ఆపధ్థర్మం

ఆపధ్థర్మం

రచన: అరుణ చామర్తి ముటుకూరి

పరుగు పరుగున ఒగరుస్తూ ఆఫీసులో అడుగు పెట్టాను. అంతా నిశ్శబ్దంగా ఉంది. అందులో నా వైపు పరుగు పరుగున ఆల్ ఇన్ వన్ వస్తున్నాడు.

“కృతిక మేడం” పిలిచాడు ఆల్ ఇన్ వన్.

“మన బాసాసురుడు , వచ్చేసి,నన్ను రమ్మంటున్నార” ఎప్పటిలానే తమాషా పద్ధతిలో ప్రశ్నించింది కృతిక.

“అవును మేడమ్ “అంటూ తలాడించాడు.

“కాస్త మంచి నీళ్ళు తాగే వెళ్తాను చెప్పకు నేను వచ్చానని ఇప్పుడే”

“సరే మేడం”

ఆల్ ఇన్ వన్ కి ఆ మారుపేరు పెట్టింది నేనే. అందరి కబుర్లు మోసుకొచ్చి చెబుతాడని అలా పెట్టానన్నమాట. అంటే ఏంటి మేడం అని అడిగాడు అమాయకంగా మొదటగా నేను పిలిచిన రోజున.
“ఆల్ ఇన్ వన్, అంటే , నువ్వు ఒక్కడివే అన్ని పనులు చేస్తున్నావని, నువ్వు లేకుంటే ఆఫీసులో చాలా ఇబ్బంది అని”
అని చెప్పగానే, ఆ చిన్న మాటలో అంత అర్థం ఉందా? అని బ్రహ్మానంద పడిపోయాడు.

“మేడం గారు” ఆలోచనల్లో పడిపోయిన నన్ను మళ్లీ గుర్తు చేశాడు ఆల్ ఇన్ వన్.

“వెళ్తున్న, వెళ్తున్న “అంటూ మా బాసాసురుడి దగ్గరికి వెళ్లాను.
** *** **
“ఏంటి కృతిక, వర్క్ ఫ్రం హోమ్ బాగా ఎంజాయ్ చేసి బద్ధకం గా తయారు అయినట్టు ఉన్నారు అందరూ. ఆఫీస్ టైమింగ్స్ మర్చిపోయావా ఏంటి??”
మెత్తమెత్తగా చివాట్లు పెట్టాడు.
“వీడి పిండం పిల్లలకు వెయ్యా..”వీరభద్ర రావు గారి స్టైల్ లో మనస్సులోనే అనుకుంటూ..
నో సార్ ,అలా కాదు సార్.. నేను ఎంత పంక్చ్వల్ గా ఉంటానో తెలుసు కదా. ఈ రోజు క్యాబ్ రాదని నేను ఇంకా ముందే బయల్దేరాను. దారిలో నాకో ఫోన్ వచ్చింది. ఫోన్ వల్లే ఆలస్యం అయింది సార్.”

“వాట్స్ ఆల్ దిస్ రబ్బిష్ ఫోను
ఎక్కడి నుంచేమిటి” కాస్తంత వ్యంగ్యం మిళితం చేసి అడిగాడు.
“అబ్బా జిడ్డు ,వదిలేలా లేడు. అందుకే బాసాసురుడు అన్నది. అయినా నిజంగానే ఇన్ని రోజులు లాక్ డౌన్లోడ్ లో కూడా ఎక్కువ గంటలే పని చేశాం కదా . టీం లీడ్ పేరుకే. ఆల్ ఇన్ వన్ కన్నా బండచాకిరి.” అనుకుంటున్న కృతిక బాస్ పిలుపుతో ఈ లోకం లోకి వచ్చింది.
“ఐ నీడ్ యాన్ ఎక్స్ప్లనేషన్, అలా నీలో నువ్వే మాట్లాడుకుంటూ ఉండి పోతే ఎలా?”
“చెప్తున్నాను సార్, ఆ ఫోన్ ఎక్కడినుంచో కాదు. మా పెద్దమ్మ కూతురు సుమతక్క నుండి. ఏం జరిగిందంటే, తను కూడా ఆఫీస్ కి బయలుదేరింది అట. కొద్దిగా రష్ ఎక్కువగా ఉండి తన బండికి ఎవరో డాష్ ఇచ్చారు. కాలు మెలిక పడి కింద పడిపోయిందట. ఎవరూ లేవదీయటానికి కూడా రాలేదని.. నన్ను సాయం రమ్మని ఫోన్ చేసింది.”
“అయ్యో !పాపం అవునా ఇప్పుడు ఎలా ఉంది ఆవిడకి. అయినా ,రోడ్డుమీద అంత మంది ఉన్నారు అంటున్నావ్. ఒకళ్ళు కూడా సాయానికి రాలేదా”?
“అందరికీ కరోనా భయం అవడంతో ఎవరూ ముందుకు రావడానికి సాహసించలేదు అట”
“పెద్దగా దెబ్బలు తగలలేదు కదా!. ఏదైనా హాస్పిటల్ కి తీసుకు వెళ్ళావా”
“తీసుకు వెళ్ళాను సార్. కాలు బాగా వాచిపోయింది. బ్యాండేజ్ వేశారు. తనని ఆటోలో ఇంటికి పంపించి వచ్చాను.”

“అయ్యో అదేంటమ్మా! అంతలా కాలు వాచిన ఆవిడని.. అలా ఒక్క దాన్ని పంపించేసావా. ఇంటి దగ్గర దిగబెట్టి ఉండాల్సింది కదా!.”

“నిజమే సార్ !కానీ అప్పటికే చాలా ఆలస్యం అయిపోయింది ఆఫీసుకి. అందుకే పరుగు పరుగున వచ్చాను.”

“ఓకే గుడ్ జాబ్ కృతిక. కనీసం ఫోన్ చేసి చెప్పుండాల్సింది కదా. గో అండ్ జాయిన్ యువర్ వర్క్”

“థాంక్యూ సార్”
అంటూ బయటికి వచ్చిన కృతిక “హమ్మయ్య, ఈ రోజుకి బ్రతికి పోయాను. వాళ్ళ ఆవిడ పేరు సుమతి అని టైంకి గుర్తుకు రాబట్టి, ఆపద్ధర్మంగా ఓ సుమతి అక్కని సృష్టించేసి కథ అల్లేశాను . అయినా ఇన్ని రోజుల తర్వాత మొదటి రోజు ఆఫీస్ కి వస్తున్నాం చూసి చూడనట్టు పోవాలి గాని.. అయినా తప్పు నాదే. బిగ్బాస్ కరెక్ట్ గా లేకపోతే మిగిలిన వారు తోక జాడిస్తారు. ఇంకెప్పుడు ఇలా లేటుగా రాకూడదు” అనుకుంటూవెళ్ళిపోయింది కృతిక.

*****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!