కలల తీరంలో భాగం -3

రచన – తపస్వి

గూటికి చేరే పక్షుల కిలకిలలకి నిద్ర లేచి కనులు తెరిచి చూసింది వల్లి. కలత లేని నిద్ర ఎన్ని సంవత్సరాలు అయింది, మళ్లీ ఈ రోజు కార్తిక్ ఎదపై ప్రశాంతంగా లోకం మైమరిచి నిద్రపోయింది. పక్కన కార్తిక్ కోసం చూసింది, కనపడలేదు. ఓ క్షణం కలవరింత, ఆత్రంగా కళ్ళు అతని కోసం వెతికాయి, కనపడలేదు., వెంటనే చూడాలన్న కోరికతో పైకి లేచి, నాలుగు అడుగులు ముందుకి వేసింది. జలపాతం మధ్యలో పెద్ద బండ మీద ఏదో చిన్న పందిరిలాంటి దాని దగ్గర నిలబడి అక్కడ కర్రలకి పూల తీగల్లాంటివి కడుతూ కనిపించాడు కార్తిక్. కార్తిక్ ని చూసిన తరువాత వల్లి పెదవులపై తెలియకుండానే చిరునవ్వు వచ్చింది.

“ఏంటి ఈ ఫీలింగ్?? నిన్నటి వరకు మాటల్లో మాత్రమే కలిసి ఉన్న మేము, ఈ ఒక్క రోజు మనుషులుగా దగ్గరగా ఉన్నాము., కానీ కనులు తెరిచే సరికి కనపడకపోతే, తనను చూసే వరకు ఎందుకు ఈ అలజడి, ఎందుకు ఈ కలవరపాటు…” తనలో తానే నవ్వుకుని… “కార్తిక్…” అంది గట్టిగా. ఏంటో ఇపుడు పిలిచిన పిలుపులో, ఏదో తెలియని ఒక కొత్త భావన… ఈ క్షణం కార్తిక్ ని చేతుల్లోకి తీసుకుని అతన్ని కౌగిలిలోకి ఒదిగిపోవాలన్న ఆత్రం.

వల్లి పిలుపు వినబడే సరికి చేస్తున్న పని పక్కన పెట్టి, మరో ఆలోచన లేకుండా కార్తిక్ వల్లి దగ్గరకి వచ్చాడు.

“హ్మ్… కాఫీ…” అన్నాడు దగ్గరకి రావటంతోనే,

కార్తిక్ కి సమాధానం ఇవ్వకుండా అడుగు ముందుకి వేసి కార్తిక్ ని చేరి గట్టిగా కౌగలించుకుంది. నవ్వుకుంటూ కార్తిక్ కూడా కౌగిలించుకున్నాడు.

“రెండు నిమిషాల్లో కాఫీ రెఢీ చేస్తా” అన్నాడు, తల మీద ముద్దు పెడుతూ.

“ఏం చేస్తున్నావు…” అంది కార్తిక్ భుజం మీద నుండి ఆ రాతి బండ వైపు చూస్తూ.

“బొమ్మల పెళ్ళి అన్నావు కదా… అందుకే బొమ్మల పెళ్లికి బొమ్మ లాంటి మండపం రెఢీ చేస్తున్న…”

“సరే రా… కాఫీ తాగుతూ మాట్లాడుకుందాం…” అన్నాడు.

“లేదు నువ్వు కాఫీ కలుపు… నేను అది చూసి వస్తా” అంది చిన్నపిల్లలా మారం చేస్తూ.

“హ్మ్ సరే, జాగ్రత్త…” అంటూ, నుదిటి మీద ముద్దు ఇచ్చి కార్తిక్ టెంట్ వైపు వెళ్ళాడు.

వల్లి అడుగులో అడుగు వేసుకుంటూ నీళ్ళ వైపు వెళ్ళింది.

జలపాతానికి కాస్త దూరంలో, నీటి మధ్య, ఓ బండరాయి… దాని మీద రాయికి సపోర్ట్ గా నాలుగు వైపుల నుండి కొన్ని పెద్ద పెద్ద కర్రలు, ఆ కర్రలని కలుపుతూ అడ్డంగా, వరుసలుగా మరి కొన్ని. నీటి ప్రవాహానికి కదిలి కదలకుండా కదులుతున్నాయి. ఎంత కష్టపడి ఉండాలి వాటిని అలా నిలబెట్టటానికి. ఆ కర్రలపై పచ్చని ఆకుల పందిరిలా అలంకరణ, పందిరి అంచులకి అడవి పూల తీగలు, రంగురంగుల పూల తీగలు గాలికి ఎగురుతూ కొత్త అందాన్ని ఇస్తున్నాయి.

గాలికి పందిరికి అల్లిని ఓ పూల తీగ నుండి ఓ పువ్వు ఎగిరి నీటిలో పడింది. వల్లి కంగారుగా వెళ్లి నీటిలో పడి కొట్టుకుపోతున్న ఆ పువ్వును పట్టుకుంది. దాన్ని అపురూపంగా చేతిలోకి తీసుకుంది. కార్తిక్ చేతిలో పడి తమ ప్రేమకి గుర్తుగా నిలిచిన ఆ పువ్వు కూడా, ఎందుకో ఈ క్షణం చాలా ప్రత్యేకం అనిపించి దానికి ఓ ముద్దు పెట్టింది. ఆ పువ్వు అలాగే చేతిలో పట్టుకుని ఆ పందిరిని కనులు ఆర్పకుండా చూస్తూ బండ రాయిని చేరింది.

