దుష్ట చతుష్టయం

దుష్ట చతుష్టయం

రచన: ధరణీప్రగడ వేంకటేశ్వర్లు

భారత యుద్ధం పూర్తయ్యింది. కౌరవ వంశం పూర్తిగా నాశనం అయ్యింది. ఇక హాయిగా సుఖసంతోషాలతో వుండవచ్చుననుకుని, ప్రజలు ఉపిరి పీల్చుకుంటున్నారు.

కలియుగం మొదటి పాదం ప్రవేశించింది. గాలిలో తిరుగుతున్న వంద కౌరవ ఆత్మలు ఒక చోట సమావేశమయ్యాయి. భరత ఖండంలో ఆడ,మగ నిర్భయంగా తిరగడం, ప్రశాంతంగా వుండటం భరించ లేకపోతున్నాయి ఆ ఆత్మలు.
ముందుగా దుర్యోధనుని ఆత్మ తన అభిప్రాయాన్ని మొదలు పెట్టింది.
‘చాల కాలానికి మనం అందరం యిక్కడ కలుసుకోవడం చాలా ఆనందంగా వుంది. పూర్వ జన్మలో మనమంతా ఏక తాటిపై నడచి, పాండవాది సన్మార్గులను భయబ్రాంతులను చేసి, అలనాటి సంఘంలో యెన్నో అలజడులను సృష్టించాము. ప్రస్తుత సమాజంలో ప్రజలు యెంతో హాయిగా వున్నారు. భరించే శక్తి నాకు లేదు. మనమంతా మన మందీమార్భలంతో భరత ఖండంలో పుట్టాలి. పూర్వ జన్మలో పరిస్థితుల వలన ద్రౌపదిని పూర్తిగా లొంగదీసుకోలేక పోయాము. పైగా ఆ సమయంలో మన అన్నదమ్ములలో నేనూ, దుశ్శాసనుడు మాత్రమే ముఖ్య భూమికలు పోషించాము. మళ్ళీ మనమంతా తిరిగి భరత ఖండంలో జన్మించాలి. మనం వయస్సుతో సంబంధం లేకుండా వివాహిత, అవివాహిత, చిన్నపిల్లలు (మైనర్) అనే తారతమ్యం లేకుండా ఆడవారిని హింసించడం విషయంలో భాగస్వాములమవుదాము. పైగా ద్వాపర యుగంలోలా స్త్రీ రక్షణలో సమయానికి వచ్చే శ్రీకృష్ణులు యెవ్వరూ ప్రస్తుతం లేరు. సంఘటన తెలిసిన తర్వాత కథలు తెలుసుకోవడానికి వచ్చే రక్షక భట వర్గము, సంఘటనను అనుకూలంగా మలచుకునే రాజకీయ,అధికార వర్గాలు, మాధ్యమాలు మాత్రమే వున్నాయి. వీళ్ళ బలహీనతలను వుపయోగించుకొని మన అసాంఘిక కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగించ వచ్చు. న్యాయం మన వైపునే వుందనేలా చట్టంలో లొసుగులను ఆసరా తీసుకుని న్యాయస్థానాలలో సాక్ష్యాలను తారుమారు చేయవచ్చు. మనకు సహకరించే న్యాయవాదులు, అనైతిక రాజకీయ, ప్రభుత్వ అధికార యంత్రాంగం మనవెంటే వున్నారు. అందుచేత ధైర్యంగా మళ్ళీ భూలోకంలో పుట్టి మన విధులను నిర్వర్తిద్దాం` అని కొంత ఊపిరి పీల్చుకుని తన ఉపన్యాసాన్ని కొనసాగించాడు .
పెద్ద వాళ్ళమైన నేనూ, దుశ్శాసనుడు, దుస్సహరుడు, దుస్సలుడు నలుగురము రాజధానైన హస్తినలో జన్మిస్తాము. మిగిలినవారు మీ సమూహాలను నిర్ణయించుకుని, మీ యిష్టమైన ప్రదేశాలలో మీమీ కార్యక్రమాలను నిర్వహించండి’ , అని వుత్తర్వులు జారీ చేసాడు యింకా తను రారాజునే అనుకుంటూ.
