రచన – తపస్వి
“మనసు దాటని మాటలు ఎన్నో
మౌనంగా నా ఊహల్లో…
నీ చుట్టూ తిరుగుతూ అలిసిపోతున్నాయి…
నీ మనసుని చేరలేక…”
వల్విత ఫోన్ బీప్ సౌండ్ రాగానే ఓపెన్ చేసి, వచ్చిన మెసేజ్ చూసి నవ్వుకుని, ఆ అక్షరాలకు సమాధానం ఇవ్వాలి అనుకుంది కానీ, చేతి మునివేళ్లు ఆమెకి సహకరించలేదు. మనసు దానికి సమాధానం ఇవ్వాలని ఆరాటపడుతుంది కానీ, ఆలోచనలు వద్దు అంటూ ఆపేస్తున్నాయి. మనసు ఆరాటం కంటే ఆలోచనల పోరాటం ఎక్కువ అవడం వల్ల, నిరాశగా ఫోన్ పక్కన పెట్టి ఆలోచనల్లో మునిగిపోయింది.
దగ్గర అవ్వాలి అనుకునే మనసు ఆరాటం, వద్దు… ఆల్రెడీ ఒకసారి గాయపడిన మనసు అది, నువ్వు అతనికి స్వాంతన అవుతావో… మళ్లీ ఓ గాయాన్ని చేసే జ్ఞాపకం అవుతావో అని. ఇంకా గత జ్ఞాపకాల నుండి పూర్తిగా బయటికి రాలేని ఆమె, గత జ్ఞాపకాలలో తనని తాను కోల్పోయిన అతనని… ఈమె స్నేహంలో మళ్లీ కొత్తగా మారుస్తున్న ఓ పరిచయం. ఆమె ఆలోచనలు చదివినట్లుగా…
“కలిసిన మనసులు…
కలవని ఆలోచనల పోరాటంలో…
ఏ దరి చేరునో మన బంధం…”
మళ్లీ అతని నుండి వచ్చిన మెసేజ్ చూసింది. ఈ సారి ఆలోచనలపై మనసు పోరాటం గెలిచింది. “తలరాతలలో లేని బంధం అయిన పర్వాలేదు… మనసు లోతుల్లో నిలిచిపోయే ఒక జ్ఞాపకమే అయి నిలిచి పోయినా పర్వాలేదు…” అతనికి తన మనసులో మాట అక్షరాలుగా మార్చి చెప్పింది. తన అక్షరాలకు సమాధానంగా తిరిగి వచ్చిన అక్షరాలను చూసి… అతని మనసులో ఒక కొత్త అలజడి…
“ఇంకా పడుకోలేదే!” తమ మధ్య మాటలు తక్కువే, అలాగే మనసుల మధ్య దూరం కూడా తక్కువే.
“ఎందుకో నిద్ర పట్టడం లేదు…” అర్ధరాత్రి అయినా నిద్రాదేవి తోడు రాక మంచం మీద అటూ ఇటూ కదులుతూ ఉంది. ఇంతకు ముందు ఎప్పుడూ ఈ సమయంలో అతనికి మెసేజ్ చేయలేదు. అతను కూడా చేయలేదు, కానీ పడుకునే ముందు ఆఖరి పలకరింపు మాత్రం వారికి వారి ఇద్దరిదే. ఎందుకో అన్న పదంలోనే ఏదో ఉంది అనిపించింది.
“ఏంట్రా… ఏం ఆలోచిస్తున్నావు…?”, అది చూడగానే, ఎందుకో తన మనసులో రేగుతున్న ఆలోచనలని అతనికి చెప్పాలి అనిపించింది ఆమెకు…
“ఎక్కడికన్నా వెళ్లి హ్యాపీగా నా కోసం నేను, నాకు నచ్చినట్టు కనీసం 3 రోజులు అయినా బ్రతకాలి అని ఉంది…” అలసిన మనసు వేదన అది.
“వెళ్దాం వస్తావా…!” అతని నుండి ఊహించని పిలుపు అది.
వస్తా…! వెంటనే సమాధానం ఇవ్వాలి అనుకుంది కానీ ఓ క్షణం ఆగింది. ఎందుకు వెళ్ళాలి ఇతనితో? అతని మెదడు వేసిన ప్రశ్నకి… ఆమె మనసు ఇచ్చిన సమాధానం ఆమెకి నచ్చింది.
కానీ “నాకు అంత అదృష్టమా…” ఏదో అనాలి కదా అని అంది, కానీ ఏమనుకుంటారో అని అనుకుంది.
“ఎప్పుడూ అంటావుగా, ఇంకా ఎంతకాలం ఆ గత జ్ఞాపకాల్లో బాధపడుతూ ఉంటావు, బయటకి రావా అని. బాధ పెట్టే ఆ జ్ఞాపకాలు నుండి బయటకి రావాలని ఉంది. కనీసం ఓ మధుర జ్ఞాపకంగా నీ జ్ఞాపకాలు ఉండాలి అని ఉంది… నీ కోసం కాదు, నా కోసం అయినా రావొచ్చు కదా…”, అతని మాటలు చూసి నవ్వుకుంది.
“నీ కోసం కాదు, మన కోసం వస్తా…” మరో ఆలోచన లేకుండా సమాధానం ఇచ్చింది.
“ఆగస్ట్ 12 నీకు కుదిరితే…”
“సరే…”
***
600 వందల కిలోమీటర్లు దూరంలో ఉండి కూడా పక్క పక్కనే ఉన్న అనుభూతిలో ఉన్నారు ఒకరికి ఒకరు. ఆ రోజు అతని పుట్టినరోజు ఆమెకి తెలుసు. ఇష్టమైన వ్యక్తికి ఆ రోజు ఇచ్చే గిఫ్ట్ కూడా అంతే ఇష్టంగా ఉండాలి అన్న కోరికతో మరో ఆలోచన లేకుండా సరే అంది తను. తన పరిచయంలో మరోసారి కొత్తగా జీవితం ఆరంభించిన అతను, ఆ పుట్టినరోజు నాడు కొత్తగా తనతో పంచుకోవాలి అని అతని ఆశ. 6 నెలల తమ పరిచయంలో, ఈ రోజు వరకు పేరు పెట్టుకోని తమ బంధానికి, చెప్పుకోని ఇష్టానికి కొత్త ఆరంభం ఆ రోజు చేశారు.