క్రింద బండ మీద మొత్తం ఆకులు, పువ్వులు అందంగా పరిచి ఉన్నాయి. తల పైకి ఎత్తి చూసింది, చిన్న చిన్న పూల తీగలు అందంగా అలంకరించి వేలాడుతున్నాయి. పందిరి మధ్యగా క్రింద కాస్త ప్లేస్ ఖాళీగా వదిలి, రాళ్ళు అందులో చిన్న చిన్న పుల్లలు పేర్చి ఉన్నాయి., అవి ఎందుకో అర్థం అయింది. కానీ తాను నిద్రపోయి లేచిన రెండు గంటల లోపే ఇన్ని ఎలా చేశాడు, ఎంత కష్టపడి ఉంటాడు… అనుకుంటూ తమ కలల పందిరిని కనులలో నింపుకుంటూ, వాటిని మళ్లీ మళ్లీ తడిమి చూస్తూ మైమరచిపోయింది వల్లి.

“ఓయ్ నిన్నే…” నాలుగోసారి పిలిస్తే కానీ పలకలేదు వల్లి… హా… అంటూ…

రాయి పక్కగా చేతిలో కాఫీ కప్స్ తో నిలబడి నవ్వుతూ చూస్తున్నాడు కార్తిక్.

“సారీ…” అంటూ వచ్చి, చేతిలో కప్ అందుకుని ఆ బండరాయి అంచున కూర్చుంది.

కార్తిక్ కూడా వల్లి పక్కన కూర్చున్నాడు.

“ఇంత అవసరమా…” కాఫీ సిప్ చేస్తూ అడిగింది.

“వద్దు అనుకుని వదులుకున్నది, ఆలోచనలలో కూడా లేనిది, నీ ప్రేమలో ఓ కలలా అనుకున్నది, నా దేవి అడగకుండానే వరంలా… నా కల నిజం చేస్తా అంటే… జీవితంలో మరిచిపోలేని ఓ జ్ఞాపకంగా నిలబెట్టుకోవాలి అని అనుకోవటంలో తప్పేం లేదుగా…”

“ఓయ్ కార్తిక్…” అంది, ఆ పిలుపుకి అర్థం ఏంటో తెలుసు కార్తిక్ కి.

“దేవిగారు తొందరగా తాగితే ఇంకా చాలా పనులు ఉన్నాయి…” అన్నాడు నవ్వుతూ.

“అవునా… అడవి కాబట్టి ఇలా చేశావు, అదే సిటీలో ఉండి ఉంటే…”

“హా హా… సిటీలో కాదు ఒక వేళ రోడ్డు మధ్యలో ఉన్నపుడు అడిగి ఉంటే అక్కడే జనాల మధ్యే…” గట్టిగా నవ్వేశాడు…

“అమ్మో… చేసినా చేస్తావు…” అంది, కార్తిక్ నవ్వుకి జతకలుస్తూ.

నీటి ప్రవాహం కూడా అలజడి మరచి మౌనంగా వీరి మాటలు వింటూ మురిసిపోతూ, వీరి కథ తీరాలలో ఉన్న స్నేహితులకి చెప్పాలి అనుకుంటూ ఉప్పొంగి ప్రవహిస్తోంది.

కాఫీ తాగడం పూర్తి చేసి కప్పులని అక్కడే నీటిలో కడిగి, ఇద్దరు నడుచుకుంటూ టెంట్ వైపు వెళ్లారు.

“కూర్చో” అనటంతో, ఏం చేస్తాడు అనే ఆసక్తితో కూర్చుని కార్తిక్ వైపు చూస్తూ కూర్చుంది.

చేతిలో మెహంది కోన్ తో వచ్చి ముందు నిల్చున్నాడు.

“ఇది కూడా తెచ్చావా…” అంది ఆశ్చర్యంగా…

“నీ చేతికి గోరింటాకు ఉంటే చూడటం ఎంత ఇష్టమో నాకు తెలుసుగా…” అన్నాడు ఓపెన్ చేస్తూ.

“హ్మ్… తెలుసు తెలుసులే…

ఎర్రగా పండిన నీ చేతి గోరింటాకును నా పెదవులు తాకగానే, సిగ్గుతో ఎర్రబడే నీ చెక్కిలి సోయగం మరువ తరమా…

ఇది కూడా గుర్తు ఉంది…” అంది ముసిముసిగా నవ్వుతూ.

వల్లి ముందు కూర్చుని తన చేతులు కార్తిక్ చేతులలోకి తీసుకుంటుంటే…

“నేను పెట్టుకుంటా కదా…” అంది.

“లేదు నేనే పెట్టాలి… నా దేవిని నేనే అలంకరించాలి…” అన్నాడు.

వద్దు అనలేక చెయ్యి ఇచ్చి, కార్తిక్ వైపు ఆరాధనగా చూస్తూ ఉంది.

పది నిముషాల్లో రెండు చేతులకి పెట్టి… “చూడు నీకు నచ్చుతుందో లేదో…” అన్నాడు.

“ఆ… అయిపోయిందా…” అంటూ ఉలిక్కిపడి రెండు చేతులు చూసుకుంది.

