బంధనాల సంకెళ్ళు

బంధనాల సంకెళ్ళు

రచన:: పరిమళ కళ్యాణ్

          ఆదివారం ఉదయాన్నే కాఫీ తాగుతూ పేపర్ చూడటం అంటే రజితకి చాలా ఇష్టం. రజితది ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగం. ఆదివారం సెలవు కాబట్టి ఆ రోజు కొంచం లేట్ గా లేస్తుంది. ఒక ఆదివారం లాన్ లో కూర్చొని కాఫీ తాగుతూ సండే మాగజైన్ చదువుతుండగా ఎదురుగా ఉన్న ఇంట్లో నుంచి ఏవో మాటలు వినిపిస్తున్నాయి.ఎదురింట్లో ఎవరో కొత్తగా పెళ్ళైన జంట దిగినట్టు ఉన్నారు. వచ్చిన దగ్గర నుంచి ఇద్దరు ఎంతో సరదాగ ఉండటం రజిత గమనిస్తూనే ఉంది. ఆ జంటను అలా చూస్తూ ఉంటే తన కళ్ళ ముందే కాలం 15 సంవత్సరాల వెనక్కి వెళ్ళింది.      

రజిత బెంగుళూరులో ఉద్యోగం చేస్తోంది. మంచి జీతం. అందగత్తె, తెలివైనది. పెళ్ళీడు వచ్చింది అని రజిత వాళ్ళ ఇంట్లో తనకి పెళ్ళి సంబంధాలు చూడటం మొదలు పెట్టారు రజిత తండ్రి పరశురామ్. తెలిసిన వాళ్ళ ద్వారా సంబంధాలు వస్తుండేవి. ఒకరోజు పెళ్లిళ్లు చేసే శాస్త్రి గారిని ఇంటికి పిలిచి, వాళ్ళ అమ్మాయి వివరాలు ఇచ్చి, తగిన వరుడిని వెతకమని చెప్పారు. అలా 2,3 సంబంధాలు వస్తె వద్దు అనుకున్నారు.తర్వాత వచ్చింది అనిల్ వాళ్ళ సంబంధం. అనిల్ హైదరాబాద్ లో మంచి ఉద్యోగం. పద్ధతి గల కుటుంబం. ఆడపడుచులు లేరు. అబ్బాయి మంచివాడు, బాగున్నాడు. రజిత కూడా మీ ఇష్టం నాన్న అని చెప్పింది. రెండు రోజుల్లో కబురు చేస్తాం అని చెప్పి, అబ్బాయి వాళ్ళు వెళ్ళిపోయారు.       

     పెళ్ళిచూపుల్లోనే రజిత వాళ్ళ ఆస్తిపాస్తులు, బంధుత్వాలు వివరాలు అన్ని తెలుసుకున్నారు అబ్బాయి వాళ్ళు. అనిల్ వాళ్ళ అమ్మ అయితే మీ అమ్మాయికి పెట్టేవి ఇపుడే పెట్టేయండి లేదంటే మిగతా పిల్లలకి కూడా ఇవ్వాల్సి వస్తుంది తర్వాత అంది. రజితకి ఇద్దరు చెల్లెళ్ళు, ఇంకా చదువుకుంటున్నారు.  వాళ్ళు వెళ్ళిన తర్వాత బాగా అలోచించుకోమన్నారు రజితని. రజిత కూడా మీ ఇష్టం నాన్న అని చెప్పింది. మంచి సంబంధమే అనుకున్నారు. రజిత కూడా తన చెల్లెళ్ళ గురించి అలోచించి పెళ్ళికి ఒప్పుకుంది.  అత్తమామలు వాళ్ళతో ఉండరు కదా, వాళ్ళతో వచ్చిన ఇబ్బంది ఇపుడేమి లేదులే అనుకుంది రజిత.        

        రెండు రోజుల తర్వాత పరశురామ్ గారు అనిల్ వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అడిగారు ఏమైందీ అండి విషయం చెప్పలేదు అని. మీకే ఫోన్ చేద్దాము అనుకుంటూ ఉండగా మీరే చేశారు అని మాట కలిపారు అనిల్ తండ్రి రావు గారు. మాటలు అయ్యాయి. “మీరు కూడా వచ్చి ఒకసారి మా ఇల్లు అది చూసుకుంటే బాగుంటుంది” అన్నారు రావు గారు.“తప్పకుండా బావగారు” అని “వచ్చేవారమే మేము వస్తాం” అన్నారు పరశురామ్ గారు.        

