అంది వచ్చిన అవకాశం

అంది వచ్చిన అవకాశం

నామని సుజనా దేవి

‘అరె…. నాకు వద్దన్నానా…. ఏమొద్దు ….. ‘
‘నా బంగారు కన్నవి కదూ…. పోద్దటి నుండి చిరాగ్గా ఉన్నావు….. నీ కిష్టమని చేసాను… కొంచెం తిను నాన్నా…..’
‘నాకొద్దని చెబుతున్నానా….. నాకేమొద్దు …..’
‘నాకు తెలుసు ..నీకు నాపై కోపం వచ్చిందని….. కొంచెం అర్దం చేసుకో నాన్నా …. బయట తిరిగితే
పోలీసులు కొడుతున్నారని చెప్పాను కదా….. కొంచెం తిను…. ‘
‘ఇంకేంటి…. చెప్పావు…. బయటకు వెళ్ళనీయక కక్ష తీర్చుకున్తున్నావు….. ఇంకేంటి నీ మాటే నేగ్గిందిగా .. పో…. నాకేమొద్దన్నానా….’ కసిగా , కోపంగా అమ్మ బలవంతాన ఇస్తున్న పళ్లాన్ని నె ట్టేసాడు రామకృష్ణ . అదాటున ఊహించని ఆ పరిణామానికి పళ్ళెం కింద పడి అందులోని వేడి వేడి మంచురియా నేల పాలయ్యింది. కోపంగా ఒక్క చెంప దెబ్బ వేయబోయింది రమ .
కాని గాలిలోనికి లేచిన ఆమె చేయిని , గాలిలోనే ఆపాడు కృష్ణ వద్దన్నట్లు తలాడిస్తూ.
ఉక్రోషంగా చూసాడు రామకృష్ణ. పళ్ళెం తో కింద కూర్చుని అన్నీ ఎత్త సాగింది. కృష్ణ కూడా తను కూడా ఆమెకు ఎత్తడం లో సహాయం చేయసాగాడు.
ఏడుపు పొంగు కోస్తోంది రామకృష్ణ లో. ఇద్దరూ అలా కొట్టకుండా, కనీసం కించిత్ మాట కూడా అనకుండా అలా తను చేసిన తప్పును ఇద్దరూ సరిదిద్దడం అతనికి పశ్చాత్తాపాన్ని కలుగ జేసింది. కాని అది ఒప్పుకోవడం ఎలాగో తెలియలేదు. పైగా అహం అడ్దోచ్చింది.
రామకృష్ణ , రమ, కృష్ణ లకు లేక లేక కలిగిన ఏకైక సంతానం. హాస్పిటల్స్ కి , డాక్టర్స్ దగ్గరకు తిరిగి తిరిగి వేసారి , ఎన్నో నోములు నోచి, ఎన్నో పూజలు చేసి కనబడిన రాయికి రప్పకు మొక్కగా అందరు దేవతలు కరుణించి ప్రసాదించిన ప్రసాదమే రామకృష్ణ. అందుకే ఇద్దరి పేర్లు కలిసేలా ఆ పేరు పెట్టారు. చాలా తెలివిగలవాడు అయినా
లేకలేక కలిగిన సంతానమని అందరూ చేసిన గారాబంతో కొంచెం మొండిగా తయారయ్యాడు.
ఇప్పుడు ఈ విసుగు ఎందుకో కూడా అతనికి తెలుసు.
‘ప్రజల సంక్షేమం వారి కుటుంబ సంక్షేమం దృష్ట్యా లాక్ డౌన్ ఈ నెల చివరి వరకు కొన్ని మార్పుల మేరకు పొడిగించబ డుతుంది. దయచేసి ఇంతకూ ముందు వరకు ఎ విధంగా నైతే ప్రజలు సహాయం చేసారో అలాగే మరో రెండు వారాలు కూడా మీ సహకారం అందించండి… అమెరికా తో పోలిస్తే అన్ని ఆధునిక వసతులు లేని మన దేశం లో ఇంతకూ మించి మరో మార్గం లేదు.. దయచేసి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని కాపాడుకోండి.’ అంటూ నిన్న ముఖ్య మంత్రి ప్రకటన విన్నప్పటి నుండి రామకృష్ణ లో చిరాకు చూస్తున్నాడు. పెద్దవాళ్ళకే చిరాగ్గా ఉంటె, చిన్న పిల్లలకి రావడం అసహజమేమీ కాదు . అయినా వ్యక్తిగత, సమాజ మంచి కోరే ప్రతి పౌరుడు తప్పక ఉండాల్సిందే.

