భయం

భయం

రచన: శ్రీదేవి విన్నకోట

నా పేరు నీలిమ,ఈ సంఘటన నాకు 15 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు నిజంగా జరిగింది, నిజంగా భయం అంటే ఏంటో భయంతో మనిషి గడ్డకట్టుకు పోవడం ఏమిటో అప్పుడే తెలిసింది, అంతవరకు ఆటపాటలు అల్లరి చేష్టలు తప్ప భయం గురించి వినడమే తప్ప భయం అంటే ఏంటో తెలీదు పెద్దగా, కానీ ఒకరోజు ఈ సంఘటన తర్వాత, భయం గురించి పూర్తిగా తెలుసుకున్నాను,
మా ఇంటి పక్కనే ఒక కుటుంబం ఉండేవారు. విష్ణు కావ్య అనే భార్య భర్త ఇద్దరు పిల్లలు, అతని తల్లితో కలిసి ఉండేవారు. అతను బాధ్యత లేని మనిషిలా ఉండేవాడు, వచ్చిన ప్రతి కొత్త సినిమా చూసేవాడు, అతని గొంతు చాలా బాగుండేది, పాటలు
అద్భుతంగా పాడేవాడు, ఏదైనా సినిమా చూస్తే యాక్షన్ తో సహా స్టోరీ చెప్పేవాడు,మా పిల్లలు అందరం అతన్ని అందుకే  చాలా ఇష్టపడే వాళ్లము, విష్ణు బాబాయ్ అంటూ ఇష్టంగా ప్రేమగా పిలిచేవాళ్ళం, అతనికి 35 ఏళ్ల వయసు వచ్చినా చిన్న పిల్లాడి మనస్తత్వం, ఆడుతూ పాడుతూ తింటూ తాగుతూ  జల్సాగా సమయాన్ని గడిపేవాడు, ఇంట్లో భార్య పిల్లలు తల్లి ఎం తింటున్నారు, ఎలా ఉంటున్నారు, పిల్లలకు ఏమైనా కొని పెట్టాలని అసలు సంపాదించాలనే ఆలోచన లేదు అతనికి, అతని భార్య చాలా మంచిది, పొద్దున్న సాయంత్రం ఇంటి దగ్గరే బయట పొయ్యి పెట్టుకుని టిఫిన్స్ తయారుచేసి అమ్మేది. అలా రోజులు వాళ్ళకి భారంగా గడుస్తున్నాయి, ఒక రోజు డబ్బులు విషయంలో అతనికి అతని భార్యకి చాలా పెద్ద గొడవ అయింది, ఆమెని తాగడానికి డబ్బులు ఇమ్మని అడిగాడు, ఆమె ససేమిరా అనడంతో భార్యను ఇష్టం వచ్చినట్టుగా కొట్టేసి ఇంట్లోంచి బయటికి వచ్చేశాడు, వీధిలో అందరూ అతన్ని చాలా తిట్టారు, నువ్వు మనిషివా పశువ్వా అంటూ, అతను ఆ రోజంతా ఇంక ఇంటికి వెళ్లకుండా బయట అటు ఇటు తిరుగుతూ గడిపేశాడు, వాళ్లావిడ  అన్నం తినడానికి రమ్మన్నా నా చావు నేను చస్తా నీకు నా గురించి అనవసరం అవతలికి పో అంటూ ఇంటికి వెళ్ళలేదు. మా నుయ్యి దగ్గర రెండు చేదలు ఉంటాయి, ఆరోజు మధ్యాహ్నం మా నుయ్యి దగ్గరికి వచ్చి, ఒక చేద (అంటే తాడు కట్టిన బకెట్ అన్నమాట)తాడు విప్పాడు, నేను ఆ తాడు ఎందుకు  బాబాయ్ విప్పుతున్నారు అని అడిగాను ఆత్రుతగా, మీ మామిడి చెట్టుకు ఉయ్యాల కడతాను అన్నాడు, మా పిల్లలు ఉయ్యాల ఊగుతా అని అడుగుతున్నారు, అనడంతో సరే బాబాయ్ చాలా గట్టిగా కట్టు నేను కూడా ఉయ్యాల ఊగుతాను  అన్నాను సంబరంగా. మధ్యాహ్నం మామిడిచెట్టుకి తాడు కట్టాడు, చాలాసార్లు గట్టిగా లాగి చూసాడు నేను మా కిటికీలోంచి చూస్తూనే ఉన్నా, మా కిటికీకి తలుపులు ఉండవు, అమ్మ చీరతో కుట్టిన కర్టెన్ మాత్రమే ఉంటుంది, అది కూడా సిల్క్ క్లాత్, లైట్ కలర్  కావడంతో