***
ఆగస్ట్ 12 :: ఉదయం 6 గంటలు::
హైదరాబాద్, నెక్లెస్ రోడ్డు… చీకట్లు వీడిన చిరుజల్లుల వల్ల మసక చీకటి. లోకం బద్దకంగా చలి దుప్పటిలో జోగుతుంది. రాయల్ ఎన్ఫీల్డ్ బండి పక్కన పార్క్ చేసి, పడే చిరుజల్లులో తడుస్తూ నిల్చున్నాడు.
“వచ్చావా?” ఆమె నుండి మెసేజ్.
“హా” అతని రిప్లై.
అతను ఫోన్లో ఆన్సర్ ఇచ్చి, ఆమె చూసే లోపు, అతని ముందు ఒక ఆటో ఆగింది. నవ్వుతూ ఆటో దగ్గరకి వెళ్ళాడు. తనని చూడగానే ఇద్దరి కళ్ళల్లో ఒక మెరుపు. ఆటో అతనికి పే చేసి బైక్ దగ్గరకి వచ్చారు.
“నీదా…” అంది బండి చూస్తూ.
“ఫ్రెండ్ ది, కానీ ఈ 3 రోజులు మనదే” నవ్వుతూ అన్నాడు.
అడుగు దూరంలో నుంచున్నారు ఇద్దరూ. కలిసింది మొదటిసారి, కానీ ఇద్దరికీ ఇద్దరూ కొత్తగా లేరు. అతనికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలి, కానీ ఎలా చెప్పాలి అదే అర్థం కావటం లేదు ఆమెకి. అతన్ని దగ్గరకి తీసుకుని, గట్టిగా హత్తుకుని, అతని నుదుటి మీద ముద్దు పెట్టి చెప్పాలని ఉంది. కానీ… అది ఆలోచన దగ్గరే ఆగిపోయింది. ఆమె ఆలోచన పసిగట్టినట్టు ఆమె కనులలోకి సూటిగా చూస్తున్నాడు.
“అలా చూస్తావే… తినేసాలా…” నవ్వుతూ అంది చిరు కోపంతో, కళ్ళు పక్కకి తిప్పుకుని.
“నన్ను చూడగానే వచ్చి హగ్ ఇచ్చి, విష్ చేస్తావు అనుకున్న…” నవ్వుతూ అన్నాడు, చూపు తిప్పకుండా.
“ఆహా… ఇంకేమన్నా కోరికలు ఉన్నాయా…!” అంది అతని భుజం మీద కొడుతూ.
“కాఫీ…” అన్నాడు నవ్వుతూ కొంటెగా.
“వద్దు బాబు…” అంది గట్టిగా నవ్వుతూ.
ఇంతకు ముందు తమ మధ్య కాఫీ, వర్షం అంటూ సాగిన ఓ సరదా సంఘటన గుర్తు వచ్చి.
“అంత భయమా…” అన్నాడు నవ్వుతూ.
“మరి… ఇప్పుడు ఇక్కడ నీ ఒడిలో కూర్చుని, నేను కాఫీ తాగితే, ఆ రుచి నా పెదవుల మీద నుండి నువ్వు తీసుకుంటాను అంటే… బాగోదు ఏమో కదా…” సిగ్గుపడుతూ అంది.
“గుర్తు ఉందా… మర్చిపోయావు అనుకున్న…” అన్నాడు నవ్వుతూ కన్ను కొడుతూ.
“నువ్వు చెప్పేవి ఏమైనా మర్చిపోయేలా చెబుతావా, నీకేం నువ్వు సరదాగా అంటూ ఏదో చెప్పేసి ఊరుకుంటావు. కానీ మాకు అలా కాదు, అవి అలా ఆలోచనలో తిరుగుతూనే ఉంటాయి…”
“ఆహా…” అంటూ నవ్వి, వెళ్దామా అన్నాడు.
“హ్మ్…” అంది నవ్వుతూ.
అతను బైక్ స్టార్ట్ చేసాడు. ఎక్కడకి, ఎటు… అని ఇంతవరకు తను అడగలేదు. జస్ట్ 3 రోజుల వరకు కావల్సినవి మాత్రం తీసుకుని వచ్చింది, కానీ అంత గుడ్డిగా అతనిని ఎలా నమ్మగలుగుతుంది తను, నిజానికి ఆమె మనసుకి కూడా తెలీదు సమాధానం.
బండి ఎక్కబోతుంటే, “అదేంటి అలా కూర్చుంటావా…!”, అతని మాటలకి ఆగి… “సిటీలో వద్దులే…” అంటూ, అతని బండి ఎక్కి భుజం మీద చెయ్యి వేసి, “పద” అంది. నవ్వుతూ అతను బండి స్టార్ట్ చేశాడు. చిరుజల్లులలో తడుస్తూ, ఇద్దరు వేగంగా సిటీకి దూరంగా వెళ్ళసాగారు.
తాము కలిసే క్షణం వస్తే, ఎన్నో కబుర్లు చెప్పుకోవాలి అనుకున్నారు. కానీ ఇద్దరి మధ్య మౌనం. అతని బండి వేగం పెరిగే కొద్దీ అతనికి దగ్గరగా జరగసాగింది ఆమె. ఒక చెయ్యి భుజం మీద, ఒక చెయ్యి అతని నడుము చుట్టూ వేసి , తల అతని వీపుకి ఆనేట్లుగా కూర్చుంది. అతను ఆమె చేయి పట్టుకున్నాడు. అతని తొలిస్పర్శ అది ఆమెకి… కానీ ఆ స్పర్శలో ఏదో తెలియని మాయ.
“చలి వేస్తుందా…” బండి స్లో చేస్తూ, ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుంటూ అడిగాడు.
“లేదు…” రెండో చెయ్యి అతని భుజం మీద నుండి తీసి, అతని చెయ్యిని పట్టుకుంటూ, గట్టిగా అతనిని హత్తుకుంటూ దగ్గరగా జరిగింది. అతను తన చేతిని వెనక్కి తీసుకుని, నవ్వుకుంటూ బండి నడపసాగాడు. ఆమె అతనిని అల్లుకుని మౌనంగా ఆ క్షణాలని ఆస్వాదించసాగింది.
“ఏంటి… ఏం మాట్లాడవు…?” అడిగాడు అతను.
