లేఖ

లేఖ

రచన :: యం . సుశీల రమేష్

*లేఖ*

‌ మై డియర్ వసు

నేను బయల్దేరుతున్న వేళ నీ కళ్ళలో బాధను చూడలేక ఎక్కడ నేను బలహీనపడతానని, నీతో అంటి ముట్టనట్టు గా వచ్చేసాను, నన్ను క్షమిస్తావు కదూ.

నాకు ప్రేమ లేఖ రాయడం రాదు. ఎందుకంటే చిన్ననాటి నుండి కూడా ఒకటే లక్ష్యంతో చదువు కొనసాగించాను.

” ఒక సైనికుడిగా నాకు బలహీనతలు ఉండకూడదు”

కానీ నేను కూడా మనిషినే నాకు హృదయం ఉంది. నా రాకకై నీవు ఎంతగా ఎదురు చూస్తావో , అంతకు పదిరెట్లు నేను ఎదురు చూస్తాను ఇంటికి రావడానికి.

నా గురించి చెప్పాలంటే పెళ్లికి ముందు తర్వాత చెప్పాల్సి ఉంటుంది. పెళ్లయిన తర్వాత లోకం
కొత్తగా అనిపించింది. పెళ్లికి ముందు నా డ్యూటీ, నా తల్లిదండ్రులు ఇదే నా ప్రపంచం. కానీ నువ్వు నా జీవితం లోకి వచ్చాక ఎంతో మార్పు వచ్చింది.

నేను ఎవరితోనూ పెద్దగా మాట్లాడను. కానీ నీ ముద్దు ముద్దు మాటలు వింటే, రాయి కూడా కరిగిపోతుంది. నీ స్వరం ఎంత బాగుంటుందో తెలుసా పాటలు పాడుతుంటే ఎంతసేపైనా అలాగే వినాలి అనిపిస్తుంది నాకు, నీకు తెలియకుండా నువ్వు పాడే పాటలు అన్నీ నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను.

ముఖ్యంగా నీ అల్లరి అంటే నాకు ఎంతో ఇష్టం. మరీ ముఖ్యంగా కలువ రేకుల్లాంటి నీ నయనాలు అంటే ఎంతో ఇష్టం. నిన్ను పొందిగ్గా
చెక్కాడేమో బ్రహ్మ అనిపిస్తుంది నాకు.

నీ సహనం, ఓర్పు సమయస్ఫూర్తి నా కుటుంబం పట్ల నీ బాధ్యత, నువ్వు పంచే ప్రేమానురాగాలు చాలు ఈ జన్మకు నాకు ఇంకేం అవసరం లేదు. నీ మాటలు అంత
ముద్దుగా వంట అద్భుతంగా చేస్తావని నేను అసలు ఊహించలేదు.

వసు నువ్వెప్పుడు అంటావు కదా ఏంటండీ మీరు సరిగా తినడం లేదు నా వంట నచ్చలేదా అని, బ్లాంకెట్ కప్పుకున్న కూడా మీ కాళ్ళు అంత చల్లగా ఎందుకు ఉంటాయి అని అడుగుతావు కదా, దానికి కారణం చెప్తాను కానీ నువ్వు బాధ పడకూడదు.

నా విధి నిర్వహణ ప్రాంతం
సియాచిన్.

ఇది హిమనీనదం ప్రపంచంలో కెల్లా
ఎత్తయిన యుద్ధక్షేత్రం. ఇది కారకోరం పర్వత శ్రేణుల్లో ఉంది.
అతిశీతలమైన బీడు భూమి.
పగలు మైనస్ 25 డిగ్రీలు, రాత్రి -55 డిగ్రీలు. అతి శీతలంగా ఉంటుంది.

అక్కడ మాకు వినిపించే నినాదం, శత్రువు, రైఫిల్స్, తుపాకులు కలిగిన సంస్థ కాదు, ప్రకృతి మంచు పర్వతాలు, ఒంటరితనం, ఒంటరి మనసు, సొంత శరీరం.

కమ్యూనికేషన్ ఉండదు.
హీటర్ పై ఆహారాన్ని వండుకోవాలి. త్రాగు నీటి కోసం అక్కడున్న మంచును కరిగించి త్రాగు తాము.