వల్లి కళ్ళల్లో మెరుపు. ఆ మెరుపుకి అర్ధం ఏంటో తెలుసు కార్తిక్ కి.

“ఏ పని లేకపోతే సీజన్ లో మెహంది పెట్టి అయినా బ్రతికేయవచ్చు నువ్వు…” అంది ఆటపట్టిస్తు, తన సంతోషం బయటకి కనపడకుండా దాచాలన్న ప్రయత్నం చేస్తూ.

“హా హా అలాగా…” అంటూ వల్లి కాలు పట్టుకున్నాడు.

“ఓయ్…” అంటూ వెంటనే కాలు వెనక్కి లాక్కుంది వల్లి.

“ఏంటి… కాళ్ళకి పెట్టొద్దా…”

“నేను పెట్టుకుంటా… ప్లీజ్…” అంది ఇబ్బందిగా.

“ఆహా… అంత ఓవర్ చేయకు…” అంటూ, ఓ కాలు తీసుకున్నాడు.

“అది కాదురా…” అంది ముద్దుగా.

“ఏమి కాదు…” అంటూ కార్తిక్ తన పని మొదలు పెట్టాడు.

ముసిముసిగా నవ్వుకుంటూ కార్తిక్ నే చూస్తూ కూర్చుంది. ఇది ఇష్టమా… ప్రేమ… వ్యామోహం… కోరిక… ఎవరేం అయిన అనుకోని, కానీ ఈ క్షణం ఇద్దరం ఒకరికొకరం… ఇది తమ ప్రపంచం… ఈ క్షణం తమ ఇద్దరి ప్రపంచం… ఈ ప్రపంచంలో మరో ఆలోచనకి తావు లేదు… ప్రతి ఆలోచన… ప్రతి క్షణానికి వారి ప్రేమే చిరునామా అయ్యి ఉండాలి.

“అయిపొయింది, పది నిముషాల్లో కడుక్కో… నేను వెళ్లి అక్కడ పని చూసి వస్తా…” అంటూ పైకి లేచాడు.

కాళ్ళ వైపు చూసుకుని… “పది నిముషాలా…” అంది అప్రయత్నంగా కార్తిక్ ముఖంలోకి చూస్తూ.

“అంటే ఎర్రగా పండదులే… కానీ చీకటిపడే లోపు…” వల్లి కళ్ళలో కన్నీటి తెర కనపడే సరికి ఆగి…

“ఏమైందిరా అన్నాడు…” ప్రేమగా తల మీద నిమురుతూ.

“నేనెప్పుడన్న నీకు I LOVE YOU చెప్పానా” అంది లేని నవ్వు తెచ్చుకుంటూ.

“చెప్పకు… అలా చెప్పిన వాళ్ళు నా జీవితంలో లేరు. కానీ ప్రేమ అంటే మాటల్లోనే చెప్పుకోవల్సిన అవసరం లేదు…” అన్నాడు వల్లి తలని గుండెలకి హత్తుకుంటూ.

“కానీ నాకు నీ ప్రేమ కావాలి…”

“నీ ప్రేమలోనే నేను కొత్తగా ఊపిరి పోసుకున్న, ఎలాంటి పరిస్థితి ఎదురైనా నీ ప్రేమని మాత్రం వదులుకోలేను…” వల్లి తల నిమురుతూ అన్నాడు.

ఇద్దరి మధ్య మౌనం అల్లుకుంది రెండు నిముషాలు.

“సరే నువ్వు వెళ్లు…” అంది కార్తిక్ కి కాస్త దూరంగా జరుగుతూ.

“హ్మ్… సరే…” అంటూ…

“అమూల్ బేబీ…” అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టి అక్కడ నుండి కదిలాడు.

“ఓయ్ నేనేం కాదు…” అంది… సిగ్గుతో నవ్వుకుంటూ.

“హా హా నిజమే… కాదు అని ప్రూవ్ చేసావుగా ఇంతకు ముందు…” అన్నాడు వెళ్తూ.

“నిన్ను…” అంది చిరుకోపంగా.

“హా హా హా…” అంటూ పందిరి వైపుగా వెళ్ళిపోయాడు కార్తిక్.

వల్లి తన చేతులకి, కాళ్ళకి ఉన్న గోరింటాకు చూసుకుంటూ… మురిసిపోతూ…

“అరే చీర తెచ్చుకుని ఉంటే బాగుండేది కదా…” అనుకుంది.

***

మనసు పడిన మనిషి ఒంటరిగా వదిలేసి వెళ్తే, తను మళ్లీ వచ్చి కనపడే క్షణం వరకు ఆ ఎదురు చూపు అంత భారంగా ఉంటుందని అపుడే తనకి తెలిసింది. ప్రతి క్షణం లెక్కపెట్టుకుంటూ, చేతుల వైపు… కాళ్ళ వైపు… జలపాతం వైపు చూస్తూ ఉంది. కార్తిక్ అక్కడ ఏదేదో చేస్తూ ఉన్నాడు.

తను కూర్చున్న చోటు నుండి కనపడటం లేదని, కాస్త కదిలి వచ్చి కార్తిక్ తన కంటికి కనపడేలా కూర్చుంది. కాసేపటి తర్వాత అంతకు మించి అక్కడ కూర్చోలేక లేచి కార్తిక్ వైపు నడక ప్రారంభించింది. చేయాల్సింది అంతా పూర్తి అయిందా, లేదా అనుకుంటూ మరోసారి పందిరి అంతా కలయజూసి… హ్మ్… పెర్ఫెక్ట్ అనుకున్నాడు.