          పరశురామ్ గారు వాళ్ళ అన్నయ్య కూడా వెళ్ళి రావు గారి ఇల్లు చూసుకున్నారు. అంతా బాగానే ఉంది అనుకున్నారు. “మాకు అమ్మాయి నచ్చింది. కట్నం ఏమీ వద్దు, పెళ్ళి మేమే చేసుకుంటాం, కాకపోతే మీరు ఎంత పెట్టాలి అనుకుంటే అంతా అమ్మాయికి పెట్టండి. మాకు అమ్మాయి చాలు” అన్నారు రావు గారు.ఆ మాటలకి పోంగిపోయారు పరశురామ్ గారు వాళ్ళ అన్నయ్య గారు. “ముహూర్తాలు మీరే పెట్టించి, మాకు కబురు పెట్టండి” అని బయలుదేరారు.రెండు రోజుల్లో ముహూర్తాలు పెట్టించి, ఫోన్ చేశారు రావు గారు “ముహూర్తాలు ఇపుడే లేవు 4 నెలల తర్వాత కుదిరింది” అని.“సరే మాకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు” అన్నారు పరశురామ్ గారు.

       రజిత పెళ్ళి అయ్యాక ఉద్యోగం చేయటం వాళ్ళకి ఇష్టం లేదు అని అన్నారు రావు గారు. దాంతో బెంగళూరులో ఉద్యోగానికి రిజైన్ చేసి వచ్చేసింది పెళ్లికి ముందే. అనిల్, రజితలు ఫోన్లో మాటలు కలిపి ఒకరి గురించి ఒకరు అన్ని విషయాలు, అభిరుచులు తెలుసుకున్నారు. అలా నాలుగు నెలలు ఎలా గడిచాయో కూడా తెలియదు. పెళ్ళిరోజు రానే వచ్చింది. అనుకున్నట్టుగానే వైభవంగా అనిల్, రజితల పెళ్ళి జరిగిపోయింది. పెళ్ళి అయిన వారం రోజులకే, కాపురానికి పంపమని అడిగారు రావు గారు వాళ్ళు. ఒక 10 రోజులు ఉంచుకొని పంపిస్తాం అన్నారు పరశురామ్ గారు. అప్పుడే మొదలు అయ్యింది గొడవ. మరి పెళ్ళి ఎందుకు చేసినట్టు అమ్మాయికి, మీ ఇంట్లోనే అట్టేపెట్టుకొండి అంటూ నిష్టూరాలు ఆడింది అనిల్ వాళ్ళ అమ్మ రాధమ్మ. అదేమిటంటే మా ఇంటి ఆచారం ప్రకారం వెంటనే అమ్మాయిని కాపురానికి పంపాలి అన్నారు. ఎంతో బతిమాలుకొని ఒక 10 రోజుల్లో పంపటానికి ఒప్పించారు రజిత వాళ్ళ అమ్మ, నాన్నలు.       

            హైదరాబాద్ లో ఆఫీస్ కి దగ్గరలో ఇల్లు తీసుకున్నారు. అనిల్, రజిత మాత్రమే ఉంటారు అక్కడ. అనిల్ కి మంచి ఉద్యోగం, మంచి జీతం, ఆస్తిపాస్తులు బాగానే ఉన్నాయి. కానీ ఒక్క రూపాయి కూడా ఎక్కువ ఖర్చు పెట్టేవాడు కాదు. ఇంటి ఖర్చులకి లెక్క కట్టి మరీ డబ్బు ఇచ్చేవాడు రజితకి. ప్రతి రూపాయకి లెక్క చెప్పమనేవాడు.  అనిల్ బాగా ఛాందస భావాలు కలిగినవాడు. రజితకి నచ్చిన డ్రెస్ వేసుకొనిచ్చేవాడు కాదు. అలా ఉండాలి, ఇలా ఉండకూడదు అంటూ ఏదోకటి చెప్తూ ఉండేవాడు. రజిత ఎంతో ఇష్టపడి తనకి నచ్చిన వంటలు చేసి పెట్టేది. ఒక్కసారైనా బాగున్నాయి అని చెప్తాడు అనుకుంది. కానీ ఎపుడు చెప్పలేదు ఆ మాట. భోజనం వడ్డిస్తూ ఏవో కబుర్లు చెప్పేది రజిత, కానీ ఏదో లోకంలో ఉంటున్నట్టు ఆ మాటలు ఏవి వినేవాడు కాదు అనిల్. ఎపుడు ఫోన్ లేదా టీవీ అంతే.      

