ఊరెళ్లిపోదాం

“ఊరెళ్లిపోదాం”

“ఏమండీ…!”

“హుమ్మ్…!”

“ఏమండీ…!”

“ఏంటి వసూ…?”

“నేనో మాట అడుగుతాను కాదనరు కదూ…?!” అంది గోముగా అతని హృదయం పై ఉన్న వెంట్రుకలను చేతులతో లాగుతూ.

“నువ్వు అడగడము నేను కాదనడమూనా…?” అన్నాడు హర్ష ఆమె తలపై చేత్తో ప్రేమగా రాస్తూ.

“అలా కాదు ముందు నాకు మాటివ్వండి.”

“ఇదేంటి వసూ కొత్తగా మాటివ్వమని అంటున్నావు.ఎప్పుడైనా నీ మాట కాదన్నానా చెప్పూ?!.”అని ఆమె చేతిలో చేయి వేసి“ఇదిగో మాటిస్తున్నా నువ్వేం అడిగినా చేస్తాను. మాటిచ్చాను కదా అని ఏ వడ్డాణమో అడగవు కదా?!.” అన్నాడు నవ్వుతూ.

“మరేమో మనం మన ఊరు వెళ్లిపోదామండీ.”

“ఏంటీ నువ్వన్నదీ, నే విన్నదీ నిజమేనా…?!.” అన్నాడు హర్ష ఒక్కసారిగా లేచి కూర్చుని.

“నిజమే మనం ఊరేళ్లిపోదామండీ.ప్లీజ్.”అంది ఏడుస్తూ.

“హేయ్ వసూ ఏడుస్తున్నావా. ఈ మాత్రం దానికి ఏడ్వడం ఎందుకు.నువ్వన్నట్టే మనం ఉరేళ్లిపోదాం.కానీ ఇన్నేళ్లు గా నేను ఎన్ని సార్లు అడుగుతున్నా రాను అన్నదానివి ఇప్పుడు ఊరెళదామంటే ఏదో కారణం ఉండే ఉంటుంది.అదేంటో నేను తెలుసుకోవచ్చా.”

“మా లత ఉంది కదా.”

“హా మీరిద్దరూ ఒకేచోట వర్క్ చేస్తారు కదూ. ఏమయ్యింది తనకి?.”

“వాళ్ళాయన నైట్ చనిపోయాడండి.”

“వాట్ చనిపోయారా.బాగా దిట్టం గా ఉండే వాడే. ఎలా చనిపోయారు?!.”

“సడన్ గా బ్రీథింగ్ ట్రబుల్ వచ్చి ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది గా అనిపించి అంబులెన్స్ కి ఫోన్ చేసిందిటా.కానీ అంబులెన్స్ లు అందుబాటులో లేవని చెప్పడం తో ఏం చేయాలో తోచక పక్క ఫ్లాట్ లో వాళ్లని లేపి చాలా రిక్వెస్ట్ చేసిందిట తనతో పాటూ రమ్మని. ఎవరూ రామని తెగేసి చెప్పడం తో ఏడుస్తూనే తన భర్తని నెమ్మదిగా బయటకు తీసుకుని వచ్చి కార్ ఎక్కించి తానే డ్రైవ్ చేసుకుంటూ హాస్పిటల్ కి తీసుకుని వెళ్లింది. తీరా అతన్ని  స్ట్రెచర్ పై వేసేసరికి ఆయన ఊపిరి ఆగిపోయిందిట.సమయానికి హాస్పిటల్ కి తీసుకుని వస్తే బ్రతికే వాడని అక్కడ డ్యూటి లో ఉన్న డాక్టర్ పల్స్ చూసి చెప్పడం తో గొల్లుమంది. చుట్టూ అంతమంది ఉన్నా ఒక్కరూ సాయానికి రాకపోవడం తో తన భర్త చనిపోయాడని, పేరుకే పదిమంది ఫ్లాట్ లనీ అవసరానికి ఏ ఒక్కరూ సహాయం చేయలేదనీ,అదే పల్లెటూర్లలో అయితే ఏ చిన్న అవసరం అయినా ఊరు ఊరంతా సహాయం గా వస్తారని ఈ పట్నం లో ఎవరూ సహాయం చేయడానికి ముందుకే రాలేదని ఫోన్ లో చెప్తూ ఏడుపు మొదలు పెట్టింది.” అని కాసేపు ఆగింది.

ఆమె ఇంకా ఏం చెప్తుందా అని ఆసక్తి గా చూస్తున్నాడు హర్ష.

లత మాటలు వినగానే నాలో భయం మొదలయ్యింది. అవసరానికి ఎవరూ తోడు లేకపోతే ఎలాంటి పరిస్థితులు ఎదురౌతాయో తనని చూస్తే అర్ధం అయ్యింది. భార్యా భర్తలు ఇద్దరూ చాలా సంపాదించారు. కానీ ఏం లాభం ఆ సంపాదన ఆయన్ని కాపాడలేకపోయింది. సుమారు వంద కుటుంబాలు ఉన్న ఆ అపార్ట్ మెంట్ లో ఎవరికి వారే ఎమునా తీరే అన్నట్టుగా వ్యవహరించడం తో లత భర్త చనిపోయాడు. రేప్పొద్దున్న మనకి ఇలా ఏదైనా అవసరం వస్తే. అమ్మో తలుచుకుంటేనే భయం వేస్తోంది.మనం మన ఊరెళ్లిపోదాము. ఇప్పుడున్న పరిస్థితిలో మనం అక్కడ ఉండటమే మంచిది.” అని చెప్పడం ముగించింది.