“ఓయ్ పిల్లాడా…” పిలుపు వినబడే సరికి, వెనక్కి తిరిగి చూసి… “నేనే వచ్చే వాడిని కదా, నీటికి గోరింటాకు పోతుంది చూడు…” అన్నాడు.

“ఎలాగైనా కడగాల్సిందే కదా…” అంది ఒడ్డుకి చేరుతూ.

“హ్మ్… పండిందా…” చేతుల వైపు చూస్తూ అడిగాడు.

“కాస్త పండిందిలే బాబు…” అంది.

“హ్మ్… మధ్యాహ్నం పెట్టాల్సింది నువు నిద్రలో ఉన్నప్పుడు, కానీ మళ్ళీ ఒళ్లు అంతా పూసుకుంటావు అని పెట్టలేదు…”

“మంచి పని చేసావు… సరే ఇక కడుగుతావా…” అంది చేతులు చూపిస్తూ.

నవ్వుకున్న కార్తిక్ “రా…” అన్నాడు నీళ్ళలోకి దిగుతూ…

రాయి మీద కూర్చుని కాళ్ళుకార్తిక్ కి అందేలా పెట్టి… “కడుగు…” అంది.

నవ్వుతూ… వల్లి కళ్ళలోకి చూసి… వల్లి కాలు పట్టుకుని నీళ్ళు పోసి కడిగాడు.

రెండు కాళ్ళు, చేతులు కడగటం అయ్యే సరికి వల్లి చెక్కిళ్ళు సిగ్గుతో ఎర్రగా అయిపోయాయి.

“హ్మ్ పర్వాలేదు బాగానే పండింది…” అన్నాడు చేతులు పట్టుకుని చూస్తూ.

“ఆహా…” అంది నవ్వుతూ.

ఆ చేతులని అలాగే తీసుకుని కార్తిక్ తన పెదవులతో వాటి మీద ముద్దు పెట్టాడు.

“మనసైన వాడు ముద్దాడిన క్షణాన… పండిన గోరింట కూడా పగడాలై మురిసిపోవును…” అంది నవ్వుతూ.

“ఆహా…” అంటూ, వల్లి చేతిని పట్టుకుని నీళ్ళలోకి లాగి నీళ్ళు మీదకి జల్లాడు.

“అబ్బా… తడిచి పోతున్నా…” అంది చిరు కోపంగా.

“ఆహా… పెళ్లి కూతురుకి స్నానం చేయించరా మరి పెళ్లికి ముందు…”

“ఓహ్ అదొకటి ఉందా…” అంది, తాను కూడా నీళ్ళు చల్లుతూ కార్తిక్ మీదకి.

ఇద్దరు సరదాగా నీళ్లలో కాసేపు ఆడుకుంటూ పూర్తిగా తడిచిపోయారు.

కార్తిక్ ముందుకి వచ్చి వల్లిని చేతుల్లోకి తీసుకుని… “నలుగు పెట్టాలా…” అన్నాడు చిలిపిగా.

“ఆహా… కానీ నలుగు తెచ్చి ఉండవుగా అంది…” కొంటెగా నవ్వుతూ.

“హా హా… ఇక్కడ ఏదో ఒక ఆల్టర్నేట్ చేస్తున్న కదా… దానికి కూడా ఉంది…” అన్నాడు నడుము చుట్టూ చెయ్యి వేసి దగ్గరకి లాక్కుని, బురద ఉన్న వైపు చూపిస్తూ…

“ఛీ… అసలు నిన్ను…” అంటూ ప్రేమగా గుండెలపై కొట్టి… “తమరి అల్లరి ఇక్కడతో ఆపితే మంచిది స్వామి… లేట్ అయితే లైట్స్ కూడా లేవు…” అంది నవ్వుతూ.

“హ్మ్ నిజమే…” అంటూ వల్లిని చేతుల్లోకి ఎత్తుకున్నాడు, వల్లి రెండు చేతులు కార్తిక్ మెడ చుట్టూ వేసి… “పెళ్లి కూతురిని బుట్టలో అనుకుంటా తీసుకువెళ్ళేది” అంది కార్తిక్ గడ్డం మీద ముద్దు పెడుతూ.

“హా అంటే ఇపుడు మండపానికి కాదుగా, టెంట్ లోపలకి…” అన్నాడు వల్లిని మరింత గట్టిగా పట్టుకుని, తన ముక్కు మీద ముద్దు పెడుతూ.

“హెల్లొ ఇది బొమ్మల పెళ్లే…” అంది నవ్వుతూ.

“హా హా హా అది కూడా బొమ్మల…” అన్నాడు నవ్వుతూ.

“ఛీ… అసలు సిగ్గే పడవే…” అంది నవ్వుతూ.

మాటలు పూర్తయ్యే సరికి టెంట్ దగ్గరకి చేరుకున్నారు ఇద్దరు. వల్లిని దింపి, బ్యాగ్లో నుండి ఒక చీర తీసుకుని వచ్చాడు, ఈ లోపు వల్లి టవల్ తో తల తుడుచుకుంటూ ఉంది.

“ఇదిగో ఈ చీర కట్టుకో…” అంటూ ఇచ్చాడు.