ఈలోపుల నాలుగవవాడైన దుస్సలుడు ‘అన్నయ్యా చిన్న అభ్యర్ధన నేను మీకు చిన్నవాడుగానే పుడతాను కానీ మీ అందరికి సలహాలు, సూచనలు యిస్తూ, నాయకత్వం వహించే అవకాశం దయవుంచి నాకు యీయండి’
‘నీవు మానసిక పరిపక్వత చెందిన చిన్నవానిగా పుడితే, నీకు అదో అదనపు అర్హత. ఒక వేళ చట్టానికి దొరికినా న్యాయపరిధిలో తక్కువ శిక్షతో రక్షించబడతావు. చరిత్రహీన రాజకీయ,న్యాయవాదుల అండ ఎలానూ వుంది. కనుక అంత పరిస్థితి నీకు రాదు’ అని వాగ్ధానం చేసాడు. అనుకున్న ప్రకారం అనుకున్న విధి నిర్వహణకు మొదటి నలుగురు హస్తినలో జన్మించారు.
….
అదో మహానగరం. భారతదేశపు రాజధాని ధిల్లీలో మధ్యతరగతి వుద్యోగి అర్జున్. డిగ్రీ పూర్తవగానే ఒక ప్రైవేట్ సంస్థలో సూపర్వైజర్ గా ఈమధ్యనే జాయినయ్యాడు. కాలేజిలో సహా విద్యార్థిని చిత్రను ప్రేమించాడు.
అర్జున్ మంచితనము, కుటుంబ వివరాలు తెలుసుకున్న చిత్ర తల్లిదండ్రులు వారి వివాహానికి అంగీకరించడం జరిగింది. మంచి ముహూర్తం చూసి, వారి వివాహం చేయవలసివుంది. అంతవరకూ వారిద్దరూ మంచి స్నేహితులుగానే తిరుగుతున్నారు.
….
కౌరవుల రెండో సమూహం దుర్ముఖుడు, వివింశాంతి, సత్వుడు, శలుడు నలుగురూ తెలుగు రాష్ట్రంలో మారుమూల ప్రాంతంలో జన్మించారు. వీరు చట్టానికి దొరకకుండా, సాక్ష్యాధారాలు లేకుండా ‘చెడు’ కార్యక్రమాలను సభ్యసమాజం తల వంచుకునేలా యదేశ్చగా చేస్తున్నారు. ఒకవేళ సాక్ష్యాలు వున్నా, వీరే వాటిని చంపేస్తారు. లేదా ఆ సాక్ష్యాలే ఆత్మహత్య చేసుకుంటాయి. వీళ్ళలో వీరికి మంచి అవగాహన కూడా వుంది.
….
అర్జున్, చిత్ర యిద్దరూ శలవు రోజు మధ్యాహ్నం సినిమా చూసి, అలా రెస్టారెంటుకు, గుడికి వెళ్లి యింటికి తిరిగి ప్రయాణం అయ్యారు. చీకటి పడింది.
నేతాజీ నగర్ లో వున్న వాళ్ళ నివాసాలు సిటీకి కొంచెం దూరంలో వున్నాయి. సిటి బస్సులోనే వెళదాము అనుకున్నారు. ఈలోపుల నేతాజీనగర్ మీదుగా వెళ్ళే ఒక ప్రైవేటు ఏ.సి. బస్సులోవున్న క్లీనర్ పేరు దుస్సలుడు ప్రతీ బస్సు స్టాప్ లోనూ వారి బస్సు వెళ్ళుతున్న రూట్స్ చెబుతూ ఎవ్వరైనా ఎక్కుతారేమోనని అడుగుతున్నారు. ప్రైవేటు బస్సులో వాళ్ళది ఇదో అనధికార సంపాదన, ఆ రూటు నేతాజీనగర్ వైపునుండే పోతుంది కాబట్టి అర్జున, చిత్ర ఆ బస్సు ఎక్కేసారు. ఆ బస్సులో ఇతర ప్రయాణికులు యెవరూ లేరు. అనుకోకుండానే నరక కూపంలో ప్రవేశించారు. అప్పటికే డ్రైవర్ దుర్యోధనునితోనూ, కండక్టర్ దుశ్శాసనునితోనూ, స్నేహితుడు దుస్సహరునితోనూ మానసిక పరిపక్వత చెందిన మైనర్ క్లీనర్ దుస్సలుడు చేయబోయే పనులకు స్కెచ్ వేసి డైరెక్ట్ చేయడం కూడా జరిగిపోయింది.