            రజిత పెళ్లికి ముందు ఎంతో ఊహించుకుంది. తన ఫ్రెండ్స్ ని చూసి, తను కూడా పెళ్ళి అయ్యాక, అలా సరదాగా భర్తతో సినిమాకి, షికార్లకు వెళ్ళచ్చు అనుకుంది. తనకి నచ్చిన డ్రెస్ వేసుకోవచ్చు అనుకునేది. కానీ పెళ్ళి అయ్యాక ఏది జరగలేదు. అనిల్ అందరిలా ఉండేవాడు కాదు. సరదాలు అనేవి ఉండేవి కావు.  సెలవు వస్తె 11గంటల దాకా లేచేవాడు కాదు. ఎక్కడికైనా వెళ్దాం అంటే మూడ్ లేదు, ఇప్పుడు కాదు అనేవాడు. పెళ్ళి అయిన రెండేళ్లలో వాళ్ళు వెళ్ళింది 3 సినిమాలకు మాత్రమే.  ఏ పని చేసిన తన తల్లి తండ్రులకి చెప్పే చేయాలి అనేవాడు. తన సొంత నిర్ణయం ఏది తీసుకొని ఎరుగడు అనిల్. ఇప్పటికీ వాళ్ళ నాన్న మాటే వేదంగా భావిస్తాడు. భార్య అంటే ఒక అవసరం మాత్రమే. తనకి వంట చేసి పెట్టడం, పిల్లల్ని కనటం, పెంచటం వరకు మాత్రమే అని మూఢ భావాలను కలిగి ఉన్నవాడు.  అలాంటి అనిల్ తో ఎలాగోలా అడ్జస్ట్ అవుతూ వచ్చేది రజిత. ఒక పాపకి తల్లి అయ్యింది. పాపకి పేరు కూడా సెలెక్ట్ చేసుకుంది. కానీ తన మాట ఎవరు వినలేదు. వాళ్ళకి నచ్చిన పేరు పెట్టుకున్నారు పాపకి.చివరికి బారసాల, అన్నప్రాసన, పుట్టినరోజు ఇలా ప్రతి ఫంక్షన్ తనకి నచ్చినట్టుగానే చేసేవాడు అనిల్, వాళ్ళ నాన్న.       