“అందుకని ఊరెళ్లిపోదామని అంటున్నావా?!. ఇన్నాళ్లూ అమ్మా వాళ్లు ఎన్నిసార్లు రమ్మని అడిగారు. ఒక్కసారైనా వెళ్దామని అన్నావా. మనకి కష్టం వస్తుందేమో అన్న భయం తో అక్కడికి వెళ్దామని  అంటున్నావు. ఏం ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్లగలం. వాళ్లు రమ్మన్న ప్రతిసారీ ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకునే సరికి నా తల  ప్రాణం తోకకి వచ్చేది. ఎందుకు రానని అంటున్నావంటే నాకా పల్లెటూరి వాతావరణం అస్సలు గిట్టదు. నేను రానంటే రానని అనే దానివి.

అలాగనీ నువ్వేం పెద్దింటి బిడ్డవా కాదు. ఓ అనాధ వి. నిన్ను ప్రేమించి పెళ్లిచేసుకుని ఇంటికి తీసుకెళ్తే వాళ్లెంత సాదరం గా ఆహ్వానించారు. ఓ వారం రోజులు ఉండేసరికి లీవ్స్ అయిపోవడం తో బయలుదేరిన మనం ఇంత వరకూ వెళ్లనే లేదు. ఇన్నాళ్లూ వాళ్లు నాకోసం ఎంతలా పరితపించారో నీకు తెలియలేదు కదా. ఇప్పుడు నీకేదో జరిగిపోతుంది అని భయం వేసి వెళ్లిపోదాం అంటున్నావు. అంతేగా.” అన్నాడు హర్ష.

“మీరు అన్నదంతా నిజమేనండీ. నేనెంత తప్పు చేశానో నాకిప్పుడు అర్ధం అవుతుంది. పల్లెటూర్లే  ప్రేమకి పుట్టినిల్లు అని. పల్లెను మరచిన బ్రతుకులు చివరికి ఎటువంటి పరిస్థితులు ఎదుర్కొంటాయో ఈ కరోనా విపత్కర పరిస్థితులు చూస్తుంటే అర్దం అయ్యింది. కష్టం వస్తే నేనున్నానంటూ ఆదుకునే ఆత్మీయులు లేకపోవడం ఎంత కష్టమో. ఈ లాక్డౌన్ సమయం లో ఎంతోమంది ప్రజలు సొంత ఊరికి చేరుకోలేక, ఉన్న ఊర్లో తిండి లేక ఎన్నెన్ని కష్టాలు అనుభవించారో కళ్లారా చూస్తే తెలిసింది.ఇప్పుడు లాక్ డౌన్ తీసేశారు కదా, మనకీ వర్క్ ఫ్రమ్ హోమ్ నే కాబట్టి మనం ఊరెళ్లిపోదాం అక్కడ మీరు హ్యాపీ గా వర్క్ చేసుకోండి.ఇక మనం ఎప్పటికీ అక్కడే మన ఊర్లో అత్తయ్యా మామయ్య లతో ఉండిపోదాం. పరిస్థితులు చక్కబడ్డాక మీరు ఆఫీస్ కి వెళ్లి వద్దురు.నేను జాబ్ మానేసి హ్యాపీ అక్కడే ఉంటాను. రేపు మనకి పుట్టబోయే బిడ్డ ఇలాంటి వాతావరణం లో ఉండకూడదు. స్వచ్చమైన మనుషులు ఉన్న పల్లెటూర్లోనే పెరగాలి. నాలా స్వార్ధం గా కాకుండా మీలా మంచి మనిషిలా పెరగాలి.” అంది తన కడుపుపై చేయి వేసి.

“అంటే…?!.”అన్నాడు హర్ష ఆనందం, ఆశ్చర్యం కలగలిసిన గొంతుతో.

“అవును” అన్నట్టు తల ఊపి చేతి వేలు మూడు తెరిచి చూపించింది.

“నిజమా…! థాంక్యూ. థాంక్యూ సో మచ్  వసూ. నేను తండ్రి ని కాబోతున్నానా. వింటుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా.” అంటూ ఆమెని దగ్గరికి తీసుకుని నుదుట ముద్దు పెట్టుకుని, ఆమె కడుపుపై చేయి వేసి  ‘రేయ్ చిన్నా నువ్వు కడుపులో పడి మీ అమ్మ కళ్లు తెరిపించావురా.”అన్నాడు.

“నిజమే నండీ నా బిడ్డే నా కళ్లు తెరిపించి జ్ఞానోదయం కలిగించింది.” అంది తన కడుపుపై చేయి వేసి. ఆ మరునాడే ఫ్లాట్ ని ఖాళీ చేసి తమ ఊరికి పయనం కట్టారు భార్యాభర్తలిద్దరూ.

రచయిత::కమల’శ్రీ’

You May Also Like

5 thoughts on “ఊరెళ్లిపోదాం

  1. ఊరెళ్ళిపోదాం కథ బాగుంది అక్క
    కరోనా కాలం కోసం బాగా రాశారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!