“చీర… కానీ…” అంది అందుకుంటూ.

“ఏమైంది…” అన్నాడు టవల్ వల్లి చేతిలో నుండి తీసుకుంటూ.

“అంటే చీర ఒక్కటి అయితే సరిపోదు కదా, ఇంకా చాలా ఉండాలి…” అంది తన చేతిలో ఉన్న తెల్లని చీర వైపు చూస్తూ.

“హ్మ్… తెలుసు… అన్ని ఈ ప్యాక్ లో ఉన్నాయి, నీకు సరిపడతాయి అనుకునే సైజ్ లో డిఫరెంట్ గా, ఏది సెట్ అవుతుందో అదే వేసుకో…” అంటూ మరో ప్యాకెట్ ఇచ్చాడు.

“అన్ని ముందే ఏర్పాట్లు చేసుకున్నావుగా…” అంది ఆశ్చర్యంగా.

“పెళ్లికి అని కాదు కానీ… నిన్ను ఈ చీరలో చూడాలని…” అన్నాడు తల తుడుచుకుంటూ.

“హ్మ్ సరే పది నిముషాలు…” అంటూ, అవి తీసుకుని టెంట్ లోపలకి వెళ్ళింది వల్లి.

కార్తిక్ తల తుడుచుకుని, ఉన్న వాటిలో మంచి డ్రెస్ వేసుకున్నాడు.

“రావచ్చా…” అని పిలుపు వినబడడంతో టెంట్ వైపు చూసాడు “రా…” అంటూ.

టెంట్ నుండి వల్లి బయటకి రావటంతోనే తనని తాను మరిచి కళ్ళు అప్పగించి చూస్తూ ఉండిపోయాడు.

“ఓయ్ ఏంటి ఆ చూపు కొరుక్కు తినేసాలా…” అంది నవ్వుతూ.

“హ హ… అదేం లేదు…” అన్నాడు తడబడుతూ.

“బాలేదా…” అంది పైట సరిచేసుకుంటూ.

“లేదు… లేదు… చాలా చాలా బాగున్నావు…” అన్నాడు పదాలు కూడబలుక్కుని.

“నిజమేనా…” అంది మళ్ళి ఒకసారి చీర చూసుకుంటూ.

“ఏ… ఎందుకు అలా అడుగుతున్నావు…” అన్నాడు, వల్లిని పైనుండి క్రిందకు చూస్తూ.

“అంటే అంత బాగుండి ఉంటే… ఏదో ఒక కవిత చెప్పేవాడివి కదా… అలా సైలెంట్ గా ఉంటే…”

“నిజమే కానీ ఇపుడు నిన్ను ఇలా చూస్తుంటే నా అక్షరాలు కూడా మూగబోయాయి, ఏం చేయమంటావు…” అన్నాడు దగ్గరకి వస్తూ.

“ఆహా…” అంది చిలిపిగా నవ్వుతూ.

“నచ్చిందా…” అన్నాడు.

“చాలా…” అంది కార్తిక్ చెయ్యి తీసుకుని ముద్దు పెట్టుకుంటూ.

వల్లి పెట్టుకున్న కాటుకని చేత్తో తీసుకుని, వల్లి బుగ్గ మీద పెట్టి, “నా దిష్టి తగిలేలా ఉంది…” అన్నాడు.

“ఆహా… ఇది దిష్టి చుక్క అనుకోవాలా? లేక పెళ్లిలో పెట్టే బుగ్గచుక్క అనుకోవాలా??” అంది ఆలోచిస్తున్నట్టు నటిస్తూ.

“నిజమే కదా… సరే ఇంకో చుక్క పెట్టనా…”

“వద్దు… ఒక్కటి చాల్లె… వదిలితే ఒళ్ళంత చుక్కలతో ముగ్గు వేస్తారు సారు… నాకు తెలీదా…” అంటూ, తను కూడా కాటుక తీసి… కార్తిక్ బుగ్గ మీద చుక్క పెట్టింది.

“వెళ్దామా…” అన్నాడు నవ్వుతూ.

“హ్మ్ సరే…” అంటూ కార్తిక్ చెయ్యి పట్టుకుని, కార్తిక్ అడుగులో అడుగు వేసుకుంటూ నడిచింది.

జీవితాంతం ఈ చేతులు కలిసి ఉంటాయో లేదో తెలీదు, కలిసి ఉంటారో లేదో తెలీదు, కానీ ఇద్దరి మదిలో ఈ క్షణం ఒకటే భావన… తమ కోసం తాము బ్రతికే క్షణాలు, తరువాత ఏదైన అవ్వని… ఇపుడు తమకి కావాల్సింది తమ ప్రేమ… కొన్ని జ్ఞాపకాలు.

నీటిలో వల్లి చీరతో నడవటానికి ఇబ్బంది పడుతుందని… చేతులతో ఎత్తుకుని తీసుకుని వెళ్ళాడు.

“ఇదే మన బొమ్మల పెళ్లికి పందిరి…” అన్నాడు దింపుతూ.

పుల్లలు వెలిగించి ఉన్నాయి, పక్కన అడవి తీగల దండలు, పువ్వులు విడదీసి కుప్పగా పోసి ఉన్నాయి… అవే తలంబ్రాలు.

సిగ్గుతో కార్తిక్ చెయ్యి పట్టుకుని మండపంలోకి అడుగు పెట్టింది.

