
“అయ్యో..లేదు మేడం..నేను మోక్ష దగ్గర టెస్ట్ బుక్ తీసుకోలేదు”
“ఏంటి..మేడం..పాప ఇంత స్పష్టంగా మీరు తీసుకున్నారని చెబుతుంటే ..లేదు అంటారు.. బాగా గుర్తుకు తెచ్చుకోండి..రేపు స్కూల్ కు వచ్చినప్పుడు ఇవ్వండి'”
“లేదండి..రేపు మీరు పాపను స్కూల్లో వదిలినప్పుడు నన్ను కలవండి..స్కూల్లోనే ఎక్కడైనా పారేసుకుందేమో చుద్దాం..'”
“సరే..వస్తాను.కానీ మీరే సరిగా చూడండి”అని కాస్త విసురుగా ,
అసహనంగా అంది..
అప్పటికి రిలాక్స్ అయ్యింది మోక్షా.
అమ్మ చదువుతూనే ఉంది..”రోజూ నీతో పరేషాన్ ఉంది..ఎదో ఒకటి ఎక్కడ పారేస్తున్నావో,మరచి పోతున్నావో,అర్థం కావడం లేదు..
మళ్లి మళ్లి కొనాలంటే,
డబ్బులేమన్న చెట్లకు కాస్తున్నాయనుకుంటున్నారా..ఈ సారి నీకు దెబ్బలు పడితేనే వింటవ్ బిడ్డా”అంటుంటే మోక్షా కిమ్మన కుండా ఉంది…
వర్ధిని విష్ణుమూర్తి ల గారాల కూతుళ్లు అక్షయ,మోక్ష..పెద్దపాప ఫిఫ్త్ క్లాస్ అక్షయ సిన్సియర్ ,తనవి అన్నీ వయసుకు మించి పరిణతి చెందిన మనసు ప్రతి విషయాన్ని అమ్మలా బాధ్యతగా ఆలోచిస్తుంది.
క్లాస్ ఫస్ట్,తాను చిన్నప్పుడు బొద్దుగా ఉండేది..పెద్దవుతుంటే సరిగా తినకుండా ,చదువు మీదే శ్రద్ధ..ఎప్పుడూ ఏదో ఒక డౌట్ ను అడిగి క్లియర్ చేసుకుంటుంది..
చిన్న పాప మోక్షా,అక్షయకు తనకు చాలా తేడా..మొగరాయుడిలా నడక..మాట..కొట్లాట..లాపర్వా.. బెదిరించుకోవడం..చదవమని వెంటపడాలి..డ్రాయింగ్ మాత్రం చక్కగా ఏవేవో ఊహించి వేస్తుంది..
మారుసటి రోజు పిల్లలిద్దర్నీ స్కూల్ లో వదిలి ,స్కూల్ హీడ్మాస్టర్ గారిని కల్సి మోక్షా ఇంగ్లీష్ టెస్ట్ బుక్ విషయం తెలియజేసింది…
హెచ్ .యం.గారు ఇంగ్లిష్ టీచర్ గారిని పిలిచి ,వాకబు చేయగా.. “లేదు మేడం..నేను మోక్షా దగ్గర నుండి టెస్ట్ బుక్ తీసుకోలేదు..తానే ఎక్కడో పడేసుకొని ఉంటుంది”
“సరే–ఆయా..! 3rd క్లాసులో మోక్షను తీసుకుని రా”..హెచ్.యం గారిది గంభీరమైన స్వరం,మనిషి కూడా ఎత్తు లావుగా,కళ్లు పెద్దవిగా ఉంటాయి..
“మోక్షా… నీ ఇంగ్లీష్ టెస్ట్ బుక్ మీ మేడం తీసుకుందా..?”అని హెచ్.యం.గారు ఆడిగేసరికి “తీసుకోలేదు..మేడం”అని అనేసరికి బిత్తరపోవడం వర్ధిని వంతయ్యింది..
“నిన్న…. మేడం..తీసుకుంది అన్నావు కదా..మోక్షా..”
చడిచప్పుడు లేదు…ఇక అక్కడ అనవసరంగా పాపను ఇబ్బంది పెట్టొద్దని..””మేడం..ఐ యాం సారీ..
రాత్రి పాప ..నాతో మీరే తీసుకున్నారని చెప్పింది.
అందుకే మీకు ఫోన్ చేసి అడిగాను.