          రాను రానూ అత్తగారు ఆరళ్లు ఎక్కువ అవుతూ వచ్చాయి. రజిత చెల్లెళ్ళ చదువు, పెళ్ళి విషయంలో తనకి సంబంధం లేనట్లు ఉండేవాడు. రజితని కూడా ఎమీ చేయనిచ్చేవాడు కాదు. చాలా బాధపడేది రజిత. తన ఇంట్లో కూడా తనకి ఏ స్వతంత్రం లేకపోయేసరికి ఒకరకమైన విరక్తి భావన కలిగేది జీవితం అంటే ఇంతేనా అనిపించేది. ఎన్ని కలకు కన్నాను, ఎంతో ఊహించుకున్నాను, కానీ ఇపుడు జరుగుతున్నదేమిటి, అని కుమిలిపోతూ ఉండేది.  బంధువులు, చుట్టాలు, పెళ్లిళ్లు, ఫంక్షన్ లు అనేవి ఏవి ఉండేవి కాదు. చుట్టుపక్కల వాళ్ళతో కూడా అంటి ముట్టనట్లు ఉండాలి అనేవాడు. తను కలిసేవాడు కాదు, రజితని కలవనిచ్చేవాడు కాదు. ఎంతో భారంగా గడిచేవి రోజులు.   పాప స్కూల్ కి వెళ్తోంది. ఇంట్లో పని చేసుకొని పాపని తనే స్కూల్ లో దింపి, తీసుకువస్తుంది. ఒకసారి పాప పుట్టినరోజుకి అందరినీ పిలవాలి అని అనుకుంది. అనిల్ తో చెప్పింది. ముఖ్యంగా తన తల్లి తండ్రులు, చెల్లెళ్ళని పిలవమన్నది. అంతే దిగ్గున లేచాడు అనిల్. కావాలంటే నువ్వు అక్కడకి వెళ్లి చేసుకో, నన్ను అడగకు అన్నాడు. సరే అని అనిల్ కి ఆఫీస్ లో లీవ్ లేదు అని చెప్పి, తను పాపని తీసుకొని వాళ్ళ అమ్మ వాళ్ళింటికి వెళ్ళింది. అనిల్ చెప్పినట్టుగానే అమ్మమ్మ ఇంట్లో పాప పుట్టినరోజు చేశారు. గ్రాండ్ గానే జరిగింది. అదే విషయం అనిల్ తో చెప్పింది రజిత. మీ అమ్మ ఇంట్లో నీకు ఏం చేసిన ఆనందంగానే ఉంటుంది. మొగుడు గురించి అసలు పట్టించుకునే పనే లేదు. అక్కడే ఉండిపో ఆనందంగా అన్నాడు.  రజితకి పట్టరాని కోపం వచ్చింది. కానీ ఏమీ చేయలేక మర్నాడే తిరుగు ప్రయాణం అయ్యింది. రెండు రోజుల దాకా అనిల్ తనతో మాట్లాడలేదు. చివరికి ఏదోలా మాట్లాడాడు. ఎంతో సంతోషించింది రజిత.      

             ఒక సారి వాళ్ళ నాన్నకి బాగోలేదు అని తెలిసి, “నాన్నకి అనారోగ్యంగా ఉంది చూడాలని అనిపిస్తుంది, వెళ్తాను” అని అడిగింది.“సరే బాగ్ సర్దుకో” అన్నాడు.ఒక్కసారి షాక్ అయ్యింది. ఎపుడు లేనిది ఇదేంటా అనుకుంది. సరే వెళ్ళమన్నాడు కదా అని బాగ్ సర్దుకుంది. “సాయంత్రమే ప్రయాణం” అన్నాడు.  సాయంత్రం ఆఫీస్ నుంచి రాగానే రజితని బయలుదేరమన్నాడు. పాపని రెడీ చేసి, తను రెడీ అయ్యి వచ్చింది. వాళ్ళ ఊరికి తీసుకువెళ్ళి, అక్కడ బస్టాప్ లో రజితని, పాపని వదిలిపెట్టి ఇక్కడే ఉండిపో ఇంక నా దగ్గరకు రానవసరం లేదు అని వెళ్ళిపోయాడు.        

        ఇక ఇలాంటి మనిషితో అనవసరం అనుకుంది రజిత కూడా. మానవత్వం లేని మనిషితో కలిసి ఉండలేను అనుకుంది. పాపని తీసుకొని వెళ్ళి, తన తండ్రికి జరిగింది చెప్పింది. “ఇక ఆ మనిషితో నేను ఉండలేను నాన్న” అని కరాఖండిగా చెప్పేసింది.కూతురు చెప్పిన మాటలు విని నిర్ఘాంతపోయారు పరశురామ్ గారు. “ఊరుకో తల్లీ! అలా మాట్లాడకు, నువ్వే సర్దుకుపోవాలి” అన్నారు.“ఇప్పటికే చాలా సర్ధుకుపోయాను నాన్నా, ఇకపై నాకంటూ ఈ పాప తప్ప ఏమీ లేదు. నేను కొన్ని రోజులు ఇక్కడే ఉంటాను నాన్నా, ఉండనిస్తారా” అని అడిగింది.“ఇది నీ ఇల్లే తల్లీ నువ్వు ఎన్నాళ్ళు కావాలంటే అన్నాళ్లు ఉండచ్చు” అన్నారు.“సరే నాన్నా, కొంచెం నేను కుదుటపడేవరకు ఉంటాను, తర్వాత జాబ్ చేసుకుంటాను” అంటుంది.

