తనదాకా వస్తే గాని?

తనదాకా వస్తే గాని?
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)   

రచన: సుశీల రమేష్.

   తెల్లవారుజామున కాలింగ్ బెల్ అదేపనిగా మోగుతుంది… అంతకు కొద్ది నిమిషాల ముందే నిద్రలేచిన రూప బాత్రూం నుండి అబ్బబ్బ.. ప్రశాంతంగా బాత్రూం కి కూడా వెళ్ళనివ్వరు కదా అయినా ఇంత పొద్దున్నే ఎవరై ఉంటారు అంటూ తలుపు తెరిచింది రూప. ఆశ్చర్యం చానల్లో ఉన్న తన ఫేసు చిరాకు చానల్ కి వచ్చేసింది రాని నవ్వు ఒకటి విసిరి, అరెరే మామయ్య గారు రండి రండి ముందే చెప్పుంటే మీ అబ్బాయిని పంపించేదాన్ని కదా స్టేషన్ కి అంటూ మూర్తి గారు చేతిలో బ్యాగ్ అందుకుంది రూపా. ( నిజంగా చెప్పి ఉంటే ఏదో ఒక వంకతో తన పుట్టింటికి వెళ్ళిపోయేది పాపం రూపకు ఆ ఛాన్స్ లేకుండా చేశారు మూర్తి గారు ఏంటో) కూర్చోండి మావయ్య కాఫీ తెస్తాను అంటూ లోపలికి వెళ్ళింది రూప. గబగబా కిచెన్ లోకి వెళ్లి కాఫీ అంటే కాఫీనే కలిపి తీసుకొచ్చి తాగండి మామయ్య అని ఇచ్చి, నేను మీ అబ్బాయిని నిద్ర లేపుతాను అంటూ బెడ్ రూమ్ లోకి వెళ్లి వినయ్ మీ నాన్నగారు వచ్చారు అని అతని వీపు మీద గట్టిగా ఒక దెబ్బ వేసింది. (కొత్త పెళ్ళాం కదా ఏం కాదులే) అబ్బా ఏంటే బాబు అంత గట్టిగా కొట్టావ్ అంటూ మళ్లీ పడుకుంటున్న వినయ్. ఏంటి నాన్నగారు వచ్చారా అంటూ పైకి లేవబోతున్న వినయ్ తో రోజు 10, 12 సార్లు ఆఫీస్ టైం అవుతుంది లేవండి అని అరచి చెప్పిన నిద్ర లేవని వినయ్ నాన్నగారు అనే మాటతో వెంటనే లేచారు అన్నది రూప. అవును కదా అనుకుంటూ హాల్లోకి వచ్చి నాన్నగారు బాగున్నారా అని వినయ్ పలకరించాడు. హా బాగున్నాను బాబు అన్నారు మూర్తి గారు. ఏంటి నాన్న ఇన్నాళ్లకు గుర్తొచ్చానా నేను నా పెళ్లి చేశారు అంతే మళ్లీ 8 నెలల తర్వాత ఇదే కనబడడం అని వినయ్ అన్నాడు. అయినా కొత్తజంట వద్ద నేనెందుకు మీ ఇద్దరిని చూసి రెండు రోజులు ఉండి వెళ్ళిపోవాలని వచ్చాను అన్నారు మూర్తి గారు. అంటే కాళ్లు చెప్పుల్లోనే పెట్టుకొని వచ్చావు అన్నమాట, అమ్మ కూడా లేదు అక్కడ నువ్వు ఊరిలో నువ్వెలా ఉంటున్నావో ఒంటరిగా అనే విషయం గుర్తొచ్చినప్పుడల్లా నాకు చాలా బెంగగా ఉంటుంది నాన్నగారు మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండండి ఎక్కడికి వెళ్లొద్దు అన్నాడు వినయ్. నీకు తెలుసు కదా బాబు నాకు ఈ పట్నం వాతావరణం పడదని, అయినా నా గురించి నువ్వు ఏమి దిగులు పడకు, బాగానే ఉంటున్నాను మీ అమ్మ నాకు అన్ని పనులు నేర్పింది. అన్నారు మూర్తి గారు. ఈ వయసులో పనులు చేసుకోవడం