అతనికి సమాధానం ఇవ్వకుండా మరింత గట్టిగా పట్టుకుంది. కొందరి మధ్య ఇష్టాన్ని, ప్రేమని చెప్పుకోవటానికి చాలా మాటలు కావాలి, కానీ వారి ఇద్దరికీ మాత్రం మాటల కంటే మౌనం, స్పర్శ… వారి ఇష్టం, ప్రేమని కొత్తగా చెబుతున్నాయి.
***
సిటీ దాటిన కాసేపటికి బండిని స్లో చేస్తూ “ఏమన్నా తిందాం…” అన్నాడు. ఇంతసేపు వాళ్ళ మధ్య అల్లుకున్న మౌనం కూడా వాళ్ళ మౌనప్రేమగాథలో మునిగిపోయింది ఏమో… ఒక్కసారిగా మౌనాన్ని చెరిపేసరికి, కసురుకుంటూ వెళ్లిపోయింది.
“నీ ఇష్టం…” ఆ మాటలో… అతని ఇష్టం అనే దానికన్నా, ఈ క్షణం మనం ఒక్కటే… నేను నీ దాన్ని అన్న భావం అర్థం అయింది అతనికి.
బైక్ ని ఒక చిన్న కాకా హోటల్ ముందు ఆపాడు అతను. ఎందుకో అతనిని విడిచి బండి దిగాలని లేదు ఆమెకి, చుట్టుకుని ఉన్న చేతుల మీద చెయ్యి పెట్టి… “దిగు…” అన్నాడు. అయిష్టంగానే అతనిని విడిచి, బండి దిగి చుట్టూ చూసింది.
ఏదో పల్లెటూరు అనుకుంటా, ఒక పెద్ద చెట్టు క్రింద తాటాకులు, తడికెలతో ఉన్న హోటల్. రోడ్డుకి మరో పక్క పెద్ద చెరువు. అందులో తామర పువ్వులు పడుతున్న వానకి తడుస్తూ నీటి కదలికలకు తగ్గట్టు నాట్యమాడుతున్నట్టు ఉన్నాయి. ఇద్దరు దిగి ఆ హోటల్ లోనికి వెళ్ళారు. ఖాళీగా ఉన్న ఒక టేబుల్ ముందు కూర్చున్నారు.
“తడిచి పోయావు, టవల్ తీసుకుని వస్తా…” అంటూ, అతను వెళ్లి బ్యాగ్ లో నుండి టవల్ తీసుకుని వచ్చి తన చేతికి అందించాడు. అతని వైపు, టవల్ వైపు చూసి… చుట్టూ చూసింది. హోటల్ లో ఉన్న ఒకరిద్దరు తమనే చూస్తూ ఉన్నారు అని గమనించి, టవల్ అందుకుంది నవ్వుతూ. ఆ నవ్వుకి అర్థం, తనకు అర్థం అయ్యి… అతను కూడా నవ్వుతూ ఆమె పక్కన కూర్చున్నాడు టవల్ ఇచ్చి.
ఎందుకో ఒకసారి మళ్లీ ఆమె ముఖంలోకి చూడాలి అనిపించి చూసాడు. తల మీద నుండి జారిన నీరు, అలా జారుతూ, ఆమె నాసిక మీదుగా జారీ పెదవుల మీద పడింది. ఎర్రని పెదవుల మీద ముత్యంలా మెరిసిపోతున్న ఆ నీటి బిందువుని టక్కున తన పెదవులతో అందుకోవాలన్న ఆలోచన కలిగింది అతనికి. అతని చూపు తన పెదవుల మీదే ఉన్నాయని అర్థం అయ్యి, మోచేతితో పొడిచింది. డిస్టర్బ్ అయిన అతను, ఏంటి… అన్నట్టు చూసాడు ఆమె కనులలోకి.
“ఏంటి ఆ చూపు…” అంది, తన పెదవులని నాలుకతో తడుముకుని.
“ఉఫ్…” అన్నాడు, నవ్వుకుంటూ.
ఎందుకు అలా అన్నాడో అర్థం అయ్యి చుట్టూ చూడు అన్నట్టు కళ్ళు గుండ్రంగా తిప్పి నవ్వుకుంది.
నా తప్పేం లేదు… అన్నట్టు సైగ చేసాడు నవ్వుతూ.
“అరే…” అంది నవ్వుతూ కళ్ళు పెద్దవి చేస్తూ.
“చూపులతోనే చంపేసేలా ఉన్నావు…” నవ్వుతూ అన్నాడు.
“ఆహా… ఇంకేమనిపిస్తుంది ఏంటి?” కనుబొమ్మలు ఎగరేస్తూ అడిగింది.
“కొన్ని చెప్పలేము…”
“మరి…”
నవ్వుతూ… సమాధానం చెప్పకుండా,
“సర్లే ఏం తింటావు…?” మాట మార్చేశాడు.
“నీ ఇష్టం…”
వారి మాటలు సాగుతుండగానే, ఒక పిల్ల వచ్చి… వారి ముందు గ్లాస్ తో నీళ్ళు పెట్టి, “ఏం కావాలి” అంది. ఇద్దరూ ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకున్నారు.
“2 ప్లేట్స్ ఇడ్లీ…” అన్నాడు అతను.
ఇడ్లీ తినడం అయ్యే వరకు ఇద్దరు మౌనంగానే ఉన్నారు, మధ్య మధ్యలో ఒకరి కళ్ళల్లోకి మరొకరు చూసుకుంటూ.
“కాఫీ…” అన్నాడు చెయ్యి తుడుచుకుంటూ ఆమె చున్నికి.
“హ్మ్…” అంది, ఇక్కడ ఎటువంటి చిలిపిచేష్టలూ చేయలేవులే అన్నట్టు నవ్వుతూ.
కాఫీ వచ్చింది. ఒక్కసారిగా అతను లేచే సరికి కాస్త కంగారుపడింది. నిజంగా వచ్చి ఒడిలో కూర్చుంటాడేమో అని. చిలిపిగా నవ్వి టేబుల్ కి మరో పక్కగా వెళ్లి ఆమెకి ఎదురుగా కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడని ఆలోచిస్తూ… కాఫీ కప్ అందుకుని అతనిని చూస్తూనే తాగుతుంది. అతను కూడా ఆమెని చూస్తూ తాగి, ఆమె తాగటం అయ్యి కప్ కింద పెట్టగానే… కళ్ళతో ఇటు చూడు అన్నట్టు సైగ చేసాడు.