రెండు తీగలు తీసుకుని, ఒకటి వల్లి తలకి బాసికగా కట్టాడు. కార్తిక్ చేతి నుండి ఇంకోటి తీసుకుని కార్తిక్ కి కట్టింది. పక్కన తగిలించి ఉన్న దండలు తీసుకుని వల్లి మెడలో ఒకటి వేశాడు, వల్లి మరొకటి అందుకుని కార్తిక్ మెడలో వేసింది.

“కూర్చుందామా…!” అన్నాడు రాళ్లతో పీటలులా పేర్చిన చోటు చూపిస్తూ. సరే అన్నట్టు సిగ్గుతో తల ఊపింది వల్లి.

పేరుకి బొమ్మల పెళ్ళి అందే కానీ… నిజమైన పెళ్లిలాగా అనుభూతి చెందుతుంది వల్లి.

“ఒక్క నిమిషం…” అంటూ జేబులో ఉన్న ఫోన్ తీసి…

“ఆ దొరికింది…” అంటూ ఒక పెళ్లి పాట పెట్టి… “ఇపుడు ఓకె…” అన్నాడు వల్లి చెయ్యి పట్టుకుని.

ఇద్దరు వెళ్లి పెళ్లి పీటలు మీద కూర్చున్నారు. పెద్దల మధ్య పెళ్లితంతు ఎలా జరుగుతుందో అలా ప్రతి అంకం గడిచింది.

తాళి దగ్గరకి వచ్చేసరికి, ఇపుడు ఏం చేస్తాడు అనుకుంటూ సిగ్గుతో తల దించుకుని ఉంది వల్లి.

తన మెడలో ఉన్న బంగారు గొలుసు తీసి, వల్లి మెడలో వేసి… “ఇదే తాళి…” అన్నాడు వల్లి మెడపై చిన్నగా గిల్లుతూ.

పసుపు తాడు కాకపోయినా… ఆ గొలుసు మెడలో పడగానే సంతోషంతో కన్నీళ్లు ఉబికి వచ్చాయి వల్లికి. దాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా నీళ్ళు నిండిన కళ్ళతో అలా చూస్తూ ఉండిపోయింది.

“ఏమైంది దేవి గారికి…” అన్నాడు వల్లి కనుల నుండి జారిన కన్నీరు చెంపపై కనపడేసరికి.

“I LOVE YOU కార్తిక్…” అంటూ అలాగే కార్తిక్ పైకి ఒరిగిపోయింది వల్లి.

తనలో కలిగే అలజడి, సంతోషం… ఇంకెలా చెప్పాలో వల్లికి అర్ధం కాలేదు. పిచ్చిగా కార్తిక్ ముఖంపై ముద్దుల వర్షం కురిపించి, అలిసిపోయి అలాగే పడుకుంది.

“ఇంకా తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం, దాని తరువాత ఫస్ట్ నైట్… ఇపుడే ఇక్కడే పెళ్లిపందిరిలో అంటే బాగోదేమో…” అన్నాడు వల్లి గడ్డం అంచున కొరుకుతూ.

“అబ్బ… రాక్షసుడు…” అంటూ నవ్వుకుని పైకి లేచి మళ్ళీ కూర్చుని, పక్కన ఉన్న పువ్వులను కార్తిక్ మీదకి విసిరింది.

నవ్వుతూ కార్తిక్ కూడా తిరిగి విసిరాడు. కొన్ని నిముషాలు అల్లరిలో లోకం మరిచి గడిపిన వాళ్ళిద్దరు, పందిరి బయటకి చేతులు పట్టుకుని వచ్చారు. అప్పటికే చీకటి పరదా కప్పేసింది అడవి.

“చీకటిలో అరుంధతి కనపడదుగా ఇపుడెలా…” అంది కార్తిక్ భుజం మీద తల వాల్చుతూ.

“అరుంధతి కాకపోతే, అటు చూడు ఎన్ని ఉన్నాయి…” అన్నాడు ఆకాశం వైపు చూపిస్తూ.

మొదటిసారి చీకటిలో, వెన్నెలలో మెరిసిపోతున్న ఆ పచ్చని అడవి, జలపాతం, ఆకాశం, నిండు చంద్రుడు… మైమరిచి కార్తిక్ ని గట్టిగా పట్టుకుని అలాగే కూర్చుంది.

ఇద్దరు అక్కడే ఎంతసేపు అలా మౌనంగా కూర్చున్నారనేది తెలీదు, ఎపుడు టెంట్ కి చేరారు అని తెలియలేదు. కానీ వాళ్ళు ఆ క్షణం నుండి గడిపిన ప్రతిక్షణం గురించి ఆ పచ్చని ప్రకృతి సిగ్గుతో కథలు కథలుగా చెబుతూనే ఉంది.

వాళ్ళు అక్కడ నుండి వెళ్లాల్సిన సమయం వచ్చింది, అంతా పిచ్చిగా మళ్లీ కలయ తిరిగి, అన్ని జ్ఞాపకాలుగా భద్రపరుచుకుని, వాళ్ళు అక్కడ నుండి వెళ్ళగానే… మళ్లీ ప్రకృతిలో కూడా ఏదో వెలితి కనపడింది.

***

:: ఇందిరా పార్క్సిగ్నల్స్ దగ్గర::

“నేనే దింపుతా కదా…” అన్నాడు బండి స్లో చేస్తూ.