బయట అంతా క్లియర్ గా కనిపిస్తుంది. ఆ తర్వాత మళ్లీ చెట్టు నుంచి ఆ తాడు విప్పేసాడు. లోపలి నుంచి నేను గమనిస్తూనే ఉన్నా, ఎందుకు బాబాయ్ తాడు కట్టి తీసేసావు అని అడిగాను, అతను అంత మంచివాడు కాదు, అతనితో ఎక్కువగా మాట్లాడొద్దు అని మా అమ్మ , నాన్నమ్మ తిట్టేవాళ్ళు నన్ను, కానీ నాకైతే అమ్మ వాళ్ళు ఎంత తిట్టినా అతనంటే అభిమానం గానే అనిపించేది. ఈప్పుడు బాగా ఎండగా ఉంది కదా తల్లి  సాయంత్రం కడ్తాలే అన్నాడు, సరే అని నేను కూడా ఇంకా ఆ విషయం మర్చిపోయాను, మా నానమ్మ అయితే ఆ తాడు తెచ్చి మళ్ళీ బకెట్ కి కట్టెయ్ అని చెప్పింది సరే అమ్మ అంటూ ఆ తాడును చేతికి చుట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్లిపోయాడు ఎక్కడికో, సాయంత్రం కూడా కనిపించలేదు, నేను చాలా సేపు చూసా ఉయ్యాల కడతా అన్నాడు కదా అని, కానీ అతను రాలేదు నేను ఇంకా తర్వాత ఆ విషయం మర్చిపోయాను. ఆ రాత్రి గడిచి పోయింది, తెల్లవారుఝామునే ఎక్కడి నుంచో గోలగోలగా ఏడుపులు అరుపులు వినిపిస్తుంటే మెలకువ వచ్చింది నాకు, ఇంట్లో ఎవరూ లేరు, ఏంటో చూద్దును కదా అందరూ మా మామిడి చెట్టు దగ్గరే ఉన్నారు, పోలీసులు కూడా ఉన్నారు. నిద్దట్లో నుంచి కళ్ళు నులుముకుంటూ లేచి అమ్మ అని పిలుస్తూ అక్కడికి  వచ్చేసాను, ఒక్క క్షణం భయంతో అక్కడే ఆగిపోయాను, విష్ణు బాబాయ్ మా మామిడి చెట్టుకి ఆ తాడుతోనే ఉరేసుకున్నాడు, నేను భయంతో వణికి పోయాను, నాలుక కనుగుడ్లు బయటికి వచ్చేసి చూడటానికే చాలా భయంకరంగా అనిపించింది, అతన్ని అలా చూడగానే విపరీతంగా ఏడుపు వచ్చేసింది, ఇంతలో అమ్మ పరుగున వచ్చి నన్ను పట్టుకుని లోపలికి తీసుకువచ్చేసింది, చాలా అంటే చాలా భయమేసింది భయంతో వణికి పోవడం అంటే ఏంటో మొదటిసారి తెలిసింది, నిజంగా నేను నా జీవితంలో అంత భయపడిన సంఘటన అప్పటివరకు ఎప్పుడూ జరగలేదు(ఆ దృశ్యం ఇప్పుడు తలుచుకున్న సరే నాకు భయంతో ఒళ్ళు జలదరిస్తుంది). అతని జేబులో సూసైడ్ నోట్ దొరికింది, నా బ్రతుకు మీద నాకే విరక్తి వచ్చేసింది
నేను నా కుటుంబం కోసం ఏమి చేయలేక పోతున్నాను, అందుకే నా అంతట నేనే చనిపోతున్నాను, నా చావుకు ఎవరూ కారణం కాదు, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి నన్ను క్షమించు అమ్మ ,కావ్య అని రాశాడు. అప్పటి నుంచి నాకు చాలా  రోజుల పాటు భయమే, పిల్లలం అందరూ భయంతో వణికి పోయేవారము. ఏప్పుడు ఆ మామిడిచెట్టు వంక చూసిన అతను ఆ చెట్టుకు వేలాడుతున్నట్టే అనిపించి మరింత భయం అనిపించేది, మా నాన్న మా కిటికీకి వెంటనే తలుపు
వెయించేసారు, కానీ చాలా రోజులు అతని మాటలు పాటలు వినబడుతూ ఉన్నట్టే ఉండేవి, అమ్ములు, తల్లి, అని నన్ను అతను పిలుస్తున్నట్టే అనిపించేది.