కరోనా కారణంగా మూడు వారాల పాటు బయటకు వెళ్లక ఇంట్లోనే ఉండడం వలన వచ్చిన విసుగు అది. నిన్న మొన్నటి వరకు నవ్వుల పువ్వులు విరిసిన ఇంట్లో కొద్ది కొద్దిగా విసుగు, కోపం చేరుతున్నాయి, అని మొదటగా గ్రహించింది కృష్ణ.

కొన్ని రోజులు స్కూల్ లేదని , తల్లి తండ్రులతో ఆటలతో బాగానే ఎంజాయ్ చేసిన కృష్ణ , ఫ్రెండ్స్ ని కలవక చాలా రోజులు కావడం, ఆడడానికి మాట్లాడడానికి ఇంట్లో ఉన్న అమ్మా నాన్న , టీవీ లే తప్ప మరొకరు లేక పోయేసరికి ఆ విసుగు కాస్తా కోపం, మంకుతనం రూపం లో బయటకొచ్చాయి. ఇండిపెండెంట్ ఇల్లు కావడంతో, కొత్తగా కట్టిన కాలనీ కావడం తో , ఇరుగు పొరుగు అంతంత మాత్రమె.
‘కన్నా…. నేను నిన్ను బయటకు తీసుకెళతాను. అయితే నీ ఫ్రెండ్స్ దగ్గరకు కాదు …. నేను ఎక్కడికి తీసుకెళితే నువ్వు అక్కడికి రావాలి సరేనా….’ అన్నాడు కృష్ణ, కింద క్లాత్ తో రమ శుబ్రపరుస్తుంటే , కొడుకు తో.
అసలు ఎప్పటికీ బయటకి వెళ్లి ఫ్రెండ్స్ తో ఆటలాడే రామకృష్ణ కి ఇంట్లోనే ఉంటె పిచ్చి లేస్తోంది. దానితో బయటకు వెళితే చాలు అనుకుని, ‘ఓ కే నాన్నా,….’ అన్నాడు ఉత్సాహంగా.
‘మీకేం పిచ్చా….. ఈ లాక్ డౌన్ లో పసి వాడిని తీసుకుని అలా వెళ్ళడం ఏమిటి?’ కోపం తో రంకె లేసింది రమ. దాని వెనక ఇద్దరి పై నున్న వాత్సల్యం, ప్రేమ ద్యోతక మవుతుంది.
‘ పావు గంట లో వస్తాం రమ. నువ్వు అర్జంట్ గా నేను పొద్దున్న చెప్పినట్లు తయారు చేసిన పదార్దాలు అన్నీ ఇలా ఇవ్వు . రెండు గంటలు రిలాక్సేషన్ ఇచ్చారు కాబట్టి ఈ సమయం లో ఏమీ అనరు. ఇద్దరం గ్లౌజులు వేసుకుని, మాస్క్ లు కట్టుకుని మొత్తం శరీరం అంతా కవర్ చేసుకునే వెళతాం. రాగానే మళ్ళీ ఇద్దరం ఆరుబయటే బట్టలు పిండడానికి వేసేసి , బయటి బాత్ రూమ్ లో తలారా స్నానం చేసి వస్తాం . సరేనా….’ అనగానే మౌనంగానే రమ ఇంటి లోని రెండు పెద్ద బాగు లు తెచ్చి ఇచ్చింది.
‘ఏమున్నా యమ్మా అందులో….’ ఇంతకూ ముందు కోపం మర్చి అడిగాడు. మాట్లాడలేదు రమ.
‘నువ్వు చూద్దువు గాని. సర్ ప్రైజ్ …. పద….’ అంటూ రెండు బాగ్ లు రెండు చేతుల్లో పట్టుకున్నాడు కృష్ణ.