“వద్దు… నా ఫ్రెండ్ చూస్తే బాగోదు…” అంది గట్టిగా పట్టుకుని కార్తిక్ ని.

“హ్మ్…” అంతకు మించి కార్తిక్ నోటి వెంట మాట రావటం లేదు. బాధతో గొంతు పూడుకుపోయింది.

వల్లి పరిస్థితి అలాగే ఉంది, తన కన్నీళ్లకు కార్తిక్ షర్ట్ తడిచింది. బండి ఆగింది, వల్లి దిగింది. స్టాండ్ వేసి వల్లి ఎదురుగా నిల్చున్నాడు కార్తిక్. ఇద్దరి కళ్ళల్లో నీళ్ళు, ముఖంలో బాధ కనపడకూడదు అని అనుకుంటున్నారే కానీ… అది వాళ్ళ వల్లకావటం లేదు. 3 రోజుల క్రితం వరకు, కలిసే క్షణం ఒక్కటి అయినా ఉంటే చాలు అనుకున్న ఇద్దరు… ఇపుడు విడిపోయే క్షణం రాకుండా ఉంటే బాగుండు అనుకుంటున్నారు.

“వల్లి…”

“హా…”

“అది…”

“ప్లీజ్ అడగొద్దు… అడిగితే ఇక్కడ నుండి వెళ్ళలేను, నీకు తెలుసు…” అంది కార్తిక్ దగ్గరకి వచ్చి, ఉన్నది రోడ్డు పక్కన, వచ్చి పోయే బండ్లు, మనుషులు, చుట్టూ ఉన్న వాళ్ళు వీళ్ళని గమనిస్తున్నారన్న ఆలోచన కూడా లేదు ఇద్దరికీ.

నోరు తెరిచి ఏదో మాట్లాడాలి అనుకున్నాడు కానీ… నోరు పెగలక… వల్లిని దగ్గరకి లాక్కుని కౌగలించుకుని “జాగ్రత్త…” అన్నాడు.

“నువ్వు కూడా…” అంటూ అల్లుకుపోయింది వల్లి.

“మాస్టారు… ఇది రోడ్డు…” ఎవరో అరిచినట్టు అనిపించి ఇద్దరు ఉలిక్కిపడి చుట్టూ చూసి నవ్వుకున్నారు.

“ఆటో ఆపనా?” అన్నాడు.

“హ్మ్…” అందే కానీ కార్తిక్ ని వదిలి వెళ్ళాలి అని లేదు వల్లికి. రోడ్డు మీద వెళ్తున్న ఆటో ఒకటి ఆపాడు కార్తిక్.

“కార్తిక్…” పిలిచింది వల్లి.

“హా” అన్నాడు.

“ఏం లేదులే…” అంది.

“రా…” అనటంతో బ్యాగ్ తీసుకుని కళ్ళ వెంట నీళ్లు వస్తుంటే మౌనంగా ఆటో దగ్గరకి వెళ్ళింది.

“ఎక్కు… వెనక నేను వస్తా…” అన్నాడు.

“సరే…” అంటూ బ్యాగ్ లోపల పెట్టి, కార్తిక్ చెయ్యి పట్టుకుని దగ్గరకి తీసుకుని, నుదిటి మీద ముద్దు పెట్టి, “వెళ్ళొస్తా…” అని కార్తిక్ సమాధానం కోసం చూడకుండా ఆటో ఎక్కేసింది.

ఇపుడు తను ఏడిస్తే వెళ్ళాలి అనుకున్న తను వెళ్ళలేదు, అని తెలిసి కార్తిక్ వచ్చే ఏడుపు అతి కష్టం మీద ఆపుకుంటూ…

“బై…” అన్నాడు చెయ్యి పట్టుకుని.

“బై…” అంది.

ఆటో స్టార్ట్ అయింది, ఆటో కదులుతుంటే వాళ్ళ చేతులు విడిపోయాయి. ఆటో ముందుకి వెళ్ళింది. కార్తిక్ వెంటనే బండి దగ్గరకి పరిగెత్తాడు, కీ ఆన్ చెయ్యలేదు అన్న సంగతి కూడా మర్చిపోయి బండి స్టార్ట్ చేయటానికి ట్రై చేస్తున్నాడు, వెళ్ళిపోతున్న ఆటో వైపు చూస్తూ.

వెళ్తుంది మనిషి మాత్రమే కదా… కానీ ఏంటో… తన ప్రాణమే అలా వెళ్ళిపోతున్న భావన… కార్తిక్ కనుల వెంట కన్నీళ్లు తెలియకుండానే వచ్చేస్తున్నాయి. మరో పక్క వల్లి పరిస్థితి అంతే, చిన్నపిల్లలాగా ఏడుస్తూ ఉంది. మధ్యలో ఆటో నుండి బయటకు చూస్తుంది, కార్తిక్ వస్తున్నాడా లేదా అని.

కార్తిక్ కనపడక కంగారు ఎక్కువ అయింది. సెంటర్ రావటం, సిగ్నల్ పడటంతో ఆటో ఆగింది. ఆగిన మరుక్షణం వల్లి బ్యాగ్ తీసుకుని, ఎంత అని కూడా చూడకుండా 500 నోటు ఇచ్చి, నువు వెళ్ళిపో అని, ఆటో దిగేసింది బ్యాగ్ తో సహా.