చాలా రోజులు భయపడ్డాను, అమ్మ నా భయం చూసి ఆ మామిడిచెట్టు కొట్టించేద్దాం అంది, కానీ నాన్నగారు ఒప్పుకోలేదు. వాడి కర్మకు వాడు చేతులారా పిరికివాడిలా ఆత్మహత్య చేసుకుని  పోయాడు, పచ్చని చెట్టు ఏం పాపం చేసింది, ఇందులో ఆ చెట్టు తప్పేముంది, నాలుగు రోజులు పోతే అంత మర్చిపోతాం, అని అమ్మకి నచ్చచెప్పారు. నాకు చాలా రోజుల పాటు భయంతో కూడిన జ్వరం వచ్చేసింది, ఎంతకీ తగ్గకపోవడంతో నన్ను కొన్ని రోజుల పాటు అమ్మమ్మ  వాళ్ళ ఇంటికి పంపించేశారు. చాలా నెలలకి కూడా ఆ భయాన్ని మర్చిపోలేకపోయాను నేను, అందరూ డబ్బులు వేసుకుని, విష్ణు బాబాయ్ ఫ్యామిలీ కోసం చిన్న కిరాణా కొట్టు పెట్టించారు వీధిలో వాళ్ళంతా కలిసి.
ఇప్పటికీ ఆ మామిడి చెట్టు అతని ఆత్మహత్యకు సజీవ సాక్ష్యంగా అలాగే ఉంది, ఆ చెట్టు చూడగానే అతను అతని ఆత్మహత్య దృశ్యం గుర్తొస్తాయి, ఇప్పటికీ భయంగానే అనిపిస్తుంది తలుచుకుంటే.
ఇలా పిరికితనంగా ఎవరూ ఆలోచించకండి, దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చింది మనం
అనుభవించడానికి, మన కుటుంబాన్ని మనం బాధ్యతగా చూసుకోవడానికి, వీలైతే ఇతరులకు సహాయం చేయడానికి, మధ్యలోనే ఇలా అర్ధాంతరంగా జీవితాన్ని ముగించుకొని మీ ప్రాణాలు తీసుకుని కుటుంబానికి కన్నీళ్లు మిగిల్చి మీ వాళ్లను ప్రాణం  మాత్రమే మిగిలి ఉన్న అనాధలుగా చేయడానికి కాదు. అందుకే ఇలాంటి ఆలోచనలు ఉన్నవాళ్ళు, మీ వాళ్ల కోసం మీరు లేకపోతే వాళ్ళ జీవితం తర్వాత ఎలా ఉంటుందో ఏమైపోతారో కొంచెం ముందే ఊహించుకుని ఆలోచించండి తొందరపడకండి. ఇదే ఏ మాత్రం తమ వారి కోసం ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకోవాలి అనుకునే వాళ్లకు నా మనవి, నేను నా పసితనంలో చూసిన ఈ సంఘటన మాత్రం నాకు మనసులో చెరిగిపోని ముద్రగా మిగిలిపోయింది, ఇప్పటికీ కూడా ఎక్కడైనా నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఆత్మహత్య చేసుకున్నారు అంటే భయంతో వణికిపోతూ ఉంటాను. ఇది నేను నా జీవితంలో ప్రాణం ఉన్నంత వరకు మర్చిపోలేని హృదయవిదారకమైన సంఘటన.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!