వాళ్ళ దుశ్చర్య గ్రహించి, ఎదిరించబోయిన అర్జునుని చితగ్గొట్టి స్పృహ కోల్పోయేలా చేసి, ఒక మూల పడేసారు. దుర్మార్గులు చేస్తున్న ఆ ‘తతంగం’ తెరలమాటు కిటికీల్లోంచి కనిపించే అవకాశం లేదు. ఆ తరువాత దుర్మార్గులు ఒకరితరువాత ఒకరు చిత్రను బలాత్కారం చేసి, పెద్దగా జన సంచారం లేని నడి రోడ్డున పూర్తిగా నగ్నంగా చిత్రను మరియు స్పృహ లేని అర్జునుని నడుస్తున్న బస్సులోనుంచి తోసేసి, ఆనందంగా, వేగంగా వెళ్లిపోయారు. వాళ్ళు చేసే దారుణాన్ని గమనించినిస్తే , రాక్షసులు కూడా అసహ్యంగా తల వంచుకుంటారు.
నడి రోడ్డుపై పడివున్న వారిని, కొంతమంది జాలి పడినప్పటికీ, పరిస్థితులకు భయపడి యేమీ గమనించనట్లుగా వెళ్ళిపోయారు. ఎవ్వరో ఆకాశ రామన్న ఫోన్ చేసిన సమాచారంతో పోలీసులు వచ్చి, ఆ యిద్దరిని అంబులెన్స్ సహాయంతో ఆసుపత్రికి తీసుకుని వెళ్ళారు. కాని యేమి లాభం. దుర్మార్గులను కఠినంగా శిక్షించాలని అరుస్తూ చిత్ర, సాక్ష్యం స్పష్టంగా చెప్పలేక అర్జున్ దూరతీరాలకు వెళ్ళిపోయారు. దుర్మార్గులు నలుగురు దొరికారు.
….
ప్రజలలో చైతన్యం వచ్చింది. ఆ నలుగురికి ఉరిశిక్ష వేయాలని ఉప్పెనగా ఉరిమారు. గర్జించారు. మొత్తం దేశ పరిపాలన కదలి వచ్చింది. అందరిదీ ఒకే మాట శిక్షించే విషయంలోనే. ‘కసి’ గా త్రీవ్రస్థాయిలో స్పందించారు, చర్చలు చేసారు.
‘ఆ నలుగురికి ఉరిశిక్షతో చంపడం వాళ్లకు సరిపోతుందా? ఉరిశిక్ష కూడా ఒక శిక్షేనా. ఉరిశిక్షలో చనిపోవడమే వుంటుంది కానీ బాధ వుండదు. శిక్ష అనేది బాధించేదిగా వుండాలి’ ఒకరి వాదన.
‘భయంకరంగా, అసహ్యంగా స్త్రీని బలాత్కారం చేసినట్లయితే, ఆ నిందితుడ్ని ‘బాబోయ్ నన్ను చంపేయండి’ అని అరిచే విధంగా కఠినంగా శిక్షించాలి’ ఒకరి ఆవేదన.
‘నిందితుడికి అంగ విచ్చేధన చేసి, కారం చల్లి, రోడ్డు మీద అందరూ చూస్తూండగా వదిలేయాలి. అతని భయంకరమైన అరుపులు విని, ఇంకొకరికి అటువంటి ఆలోచన రాకుండా వుండేవిధంగా శిక్ష వుండాలి’ ఒకరి కౌంటర్.
‘క్లీనర్ దుస్సలుడు మైనర్ కదా. వీడు రెండు, మూడు సంవత్సరాల క్రితమే యిటువంటి పని చేసాడట. తగిన ఆధారాలు లేనందున వదిలేసారట. యిప్పుడు మళ్ళీ ఈ పని చేసాడు. సంఘటన సమయానికి మైనర్ అయినప్పటికీ ప్రస్తుతం మేజర్ అయిపోయాడు. వీడు అప్పటికే మానసికంగా పరిపక్వత పొంది, శారీరకంగా యెదిగి వున్నప్పుడు వీడు బాలుడు యెలా అవుతాడండీ. తెలివితేటలు, వయసును బట్టి కాదండి, జీన్స్ బట్టి వుంటాయి కదండీ’ ఇంకొకరి సందేహం.