అవసరమా? నాన్న. నేనింకేం వినదల్చుకోలేదు నువ్వు ఇక్కడే మాతో పాటే ఉంటున్నావ్ అంతే అన్నాడు వినయ్. ఇంకేం చెప్పినా వినయ్ వినడు ఎందుకంటే తాను అనుకున్నది పట్టుపట్టి సాధిస్తాడు. ఎవరినైనా ఎదిరిస్తాడు. దేనిని లెక్క చేయడు. అలా అని ఎవరిని నొప్పించే మనస్తత్వం కాదు. అందుకే ఇంకేం మాట్లాడలేదు మూర్తి గారు. ఇంట్లో పనివాడు రాజు ని పిలిచి, ఈరోజు నుంచి నాన్నగారికి ఏం కావాలో అన్ని నువ్వే దగ్గరుండి చూసుకోవాలి అని చెప్పాడు వినయ్. అలాగేనండి పెద్దయ్య గారిని నేను చూసుకుంటాను అన్నాడు రాజు. ఆఫీస్ కి రెడీ అవుతున్న వినయ్ తో ఏంటి వినయ్ నీ ఉద్దేశం రెండు రోజులు ఉండి వెళ్తాను అన్న మావయ్య గారిని వెళ్ళనివ్వచ్చు కదా ఇక్కడే ఉండి పొమ్మన్నావు ఎందుకు, మీ వాళ్లంతా వచ్చి ఇక్కడ చేరితే అందరికీ చేసి పెట్టడానికి నేనేమైనా పని మనిషి లాగా కనబడుతున్నానా. అన్నది రూప. అయ్యో పిచ్చి నాన్న మనకు ఏమీ భారం కాడు అయినా నాకు ఈ లోకంలో నాన్నగారు నువ్వు తప్ప ఇంకెవరూ లేరు. ఈ వయసులో ఆయన్ని ఒంటరిగా వదలడం అంటే నాకెందుకో మనసు ఒప్పుకోవడం లేదు అందుకే ఇక్కడే ఉండిపోమన్నాను. అయినా రాజు ఉన్నాడు కదా నీకు పనిలో సాయం చేయడానికి. నువ్వేం టెన్షన్ పడకు వేళకు ఇంత భోజనం, కాస్త పలకరింపు చాలు, ఏం పెట్టినా తింటారు నాన్నగారు ఎవరిని విసిగించే మనస్తత్వం కాదు ఆయనది. నాన్నగారి గురించి నాకు బాగా తెలుసు ఇంకా ఆ విషయం వదిలేయ్ సరేనా నేను ఆఫీస్ కి వెళ్తున్నాను అంటూ వెళ్లిపోయాడు వినయ్. రోజులు గడుస్తున్నాయి. మూర్తి గారు పట్నం వాతావరణానికి అలవాటు పడుతున్నారు. రాజు బాగానే చూసుకుంటున్నాడు మూర్తి గారిని. ఎటొచ్చీ రూప పలకరించడం లేదు మూర్తి గారిని. రెండు రోజుల తర్వాత మేడం నాకు సెలవు కావాలి, చెల్లి పెళ్లి ఉంది అని చెప్పాడు రాజు. అయ్యో రాజు ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఇంట్లో పని అంతా ఎవరు చేస్తారు, నా నెత్తిన పడుతుంది పనంతా. సర్లే నువ్వు మాత్రం ఏం చేస్తావ్ డబ్బు ఏమైనా కావాలా అని అడిగింది రూప. లేదు మేడం సార్ ఇచ్చారు అని చెప్పి రాజు వెళ్లిపోయాడు. దేవుడా ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగింది అని విసుక్కుంటూ కిచెన్ లోకి వెళ్ళింది రూప. వంట గదిలోకి వచ్ఛి చాలా రోజులైంది కాబట్టి, ఏది ఎక్కడుందో మర్చిపోయింది. ఛీ ఇదంతా నా కర్మ అనుకుంటూ వంట మొదలు పెట్టింది. తిట్టుకుంటూ మమ అనిపించింది. అంటే అన్నం పప్పు వండేసరికి పాపం అలిసిపోయింది చాలా విసుగు వచ్చేసింది రూపకు.