ఏమీ అనుకోకండి..సారి.. సారీ… మేడం”అని పదే పదే అనే సరికి “ఓకే.. మేడం..పాప కదా,భయంతో
అలా చెప్పి ఉంటుంది.కానీ అబద్ధం
ఆడటం మాన్పించాలి..సరే మేడం..ఈ రోజు సాయంత్రం వరకు స్కూల్లో ఉండనివ్వండి.కాస్త పనిష్మెంట్ గా ఉంటుంది”
“ఓకే. ..మేడం”అని చెప్పి..ఇంటికి వచ్చేసింది..ఇంటికి వచ్చినా మోక్షా అలా..ఎందుకు అబద్ధం చెప్పింది..ఇదివరకు ఎప్పుడూ ఇలా అబద్ధం ఆడలేదు..రోజూ ఏదో
వస్తువు మరిచి వస్తుందంటే..చిన్నతనం ఆకతాయి తనం కదా.. అని అనుకున్నాను..తనపై తన క్లాస్మెంట్స్ ప్రభావం ఏమైనా పడుతుందా..పరి పరి విధాల మనసులో ఆలోచనలు..తన పిల్లల్ని చక్కగా తీర్చిదిద్దాలని,భవిష్యత్ లో వాళ్లు ఒక మంచి స్థితిలో ఉండాలని.. నేనే
చిన్నప్పుడు మా అమ్మానాన్నల గారభం..వల్ల సరిగా చదవలేదు..
కనీసం నా పిల్లలను చిన్నప్పటినుండి ఎప్పటికప్పుడు మంచి బుద్ధులు నేర్పుతూ..ఉంటే మంచిది అని వారి పట్ల ఇంత శ్రద్ధ తీసుకొంటుంటే…ఇలా ఏమిటి..ఎంత మరుద్దామన్నా ..అదే ఆలోచనలతోనే సాయంత్రం అయ్యింది.. పెద్ద పాప అక్షయ వచ్చేసింది..
“మమ్మీ.. చెల్లె ను టీచర్ తీసుకొని వస్తానని చెప్పింది..”అక్షయ ..తాను ఫ్రెష్ అయ్యింది..స్నాక్స్ తిని కొద్ది సేపు ఆడి, హోమ్ వర్క్ చేసుకుంటుంది..సాయంత్రం ఏడు గంటలకు మోక్షను తీసుకొని వచ్చింది టీచర్..ఇప్పటి వరకు స్కూల్ లోనే టెన్త్ క్లాస్ పిల్లలకు స్పెషల్ క్లాస్సెస్ చెబుతారు..
“రండి..టీచర్..మీరు శ్రమ తీసుకున్నారు..ఫోన్ చేస్తే మా వారిని పంపిద్దాం అనుకున్నాను”
“నేనూ ఇదే రూట్లో వెళతాను కదా..లేట్ అయ్యింది.. మీకు పాపను అప్పజెప్పినట్లు ఉంటుంది..తన టెస్ట్ బుక్ దొరికింది..తన క్లాస్ పిల్లల బ్యాగ్ లన్నీ చెక్ చేశాను..ఓ బాబు బ్యాగ్ లో దొరికింది..బాబు కూడా కావాలని తీసుకోలేదు…ఇద్దరి బుక్స్ ఒక్కదగ్గరే ఉండేసరికి ,ఆ బాబు చూసుకోకుండా తన బ్యాగులో పెట్టుకున్నాడట…”
“అయ్యో..మిమ్మల్ని నేను కోప్పడ్డాను..ఏమీ అనుకోకండి..సారీ”
“అదేం లేదండీ.. నేను కూడా మీ స్థానంలో ఉంటే అలాగే తొందర పడే దాన్నేమో..ఓకే.. వస్తానండి..లేట్ అయ్యింది…”
రాత్రి షాప్ నుండి ఇంటికి వచ్చిన భర్త విష్ణు తో …”నీ ముద్దుల కూతురి ఘనకార్యం.. ఈ రోజు ఇది””అని చెప్పింది..
“ఏం రా…మోక్షా..అబద్ధం చెప్పినావా…మీ మేడం కే గురి పెట్టినవా.. తప్పు కదా…ఇంకెప్పుడు అబద్ధం చెప్పొద్దు.. బిడ్డా..బ్యాడ్ హ్యాబిట్ అది…ఓకే నా””అని దగ్గరకు తీసుకొని గుండెలకు హత్తుకున్నాడు..”.ఓకే పప్పా..”
ఈ సంఘటన అప్పుడప్పుడు గుర్తుకొచ్చినప్పుడల్లా నవ్వు వస్తుంది…

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!