        రెండు రోజుల తర్వాత,“నన్ను ఏదైనా మాట్లాడమని అంటావా అనిల్ తో” అని అడుగుతారు రజితని.“వద్దు నాన్నా, తను మారతాడు అన్న నమ్మకం నాకు లేదు, ఒకవేళ తను మనిషిగా మారి వస్తె సంతోషం.” అంటుంది.ఇక మిన్నకుండిపోయారు పరశురామ్. కూతురి జీవితం ఇలా అయినందుకు బాధపడుతూ ఉంటారు.“బాధపడకండి నాన్నా నాకేమీ కాలేదు, నేను బాగానే ఉన్నాను. మీరు ఊరుకోండి” అని సర్దిచెప్పింది. కానీ తను కూడా లోలోపల బాధ పడేది.    రెండు నెలల తర్వాత హైదరాబాద్ లోనే రజితకి కూడా ఒక మంచి ఉద్యోగం దొరికింది. దాంతో పాపని తనతో పాటే హైదరాబాద్ తెచ్చుకుంది. ఆఫీస్ కి దగ్గర్లో ఇల్లు తీసుకొని ఉంటుంది. అప్పటికి రజిత పాపకి ఇదంతా ఏమీ తెలియదు. తెలియని వయసు.         

సింగిల్ పేరెంట్ గా ఎన్నో సమస్యలని ఎదుర్కుంటూ వచ్చింది రజిత. అపుడపుడు డాడీ ఏరి మమ్మీ అని అడుగుతూ ఉండేది పాప. డాడీ మనతో లేరు నాన్న అని చెప్తూ ఉండేది. ఆఫీస్ లోనూ, బయట కూడా తను ఒంటరిగా ఉంటుంది అని తెలిసి ఎందరో ఎన్నో రకాలుగా ఇబ్బంది పెట్టేవారు. అయినా అన్నిటినీ తెలివిగా ఎదుర్కుంటూ వచ్చింది. 

  ‘అమ్మా ‘ అంటూ పాప పిలవటంతో గతంలో నుంచి ప్రస్తుతానికి వచ్చింది రజిత.  ఇపుడు పాపకి పన్నెండేళ్ళు. తండ్రి అవసరం తనకి ఎంతైనా ఉంటుంది. కానీ ఆ మనిషి ఇప్పటివరకు తనని మళ్లీ కలవనూ లేదు మాట్లాడను లేదు. అలా బంధాల సంకెళ్లు తెంచుకుని రజిత పాపే తన ప్రాణంగా జీవితం కొనసాగిస్తూ ఉంది.      

         తను చేసిన పని తప్పు అని ఫీల్ అయ్యేది కాదు కానీ, పాపకి తండ్రి అండ లేదు అని ఎంతో బాధపడేది. అందుకే పాపకి తల్లి, తండ్రి అన్ని తనే అయ్యి చూసుకునేది.      ఆఫీస్ లో ఎంతో కష్టపడి అంచెలంచెలుగా ఎదుగుతూ MD స్థాయికి చేరింది. తనని గేలి చేసిన వారి నోళ్ళు మూయించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది. ఏ సహాయం లేని ఒంటరి మహిళలకి తన జీవితం ఒక గుణపాఠం కావాలని చెప్తుంది. 

You May Also Like

4 thoughts on “బంధనాల సంకెళ్ళు

  1. ఆడవాళ్ళని చిన్నచూపు చూసే మనుషులు ఈ రోజుల్లో కూడా ఇంకా ఉన్నారు. అలాంటి వారికి బానిస కాకుండా, తన కాళ్ళ మీద తాను నిలబడి, సమాజం లో తనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకున్న రజిత లాంటి వాళ్ళు, ఎందరో ఒంటరి స్త్రీ లకు ఆదర్శం. Nice story sis

    1. నిజమే ఇంకా చాలా మంది అలాటి వాళ్ళు ఉన్నారు. థాంక్యూ సిస్

  2. కథ చాలా బాగుంది అక్క ,
    ఈ సమాజంలో అనిల్ లాంటి మూర్ఖులు చాలా మంది ఉన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!