‘నాన్నా …నేనూ పట్టుకుంటా’ అంటూ అందులో కొంచెం చిన్నగా ఉన్న బాగ్ తీసుకున్నాడు కాని బరువు గా ఉండడం వల్ల అతని వల్ల కాలేదు.
కార్ లో అప్పటికే మరో బాగ్ కూడా ఉంది ఆ మూడు బాగ్ లతో రెండు నిమిషాల్లో కార్ లో ఒక వీధి అవతల ఉన్న మురికి వాడకి చేరుకున్నారు .
అక్కడ వేప చెట్టు కింద మాస్క్ తో నిలుచున్న వ్యక్తీ చేయి పైకేత్తగానే, అతనికి కొంచెం దూరం లో ఆపాడు. అప్పటికే ఆ పెద్దగా ఉన్న ఆ చెట్టు చుట్టూ రెండు అడుగులకు ఒకరు చొప్పున ‘ ఎవరికీ వారే యమునా తీరే ‘ అన్నట్లు ఒక పది మంది వరకు కూర్చుని ఉన్నారు . వారు ఎదో గుడ్డను నోటి చుట్టూ కట్టుకుని ఉన్నారు. కొందరు ఆకులనే మాస్క్ లు గా కట్టుకున్నారు. వాళ్ళంతా కూలీ నాలీ చేసుకునే రోజువారి కూలీలు.
‘మీ సహాయ కార్యక్రమం లో వీరిని ఇక్కడికి చేర్చడం ద్వారా నన్నూ భాగస్వామిని చేసినందుకు ధన్యవాదాలు’ చేయి పైకి ఎత్తినతను దూరం నుండి రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నాడు.
ప్రతి నమస్కారం చేస్తూ ,’ ఆయన ఈ తండా కి సర్పంచ్’ అని రామ కృష్ణ తో చెబుతూ , డిక్కీలోని బాగ్లు బయటకు తీసాడు కృష్ణ. సర్పంచ్ పక్క ఉన్నతను సెల్ లో ఫోటోలు తీస్తున్నాడు.
బాగ్ లలో పాలిథిన్ బాగ్ లలో ఒక్కో దాంట్లో బియ్యం, పప్పులు, ఆయిల్ పాకెట్లు ఉన్న పాకెట్స్ దాదాపు పది నుండి పదిహేను వరకు ఉన్నాయి. అవి ఒక్కో పాకెట్ ఒక్కొక్కరికి కృష్ణ ఇస్తూ పోయాడు. వారందరూ తీసుకుంటూ రెండు చేతులతో దండం పెడుతున్నారు. కొందరయితే కాళ్ళు కూడా మొక్కడానికి ముందు కొచ్చారు.
పది నిమిషాల్లో పంచడం అయిపొయింది. వాళ్ళ కళ్ళల్లోని వెలుగులు , కృతజ్ఞత వెహికిల్ దగ్గర ఉండి చూస్తున్న రామ కృష్ణ చూస్తూనే ఉన్నాడు. ఒంటి నిండా సరిగ్గా బట్టలు లేని, చిరిగిన బట్టలు , మట్టి గోట్టుకుని పోయిన వారిని వింతగా చూస్తున్నాడు రామ కృష్ణ.
మూడో బాగ్ లో ఉన్న సబ్బులు, మాస్క్ లు , ఇంట్లో ఉన్న చిన్నవయిన రామ కృష్ణ బట్టలు, రమ, కృష్ణ వి కొన్ని పాత బట్టలు, కొన్ని కొత్త షర్ట్లు, టవల్స్, చీరల ను బాగ్ తో సహా సర్పంచ్ చేతి కిచ్చాడు.
అతను పంచేంత వరకుండి, వారంతా దూరం నుండే దండాలు పెడుతుంటే , ప్రతి నమస్కారం పెడుతూ , కార్ లో కూర్చుని , రామకృష్ణ తో కల్సి టాటా చెబుతూ ఉంటె , వారంతా లేచి చప్పట్ల తో వారి హర్ష ద్వానాలు తెలియ జేశారు.
ఇంటి కొచ్చి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక, ‘అమ్మా…..సారీ ఆమ్మా…. అప్పుడు ఎదో చిరాకులో అలా చేసాను … ఆకలిగా ఉంది పకోడీ తేవా….’ అన్నాడు రామకృష్ణ.