తదుపరి రేషన్ సరఫరా వచ్చేంతవరకు మా దగ్గర ఉన్న ఆహార పదార్థాలను జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే వాతావరణం అనుకూలించక పోతే
మాకు ఆహార సరఫరా ఉండదు. ఉన్న వాటితోనే సర్దుకోవాలి హెలికాప్టర్ దిగ గల ప్రదేశం లేదు.

ఒక వాష్ కోసం ఒక బకెట్ నీళ్లు వేడి చేయడానికి మూడు గంటల సమయం పడుతుంది. తాత్కాలిక పడకల మీద నిద్రించాలి. ఇంతకుముందు వరకు వంటగదిలోకి వెళ్ళని వారు సైతం ఉత్సాహంగా వంట చేయడం నేర్చుకుంటారు ఇక్కడ ఉన్న సైనికులంతా.

అక్కడ శారీరక ఆకలి ఉండదు. పండగలప్పుడు రక రకాల స్వీట్స్ తింటారు కదా, మరి మేము తినే స్వీట్స్ ఏంటో తెలుసా, చాక్లెట్ పాలపొడి.

కాని ఒంటరితనం అక్కడ బాగా వేధిస్తుంది. అప్పుడు నీ ఫోటో చూస్తూ నీ కళ్ళలో కళ్ళు పెట్టి చూస్తే నా ఎదురుగా ఉన్నావు అనే భావన కలుగుతుంది.

అక్కడ అధికారి జవాను అన్న తారతమ్యం ఉండదు. అంతా కలిసిమెలిసి ఉంటారు. సెలవు పొందిన తర్వాత ఇంటికి వచ్చే సమయంలో చాలా గందరగోళంగా ఉంటుంది.

కారణం ఒకేసారి జనావాసాలు చూసేసరికి ఆందోళనగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఉండే చోట ఒంటరిగా ఉంటాం కదా అందుకన్నమాట. కరిగించిన మంచును తాగే మేము ఇక్కడ ఉన్న వాటర్ తాగుతుంటే చాలా ఫన్నీగా ఉంటుంది.

తొందరగా బయట ఇమడలేక ఇబ్బందిగా ఉంటుంది అలాంటి సమయంలో నీలాలన నాకెంతో ఊరటనిస్తుంది. కన్నబిడ్డను లాలించే విధంగా నన్ను నీవు ప్రేమించే తీరుకి సహనానికి నేను ఏమి ఇచ్చినా తక్కువే అవుతుంది.

నీ గుండెలో బాధని నాకు చెప్పకూడదు అనుకుంటావు కానీ నన్ను హత్తుకున్నవేళ నీవు పొందే స్వాంతన నా మదిని దాటిపోలేదు.

ఇదంతా నీ ఎదురుగానే చెప్పొచ్చు కానీ నీ కంట తడి ని నేను చూడలేను. అందుకే రైల్లో ప్రయాణిస్తూనే వాట్సాప్ లో టైప్ చేస్తున్నాను ఈ లేఖ.

ప్రేమించడం , భార్యా భర్తల బంధం అంటే టైం పాస్ కోసం కాదు ఒకరికి ఒకరు అని నీవు రుజువు చేశావు నా భార్య స్థానంలో ఉండి.

జన్మ జన్మలకు నీవే నా ప్రేయసివి.
ఇప్పటివరకు నా తల్లిదండ్రుల పై బెంగ ఉండేది‌. కానీ నీ ఆప్యాయత ఆత్మీయత చూశాక నేను ఏ బెంగా లేకుండా నిశ్చింతగా వెళుతున్నాను
నేను చాలా లక్కీ పర్సన్. ఎందుకంటే అటు దేశ సేవలో, ఇటు అమ్మానాన్నల సేవ నాలో సగం గా నువ్వు చేస్తున్నందుకు.

వసు భౌతికంగా మనం దూరంగా ఉన్నా మన మనసులు ఎప్పుడూ కలిసే ఉంటాయి. మన ఆలోచనా విధానం ఒకటే. ఈ లేఖను చదివి పొరపాటున కూడా ఏడవకూడదు

ఇట్లు

ప్రేమతో ప్రేమ లేఖ రాయడం రాని
నీ గుండెలో చోటు ఇచ్చిన నీ ప్రియమైన భర్త, పేరులోనే తప్ప నీకు ఎలాంటి ఆనందాలు పంచలేని నీ శ్రీవారు.

ఆనంద్ 🌹.

 సమాప్తం.

You May Also Like

One thought on “లేఖ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!