తను చూస్తుంది అని గమనించి… అతని నాలుకని బయట పెట్టి… పెదవుల మీద రాస్తూ ఆడసాగాడు,
అది చూడగానే తనకి నవ్వు వచ్చి… “ఓయ్ ఆపు…” అంటూ అతని చేతి మీద కొట్టింది. నవ్వుకుని మళ్లీ చేశాడు.
“ఆపుతావా లేదా…”అంటూ చెయ్యి గట్టిగా పట్టుకుని గిల్లింది.
“హా…” అన్నాడు గట్టిగా.
హోటల్ లో ఉన్నవాళ్లు తనని చూసారు అని అర్థం అయ్యి… “ప్లీజ్…” అంది ముద్దుగా ముఖం పెడుతూ. “సరే” అంటూ నవ్వి “వెళ్దాం…” అన్నాడు. తను లేచింది. బిల్ పే చేసి ఇద్దరు బయటకి వచ్చారు. అతను బైక్ స్టార్ట్ చేసాడు. ఆమె అతని వీపుకి ఆమె వీపు ఆనుకునేల ఎక్కి కూర్చుంది. ఇపుడు బండి వెళ్తుంటే, వెనుకకి వెళ్లిపోయే రోడ్డుని తను చూస్తుంది.
పడుతున్న చిరుజల్లులలో తడుస్తూ, రెండు చేతులు ఆకాశానికి చూపిస్తున్నట్టు పైకి చాచి, తన ముఖం మీద పడే చినుకుల తాకిడికి మురిసిపోతుంది. ఎవరేం అనుకుంటారన్న ఆలోచన లేదు ఇద్దరికీ. తను కోరుకున్న క్షణాలు అవి. సంతోషంతో తనకి ఇష్టమైన పాటని గట్టిగా పాడుతుంది. మధ్య మధ్యలో అరుస్తుంది. అతను బైక్ ని నెమ్మదిగా జాగ్రత్తగా పోనిస్తున్నాడు. బైక్ మీద వెనక్కి తిరిగి కూర్చుని వర్షంలో తడుస్తూ… రోడ్డు మీద గట్టిగా పాట పాడాలి… ఇది తన మొదటి కోరిక.
కాసేపటికి బండి ఒక ఊరు మధ్యలో ఆపాడు రోడ్డు పక్కగా. బండి దిగి, ఎందుకు ఆపావు? అన్నట్టు చూసింది. పక్కనే ఒక గాజుల బండి. “పదా” అంటూ, బండి స్టాండ్ వేసి ఆ గాజుల బండి దగ్గరకి వెళ్ళాడు. ఆ బండి వాడు అప్పుడే సర్దుకున్నాడు. వెళ్లి మౌనంగా అతని పక్కన నుంచుంది.
“సైజ్ ఎంత” అడిగాడు అతను.
“ఇపుడు ఎందుకు…?” అందే కానీ, ఎందుకో అతనితో గాజులు వేయించుకోవాలన్న కోరిక తనకి కూడా ఉంది.
ఆమె చేతుల వంక చూసి, “2.6… సరిపోతాయి కదా” అన్నాడు. అంత కరెక్ట్ గా ఎలా చెప్పాడు అనుకుంది మనసులో.
అతనే తనకి నచ్చిన రంగుల గాజులు తీసుకుని ఆమె చేతికి ఇవ్వబోయాడు. కానీ ఆమె తీసుకోకుండా అతని కళ్ళలోకి చూడటంతో నవ్వి “చెయ్యి చాపు” అన్నాడు. రెండు చేతులు ముందుకి చాపింది. ఆమె చేతులు పట్టుకుని ఆ గాజులని తొడిగాడు అతను. తొడుగుతున్నంత సేపు అతనినే చూస్తుంది. గాజులు తొడగటం అయ్యాక రెండు చేతులని పట్టుకుని వాటి వైపే చూస్తూ ఉన్నాడు. తను చూసింది, ఎందుకో ఆ గాజులున్న తన చేతులు ఇప్పుడు తనకే చాలా కొత్తగా కనపడుతున్నాయి. ఆ గాజులలో అతని ప్రేమ ఉండటం వల్ల అనుకుంటా.
చేతులని అతను గట్టిగా పట్టుకుని ఉండటం వల్ల “ఏంటి…?” అంది నెమ్మదిగా. ఆమె రెండు చేతులని ఒకటిగా చేసి దగ్గరగా తెచ్చుకుని, ఆ చేతుల మీద తన పెదవులతో ముద్దు పెట్టాడు. ఊరు మధ్యలో, చుట్టూ జనాలు ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా అతను చేసిన పనికి షాక్ అయింది తను. కానీ వెంటనే చిరు నవ్వుతో… “వెళ్దామా” అంది చేతులు వెనక్కి తీసుకుంటూ.
”నచ్చాయా…” ఆమె సమాధానం కోసం ఎదురు చూడకుండానే వెళ్లి బైక్ స్టార్ట్ చేసాడు. వాటి వైపు ఆమె చూసుకుంటూ నవ్వుకున్న క్షణమే అర్థం అయింది అవి తనకి నచ్చాయి అని.
“ఇంతకీ ఏం నచ్చాయి అని అడిగావు…?” అంది బైక్ ఎక్కి అతన్ని చేతులతో చుడుతూ. ఆమె ప్రశ్నకి బదులుగా, ఆమె చెయ్యి పైకి తీసుకుని మరో ముద్దు ఇచ్చాడు.
“నిన్నూ…” అంటూ ఒక చేత్తో అతని నడుం మీద గిల్లింది.
“ఓయ్…” అన్నాడు మెలికలు తిరుగుతూ, బండి అదుపు తప్పినట్లు అయింది.
“ఇంత సుకుమారమా…?” అంది నవ్వుతూ, మళ్లీ గట్టిగా నడుం పట్టుకుని.
“కాదు నాకు చక్కిలిగింతలు ఉన్నాయి” నవ్వుతూ అన్నాడు.
“ఓహో… దొరికావు” అంది మళ్ళి అలాగే అంటూ.