పాపం అలాగే వచ్చి సోఫాలో కూర్చుని ఫ్రెండ్స్ తో ఫోన్లో బాతాఖానీ మొదలుపెట్టింది. మాటల్లో భోజనం సమయం దాటిపోయింది. అంతే కదండీ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే సమయం కూడా తెలియదు కదా. మూర్తి గారు అప్పటికే తన గది నుండి రెండుసార్లు వచ్చి చూశారు రూప ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. ఇక లాభం లేదని ఆమెను డిస్టర్బ్ చేయడం ఎందుకని తనే స్వయంగా వంటగదిలోకి వెళ్లి ప్లేట్లో అన్నం వడ్డించుకుని పప్పు వేసుకుని ముద్ద కలిపి నోట్లో పెట్టుకునేసరికి అస్సలు తినాలనిపించలేదు మూర్తి గారికి ఎందుకంటే ఆ వంటను రూప శ్రద్ధగా వండలేదు కాబట్టి, అందుకే చెయ్యి కడిగేసుకుని తన గదిలోకి వెళ్లిపోయారు. రూప అసలు ఏం పట్టించుకోవడం లేదు. సాయంత్రం టీ కూడా తనే పెట్టుకుని తాగారు మూర్తి గారు. బ్యాగులో ఉన్న తన భార్య వనజ ఫోటో తీసుకుని చూస్తూ ఏ లోకంలో ఉన్నావో కానీ నువ్వు చెప్పింది నిజమే, అన్నిటికీ నా మీద ఆధార పడకండి అంటూ నాకు వంట నేర్పించావు. నీ మేలు మరువలేను. నేనే నిన్ను ఎప్పుడు పల్లెటూరి పిల్ల అని సరదాగా ఆట పట్టించే వాడిని కానీ, నీ అంత ఓర్పు నేర్పు ఈ కాలం పిల్లలకు లేదోయ్ అంటూ చమర్చిన కళ్ళను తుడుచుకున్నారు మూర్తి గారు.
సాయంత్రం, మామయ్య వినయ్ ఆఫీసులో ఎవరిదో బర్తడే పార్టీ ఉందంట నేను వెళుతున్నాను. ఆ
మీకు వంట చేసుకోవడం వచ్చు కదా మీ మట్టుకు వంట చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోయింది రూప.
కిచెన్ లోకి వెళ్ళిన మూర్తి గారికి ఉల్లిపాయలు కోస్తుంటే వేలు తెగింది. గాయం కడిగి అక్కడే డబ్బాలో ఉన్న కాస్త పసుపును పూసి కట్టు కట్టుకుని ఒక్క పూట తినకపోతే చస్తానా అనుకుంటూ తన గదిలోకి వెళ్లి పడుకున్నారు మూర్తి గారు. రాత్రి 12 గంటలకు వచ్చారు వినయ్ దంపతులు ఇంటికి. రూపా నువ్వు వెళ్ళు నేను నాన్నను పలకరించి వస్తాను అన్నాడు వినయ్. తొందరగా వచ్చేయ్ వినయ్. నేను బాగా అలసిపోయాను పడుకుంటాను అన్నది రూప. నాన్నగారు మిమ్మల్ని కూడా రమ్మన్నాను కదా హోటల్ కి ఎందుకు రానన్నారు అని అడిగాడు వినయ్. అదేంటి బాబు మీ ఆఫీసులో ఎవరిదో బర్తడే ఉందని చెప్పింది రూప అని చెప్పారు మూర్తి గారు. విషయం అర్థం చేసుకున్న వినయ్ బెడ్ రూమ్ కి వెళ్లి, రూప నువ్వు అసలు నాన్నగారిని అడగలేదు హోటల్ కి రమ్మని నాకేమో ఆయన రానున్నారని చెప్పావు. కనీసం వంట కూడా చేయలేదు. ఖాళీ కడుపుతో పడుకుని ఉంటారు నువ్వు అసలు మనిషివేనా అని అరిచాడు వినయ్. ఓయ్ ఏంటి అరుస్తున్నావ్ నా మీద అయినా నేను మీ నాన్నగారి పనిమనిషినా, అని అడిగింది రూప. ఇదే స్థానంలో మీ నాన్నగారు ఉంటే ఇలాగే మాట్లాడతావా అన్నాడు వినయ్. ఇలా ఇంటింటికి తిరిగే కర్మ మా నాన్నగారికి ఏం పట్టలేదు, ఒక మాట అడుగుతాను చెప్పు అసలు నేను  కావాలా మీ నాన్నగారు కావాలా అని అడిగింది రూప నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థం అవుతుందా రూప. ఇద్దరి కేకలు వినబడుతుంటే మూర్తి గారు వినయ్ ని పిలిచి బాబు ఏంటి అర్థరాత్రి కేకలు తను నీ భార్య అలా అరిచి చెప్పకూడదు నిమ్మళంగా మాట్లాడాలి. నా గురించి పోట్లాడుకోవద్దు మీరిద్దరూ, నేను రేపు మన ఊరికి వెళ్ళిపోతాను నాకు ఇక్కడ ఈ వాతావరణం పడటం లేదు