తెలివిగా హత్యలు, అఘాయిత్యాలు మైనర్స్ చేసినా అవతలవారు అనుభవించే బాధ ఒకటే కాని శిక్షలు వచ్చేసరికి పరిపక్వత చెందిన మైనర్స్ విషయంలో కనికరం ఎందుకు చూపుతున్నారో అర్థం కావడం లేదు. వయస్సుకు మాత్రమే వారు మైనర్స్. ఈ సంఘటన జరిగిన తేదికి వారి వయస్సు ఒక రోజు తగ్గినా మైనర్ కదా. ఒక రోజులో మేజర్ అయిపోయి అంతకు ముందు లేని మానసిక ఎదుగుదల వచ్చేస్తుందా అని వయస్సు మీరిన ఒక అమాయకుని ప్రశ్న.
అవునండి,జగద్గురు శంకరాచార్యులు వారు మైనర్ గానే అనగా 13వ సంవత్సరంలోనే సన్యాసం తీసుకుని అర్థవంతమైన బోధనలతో, దిగజారిపోతున్న సనాతన ధర్మాన్ని చైతన్యపరచి, హిందూ ధర్మంలోని ఆధ్యాత్మిక ఔనత్యాన్ని పెంచారు. మైనర్ అని, మానసిక ఎదుగుదల లేదని వారి బోధనలను పక్కన పెట్టలేదు కదా . మంచిచెడులకు వయసుతో పనిలేదు. మానసిక ఎదుగుదలనే పరిగణనలోకి తీసుకోవాలి. అందుకనే యిటువంటి విషయాలలో మైనర్ అయినా శిక్షార్హుడే .. ఇంకో భక్తుని సపోర్టు.
ప్రజల వుద్వేగం నుండి యిదివరకే ‘నిర్భయ’ చట్టం దుర్మర్గులపాలిట ఆదిశక్తిగా వుద్భవించింది. ఈ చట్టం దుర్మార్గుల పాలిట పాశుపతాస్త్రంగా మారాలి కాని, అభయాస్త్రం కాకూడదు. రాజకీయ, ప్రభుత్వ అధికార జోక్యం వుండకూడదని, ఈ కేసు వున్నత న్యాయ స్థానంలో వుంది కాబట్టి రాబోయే తీర్పు దొరికిన దొంగలకే కాదు, తప్పించుకున్న దుర్మార్గులకు, కిరాతకపు ఆలోచనలున్న వారు కూడా భయపడేలా శిక్ష వుండాలని కోరుకుంటూ ప్రజలు సద్దుమనిగారు.
అయినా తరువాత యెన్నో ఇటువంటి సంఘటనలు జరుగుతూనే వున్నాయి. దొరికినవాడు దొంగ. రాక్షస, అనైతిక రాజకీయ, న్యాయవాదుల, అధికార గణంతో న్యాయం మరుగున పడుతూనే వుంది. రాక్షసులు మనుషుల మధ్య ‘మంచి’ మనుషులుగా చలామణి అవుతూ, పశువులు సమాజంలో సంచరిస్తూనే వున్నాయి. అన్ని రోజులు వారివి కాదు. భవిష్యత్తులో యిటువంటి వారి విషయంలో కఠినమైన శిక్షలు అమలు జరుగుతాయని ఆశిద్దాం.
రెండో సమూహానికి కూడా ‘చెడు’ చేయడానికి ఎప్పటిలాగే అవకాశం దక్కింది. విచక్షణ కోల్పోయి ఆ ‘చెడు’ చేసేసారు. వీరిలో శలుడికి ఆరోజు పని వుండి వూరు వెళ్ళడం వలన అవకాశం చేజారిపోయ్యిందని మిగతా వారు బాధ పడ్డారు. పైగా శలునికి ఫోన్ చేసి వాళ్ళ ఘన కార్యం చెప్పి వూరించారు. సెల్ ఫోనులో రికార్డు చేసాము చూద్దువుగాని అని కూడా చెప్పారు.

శలుడు ఆ రోజు పని పూర్తి చేసుకుని, యింటికి వచ్చేసరికి, తన ముద్దుల చెల్లెలు అమ్మానాన్నలతో సహా ఈ లోకాన్ని చూడలేక శాశ్వత నిద్రలో వుంది. ఆ ‘పని’ తన సహవాసులదే అని తెలుసుకుని, అక్కడే కూలబడిపోయాడు.

…‌

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!