‘అబ్బా…. పాపం… వాళ్ళు ఎంత పేద గా ఉన్నారు నాన్నా… మీరిస్తుంటే ఒక్కొక్కరి లో ఎంత ఆనందమో కదా… ఈ పని ఇంతకు ముందు ఎందుకు చేయలేదు నాన్నా.. అసలు వారు చప్పట్లు కొడుతుంటే ఎంత బాగా అనిపించిందో తెలుసా … ‘ అన్నాడు రామకృష్ణ.
‘ ఎందుకు చేయలేదు అంటే … తీరిక ఎప్పుడు దొరక లేదు. మొన్న వాట్సప్ లో ఆ సర్పంచ్ ఇలా కూలీలు ఆకలికి మాడి పోతున్నారని, ఎవరైనా దాతలు ముందుకు రావాలని పోస్ట్ పెట్టడం , చూసి అతనితో ఫోన్ లో మాట్లాడాను. మనది ఎలాగూ పెద్ద హోల్ సెల్ షాప్ కాబట్టి , మన దగ్గరున్నదే ఇద్దాం అని చెప్పాను తర్వాత వారి దయనీయ స్థితి చెబితే విని ఇలా మాస్క్ లు, సబ్బులు, బట్టలు కూడా ఇచ్చాను… అందుకే అలా మనకు కష్టం వచ్చిందని కోపం తెచ్చుకోవద్దు. చూడు ఆ కష్టం లేక పొతే ఈ అవకాశం వచ్చేదా.. కనీసం మనం ఆలోచించే వాళ్ళమా…. వారికి రోజువారి కూలీ బంద్ అయ్యింది కాబట్టి వారికి దానం చేసే అవకాశం మనకు వచ్చింది…. నిన్న వార్తల్లో చూసావా…. అంత పెద్ద ధనిక దేశమైన అమెరికా , క్లోరో క్విన్ ‘ మందు కోసం మనదేశాన్ని అడిగింది. మామూలు గా అయితే ఈ అవకాశం భారత్ కి వచ్చేదా…. అందుకే ప్రతీ కష్టం వెనక ఒక అవకాశం ఉంటుంది . అంతే గాని కష్టం వచ్చిందని అలా కోపం తెచ్చు కుంటారా….. రైతులు రాత్రనక పగలనక ఎంత కష్టపడితే ఒక్క గింజ వస్తుందో తెలుసా…..’ కృష్ణ అంటుంటే , ‘సారీ నాన్న…. మరోసారి ఎప్పుడూ ఇలా చేయను. సారీ అమ్మా….. ‘ అన్నాడు రామ కృష్ణ. ఇద్దరూ చెరో బుగ్గపై ముద్దు పెట్టుకున్నారు నవ్వుతూ.
‘ నేను బాబు ను కొడితే ఈరొజు అందరి మనస్సులు బాధగా ఉండేవి. దానిని ఎంత అందమైన జ్ఞాపకం గా మార్చారు…ఎంతైనా మీరు సైకాలజీలో పీజీ కదా…’ నవ్వుతూ అంది రమ.
‘నాన్నా…. మనం టీ వీలో కనబడుతున్నాం…..’ అన్న రామకృష్ణ మాటలకు ఉలిక్కి పడి చూసారిద్దరూ.
‘ఇప్పుడే అందిన వార్త , తండావాసులకు నిత్యావసర వస్తువులు వితరణ చేసిన కృష్ణ అనే ప్రముఖ వ్యాపార వేత్త….’ అంటూ లోకల్ న్యూస్ చానల్ లో సర్పంచ్ తో సహా చూపెడుతున్నారు .
సర్పంచ్ ఇచ్చి ఉంటాడను కున్నాడు కృష్ణ.
‘నిజం నాన్న..కష్టం వెనక అవకాశం ఉంటుంది’ నవ్వుతూ అన్న రామ కృష్ణ మాటలు నిజం అన్నట్లు దేవుడి గుడికి ఉన్న గంటల తలుపు కున్న గంటలు, ‘శుభం’ అన్నట్లు మృదు మధురంగా మోగాయి.

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!