అంటూ తన గదికి వెళ్లి పడుకున్నారు మూర్తి గారు. కొద్దిరోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం వినయ్ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చేసరికి రూప ఏడుస్తుంది. ఏమైంది అని వినయ్ అడిగాడు. ఇంట్లో గొడవ జరుగుతుంది అంట మనం వెళ్దాం పదండి అంటూ తన పుట్టింటికి వినయ్ ని తీసుకొని వెళ్ళింది రూప. వీళ్ళు వెళ్లేసరికి రూప వదిన స్వాతి మాటలు వినబడుతున్నాయి.” ఏంటి నేను ఏమన్నా మీ ఇంటి పనిమనిషి నా మీకు కాఫీలు టిఫిన్లు వేళకు అందించడానికి, నాకు ఇష్టమైతే చేస్తాను లేకపోతే లేదు ఎంతసేపు నాన్న నాన్న అంటావు కానీ అసలు నీకు నేను కావాలా మీ నాన్న కావాలా తేల్చుకోండి అని తన భర్త సాకేత్ ని అడుగుతుంది స్వాతి. అదేంటి స్వాతి ఆయన నా కన్నతండ్రి నువ్వు నా భార్యవి. ఈ వయసులో తనకి ఏం కావాలి చిన్న పలకరింపు టైం భోజనం అంతే కదా అన్నాడు సాకేత్. అబ్బా ఎంత సింపుల్ గా చెప్పేశారు ఉండి చేస్తే తెలుస్తుంది అయినా ఈ మాటలన్ని అనవసరం, నేనా మీ నాన్నగారా ఒకటే మాట చెప్పు సాకేత్ అన్నది స్వాతి. అంతలో మా నాన్న ఎందుకు వెళ్తాడు బయటకు నువ్వే వెళ్ళు అన్నది రూప లోపలికి వచ్చి. ఆ మాట చెప్పడానికి నువ్వు ఎవరు అన్నది స్వాతి. నేను ఇంటి ఆడపడుచును అయినా మా నాన్నగారిని వెళ్ళమనడానికి నీకేం హక్కు ఉంది. ఇది ఆయన కొడుకు ఇల్లు అన్నది రూప. ఆహా నీకు తెలుసో లేదో ఆయన కొడుకు నాకు తాళి కట్టిన భర్త, ఇది నా ఇల్లు నాకు ఇష్టమైన వాళ్లే ఉంటారు నా ఇంట్లో అడ్డమైన వాళ్ళకి ఇక్కడ స్థానం లేదు. మీ అందరికీ చాకిరీ చేయడానికి నేనేం పనిమనిషిని కాదు. నీకంత పౌరుషం ఉంటే మీ నాన్నను మీ ఇంటికి తీసుకెళ్లి చూసుకో అన్నది స్వాతి. హా హా తీసుకెళ్తాను నా భర్త నా మాట కాదనరు. అలాంటి తారతమ్యాలు ఏమీ లేవు కదా వినయ్ అని రూప అన్నది. ఏంటి మీ నాన్నను నా ఇంటికి తీసుకు వస్తావా, నీకు పని భారం ఎక్కువ అవుతుందేమో అన్నాడు వినయ్. ఏం కాదు నిమిషాల్లో పని అంతా నేను చేసుకోగలను ఇలా ఇక్కడ దిక్కులేని వాడిలా నాన్నను వదలలేను అని రూప అన్నది.. “మరి నా కన్న తండ్రి వచ్చినప్పుడు అదే పని కదా ఎందుకు చేయలేకపోయావు కనీసం కాఫీ కూడా కలిపి ఇవ్వలేకపోయావు ఒక్క పూట భోజనమైన పెట్టావా పెట్టలేదు ఎందుకంటే నీ తండ్రి కాదు కాబట్టి, ఇప్పుడు నీ తండ్రిని నా తండ్రి అనుకుని నా ఇంటికి తీసుకెళ్లాలా? ” వాట్ ఎ జోక్..రెండు రోజుల కూడా నువ్వు నా తండ్రిని చూసుకోలేక పోయావు. నిన్ను కన్నట్టే నన్ను కన్నారు చదివించారు ఈ వయసులో నా తండ్రిని నేను చూసుకోకుండా చేశావు. వృద్ధాప్యంలో ఆయన సేవ చేసుకునే కాస్త అదృష్టం నాకు దక్కింది అనుకునే లోపు నీ మూర్ఖత్వంతో అది కూడా దూరం చేశావు ఇప్పుడు నీ తండ్రిని మాత్రం తీసుకొచ్చి బాగా చూసుకుంటావు. “అందుకే అంటారు పెద్దలు తన దాకా వస్తే గాని ఏది తెలియదు అని” రూప నేను ఐదు నిమిషాలు కారులో నీకోసం వెయిట్ చేస్తాను వచ్చావా సరే ఆరో నిమిషంలో నువ్వెవరో నేనెవరో అని చెప్పి బయటకు వెళ్ళిపోయాడు వినయ్..ఏమ్మా రూపా దేవి ఇందాక నుంచి నాకు తెగ నీతులు చెప్తున్నావు నువ్వు చేసిన నిర్వాకం ఏంటి. ఈరోజు నీ తండ్రి అనేసరికి ఆడదానివి నీకే అంత రోషం వచ్చింది. నీ భర్త పైగా మగాడు వినయ్ కి ఎంత కోపం రావాలి.
