నీటి విలువ

నీటి విలువ

రచన: పి. వి. యన్. కృష్ణవేణి

కుశాల్, కృప ఇద్దరూ అన్నాచెల్లెళ్లు. చాలా మంచి పిల్లలు. బుద్ధిగా చదువుకుంటారు, కలసిమెలసి ఆడుకుంటారు. చురుకుదనం,  చిలిపితనం అన్నీ ఎక్కువే వాళ్ళకి..

కొన్ని పనులకు వాళ్ళమ్మ అప్పుడప్పుడు మందలించిన వాళ్ళ నాన్న మాత్రం చిన్న పిల్లలు కదా అంటూ సమర్థిస్తూ ఉండేవాళ్ళు. అప్పుడప్పుడు చిన్న చిన్న అల్లర్లు, కొంటె పనులు మినహాయిస్తే చక్కగా చెప్పిన మాట వింటూ,  చదువుల్లో, ఆటల్లో అన్నింటిలో ముందు ఉంటూ రాణిస్తున్నారు. 
అన్నింటిలో ముందు ఉండే వాళ్ళిద్దరూ,  అప్పుడప్పుడు అల్లరి చేస్తే తప్పేముందిలే అని వాళ్ల నాన్న సమర్థిస్తూ ఉండేవాళ్ళు. వాళ్ళ అమ్మ మాత్రం కొంచెం తప్పు జరిగినా కోపగించుకుంటూ ఉండేది.
ఒకరోజు  స్కూల్లో జంతు ప్రదర్శనశాలకు తీసుకెళ్తామని నోటీస్ వచ్చింది. ఇక పిల్లలు అందరూ ఒకటే హుషారుగా కేరింతలు కొడుతున్నారు. జూ అంటే ఏ పిల్లలకి ఇష్టం ఉండదు చెప్పండి.
ఇంకా కుశాల్, కృప ఇద్దరూ ఇంటికి వచ్చి,  ఎక్స్కర్షన్ కి వెళ్లడానికి మనీ పే చేయమని ఒకటే గొడవ వాళ్ళ అమ్మ దగ్గర చేరి. 
వాళ్ళ అమ్మ శ్రావ్య మాత్రం నేను ఒప్పుకోను.  మీరు జూలో ఆ జంతువుల దగ్గర కుదురుగా ఉండరు. మీ టీచర్స్ ని కూడా ఇబ్బంది పెడతారు. నేను పంపించను అన్నది. 
ఇద్దరు ఎలాగైతేనేమి ఇంట్లో అమ్మనాన్నని ఒప్పించి జూ కి వెళ్లడానికి అన్ని సిద్ధం చేసుకున్నారు. వాళ్ళ టీచర్ చెప్పినట్టు ఒక వాటర్ బాటిల్, ఒక డ్రెస్, ఒక టవల్, ఒక బిస్కెట్ ప్యాకెట్ తో ఒక బ్యాగ్ రెడీ చేసుకున్నారు. 
వాళ్ల డాడీ వాళ్ళని స్కూల్ దగ్గర దింప గానే,  ఎవరి క్లాసు పిల్లలతో వాళ్లు చేరిపోయారు. స్కూల్ వాన్ లొనే, అందరూ జూకి చేరుకున్నారు.
పిల్లలందరూ చాలా ఉత్సాహంగా జంతువుల  అన్నింటిని సరదాగా, ఎంతో ఆసక్తిగా చూడసాగారు. 
ఒరేయ్ కోతి చూడరా ఎలా గెంతుతోందో అని ఒకరంటే, ఒరేయ్ ఆ సింహం చూడరా నన్నే చూస్తోంది అంటూ ఇంకొకరు.
ఒకరు నెమలి నాట్యం చూస్తుంటే, ఇంకొకరు చిలుక పలుకులు వింటున్నారు. అలా అలా ఎవరి అభిరుచికి తగ్గట్టు వాళ్లు ఆనందిస్తున్నారు. 
అంత ఎంజాయ్మెంట్ లో కృపకి చాలా దాహం వేసింది. పైన చూస్తే ఎండ బాగా ఉంది. తనతో తెచ్చుకున్న బాటిల్లో నీళ్లన్నీ, జంతువుల్ని చూస్తున్న సంతోషం లో ఎప్పుడు తాగేసిందో కూడా తెలియలేదు.
టీచర్ పర్మిషన్ తీసుకొని పక్కనే ఉన్న పంపు దగ్గరికి వెళ్లి నీళ్లు పట్టుకుందామని పంపు తిప్పింది. చుక్క నీళ్ళు కూడా రాలేదు. పక్కనున్న పిల్లలందరూ కూడా బాటిల్స్ ఖాళీ చేసేసారు. 
పిల్లలు అందరూ వచ్చి టీచర్ కి నీళ్లు లేవని చెప్పారు. టీచర్ జూ వాళ్ళని అడిగితే, తాగునీరు మేము ఇవ్వలేము. ఎందుకంటే జంతువుల సంరక్షణకే మాకు చాలా నీళ్ళు అవసరం. కనుక ఇక్కడ తాగునీరు కావాలంటే కష్టమైన పనే అని చెప్పారు.
అలా నీళ్ళు లేకుండా, మండుటెండలో సాయంత్రం వరకూ ఉండాల్సి వచ్చింది. వ్యాన్ లో అందరూ మళ్లీ ఇంటికి తిరుగు ప్రయాణము అయ్యారు. 
పిల్లల బాధ చూడలేక, వాళ్ల టీచరు వాన్ ని మధ్యలో ఆపించి, వాటర్ బాటిల్స్ కొన్నారు. మంచినీళ్లకు కరువై పోయినట్టు పిల్లలందరూ మంచినీళ్లను తాగేసారు.
చూడండి పిల్లలు ఏది అయినా, మన దగ్గర ఉన్నంత వరకూ మనకు దాని విలువ తెలియదు.  ఇవాళ మంచినీళ్లకి ఎంత ఇబ్బంది పడ్డాము. 
మనం రోజూ ఎన్ని నీళ్ళు వృధా చెయ్యట్లేదు. అందుకే, అవి మన దగ్గర ఉన్నప్పుడే జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ రోజు మనం తెచ్చుకున్న నీళ్లే జాగ్రత్తగా వాడుకుంటే ఇంత ఇబ్బంది పడే వాళ్ళం కాదు కదా.  
ఆహారం అయినా సరే సమయానికి అందుబాటులో లేకపోతే ఇబ్బందే కదా!!! అందుకే ఏ వస్తువైనా వాటి విలువ తెలియకుండా వృధా చేయకూడదు. తర్వాత దానివల్ల మనమే ఇబ్బందులకు గురి అవుతాము అని చెప్పారు టీచర్.
ఇంటికి వచ్చిన తర్వాత జూ లో జరిగిన విషయాలన్నీ వాళ్ల అమ్మ నాన్న తో చెప్పారు కుశాల్, కృప. అంతేకాదు అమ్మ ఇంకెప్పుడూ స్నానం చేసేటప్పుడు, బ్రష్ చేసేటప్పుడు అన్ని నీళ్లు వృధా కూడా చేయము.
అలాగే ఆహారాన్ని కూడా వృధా చేయము అని శ్రావ్య కి మాటిచ్చారు. వాళ్ళ నాన్న స్వరూప్ ఆనందంగా చప్పట్లతో పిల్లలిద్దరినీ అభినందించాడు.

నీతి : నీటి విలువ, ఆహారం విలువ తెలుసుకోండి. అవి ఎంతో గొప్పవి.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!