“ప్లీజ్… ప్లీజ్…” అన్నాడు బ్రతిమలాడుతున్నట్టు.
“మరి ఇందాక హోటల్ లో తమరు చేసిన పని ఏంటి, దానికి ఇది పనిష్మెంట్…” అంది నవ్వుతూ.
“అంటే… నిన్ను ఒడిలో కూర్చోపెట్టుకొని కాఫీ తాగకపోవటం, నీ పెదవులకి అద్దిన కాఫీ రుచి చూడకపోవడం, దానికా పనిష్మెంట్, సర్లే ఈ సారి చూస్తాలే…”
“అసలు… నిన్నూ…” అంది వీపు మీద కొడుతూ, నవ్వుతూ అతను కూడా ఆమె నవ్వుకి జత కలిపాడు.
“మాటల మాంత్రికుడివి… నీతో గెలవగలమా…” అంది అతన్ని గట్టిగా పట్టుకుని తల అతని భుజం మీద వాలుస్తూ.
“ఎప్పుడైనా మాయ చేసేలాగా నీకు మాటలు చెప్పానా…”
“లేదు…” ఆమె సమాధానం.
బండి వేగంగా ముందుకి వెళుతూ ఒక చోట ఆగింది.
“ఏమనుకోకపోతే ఒక 5 మినిట్స్…” బండి ఆపి అన్నాడు.
చుట్టూ చూసింది… పచ్చని పొలాలు, రోడ్డు పక్కగా కాలువ, అపుడపుడు వచ్చి వెళ్తున్న వాహనాలు. బండి దిగి వాటర్ బాటిల్ తీసుకుని తాగింది. తనకి ఒక పది అడుగుల దూరం వరకు వెళ్లి కార్తిక్ సిగరెట్టు వెలిగించడం చూసి, “ఓయ్… ఏంటది…?” అంది చిరుకోపంతో.
“కావాలా?” అన్నాడు చూపిస్తూ.
వెళ్లి ఒక చెట్టు కింద నిలబడి, చేతిలో వాటర్ బాటిల్ తో వేగంగా అతని దగ్గరకి వెళ్ళింది.
“నేను ఉన్నప్పుడు కూడా అవసరమా…” ఆమె కోపం తెలుస్తుంది అతనికి.
“అంటే… అలవాటు ఒక్కసారిగా వదులుకోలేక…” సంజాయిషీ ఇస్తున్నట్టు అన్నాడు.
“మానేయాలి అంటే ఏం చేయాలి…”
“హా హా హా…” గట్టిగా నవ్వాడు.
“చెబుతావా లేదా…” గద్దించి అడిగింది.
“నువ్వు కాబట్టి…”
“హా నేను కాబట్టి…”
“వద్దులే వదిలేయ్… అదే నీలాగా ఇంకో అమ్మాయి అయి ఉంటే… నాకు సిగరెట్ తాగాలి అనిపించిన తాగకుండా ఉండేలా ఒక గట్టి ముద్దు ఇవ్వు… అని అనే వాడిని…” అన్నాడే కానీ, తను ఎక్కడ అపార్థం చేసుకుంటుంది అన్న భయం కలిగింది.
ఆ మాటకి మొదట షాక్ అయ్యి, తరువాత అటు ఇటు… చూసి… అతను ఊహించని విధంగా ముందుకి వచ్చి… అతని ఊహకే అందనంత వేగంగా అతని పెదవులకి ఆమె పెదవులతో ముడి వేసింది. ఓ క్షణం ఏం జరిగిందో అర్థం కాక… మరో క్షణం అసలేం జరుగుతోంది తెలియని మైకంలో మునిగిపోయి, అతని చేతిలో ఉన్న సిగరెట్ క్రిందకి జారిపోయింది. అతని చెయ్యి ఆమెని తాకే లోపు, అతన్ని వదిలి వెనకకి వెళ్లి “ఇక వెళ్దామా” అంది, అతని సమాధానం కోసం ఎదురు చూడకుండా. ఇంత చేసి, అసలేం జరగనట్టు అలా ఎలా వెళ్ళిపోతుంది, అని నవ్వుకుంటూ వెళ్ళాడు.
“బండి నువ్వు నడుపు…” అన్నాడు పక్కన నిలబడి.
వాటర్ బాటిల్ చేతికి ఇచ్చి, “మౌత్ వాష్ చేస్కో” అంది. తను నీళ్ళు పుక్కిలించి ఊసి…
“అసలు ఆ స్మెల్ నాకు నచ్చదు…” అంది బండి ఎక్కి.
“నాకు నచ్చదు… అందుకే కాల్చి పడేస్తున్న…” అన్నాడు బండి వెనుక ఎక్కి.
“పిచ్చి పిచ్చి లాజిక్స్ చెప్పావు అంటే చంపేస్తా…” అంది కోపంగా.
“సరే… సరే… ఇక తాగను… సరేనా” అన్నాడు నెమ్మదిగా.
ఇద్దరి మధ్య కాసేపు మౌనం. తను పెట్టిన ముద్దు గురించి మాట్లాడకూడదు అనే ఉద్దేశంతోనే తను కావాలని కోపం చూపిస్తుంది అని అర్థం అయింది.
అతను… ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి మౌనంగా ఆమె మీదకి ఒరిగి కూర్చున్నాడు. తడిచిన బట్టల్లో వేడి తనువుల రాపిడి కొత్తగా ఉంది ఇద్దరికి.
***
హైదరాబాద్ కి 200 కిలోమీటర్స్ దూరంలో ఒక మారుమూల కొండ ప్రాంతంలో ఉన్న రోడ్డు మీద సాగుతుంది వారి ప్రయాణం. ఇన్ని రోజుల వారి మాటల కరువు తీరేట్టు దారి పొడవునా మాటలలో మునిగిపోయారు ఇద్దరు. మెయిన్ రోడ్డు దిగి గతుకుల దారిలోకి వెళ్లి, అడవిలాంటి ప్లేస్ మధ్య బండి ఆపాడు. నీటి సవ్వడి వినపడుతుంది. ఎక్కడకి అని అతను చెప్పకముందే బండి దిగి, ఆ నీటి సవ్వడి వినబడే వైపు అడుగులు వేస్తూ వెళ్తుంది ఆమె. కార్తిక్ బండి దిగి, కావాల్సినవి తీసుకుని ఆమె వెనుక వెళ్ళాడు.