ఓ పెద్ద నామీద అంత ఎత్తున ఎగురుతున్నావు. నీ మామగారిని చూసుకునే అవకాశం వచ్చినప్పుడు నీ బుద్ధి ఏమైందంట గాడిదలు కాస్తుందా. వెళ్ళు తక్షణం నా ఇంటి నుండి వెళ్ళు ఇంకెప్పుడూ ఇటువైపు రావద్దు అన్నది స్వాతి. నాన్న అని పిలిచింది రూప. వద్దమ్మా నన్ను అలా పిలవకు. నువ్వు చేసిన నిర్వాకం అల్లుడు నోట నుండి వింటుంటే ప్రాణం పోయినట్టు అనిపించింది. ఇదేనా మా పెంపకం అని. అంటున్న తన తండ్రిని నాన్న మీరు కూడా నా అని అడిగింది రూప. అవునమ్మా మీలాంటి బుద్ధిలేని పిల్లలను కన్న మాలాంటి పెద్దలకు ఈ తిప్పలు తప్పవు వెళ్ళు వెళ్ళమ్మా కానీ నీలో మార్పు రావాలి. ఈరోజు బాధ నీ దాకా వస్తే గాని నీకు తెలియలేదు. తన తండ్రి వెళ్ళిపోతుంటే ఆరోజు వినయ్ ఎంత బాధపడి ఉంటాడో ఇప్పటికైనా నీకు అర్థమైందా. వెళ్లి నీ భర్త మన సెరిగి నడుచుకో అని చెప్పి పంపించారు రూప తండ్రి రూపను. బయట కార్లో వెయిట్ చేస్తున్నా వినయ్ పక్కన కూర్చున్న రూప ఏడుస్తూనే ఉంది. తన తండ్రి అన్న మాటలు పదేపదే వినబడుతున్నాయి రూపకు. కారు స్టార్ట్ చేసిన వినయ్. అయిపోయిందా ఇంకా ఏడుపు ఆపు ఇంటికి వెళదాం అన్నాడు వినయ్… కళ్ళు తుడుచుకుంటూ మన ఇంటికి కాదు కారును ఊరికి పోనివ్వు అన్నది రూప ఏడుస్తూనే. ప్రశ్నార్థకంగా పెట్టాడు తన ముఖాన్ని వినయ్… రూప ఏడుస్తూనే మామయ్య గారిని మన ఇంటికి తీసుకుని వద్దాం అని చెప్పింది రూప. నమ్మొచ్చా అన్నాడు వినయ్. ఇంకా పరీక్షించకండి చాలు ఇంతకన్నా నేను ఏమీ చెప్పలేను నేను ప్రవర్తించిన తీరుకు నాకే సిగ్గుగా అనిపిస్తుంది. అంటూ వినయ్ భుజం మీద తన తలను వాలుస్తు అన్నది రూప. అంతే కదండీ ఏదైనా తన దాకా వస్తే గాని తెలియదు మరి అంటూ కారును తన సొంత ఊరికి ఊరికించాడు వినయ్. వీళ్ళ మాటలన్నీ రూప తండ్రి అన్నయ్య వదిన కూడా వింటున్నారు. అర్థం కాలేదా! ఇక్కడ కొసమెరుపు ఏంటంటే ఈ గొడవకు సూత్రధారి వినయ్. అంతకు ముందు రోజే విషయం అంతా తన మామ గారికి వివరించాడు వినయ్. రూపతో చెప్పాలంటారా వద్దులేండి బాబు మళ్లీ కధ అడ్డం తిరుగుతుందేమో?

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!