పల్లెను మరిచిన బ్రతుకులు

పల్లెను మరిచిన బ్రతుకులు

    “ఊళ్ళో ఏముంది పిడకలు, పూరి గుడిసెలు తప్పా. నేనైతే రానమ్మా, అరే కనీసం ఫోన్, నెట్ సిగ్నల్స్ ఉండవు. బోర్” అంటున్న కొడుకు రాకేష్ కి ఎలా చెప్పాలో తెలియలేదు సవితకి.

“నేనైతే వెళ్తున్నాను. నీ కోసం నేను నా వాళ్ళను చూడకుండా ఉండలేను.రేపే నా ప్రయాణం” అని తేల్చి చెప్పేసి లోపలికి వెళ్ళిపోయింది.

“సరేలే నేను వస్తా” అని కొడుకు అనడంతో “రేపే ప్రయాణం” అని చెప్పి బట్టలు బ్యాగుల్లో పెట్టింది.

తెల్లవారి బస్సు ఎక్కారు. ఎన్నో ఏళ్లుగా అనుకున్న ప్రయాణం… ఇన్నాళ్లకు చేయగలిగింది. ఊరు దగ్గరపడుతున్న కొద్దీ జ్ఞాపకాలు తల నిమిరాయి. స్వచ్ఛమైన గాలి తనని తడిమి “ఎలా ఉన్నావు” అని అడిగింది. పచ్చని పంట పొలాలు “వచ్చావా” అన్నట్టు తలలు ఆడిస్తూ కదిలాయి. కొబ్బరి చెట్లు, మామిడి తోటలు బాల్యాన్ని గుర్తు చేసాయి. మనసు బస్సుకన్నా వేగంగా ఊరుకు పరుగులు పెడుతోంది. తన వారిని చూడాలన్న కోరిక… క్షణాలు యుగాలు అనిపించాయి. 8 గంటల ప్రయాణం తర్వాత ఇంటికి చేరింది. తన కోసం ఎదురుచూస్తున్న అమ్మానాన్నలు, అన్నావదిన, పిల్లలు … వారిని చూస్తుంటేనే కడుపు నిండిపోయింది.

రెడీ అయ్యి వచ్చేసరికి భోజనాలు సిద్ధం చేసి ఉంచారు. నాకిష్టమని గడ్డ పెరుగు, మావాడికి జున్ను పాలు, మామిడి తాండ్ర తెప్పించింది అమ్మ. ఎంత తిన్నామో మాకే తెలీదు. పౌడర్ తో జున్ను, ప్లాస్టిక్ పాకెట్స్ లో దొరికే పెరుగు తినే మాకు ఇవన్నీ అమృతంలా అనిపించాయి. మా కోసం ఆరు బయట సంపెంగి, మల్లె పూల చెట్ల పక్కన మంచాలు ఏర్పాటు చేసారు. నిజం చెప్పాలంటే ఆ ఏ. సి. కూలర్ ఎందుకూ పనికిరావు. ఆర్టిఫిషల్ చంద్రుడు, చుక్కల స్టికర్స్ ను గదిలో అంటించుకుని పడుకునే నా కొడుకు ఇవాళ నిజమైన వెన్నెలను ఆరాధిస్తూ … మల్లె, సంపెంగి సువాసనలను ఆస్వాదిస్తూ ఆనందంగా నిద్రపోయాడు.

రాకేష్ లేచేసరికి వాళ్ళ మామయ్య అప్పుడే పితికిన ఆవు పాలు తాగమని టేబుల్ పై పెట్టి వెళ్ళాడు. పిల్లలు కూడా టీవీ, ఫోన్ లేకుండా అందరితో కలసి ఆడుతుండడం రాకేష్ కి విడ్డూరంగా అనిపించింది. ఒకట్రెండు రోజులు వారిని చూసిన రాకేష్ వయసు మరచి వారితో ఆటల్లో పడ్డాడు. చెరువులో ఈత కొట్టడం, చేపలు పట్టడం, చెట్లు ఎక్కడం, గోటిలు ఆడడం ఇలా రోజంతా సరదాగా గడిపేసేవాడు. ఒకరోజు తాతయ్యకు జ్వరం వచ్చింది. చుట్టు పక్కల వారంతా వచ్చి పలకరించి పండ్లు ఇచ్చి వెళ్లారు. ఇదంతా విచిత్రంగా అనిపించింది రాకేష్ కి.

“సిటీలో పక్కింట్లో ఎవరైనా చనిపోయినా వెళ్లి చూడరు, కానీ ఇక్కడేంటి ఇలా” అని అమ్మను అడిగాడు.

“అదేరా పల్లె జీవన ప్రత్యేకత. అందరూ ఒకే కుటుంబంలాగా ఉంటారు. కష్టసుఖాలను పంచుకుంటారు. కానీ పట్టణాల్లో కేవలం బతుకుతున్నారంటే బతుకుతున్నారు అంతే. పల్లెవాసుల్లా జీవితాన్ని ఆస్వాదించట్లేదు. అంతెందుకు పల్లెటూరు నుంచి పట్నాలకు వెళ్లినవారే పల్లెను మరచి బతుకుతున్నారు. కానీ అందరూ తెలుసుకోవాల్సిన జీవిత సత్యం ఒక్కటే .. పల్లెలు ప్రగతికి సోపానాలు. అంతెందుకు కరోనా రాగానే లగ్జరీ జీవనాలను వదిలి అందరూ ఊళ్ళకు బయలుదేరారు. పల్లెవాసులు ఆ సమయంలోనూ అందరిని ప్రేమగా ఆహ్వానించారు” అని చెప్పగానే రాకేష్ సహా అందరూ చప్పట్లు కొట్టారు.

“అమ్మా నా తప్పును ఆలస్యంగా తెలుసుకున్నాను. నా చదువు పూర్తి అయ్యింది కదా.. నేను ఈ కల్మషం లేని పల్లెలోనే డాక్టర్ ప్రాక్టీస్ మొదలుపెడతాను. అమెరికా వెళ్ళను” అనేసరికి సవిత తాను కోరుకున్నది జరిగినందుకు ఆనందించింది.

రచయిత ::మంజీత కుమార్

You May Also Like

6 thoughts on “పల్లెను మరిచిన బ్రతుకులు

  1. బాగుంది అనేది చిన్న మాట. అద్భుతం అంతే. కథ కథనం వర్ణనలు సంభాషణలు ముగింపు అన్నీ అమోఘం. కథలో ముగింపు వాస్తవంగా జరగాలని ఆకాంక్ష. 👌👌👌👏👏👏

  2. పల్లె అందాలు అనుభూతులు బాగా వర్ణించారు. బావుందండి 👌👏👍🌷

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!