కొండమీద నుండి జారుతున్న జలపాతం, చుట్టూ చెట్లు, నిర్మానుష్యం. అది చూడటంతోనే చిన్నపిల్లలాగా కేరింతలు కొడుతూ నీళ్ళలోకి దిగింది. తనని చూసి నవ్వుకున్న కార్తిక్, చేతిలో వస్తువులు, బ్యాగ్ పక్కన పెట్టి, అన్ని సర్ది, తను కూడా నీళ్ళలోకి దిగాడు. ప్రపంచంతో సంబంధం లేదు అన్నట్టు, నీళ్ళల్లో కేరింతలు కొడుతూ, గట్టి గట్టిగా అరుస్తూ… ఆడుకోసాగింది తను. కార్తిక్ నెమ్మదిగా తన దగ్గరకి వెళ్ళాడు.
నీళ్ళల్లో ఎగిరి, ఆడి ఆడి, అలిసిన ఆమె… పక్కనే నీటి మధ్యలో ఉన్న ఒక రాతి బండ మీదకి ఎక్కుదామని ప్రయత్నించి… కాలు జారి కింద పడబోయింది. వెనుక ఉన్న కార్తిక్ తనని పడకుండా గట్టిగా రెండు చేతులతో పట్టుకుని మీదకి లాక్కున్నాడు. నవ్వుతూ అతని కళ్ళలోకి చూసి, అలాగే అతని మీదకి ఒరిగి…
“హ్యాపీ బర్త్డే…” అంటూ… అతని నుదిటి మీద ముద్దు పెట్టింది.
“థాంక్స్” గట్టిగా ఆమెని హత్తుకుంటూ అన్నాడు.
కొన్ని క్షణాలకి… “ఇక్కడ కూర్చో…” అంటూ రాతి బండ మీద కూర్చో పెట్టి “నేను కాఫీ పెడతా…” అన్నాడు.
సరే అంటూ, ఆమె రాతి బండ మీద కూర్చుని, అక్కడ అతను టెంట్ వేసి… కాఫీ చేయడం చూస్తూ కూర్చుంది.
అనుకోకుండా అయిన తమ పరిచయం ఈ రోజు ఇక్కడ దాక వస్తుంది అని కార్తిక్ కాదు, తను కూడా అనుకోలేదు, కానీ తమకు తెలియకుండానే తమ మధ్య మాటలకి అందని బంధం ఏదో అల్లుకుపోయింది. కార్తిక్ కాఫీ కప్స్ తో వచ్చి చేతికి అందించాడు. నవ్వుతూ కాఫీ తీసుకుని కార్తిక్ వైపు చూసింది. కార్తిక్ కూడా నవ్వుతూ వచ్చి పక్కన కూర్చున్నాడు.
కానీ… పైకి లేచిన ఆమె… కార్తిక్ ముందుకి వెళ్లి, అతని ముందు కూర్చుని, అతను కాఫీ తాగే వరకు ఆగింది. తర్వాత ముందుకి వంగుని… ఒకరి పెదవులకి అంటిన కాఫీ రుచి మరొకరు రుచి చూశారు. ఇది ఎవరికీ తెలియని సరికొత్త రుచి… ప్రేమికులకు మాత్రమే తెలిసిన రుచి. తమ జీవితాల్లో మధురంగా మిగిలిపోయే ఆ మధుర క్షణాలను భద్రంగా మదిలో దాచుకుంటూ, ఒకరి చేతిలో ఒకరు చెయ్యి వేసి గట్టిగా పట్టుకుని… జలపాతం చూస్తూ ఉండిపోయారు.
***
చెలికాని ఊహకే చెలరేగిన ఆశల కోరికల ఉప్పెనకి పట్టిన చిరు చెమట… చెలి సొగసుని ఆత్రంగా తాకుతూ ఉప్పొంగుతూ… ఎద ఎత్తులను దాటి ఉరకలేస్తూ… అందాల లోయల్లో దూకి ఆవిరి అవ్వాలని ఆరాటపడినట్టు… నది ప్రవాహం సాగుతుంది. నిశి రాత్రి చెలి సొగసు తీపి జ్ఞాపకంగా అల్లుకుపోతే… ఆ మత్తు నుండి బయటకి రావటం ఇష్టం లేని ప్రియుడిలా… ప్రకృతి పొగ మంచుని చుట్టుకుని బద్దకంగా కదులుతుంది.
అతని చేతిలో ఉన్న ఆమె చేతి వేళ్ళు అతని చేతి వేళ్ళ మధ్య నాట్యమాడుతుంటే, ఆమె తల అతని భుజం మీద వాల్చి ఇద్దరికీ ఇష్టమైన పాటలు వింటూ ప్రకృతిని చూస్తూ… ఆ నిమిషాలను వాళ్ళ జ్ఞాపకాలుగా భద్రపరుచుకోసాగారు. వారి ఏకాంతానికి భంగం కలిగిస్తూ ఆమె ఫోన్ రింగ్ అయింది.
ఫోన్ చూసి… “ఒక్క నిముషం… అమ్మ ఫోన్” అంటూ ఫోన్ లిఫ్ట్ చేసింది.
“చెప్పు అమ్మ…”, “హా…”, “సరే 3 రోజుల్లో వచ్చేస్తా, సరే తమ్ముడు వాళ్ళు ఎలా ఉన్నారు? సరే, జాగ్రత్తగానే ఉంటా, సరే మళ్లీ చేస్తా… బై…” అంటూ ఫోన్ పెట్టేసింది.
ఫోన్ మాట్లాడుతున్నంత సేపు ఆమె కనులలోకి చూస్తూనే ఉన్నాడు.
నిజమే కావాలని కోరుకున్న సంతోషాల ప్రపంచం అంచుల్లో ఉన్న, అల్లుకున్న బంధాల బాధ్యతలు ఉంటే ఆ కనుపాపల వెనుక ఆ ఆలోచన పోదు కదా. అందరం పిచ్చిగా గాలిలో ఎగురుతున్న పక్షులు అనుకుంటాము చాలా సార్లు, కానీ కాదు… బంధాల సంకెళ్లు వేసుకుని గాలిలో ఎగురుతున్న గాలి పటాలం మనం అని గుర్తించలేము. ఇక్కడ ఎవరి జీవితం ఎవరి సొంతం కాదు, సొంతం అనుకుని బ్రతికేస్తూ ఉంటాము అంతే. నిజం చెప్పాలి అంటే మన బ్రతుకు మన కోసం కంటే మన చుట్టూ ఉన్న బంధాలు బాధ్యతలు కోసం, వాళ్ళ కోసం బ్రతుకుతూ ఏదో నచ్చినట్టు బ్రతుకుతున్నాము అనే భ్రమతో బ్రతికేస్తాము అంతే.