ఆటో దిగి కార్తిక్ కోసం చూసే సమయానికి కార్తిక్ బండి పక్కన ఆపి స్టాండ్ వేసి వల్లి దగ్గరకి పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇద్దరు ఎందుకు ఏడుస్తున్నారో వారికే తెలీదు.కానీ ఒక్క క్షణం కూడా దూరంగా ఉండలేమన్నట్టు ఒకరిని ఒకరు చేరి గట్టిగా కౌగలించుకున్నారు. ఏం అయిందో అర్థం కానీ ఆటో డ్రైవర్, నడుస్తూ రోడ్డు దాటి వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. సిగ్నల్ వల్ల అక్కడ ఆగిన వాళ్ళు అందరూ వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు.

“ఇప్పుడే పెళ్లి చేసుకుందామా…” ఇద్దరి నోటి నుండి ఒకేసారి వచ్చింది. ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. “పద…” అంటూ కార్తిక్ వల్లి చెయ్యి పట్టుకుని రోడ్డుకి మరో పక్కగా ఉన్న గుడికి తీసుకువెళ్ళి ఇక్కడే ఉండు అంటూ పరిగెత్తుకు వెళ్ళాడు. అసలేం జరుగుతోంది తెలుసుకోవాలన్న కుతూహలంతో ఆటో డ్రైవర్ కూడా వాళ్ళ వెనుక వచ్చాడు.

వల్లి బ్యాగ్స్ పక్కన పెట్టి, కళ్ళు తుడుచుకుని, అక్కడ ఉన్న కుంకుమ తీసుకుని పెట్టుకుంది. ఐదు నిముషాలు అయ్యేసరికి కార్తిక్ చేతిలో పసుపుతాడు, దానికి ఒక పసుకు కొమ్ముతో వచ్చాడు. పంతులు గారికి “పెళ్లి మంత్రాలు చదవండి” అంటూ… వల్లిని దగ్గరకి తీసుకుని, చుట్టూ జనాలు ఆశ్చర్యంగా చూస్తూ ఉండగా వల్లి మెడలో తాళి కట్టాడు.

తన గుండెలపై పడిన పసుపు తాడు చూసి ఆనందంతో కార్తిక్ ని గట్టిగా కౌగలించుకుని ఉండిపోయింది. చుట్టూ ఉన్న జనాలకి కాస్త ఆలస్యంగా అర్థం అయి, చప్పట్లతో వాళ్ళని అభినందించారు.

“థాంక్స్…” అంటూ, ఇద్దరు బ్యాగ్స్ తీసుకుని మళ్ళీ బైక్ దగ్గరకి వచ్చారు.

వెనుక ఆటో డ్రైవర్ కూడా వచ్చి… “ఇదిగో భయ్యా…” అంటూ కార్తిక్ కి ఫోన్ ఇచ్చాడు.

ఏంటి… అన్నట్లు చూసింది వల్లి…

ఫోన్లో గ్రూప్ వీడియో కాల్ చూపించాడు కార్తిక్…

కాల్ లో కార్తిక్ అమ్మ, వల్లి అమ్మ నాన్న… ఉన్నారు.

వల్లికి షాక్, “ఇదెప్పుడు చేశావు…” అంటూచూసింది.

“హా హా తరువాత చెబుతాలే…” అన్నాడు.

“ఇంటికి ఎప్పుడు వస్తున్నారు…” అన్నారు ఇద్దరి ఇంట్లో వాళ్ళు.

“లాంగ్ డ్రైవ్ కి వెళ్తున్నాం… వచ్చాక వస్తాం…” ఇద్దరూ ఒకేసారి నవ్వుతూ చెప్పారు.

కార్తిక్ ఫోన్ కట్ చేసి,

“సో…” అన్నాడు.

“సో… ఏంటి… ఆకలి వేస్తుంది…” అంది.

“హాహాహా… సరే పద…” అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ. వల్లి కూడా నవ్వుతూ బండి ఎక్కి, “అయితే ఇప్పుడు నాకు నువ్వు నిజంగానే మొగుడివి, మనం నిజంగానే పెళ్లి చేసుకున్నాం కదా…” అంది.

“హాహాహా తూచ్ తూచ్… ఇది కూడా బొమ్మల పెళ్లి అన్నావు కదా…” అన్నాడు బండి స్టార్ట్ చేస్తూ.

“నేను కాదు నువ్వు అన్నా కూడా చంపేస్తా…” కార్తిక్ ని గిచ్చుతూ అంది.

ఇద్దరూ గట్టిగా నవ్వుకున్నారు, వారి బండి సిగ్నల్స్ దాటి వేగంగా వెళ్ళిపోతుంది.

***

మళ్లీ అదే అడవి, అదే ప్లేస్, ప్రేమికులుగా వచ్చి బొమ్మల పెళ్లి చేసుకుని, మదన రాజ్యంలో విహరించి వెళ్లిపోయి, మళ్లీ గంటలు తిరగకుండానే భార్యభర్తలుగా వచ్చిన వల్లి కార్తిక్ లతో కబుర్లు చెప్పుకుంటూ, పది రోజుల నుండి వాళ్ళ అల్లరికి సిగ్గుతో తాను కూడా మంచు పరదా చాటున దాక్కుని ప్రకృతి కూడా మురిసిపోతుంది.

#సమాప్తం#

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!