“ఓయ్… ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు…” అతని ఆలోచనలకి బ్రేక్ వేస్తూ అడిగింది.
“మళ్లీ పెళ్లి ఎందుకు చేసుకోలేదు…” సూటిగా అడిగాడు ప్రశ్న.
“హ్మ్… మళ్లీ చెప్పాలా సమాధానం…?” అతని కళ్ళ నుండి కళ్ళు తిప్పుకుంటూ అడిగింది.
“లేదు ఇప్పుడు చెప్పు… అమ్మనాన్నలను చూసుకోవటానికి తమ్ముడు ఉన్నాడు కదా…”
“హ్మ్ ఉన్నాడు కానీ వాడి జీవితమే సరిగా లేదు ఇంక అమ్మ నాన్నని ఏం చూసుకుంటాడు…” గొంతులో బాధ తెలుస్తుంది.
“కానీ ఎన్నాళ్ళు ఇలా… నీకంటూ ఒక మనిషి కావాలని లేదా…”
“నా మనిషి అనుకున్న మనిషి పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే నన్ను ఒంటరి చేసి వెళ్ళిపోయాడు. అతనితోనే అతని కుటుంబం కూడా నన్ను ఒంటరిని చేసేసింది ఆస్తి కోసం. ప్రాణాలు పోయే స్థితిలో నాకు ప్రాణం పోసిన మా అమ్మ నాన్న నన్ను మళ్లీ తెచ్చుకున్నారు. ఇప్పుడు వాళ్ళని వదిలి…”
“నా ప్రశ్నకి సమాధానం అది కాదు…”
“నాకంటూ మనిషి కాదు… నా అనుకున్న మనసు ఉంటే చాలు…” ఆ సమాధానం ఇచ్చేటపుడు అతని చేతులు పక్కకి జరిపి అతని ఒడిలోకి జారి పడుకుంది.
“కానీ…” అతను మాట్లాడే లోపు…
“ప్లీజ్ సైలెంట్ గా ఉండు…” అంది అతని చేతిని గట్టిగా పట్టుకుని ఆమె గుండెలపై పెట్టుకుని, కళ్ళు మూసుకుంటూ.
ఆడి ఆడి అలిసిపోయి వచ్చిన కూతురు తన తండ్రి ఒడిలో పడుకుని సేద తీరుతున్నట్లు ఉంది అతనికి ఆమెని చూస్తే. ఖాళీగా ఉన్న మరో చెయ్యితో జుట్టు సవరిస్తూ ఆమె పైకి వంగి ఆమె నుదురు మీద ముద్దు పెట్టాడు. క్షణం కూడా జారిపోకూడదు అన్నట్టు ఆ పెదవులను అలాగే ఉంచి అతని మనసులో మాట చెప్పాలి అనుకున్నాడు. తన నుదిటి మీద పెదవుల తడికి, ఆమె కనులు తడి అయ్యి కన్నీరు కనురెప్పలను దాటి ఆమె చెక్కిళ్ళ మీదకి చేరాయి.
అది గమనించిన అతను “ఏమైంది…” అంటూ కలవరపడుతూ అడిగాడు.
“ఏమి లేదు…” అంటూ బలవంతంగా నవ్వు తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ పైకి లేచింది.
“ఓయ్ ఏమైంది అమూల్ బేబీ…” అన్నాడు పట్టుకుని ఆపుతూ మళ్లీ ఒడిలో పడుకోపెట్టుకుని.
“ఇపుడు ఏమైంది అని అడిగే నువ్వు అమూల్ బేబీవా? నేనా?” చిలిపిగా అడిగింది కన్ను కొడుతూ, చెక్కిళ్ళపై ఉన్న నీటిని తుడుచుకోబోతూ…
ఆమె చేతిని పట్టి ఆపి “ఇవి నా కోసం వచ్చినవే కదా… నాలోనే ఉండాలి…” అంటూ ముందుకు వంగి ఆమె చెక్కిళ్ళపై ఉన్న ఆ కన్నీటి బొట్టుని అతని నాలికతో తీసుకున్నాడు.
అతని చర్యకి ఆశ్చర్యం, అతని ఆలోచన పిచ్చిలాగా అనిపించినా ఎందుకో అతను చేసిన పని కూడా నచ్చింది. ఆ సమయంలో ఆమె ముఖం మీద తగిలిన వెచ్చని అతని ఊపిరి ఆమెలో జలదరింపు కలుగజేసింది. ఆమె అధరాలు విచ్చుకుని ప్రేమ దాహం తీర్చుకో అన్నట్టు ఆహ్వానిస్తున్నాయి. మత్తుతో ఎరుపెక్కిన కళ్ళు అతని పెదవులకి మునిపంటితో గాయం చేసి కొత్త రంగు అద్దాలి అన్నట్లు ఉన్నాయి. తల పైకి ఎత్తిన అతను, ఎద చాటున ఎగిసిపడుతున్న ఆమె ఊపిరి భారాన్ని అంచనా వేస్తూ ఆమె ముఖంలోకి చూసాడు. తనకి తెలిసిన ఆ ముఖం, ఆ కళ్ళు, ఆ చూపు ఈ క్షణం అతనికి కొత్తగా అనిపించాయి. చిరు ఎండకి, దేహంలో రగిలే విరహాగ్నికి ఆమె ముఖం నిండా చిరు చెమటలు పట్టాయి.
“ఇవి కూడా నావల్లే కదా…”, ఆమె సమాధానం కోసం కూడా చూడకుండా, ఆమె ముఖాన్ని రెండు చేతులతో పట్టుకుని, ముత్యాల్లా మెరుస్తున్న ఆ స్వేదబిందువులను ప్రేమగా తన పెదవులతో తనలో కలుపుకోసాగాడు.
నుదిటి పైన…
కనురెప్పల పైన…
చెక్కిళ్ళు…
ముక్కు…
చుబుకం…
ఇలా ముఖంలో పెదవులను…తప్ప ప్రతి అంచున అతని పెదవులు ఆడుతుంటే పరవశంతో కనులు మూసిందే కానీ… ఎగిసిపడుతున్న ఊపిరి, మునిపంటి కింద నలుగుతున్న కింద పెదవి, ఆమెలో రగిలే కోరికను తెలియజేస్తున్నాయి.
తెల్లని లేలేత గులాబీలా ఉండే ఆమె మోము, అతని పెదవుల ఆటకి సిగ్గు… మోహంతో ఎరుపెక్కింది. మోయలేనట్టు ఎద ఎత్తులు అతనిని ఆహ్వానిస్తూ ఆరాటపడుతున్నాయి. ఆమె ఊపిరి వెచ్చగా అతనికి తగలటంతో… “ఏమైంది…” అన్నాడు, ఆమె చెవి అంచుకి చేరి నెమ్మదిగా.
“ఏం… ఏం… లేదు…” భారంగా ఒక్కో పదం కూడబలుక్కుని అన్నదే కానీ… నీకు తెలీదా… అంటూ జుట్టు పట్టుకుని మీదకి లాక్కుని అతన్ని తన కౌగిలిలో బంధించాలి అన్న కోరిక కలిగింది.
“ఏం లేదా…?” అంటూ ఆమె చెవి అంచుని సుతిమెత్తగా పెదవులతో బంధించి ఓ క్షణం ఆగి… “నిజంగానే ఏమి లేదా…” అన్నాడు.
అతని జుత్తు గట్టిగా పట్టుకుని, తన మెడ వంపులో దాచుకుంటూ… “ఊహు…..” అంది.
ఆమె మాటలో దాగున్న మత్తు అతనికి తెలుస్తుంది, మెడ వంపులో అతని ఊపిరి వెచ్చదనం, ఆమెలో కొత్త కోరికలని ఉసిగొల్పుతున్నాయి.
“అమ్మాయి దేహ సౌందర్యంలో ప్రతి అంచున… ప్రతి అంగుళంలో డిఫరెంట్ స్మెల్… డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అంట…” అతను తన నాలుకని బయటపెట్టి, ఆమె మెడ మీద రాస్తూ… అన్నాడు.
“హ్మ్…” చలించటం మర్చిపోయింది అనుకున్న దేహం… కోరికల సెగకి అల్లాడిపోతుంటే మత్తుగా అంది.
“ఇంకా ఏం లేదా?” భుజం అంచున నెమ్మదిగా మునిపంటితో గాయం చేస్తూ అడిగాడు.
“లే….. దు…”, లేదు అన్న పదం అతి కష్టం మీద వచ్చింది బయటకి. ఏది లేదు అనేలా కాక… ఇంకా దగ్గర అవ్వరా అని అతనిని ఆహ్వానిస్తున్నట్టు ఉంది. ఆమె ఆలోచనల్లో కల్లోలం అతనికి అర్థం అయింది.
“ఇంకా లేదా…!” ఆశ్చర్యం నటిస్తూ పైకి తల ఎత్తి, “అందుకే అమూల్ బేబీ అనేది” అన్నాడు నవ్వుతూ.
అతని మాటకి ఆశ్చర్యపోయిన ఆమె కళ్ళు తెరిచి, నాలుక బయట పెట్టి వెక్కిరిస్తున్న అతని జుట్టు గట్టిగా పట్టుకుని “నిన్నూ…” అంటూ మీదకి లాక్కుని బుగ్గల మీద గట్టిగా కొరికింది.
“అబ్బ…” అని నవ్వుతూ ఆమె కళ్ళలోకి అతను చూడటంతో, అతని ఒడిలో నుంచి పైకి లేచి “రాక్షసుడు”, అంటూ అతన్ని ఆ బండ మీదకి వెనకకి తోసింది.
“ఓయ్ ఏం చేస్తున్నావు…” నవ్వుతూ వెనుకకు వాలాడు అతను.
“నోరు తెరిస్తే నాలుక కత్తిరిస్తా…” అంటూ అతని మీదకి వాలింది.
“ఆహా…” అన్నాడు నాలుక బయట పెట్టి… “ఏది చేయి చూస్తా” అన్నట్టు.
“రాతల్లోనే అనుకున్న… బయట కూడా ఇంతేనా నువ్వు…” అంది అతని పెదవులని చేతితో గట్టిగా పట్టుకుని మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండా.
“ఊ… ఊ…” అన్నాడు అలాగే అమాయకంగా ముఖం పెడుతూ.
“ఇలా పెడితే వదిలేస్తా అనుకున్నావా?” అంది ఇంకా గట్టిగా పెదవులని నొక్కుతూ.
వదలకు అన్నట్లు రెండు చేతులతో ఆమెని చుట్టి గట్టిగా అతనికి హత్తుకున్నాడు.
“నావి నాకు ఇచ్చెయ్…” అంది అతని జుట్టులోకి వేళ్ళు పెడుతూ. సమాధానం ఇవ్వటానికి అవకాశం లేక “ఏంటివి?” అన్నట్టు కళ్ళతోనే సైగ చేసి అడిగాడు.
“ఏంటా…” అని నాలుక బయట పెట్టి, అతని పెదవులని వదిలేసి, జుట్టుని పట్టి అలాగే అతని తలని పైకి లేపి…
“నావి అంటూ ఇందాక, నీలో కలుపుకున్నావు కదా నీ పెదవులతో… అవి నీ వల్ల వచ్చినవి, నీలో చేరినవి… మళ్లీ నాకు కావాలి… నీలో కలిసి… నీవి అయినవి నాలో నాకోసం నాతో ఉండాలి…” అంటూ అతని పెదవులని ఆమె పెదవులతో ముడివేసి పూర్తిగా అతని పైకి బరువంతా వేస్తూ ఒరిగిపోయింది. ఆమెని గట్టిగా రెండు చేతులతో పట్టుకొని అతనిలో ఇముడ్చుకున్నాడు.
అలుపన్నది తెలియకుండా… ఊపిరి కూడా ఊపిరి ఆడక అల్లాడేలా వారు ఆ క్షణాలలో మనసు నిండా వాళ్ళవైన జ్ఞాపకాలను నింపుకోసాగారు.
***
సశేషం…